విశాఖ

ప్రత్యామ్నాయ రాజకీయ వేదికలో వామపక్షాలదే కీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఆగస్టు 14: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్మాణంలో వామపక్ష పార్టీలు ప్రధాన భూమిక పోషిస్తున్నట్టు సి.పి.ఐ. రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణ చెప్పారు. స్థానిక గిరిజన భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు విఫలం కావడంతో వామపక్ష పార్టీల నేతృత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మిస్తున్నామని అన్నారు. జనసేన, లోక్‌సత్తా పార్టీలను కలుపుకుని ఏర్పాటు చేస్తున్న ఈ వేధిక గిరిజన, హరిజన, వెనుకబడిన వర్గాలు, కార్మికులు, కర్షకుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించి పనిచేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. నూతన రాజకీయ కూటమి ద్వారా రానున్న ఎన్నికలలో పోటీ చేసి అధికార, ప్రతిపక్ష పార్టీలను మట్టికరిపించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. అధికారాన్ని చేజిక్కించుకునే క్రమంలో రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాలలో తమ కూటమి పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. ప్రజల అభివృద్ధిని కేంద్రంగా చేసుకుని ఎన్నికల బరిలో దిగుతున్న నూతన రాజకీయ వేదిక అన్ని వర్గాల వారి సంపూర్ణ మద్దతులో సత్పలితాలను సాధిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేయడంతో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజల సొమ్ముతో ప్రభుత్వ కార్యక్రమాలను రాజకీయ సభలుగా మార్చేసారని ఆయన ఆరోపించారు. గ్రామ దర్శిని పేరిట ప్రభుత్వం నిర్వహిస్తున్న సభలలో ఎన్నికల ప్రచారం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం కలిగించే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నా ప్రతిపక్ష వైసీపీ దీనిని ఎదుర్కొవడంలో ఘోరంగా విఫలమయ్యిందని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రతిపక్ష పార్టీ తన బాధ్యతలను విస్మరించి వ్యవహరిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. శాసనసభ సమావేశాలను బహిష్కరించిన ప్రతిపక్ష నేత జగన్ అధికారమే పరమావధిగా భావిస్తూ రోడ్డెక్కారని ఆయన విమర్శించారు. తాను ముఖ్యమంత్రి అయితేనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జగన్ తన పాదయాత్రలో పదే పదే చెబుతున్నారని, ఎక్కడికి వెళ్లినా ఆయా ప్రాంతాలలో సమస్యలపై వాగ్ధానాలను కుమ్మరిస్తూ రాజకీయ స్వలాభంతో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై తన బాధ్యతలను విస్మరించి అధికార తాపత్రయంతో జగన్ వ్యవహరిస్తుండడం సరికాదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇసుక దందా ఇంకా కొనసాగుతుందని, మంత్రులే ఇందులో భాగస్వామ్యమై దోపిడీలకు పాల్పడుతున్నారని సత్యనారాయణ ఆరోపించారు. అధికార పార్టీ నేతలే దాచేపల్లి గనులను అక్రమంగా నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ అలసత్వమే ఇందుకు కారణమని హైకోర్టు వ్యాఖ్యానించినా తమ పార్టీ నాయకులను ప్రభుత్వం వెనకేసుకు వస్తుందని ఆయన విమర్శించారు. మహిళా అధికారిపై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్‌పై చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబు ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఆయన అన్నారు. జిల్లాలో భూ దందాపై ప్రభుత్వం నియమించిన సిట్ తన నివేదికను సమర్పించినా ఇంతవరకు దీనిని బైటపెట్టడానికి ప్రభుత్వం భయపడుతుందని ఆయన విమర్శించారు. విశాఖలో జరిగిన భూ దందాలో నిందితుల జాబితాను తమ పార్టీ ప్రకటించిందని, త్వరలో రెండో జాబితాను కూడా విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు.

అభివృద్ధికి పట్టం కట్టాలి
ఎమ్మెల్సీ రామ్మోహనరావు
మాడుగుల, ఆగస్టు 14: అభివృద్ధి చేసే ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలని పాలకొల్లు ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు అన్నారు. మండలంలోని ఔరువాడ పంచాయతీలో మంగళవారం నిర్వహించిన గ్రామ దర్శిని కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి సాధించిదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కృషేనని చెప్పారు. నూతన రాజదాని నిర్మాణం కోసం కోట్లాది రూపాయలను ఒకవైపు వెచ్చిస్తునే మరోవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చంద్రన్న బీమా పథకం సామాన్యులకు వరంగా మారిందని ఆయన చెప్పారు. ఈ పథకం ఎంతోమంది జీవితాల్లో వెలుగునింపిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు ఎప్పటికప్పుడు జన్మభూమి, గ్రామ దర్శిని వంటి కార్యక్రమాలను చేపడుతూ ప్రజల వద్దకే పాలన అందించిన ఘనత తమకే దక్కుతుందని ఆయన చెప్పారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, పలువురు దేశం నాయకులు పాల్గొన్నారు.

హోమియో మందులు పంపిణీ
మాడుగుల, ఆగస్టు 14: డెంగ్యూ సోకకుండా మాడుగులలో మంగళవారం ఉచిత హోమియో మందులు పంపిణీ చేసారు. మాడుగుల గ్రామానికి చెందిన పెయ్యల ఎర్రయ్య అనే వ్యక్తి తన స్వంత నిధులతో హోమియో మందులను కొనుగోలు చేసి ప్రజలకు వీటిని ఉచితంగా అందచేసారు. స్థానిక దేవి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పి.పి. పుప్పాల అప్పలరాజు, మాజీ సర్పంచ్ దంగేటి సూర్యారావు, తూర్పుకాపు సంక్షేమ సంఘం నాయకుడు బి.జగన్నాధరావు, జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటి చైర్మన్ శ్రీనాధు శ్రీనివాసరావు, వైసీపీ నాయకుడు జి.సుధ తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ దేశందే అధికారం
మాడుగుల, ఆగస్టు 14: రానున్న ఎన్నికల్లో మళ్లీ తమ ప్రభుత్వానికే ప్రజలంతా పట్టం కట్టనున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముర్రు జయచంద్రనాయుడు అన్నారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన ఘనత ముఖ్యమంత్రిదేనని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తూ అన్ని వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సి.ఎం. అందుబాటులోకి తీసుకువచ్చి పాలనను సులభతరం చేసారని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు దశలవారీగా అమలు చేసి అన్ని వర్గాల వారి మద్దతు కూడగట్టుకున్నారని ఆయన చెప్పారు. ప్రజల మద్దతును సాధించుకున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రానున్నారని ఆయన అన్నారు.
సిట్ నివేదికను బహిర్గతం చేయాలి
మాడుగుల, ఆగస్టు 14: విశాఖ జిల్లాలో జరిగిన భూ కుంభకోణంపై విచారణ చేపట్టిన సిట్ నివేదికను బహిర్గతం చేయాలని సి.పి.ఎం. జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.వెంకన్న డిమాండ్ చేసారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ భూ కుంభకోణంపై సిట్ విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా దీనిని ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల, రావికమతం, గొలుగొండ, రోలుగుంట మండలాల్లో భూ ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయని, పేదల భూములను అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కబ్జాకు గురైన భూముల విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని ఆయన అన్నారు. భూ ఆక్రమణలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అధికార పార్టీ నేతలను కాపాడుకునే ప్రయత్నంలో ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి భూ కుంభకోణంలో పాత్రదారులపై చర్యలు తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేసారు.

రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత
కొయ్యూర, ఆగస్టు 14: ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎంపీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని నల్లగొండ గ్రామంలో మంగళవారం టీడీపీ మండల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మన్యంలో అనేక రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందే విధంగా చూడాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. ఎ ఎంసీ చైర్మెన్ చిట్టిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికై అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతాంగానికి అవసరమైన వ్యవసాయ పరికరాలను రాయితీపై అందజేస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిరిజనులకు 50 ఏళ్ళకే ఫించన్ మంజూరు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించడం అభినందనీయమన్నారు. గిరిజనుల అరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని కొనియాడారు. అనంతరం నల్లగొండ పంచాయతీ కొప్పుకొండ నుండి మంగళపాలెం (కొత్తూరు)కు 49 లక్షలతో మంజూరైన మెటల్ రోడ్డు నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేసారు. ఈకార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు రామ్మూర్తి, సీనియర్ నేతలు శ్యామలరాము, పి.దేవుడు, మాజీ సర్పంచ్‌లు ఉమామహేశ్వరి, సాంభశివరావు, నారాయణమూర్తి, సాయికిరణ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

స్వామినాధ్ చటర్జీ మృతి పట్ల సంతాపం

కొయ్యూరు, ఆగస్టు 14: కమ్యూనిస్టు పార్టీ యోధుడు మాజీ లోక్‌సభ స్పీకర్ స్వామినాధ్ ఛటర్జీ మృతి పార్టీకి , దేశానికి తీరని లోటని సీపీ ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.సత్యనారాయణ, మండల కార్యదర్శి దేముడులు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల పార్టీ నేతలు తమ సంతాపాన్ని తెలియజేసారు. దేశ రాజకీయ చరిత్రలో ఛటర్జీ ఒక గొప్ప యోధుడు అని, ఆయన సేవలను ఈసందర్భంగా కొనియాడారు. అటువంటి మహానేత మృతి తీరని లోటన్నారు. ఆయన మృతి పట్ల తమ కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారంతా సంతాపం తెలిపారు.

ప్రత్యేక ఆకర్షణగా సినీనటుడు విజయ్‌కుమార్
నర్సీపట్నం, ఆగస్టు 14: జగన్ ప్రజా సంకల్ప యాత్రలో సినీ నటుడు విజయ్‌కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాయిబాబా గెటప్‌లో ఉన్న విజయ్‌కుమార్‌తో పలువురు సెల్ఫీలు దిగారు. విజయ్‌కుమార్ కూడా ఉత్సాహంగా అడిగిన వారితో సెల్ఫీ దిగారు. మహిళల వద్దకు వెళ్ళి వారిని ఆశీర్వదించడంతో వారి అనందానికి అవధులు లేవు. గన్నవరం మెట్ట నుంచి జగన్ బస చేసిన యర్రవరం వరకు విజయ్‌కుమార్ ప్రతీ ఒక్కరి వద్దకు వెళ్ళి అప్యాయంగా పలకరించి ముందుకు సాగారు. జగన్ పాదయాత్రకు ముందు నడుస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. ఈసందర్భంగా ఆంధ్రభూమితో మాట్లాడుతూ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ఈసారి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ముఖ్యంగా మహిళలు జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారన్నారు.

నర్సీపట్నం - తుని రహదారిలో పలు చోట్ల రహదారికి అంతరాయం
నర్సీపట్నం, ఆగస్టు 14: జగన్ ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా నర్సీపట్నం -తుని రహదారిలో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బస్సులు , ఆటోలు గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రయాణీకులు పలు అవస్థలకు గురయ్యారు. ఆగి ఉన్న బస్సుల్లోంచి ప్రయాణీకులు జగన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోటీ పడ్డారు. జగన్ కూడా వారిని నిరుత్సాహ పరచకుండా దగ్గరకు వెళ్ళి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకు సాగారు. పాదయాత్రలో పలువురు యువతీయువకులు, మహిళలు జగన్‌తో సెల్ఫీలు దిగారు. కొందరు వద్ద నుంచి సెల్‌పోన్ తీసుకుని జగనే సెల్ఫీలు తీయడంతో వారు ఆనందం వ్యక్తం చేసారు. దగ్గరకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ అప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. మేడలు, మిద్దెలు , చెట్లు ఎక్కిన వారందరికీ నమస్కారం చేసుకుంటూ జగన్ పాదయాత్ర ముందుకు సాగింది.