విశాఖ

గిరిజనులపై సర్కార్ చిన్నచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, మార్చి 24: గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆదివాసీల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష కనబరుస్తున్నాయని మాజీ మంత్రి, ఎఐసిసి సభ్యుడు పసుపులేటి బాలరాజు విమర్శించారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఆదివాసుల జీవితాలు దుర్భరమయంగా మారుతున్నాయని అన్నారు. ఆదివాసుల సంక్షేమం పట్ల ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో తమ గోడను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతవౌతున్నారని ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవలసిన ముఖ్యమైన చర్యలను ప్రభుత్వం తీసుకోకుండా కాలయాపన చేస్తుండడంతో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు గిరిజనులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడం గిరిజనుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో రుజువు చేస్తుందని చెప్పారు. గతంలోని అనేక ప్రభుత్వాలు గిరిజనులకు సముచిత స్థానం కల్పించి గిరిజనులను మంత్రివర్గంలో నియమించడం వలన ఆదివాసుల సమస్యలపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉండేందని ఆయన అన్నారు. అయితే మంత్రివర్గంలో గిరిజనులకు స్థానం లేకపోవడం వలన గిరిజనుల సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయని చెప్పారు. గిరిజనుల సమస్యలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే ఎస్టీ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని ఆయన వాపోయారు. గిరిజనులు పండిస్తున్న వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నిర్వీర్యమయ్యే పరిస్థితికి దిగజారిందని ఆయన విమర్శించారు. జీసీసీకి పాలకవర్గాన్ని నియమించడంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని ఆయన అన్నారు. గిరిజన సంక్షేమ శాఖకు పూర్తిస్థాయిలో ప్రిన్సిపాల్ కార్యదర్శిని నియమించకపోవడం, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖకు చీఫ్ ఇంజనీర్ లేకపోవడం, మండల స్థాయిలలో అనేక శాఖలలో పూర్తి స్థాయిలో అధికారులు నియమించకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆదివాసుల సంక్షేమంపై పనిచేసే విభాగాలకు అధికారులే లేకపోతే మన్యంలో పరిపాలన ఏలా సాధ్యవౌతుందని ఆయన ప్రశ్నించారు. మైదాన ప్రాంతాలలో పూర్తి స్థాయిలో అన్ని శాఖల అధికారులను ఎప్పటికప్పుడు నియమిస్తున్న ప్రభుత్వం గిరిజన ప్రాంతంపై ఎందుకు వివక్ష కనబరుస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని విధాలా వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని బాలరాజు కోరారు.