విశాఖ

వేలల్లో జీతాలు తీసుకుంటున్నా లంచాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 12: ‘వేలల్లో జీతాలు తీసుకుంటున్నారు కాస్త వృత్తి ధర్మాన్ని పాటించండి. లంచాలు తీసుకోవడం ఏమిటి? ప్రభుత్వ శాఖల పరువు తీయకండి. మీరు చేసిన చిన్నపాటి తప్పు జిల్లాకే చెడ్డపేరు తెస్తుంది. అంకిత భావంతో పని చేయండి’ అంటూ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ రెవెన్యూ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. అవినీతికి తావు లేకుండా నిజాయితీగా ప్రతిఒక్క ప్రభుత్వ ఉద్యోగి అంకితిభావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్ మందిరంలో జిల్లా అధికారులు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ శాఖ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలకాలంలో జిల్లా, మండల కార్యాలయాల్లో అవినీతి నిరోధిక శాఖ దాడులు జరుగుతున్నాయన్నారు. దీనివలన కొంతమంది అధికారులు, సిబ్బంది చేస్తున్న పనుల వలన మొత్తం విభాగాలకు చెడ్డపేరు వస్తోందన్నారు. దీనిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అవినీతిపై మండల స్థాయిలో తహశీల్దార్లు, డివిజన్ స్థాయిలో ఆర్‌డిఒలు ఎప్పటికపుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుండాలన్నారు. ఎక్కడైనా అన్యాయంగా అమాయకులకు ఇటువంటి పరిస్థితి ఎదురైతే జిల్లాస్థాయిలో సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. కొంతమంది సిబ్బంది ప్రజలు కోరిన సమాచారం ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీనివలన మిగిలిన వారు కూడా బాధితులవుతున్నారన్నారు. విభాగాల మీద నమ్మకం పోతుందన్నారు. ఎసిబి ట్రాప్‌కు గురైన వ్యక్తితో పాటుగా వారి కుటుంబం సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు. కార్యాలయంతో సంబంధం లేని బయటి వ్యక్తులను కార్యాలయాల్లోనికి అనుమతించరాదన్నారు. సిబ్బంది వారి జాబ్ చార్ట్ ప్రకారం, రూల్స్‌ను అతిక్రమించకుండా క్రమశిక్షణతో పారదర్శకంగా పనిచేయాలన్నారు. నీటి, నిజాయితిగా పనిచేసే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. బాగా పనిచేసే వారికి ప్రతిఒక్కరూ సహకరిస్తారన్నారు. కొంతమంది సిబ్బందికి లంచం తీసుకోవడం ఒక అలవాటుగా మారిందన్నారు. మానసికంగా ప్రతిఒక్కరిలోను మార్పురావాలన్నారు. కౌన్సిలింగ్‌పాటుగా యోగా, మెడిటేషన్‌లో శిక్షణ పొందాలన్నారు. అవినీతి నిర్మూలనలో అవినీతి నిరోధికశాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రతి మండల కార్యాలయంలో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను పెట్టనున్నామన్నారు. వీటన్నింటికీ వారి జీతాలకు లింక్ చేయడం జరుగుతుందన్నారు. సమావేశానంతరం అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడంలో తన వంతు పాత్రను నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. రెవెన్యూ సర్వీసెస్ జిల్లా అధ్యక్షుడు సత్తి నాగేశ్వరరావురెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల్లో రెవెన్యూశాఖకు అధిక ప్రాధాన్యత ఉందని, కాలంతో సంబంధం లేకుండా ప్రతిఒక్క పనికి హాజరవ్వడం జరుగుతుందన్నారు. విపరీతమైన పని వత్తిడి ఉంటుందని, అయినప్పటికీ బాధ్యతగా ప్రతిఒక్కరూ విధులను నిర్వర్తిస్తున్నారన్నారు. ఒక ఐదు శాతం మంది చేస్తున్న అవినీతి వలన రెవెన్యూ శాఖకు మొత్తం చెడ్డపేరు వస్తుందన్నారు. రాజకీయ, ఇతర వత్తిళ్ళ వలన, తప్పుడు రిపోర్టుల వలన కొంతమంది అమయకాలు బల అవుతున్నారన్నారు. సమాజంలో కుటుంబ సభ్యులు తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డివిజన్ల నుండి తహశీల్దార్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 డి.వెంకటరెడ్డి, నర్సీపట్నం, అనకాపల్లి ఆర్డీవోలు సూర్యారావు, పద్మావతి, ఏడి సర్వే మనిషా త్రిపాఠి, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.