విశాఖ

దుండగుల దాడిలో గాయపడిన విక్రమ్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 18: దోపిడి దుండగుల దాడికి మరో వ్యక్తి బలైపోయాడు. సోమవారం స్థానిక బీచ్ రోడ్డులోని సీ సర్ఫ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న విక్రమ్, ఆయన భార్య జ్యోతి, డ్రైవర్ జనార్థన్‌పై దుండగులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన విక్రమ్ ధమిజ్ మంగళవారం మరణించారు. ఈ దాడిలో గాయపడిన జ్యోతి, జనార్థన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విశాఖలో సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుపుతున్నారు.
విక్రమ్ ధమిజ్ బెస్ట్ క్రేన్స్ యజమాని. వ్యాపారంలో బాగా ఆర్జించిన విక్రమ్ ఇంటిలో దోపిడీకి ఆరుగురు వ్యక్తులు వెళ్లినట్టు ప్రాథమిక సమాచారం. ఇద్దరు లిఫ్ట్‌లో ఉండి, నలుగురు లోనికి వెళ్లారు. ఇంటి తలుపు కొట్టిన తరువాత డ్రైవర్ జనార్థన్ తలుపు తీశాడు. విక్రమ్ గురించి అడగ్గా, లోనున్నారని చెప్పి, అతనిని పిలిచేందుకు జనార్థన్ లోపలికి వెళుతున్న సమయంలో నలుగురు వ్యక్తులు అతనిని నెట్టుకుంటూ లోనికి దూసుకువెళ్లారు. వారిని వారించేందుకు ప్రయత్నించిన జనార్థన్‌పై కత్తులతో దాడి చేశారు. లోపల నుంచి బయటకు వస్తున్న విక్రమ్ వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతనిపై కూడా కత్తులతో దాడి చేశారు. ఆయన కడుపులో ఆరు చోట్ల పొడిచారు. వంట ఇంట్లో ఉన్న విక్రమ్ భార్య జ్యోతి బయటకు వచ్చి అరవడంతో ఆమెపై కూడా కత్తులతో దాడి చేశారు. ఆమె కడుపులో రెండుసార్లు పొడిచారు. ముందుగా గాయపడిన డ్రైవర్ జనార్థన్ బయటకు పరుగులు తీశాడు. ఇద్దరు దుండగులు అతనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ తప్పించుకుని బయటకు వచ్చి, పక్క ఫ్లాట్‌ల తలుపులు కొట్టాడు. దీనికితోడు జ్యోతి పెద్దగా అరవడంతో ఈ విషయం బయటకు తెలిపోయిందని తెలుసుకున్న దుండగులు దోపిడి యత్నాన్ని విరమించుకుని చాలా కూల్‌గా మెట్లు దిగి కిందకు వెళ్లిపోయారు. వెళుతూ వెళుతూ పైన ఏదో గొడవ జరిగిందని కిందనున్న వారికి చెప్పి మరీ వెళ్లిపోయారు. వీరి కదలికలన్నీ సిసి కెమేరాల్లో రికార్డు అవడంతో వీరిని గుర్తించేపనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. కాగా, ఈ ఆరుగురిని తీసుకువచ్చిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దోపిడి దొంగలు ఎక్కిన ఆటోను పోలీసులు సిసి కెమేరా ద్వారా గుర్తించారు. పార్క్ హోటల్ సెంటర్‌లో ఉన్న ట్రాఫిక్ ఐలెండ్‌పై ఉన్న సిసి కెమేరాల్లో ఈ ఆటో కనిపించింది. ఈ ఆటో ఎండాడ వరకూ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ ఈ దుండగులను వదిలిపెట్టినట్టు పోలీసులు తెలుసుకున్నారు.
ఇదిలా ఉండగా ఈ ఘాతుకానికి పాల్పడింది బీహార్ గ్యాంగ్ అని తెలుస్తోంది. దారపాలెంలో ఈనెల 11న ఒక టీచర్ ఇంట్లో దోపిడికి పాల్పడిన వారు, వీరు ఒకే గ్యాంగా? కాదా? అన్నది పోలీసులు విచారిస్తున్నారు. బీహార్ నుంచి వచ్చిన వీరు స్థానికంగా పెరోల్‌పై వచ్చిన నేరుస్తులు, పాత నేరస్తుల సహకారం తీసుకుని ఇటువంటి దోపిడీలకు, హత్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఈ కేసు విషయంలో పెదవి విప్పడానికి నిరాకరిస్తున్నారు. కాగా, ఆటో డ్రైవర్‌తో పాటు దాడిలో పాల్గొన్న ఒక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు అనధికారికంగా తెలుస్తోంది. ఏదియేమైనా రెండు, మూడు రోజుల్లో నిందితులను పట్టుకుంటామని పోలీసు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ భార్య జ్యోతి, డ్రైవర్ జనార్థన్ పరిస్థితిని తెలుసుకునేందుకు పోలీస్ అధికారులు కేర్ ఆసుపత్రికి వెళ్లారు. విక్రమ్ మృతదేహానికి బుధవారం పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.