విశాఖ

ఆర్థిక స్వాలంబన దిశగా మహిళ ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 20: స్వయం ఉపాధి ఆసరాగా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని కేంద్ర సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా అన్నారు. ఎస్‌ఎంఇ ఫోరం ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం నిర్వహించిన ‘శక్తి ఉమన్ ఎంటర్‌ప్రన్యూర్ మీట్ 2017’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంకల్ప శక్తికి ప్రతీకలైన మహిళలు యువ పారిశ్రామిక వేత్తలుగా రాణించినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినట్టవుతుందన్నారు. చదువుకుని ఉద్యోగాల కోసం ఆరాటపడుకుండా, స్వయం శక్తితో పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే ప్రయత్నం చేయాలన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దీనికోసం కేంద్రం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. ఎటువంటి హామీ లేకుండా మహిళా పారిశ్రామిక వేత్తలకు రుణాలు మంజూరు చేస్తున్నామని, దీనికోసం రుణ నిబంధనలు సడలించినట్టు వెల్లడించారు. సాంకేతికను జోడిస్తూ, ఉత్పాదక రంగంలో అద్భుత ఫలితాలు సాధించాలన్నారు. ఎంపి కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చూసేందుకు ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ప్రహ్లాద్ టక్కర్, ఉమ, పాండే, సిఐఐ ప్రతినిధి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్త ఎల్లాప్రగడ రాజేశ్వరి, స్మిత, హేమ జైన్‌లకు అవార్డులు అందజేశారు. మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ కేంద్ర మంత్రి చేతులుమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో పలువురు మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామిక వేత్తలు బృంద చర్చల్లో పాల్గొన్నారు.

27 నుండి నవ్యాంధ్ర పుస్తక మహోత్సవం

విశాఖపట్నం, జనవరి 20: విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ, ఎన్‌టిఆర్ ట్రస్టు, ఎపి భాషా సాంస్కృతిక విభాగం ఉమ్మడి సారధ్యంలో ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 5 వరకూ ‘నవ్యాంధ్ర పుస్తక సంబరాలు’ పేరిట పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ విజయ్‌కుమార్ తెలిపారు. నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో పఠనాసక్తి పెంపొందించే లక్ష్యంతో గత రెండున్నర దశాబ్ధాలుగా విజయవాడ పుస్తక మహోత్సవం ప్రతి యేటా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. దీనిలో భాగంగానే నవ్యాంధ్ర పుస్తక సంబరాలు పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పుస్తక ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకూ అనంతపురం, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడల్లో పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. తొలి పుస్తక ప్రదర్శన గతేడాది అక్టోబర్‌లో అనంతపురంలో తొలి ప్రదర్శన ప్రారంభించగా, సుమారు 70వేల మంది పుస్తక ప్రియులు ప్రదర్శనకు హాజరయ్యారన్నారు. పుస్తక ప్రదర్శన నేపథ్యంలో పది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 27న ప్రారంభ సమావేశం జరుగుతుందని, పది రోజుల పాటు జరిగే వేడుకల్లో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖులతో చర్చా గోష్టి, సాహిత్య చర్చలు ఉంటాయన్నారు. 31న వాక్ ఫర్ బుక్ (పుస్తక ప్రియుల పాదయాత్ర) వుడా చిల్డ్రన్స్ థియేటర్ నుంచి ఎయు గ్రౌండ్స్ వరకూ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సామాజిక వేత్త ఆశిష్ నంది పాల్గొంటారన్నారు. అలాగే విశ్రాంత ఎన్‌సిఆర్‌టి డైరెక్టర్, విద్యావేత్త కృష్ణకుమార్, రిజర్వ్‌బ్యాంకు మాజీ గవర్నర్ వైవి రెడ్డి పాల్గొంటారన్నారు. పుస్తక ప్రదర్శన సందర్భంగా విక్రయించే పుస్తకాలపై 10 శాతం రాయితీ కల్పించనున్నట్టు తెలిపారు. అలాగే ఉత్తరాంధ్ర రచయితలు తమ రచనలు ప్రదర్శించి, విక్రయించుకునేందుకు వీలుగా ఉచితంగా స్టాల్స్ కేటాయిస్తామన్నారు. సుమారు 350 మంది ప్రచురణ కర్తలు ఈ ప్రదర్శనలో పాల్గొంటారన్నారు. ఎన్‌టిఆర్ ట్రస్టు సిఇఓ విష్ణువర్ధన్ మాట్లాడుతూ ప్రజల్లో పుస్తక పఠన జిజ్ఞాసను పెంచడంతో పాటు ఈ తరం పిల్లలకు పుస్తకాల గురించి తెలియజేప్పేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఉపకరిస్తాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పద్య పఠనం, వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామని, ఏ రోజు నిర్వహించే పోటీల్లో విజేతలకు ఆరోజే ముఖ్యుల చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామన్నారు. సమావేశంలో గుప్త బ్రదర్స్ సంస్థ ప్రతినిధి నాని, విశాలాంధ్ర బుక్‌హౌస్ ప్రతినిధి రాజు, ప్రజాశక్తి బుక్ హౌస్ మేనేజర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

నేడు గోరటి వెంకన్నకు లోక్‌నాయక్ అవార్డు ప్రదానం

విశాఖపట్నం, జనవరి 20: ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్నకు లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు ఇవ్వనున్నట్లు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఎయు అంబేద్కర్ అసెంబ్లీ హాల్‌లో శుక్రవారం సాయంత్రం జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు అందజేయనున్నట్టు వెల్లడించారు. ఈ పురస్కారం కింద రూ.1.5 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నట్టు తెలిపారు. గత 12 సంవత్సరాలుగా లోక్‌నాయక్ ఫౌండేషన్ తరపున సాహితీ ప్రముఖులకు పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. గత 12 సంవత్సరాల్లో మాలతీ చందూర్, బోయి భీమన్న, వాసిరెడ్డి సీతాదేవి, కాళీపట్నం రామారావ, రావూరి భరద్వాజ, ఆవంత్స సోమసుందర్, జానమద్ది హనుమత్ శాస్ర్తీ, వంగూరి చిట్టెన్ రాజు, రచయిత ఓల్గా, గొల్లపూడి మారుతీరావు, గరికిపాటి నరసింహారావులకు లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డులు ప్రధానం చేశామన్నారు. ఎయు అసెంబ్లీహాల్‌లో శనివారం జరిగే కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, అతిధులుగా మంత్రి గంటా శ్రీనివాసరావు, లా అకాడెమీ డైరెక్టర్ జి రఘురామ్, తదితరులు పాల్గొంటారన్నారు.
పిసి స్మారక ఉపన్యాసం
తొలి తెలుగు ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు స్మారకోపన్యాసం ఈ సారి విశాఖలో నిర్వహిస్తున్నట్టు యార్లగడ్డ తెలిపారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య ముఖ్య అతిధిగా పాల్గొని ‘నాగరిక-సంస్కృతి-సమాజం’ అంశంపై ప్రసంగిస్తారని తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ఎయు అసెంబ్లీ హాల్‌లో జరిగే కార్యక్రమంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ గోడ రఘురాం, ఎమెస్కో అధినేత దూపాటి విజయ్‌కుమార్, తదితరులు పాల్గొంటారన్నారు. ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న పివి స్మారకోపన్యాసం ఈ సారి విశాఖలో నిర్వహించాలని భావించామన్నారు.