విశాఖ

బెల్లం దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఫిబ్రవరి 24: అసలే అంతంతమాత్రంగా ఉన్న జిల్లాలోని మూడు సహకార సుగర్ ఫ్యాక్టరీల క్రషింగ్‌పై నింగినంటుతున్న బెల్లం ధరలు మరింత కుదేలయ్యే పరిస్థితికి తెచ్చాయి. పంచదార ధరలు ఇటీవలె కాస్తంత పెరిగాయి. దీంతో సుగర్ ఫ్యాక్టరీల
ఆర్థిక పరిస్థితికి పెరిగిన పంచదార ధరలు ఊరట కలిగిస్తాయని యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇటువంటి తరుణంలో బెల్లం ధరలు బాగా పెరిగిపోతుండటంతో ఫ్యాక్టరీలకు సరఫరా చేసిన చెరకు బెల్లం తయారీకి ఒకేసారి మరలిపోతుంది. దీంతో అర్ధాంతరంగా సుగర్ ఫ్యాక్టరీలు క్రషింగ్‌ను ముగించకతప్పని పరిస్థితి ఏర్పడింది. గడచిన నెలరోజులుగా రోజులుగా బెల్లం ధరలు నానాటికీ నింగినంటుతుండటంతో సుగర్ ఫ్యాక్టరీలకు అడపాదడపా సరఫరా అయ్యే చెరకు సైతం నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. సుగర్ ఫ్యాక్టరీల కోసం సాగుచేసిన చెరకును రికార్డు స్థాయిలో పలుకుతున్న బెల్లానికి వినియోగించి కాస్తంతైనా సొమ్ము చేసుకోవాలని ఉబలాట పడుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని తాండవ, ఏటికొప్పాక సహకార సుగర్ ఫ్యాక్టరీలు లక్ష్యంలో సగం కూడా క్రషింగ్ చేయలేని నిస్సహాయ స్థితిలో అర్ధాంతరంగా మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు ఫ్యాక్టరీలు ఏటా సగటున 1.50లక్షల టన్నుల వంతున క్రషింగ్ చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఏటికొప్పాక 77వేల టన్నులతోను, తాండవ 73వేల టన్నులతోను అర్ధాంతరంగా క్రషింగ్‌ను ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు ఐదున్నర లక్షల టన్నుల చెరకును క్రషింగ్ చేసి దేశంలోనే అగ్రగామి ఫ్యాక్టరీగా ఖ్యాతిని సంపాదించుకున్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీ సైతం ఈ ఏడాది 3.20లక్షల టన్నులకు మించి క్రషింగ్ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టిమిట్టాడుతోంది. చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోవడం, ఫ్యాక్టరీలు గత సీజన్‌లో సరఫరా చేసిన చెరకుకు సకాలంలో బకాయిలు సక్రమంగా చెల్లించకపోవడం, పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా చెరకు ధరలను పెంచకపోవడం తదితర ప్రతికూల పరిస్థితుల్లో నత్తనడకగా సాగుతున్న ఈ సుగర్ ఫ్యాక్టరీల క్రషింగ్‌కు గడచిన పక్షం రోజులుగా నింగినంటుతున్న బెల్లం ధరలతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఈ ఫ్యాక్టరీల పరిస్థితి మారింది.
అనకాపల్లి మార్కెట్‌లో పదికిలోల నాసిరకం నలుపురంగు బెల్లం సైతం 450 రూపాయల ధర పలికింది. మార్కెట్ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఈ ధర నిలిచింది. సుగర్ ఫ్యాక్టరీలకు టన్ను చెరకు సరఫరా చేస్తే 2300రూపాయలకు మించి ధర లభ్యం కావడం లేదు. ఆ కాస్తంత ధర కూడా ఎప్పుడు చేతికందుతుందో తెలియని అయోమయ గందరగోళ పరిస్థితి చెరకు రైతుల్లో నెలకొంది. అదే చెరకుతో తయారుచేసిన బెల్లానికి మార్కెట్‌లో 4,500 రూపాయల వరకు ధర పలుకుతోంది. దీంతో సుగర్ ఫ్యాక్టరీలకు సరఫరా చేయాల్సిన చెరకు బెల్లం తయారీకి తరలిపోతుంది. ఈ పోటీని తట్టుకోలేక అవసరమైన చెరకు లభ్యం కాక మార్చినెలాఖరు వరకు జరగాల్సిన ఏటికొప్పాక, తాండవ సుగర్ ఫ్యాక్టరీల క్రషింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి మూడో వారానికే ముగించాల్సిన ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. గోవాడ సుగర్స్ క్రషింగ్ సైతం అదే బాటలో పయనిస్తోంది. నాలుగున్నర లక్షల టన్నుల చెరకునైనా క్రషింగ్ చేయాలని ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం ఉవ్విళ్లూరుతుండగా 2.35లక్షల టన్నులను మాత్రమే ఈనెల 23నాటికి క్రషింగ్ చేయగలిగింది. గోవాడ ఫ్యాక్టరీ పరిధిలోని చెరకు బెల్లం తయారీకి తరలిపోతుండటంతో సుగర్ ఫ్యాక్టరీ అధికారులు చెరకు క్రషర్లపై ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. గోవాడ ఫ్యాక్టరీ పరిధిలోని రావికమతం, బుచ్చెయ్యపేట, చోడవరం, మాడుగుల తదితర మంఢలాల పరిధిలోని బెల్లం తయారీ క్రషర్లను సీజ్‌చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. దీంతో చెరకు రైతులు సీజ్ చేసేందుకు వచ్చిన సుగర్ ఫ్యాక్టరీ అధికారులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. బెల్లం ధరలు రికార్డుస్థాయిలో పలుకుతుండటంతో టన్ను చెరకుకు 3,000 నుండి 3,500 రూపాయల వరకు చెల్లించి రైతుల కమతాల వద్దనే వ్యాపారులు కొనుగోలు చేసి బెల్లం తయారీకి తరలిస్తున్నారు. అటువంటి భారీ బెల్లం తయారీ కేంద్రాలపై కూడా గోవాడ సుగర్స్ అధికారులు ఆకస్మిక దాడులు జరిపి సీజ్ చేస్తున్నారు. అలాగే ఇతర ప్రైవేట్ సుగర్ ఫ్యాక్టరీలకు సైతం చెరకు తరలిపోకుండా సంబంధిత వాహనాలను గోవాడ ఫ్యాక్టరీ అధికారులు అడ్డుకుంటున్నారు. వచ్చే ఏడాది సుగర్ ఫ్యాక్టరీల ఉనికికి మరింత ముప్పువాటిల్లే ప్రమాదముందని సంబంధిత ఫ్యాక్టరీ అధికారులే అంటున్నారు.