వరంగల్

మెరుగైన వైద్యం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల,డిసెంబర్ 31: ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మారు మూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ మండలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రులలో నెలకొన్న సిబ్బంది కొరతలను తీర్చేందుకు తక్షణమే ఖాలీగా ఉన్న పోస్టులను భర్తీచేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందేలా అల్ట్రాసౌండ్, సెల్ కౌంటర్, ఇసిజి, డిజిటల్ ఎక్స్‌రే వంటి పరికరాలను వెంటనే అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాలలోని 80 శాతం గర్భిణీ స్ర్తిలు ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు అయ్యేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం వైద్యులు, ఎ ఎన్ ఎంలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ వైద్యం ద్వారా కలిగే లాభాలను వైద్య సిబ్బంది నేరుగా గర్భిణీ స్ర్తిలను కలసి వివరించాలని తెలిపారు. వైద్యులు స్థానికంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ నెల 6న ఆరు మండలాల పరిథిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. అనంతరం మండలంలోని భావుసింగ్‌పల్లి, ఒదితల గ్రామాల శివార్లలోని చెంచు కాలనీలను ఆయన సందర్శించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని బాలకల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో కలసి బోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు వైద్య అధికారి డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ రవీప్రవీణ్‌రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కొత్త సంవత్సరానికి వెల్‌కమ్

వరంగల్, డిసెంబర్ 31: నూతన సంవత్సర వేడుకలు జరపకునేందుకు వరంగల్ నగరం ముస్తాబయింది. వివిధ రకాల కొనుగోళ్లతో షాపులు సందడిగా కనిపించాయి. పెద్దనోట్ల రద్దు కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొనుగోళ్ల హంగామా కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని వరంగల్ నగర వ్యాప్తంగా బేకరీల నిర్వాహకులు కేకుల అమ్మకాల స్టాళ్లను ఏర్పాటుచేసారు. అరకేజీ నుంచి ఐదు కేజీల బరువుతో కేకులు తయా రు చేసి అమ్మకానికి పెట్టారు. కేజీ కేకు కొంటే అర లీటరు కూల్ డ్రింక్ ఉచితం అంటూ ఆఫర్లతో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. స్వీట్లషాపుల వద్ద సందడి బాగా కనిపించింది. నూత న సంవత్సర ప్రారంభం సందర్భంగా స్వీట్లు పంచి ఆనందం పంచుకునేందుకు యువతీ, యువకులు స్వీట్ల షాపుల వద్ద నిలబడటం కనిపించింది. అదే విధంగా పండ్లకు, బోకేలకు కూడా గిరాకీ కనిపించింది. 50రూపాయల నుంచి ఐదువందల రూపాయల వరకు విలువైన బొకేలను అమ్మకానికి పెట్టారు. కొందరు డమీ పూలతో తయారు చేసిన బొకేల కొనుగోలుకు మక్కువ చూపగా, మరికొందరు అసలుసిసలు పూలతో తయారుచేసిన బొకేలకు ప్రాధాన్యత ఇచ్చారు. నూతన సంవత్సరం ప్రారంభం ఆదివారం ఉదయం ఇళ్లను ముగ్గులతో అందంగా తీర్చిదిద్దేందుకు మహిళలు నగరంలోని ముఖ్య కూడళ్లలో ఏర్పాటుచేసిన ముగ్గుల విక్రయ కేంద్రాల వద్ద తమకు ఇష్టమైన రంగు ముగ్గులు కొనుగోలు చేస్తు కనిపించారు.
ఇకపోతే మందుబాబులు నూతన సంవత్సర వేడుకల కోసం విస్తృత ఏర్పాట్లు చేసుకున్నారు. పెద్దనోట్ల రద్దు కారణంగా గతంలో మాదిరిగా ఫంక్షన్ హాళ్లలో భారీఎత్తున ఏర్పాట్లకు పోటీపడటం ఈసారి కొంత తగ్గింది. చాలామంది ఇళ్లలోనే నూతన సంవత్సర వేడుకలు జరపుకునేందుకు సన్నాహాలు చేసుకుంటుంటే, మరికొందరు లాడ్జీలలో రూంలు బుక్ చేసుకుని సన్నిహిత మిత్రులు, బంధువులతో మందుపార్టీలు చేసుకునేందుకు శనివారం ఉదయం నుంచే ఏర్పాట్లు చేసుకోవటం కనిపించింది. బార్ల నిర్వాహకులు కూడా నూతన సంవత్సర ప్రారంభ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అర్థరాత్రి వరకు మందు సరఫరాతోపాటు వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన బార్లలో ముందుగానే టేబుళ్లు బుక్ అయిపోవటంతో మందుబాబుల గిరాకీ ఆధారంగా అదనపు ఏర్పాట్లలో బార్ల నిర్వాహకులు తలమునకలుగా ఉన్నారు. ఇకపోతే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో ఈ మేరకు వైన్‌షాపుల యజమానులు విస్తృత ఏర్పాట్లు చేసారు. మందుబాబుల అవసరాల మేరకు గడిచిన నాలుగు, ఐదురోజుల నుంచి డిపోనుంచి వివిధ బ్రాండ్ల మద్యం తెప్పించి నిలువ చేసారు. నూతన సంవత్సర వేడకులను ఆసరాగా తీసుకుని కొన్ని వైన్‌షాపులలో 10రూపాయల నుంచి 50రూపాయల ఎక్కువ ధరతో మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మటన్, చికెన్ సెంటర్లు, చేపల అమ్మకం కేంద్రాలు కొనుగోలుదారులతో రద్దీగా కనిపించాయి.
ఆకతాయిల ఆగడాలకు పోలీసుల చెక్
కాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మందుబాబుల విచ్చలవిడి చేష్టలకు పోలీసు కమీషనరేట్ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేయటంతో మందుబాబుల హడావుడికి కళ్లెం పడే పరిస్థితి ఏర్పడింది. మద్యం సేవించి అతివేగంగా ద్విచక్ర వాహనాలు, కార్లు నడపటం, ప్రమాదాలు చేయటం వంటి గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈసారి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేసారు. సాయంత్రం నుంచే నగరంలోని వివిధ ముఖ్య కూడళ్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వాహనాల తనిఖీలు, బ్రీత్ అనలైజర్లతో మందుబాబుల తనిఖీలను ప్రారంభించారు. మద్యం సేవించి పట్టుబడిన వారిని సమీప పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. మొబైల్ పార్టీలను ఏర్పాటుచేసి ఆదివారం తెల్లవారుజాము వరకు నగరంలోని ప్రధాన రహదారులలో, ముఖ్య కూడళ్లలో తనిఖీలు జరిపేందుకు నిర్ణయించారు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే ఫంక్షను హాళ్లు, బార్లు తదితర జనసమూహం చేరే ప్రాంతాలలో ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసారు.

రోగులతో ప్రేమగా వ్యవహరించండి
మహాదేవపూర్, డిసెంబర్ 31: ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ప్రేమగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి అన్నారు. శనివారం మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆపరేషన్ థియేటర్‌ల సముదాయాన్ని మంథని శాసనసభ్యులు పుట్ట మధూకర్‌తో కల్సి జిల్లా కలెక్టర్ మురళి ప్రారంభోత్సవాలు చేశారు. మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా సేవ చేయడం అదృష్టంగా భావించాలని అన్నారు. మారుమూల అటవి ప్రాంతంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు చేయూత నిచ్చేందుకు పట్టణాల నుంచి వచ్చిన వైద్య బృందం సహృద్భావ వాతావరణంలో పనులు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలోని సిబ్బంది వారు పనిచేసే చోటనే నివాసం ఉండాలని పేర్కొన్నారు. కార్పోరేట్ స్థాయిలో ఆసుపత్రి అభివృద్ది చెందడానికి ప్రతి ఒక్కరి సహాయ సహాకారాలు అందించాల్సి ఉందని అన్నారు. గర్భిణీల ఇండ్లలోకి ఏ ఎన్ ఎంలు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను సముదాయించి, ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతికి ఒప్పించి తీసుకురావాలని కోరారు. ప్రతి గర్భిణీకి కావాల్సిన వౌళిక వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మంథని శాసనసభ్యులు పుట్ట మదూకర్ మాట్లాడుతూ మహాదేవపూర్ ఆసుపత్రి ప్రస్తుతం పట్టణంలోని కార్పోరేట్ స్థాయి పెద్దాసుపత్రిగా అవతరించిందని అన్నారు. అంకితభావంతో పనిచేసినట్లయితే అనుకున్న పని సాధ్యమవుతుందని అన్నారు. ఈ సమావేశంలో మహాదేవపూర్‌కు వచ్చిన గైనకాలజిస్టు డాక్టర్లు ప్రీతి దయాల్, లలిత దేవిలను, అనెస్థియనిస్ట్‌లు మహేశ్, రాజ్‌కుమార్, ఇంచార్జి మెడికల్ సూపరింటెండెంట్ డా. రవి ప్రవీణ్‌రెడ్డిలను జిల్లా కలెక్టర్ మురళి, ఎమ్మెల్యే పుట్ట మధులు పూల బోకేను అందించి, శాలువాలతో సత్కరించారు. ఆసుపత్రిలో శనివారం నిర్వహించిన ప్రప్రథమ సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్‌లలో మొదటగా పాప జననం కాగా, మొత్తం ముగ్గురికి పెద్దాపరేషన్లను నిర్వహించారు. అనంతరం అమ్మ ఒడి వాహనాన్ని ప్రారంభించారు. నూతన సంవత్సరం వేడుకలను కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. అప్పయ్య, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ కర్త డా గోపాల్, మండల పరిషత్ అధ్యక్షురాలు వెన్నపురెడ్డి వసంత, జడ్పీటీసీ హసీనాభానో, మార్కెట్ కమిటీ చేర్మన్ లింగంపెల్లి శ్రీనివాసరావు, ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం అధ్యక్షులు శ్రీపతిబాపు, మహాముత్తారం జడ్పీటీసీ మందల రాజిరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు అయూబొద్దిన్, ఎం పి టి సీ చాగర్ల రమాదేవి, వైద్యులు చంద్రశేఖర్, జైపాల్, రాజు, కల్పన , ఐసీటిసీ కౌన్సిలర్ గాదె రమేష్, ఆసుపత్రి కాంట్రాక్టర్లు నెనె్నల గట్టయ్య, కడార్ల రాజబాపు, అలీమ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రీయ బాల స్వాస్ట్య లక్ష్యాలకు కృషి చేయాలి
వడ్డేపల్లి,డిసెంబర్ 31:జిల్లాలోని శిశునుండి 19 సంవత్సరాలు కలిగిన పిల్లలు, విద్యార్థులను తరచుగా ఆరో గ్య పరీక్షలు చేసి అవసరమైన చికిత్సలను అం దిస్తూ రాష్ట్రీయ బాల స్వాస్ట్య కార్యక్రమ లక్ష్యాలను నెరవేర్చేందుకు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అడిషినల్ డైరెక్టర్ (ప్లానింగ్) డాక్టర్ సి హెచ్ సూర్యప్రకాష్ అన్నారు. శనివారం ఇండియన్ మెడికల్ అసోషియేషన్ సమావేశ మందిరంలో ఆర్‌బిఎస్ టీంల డాక్టర్లు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, పాఠశాలలకు వెళ్లని పిల్లలందిరికి ఈ కార్యక్రమంలో పరీక్షలు నిర్వహించి పుట్టుకతో వచ్చే లోపాలను, ఎదుగుదలను గుర్తించాలని అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వైద్యాధికారి అశోక్ ఆనంద్ మాట్లాడుతూ నిర్దేశించిన కార్యాచరణ ప్రకారం పల్స్ పోలియో, డీ వార్మింగ్ కార్యక్రమాలలో కూడా పాల్గొనాలని, ఆరోగ్య సూత్రాలపై విద్యార్థులకు అవగాహణ కల్పించాలని అన్నారు. ఆర్ బి ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్యామానీరజ మాట్లాడుతూ ఈ సంవత్సరం 409 పాఠశాలలు, 451 అంగన్‌వాడీ కేంద్రాలలో వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 53,445 మంది పిల్లలను పరీక్షించి 22,231 మంది పిల్లలకు చికిత్సలు అందించామని వివరించారు. ఈ సమావేశంలో అదనపు వైద్యాధికారులు డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ అనూరాధ, డాక్టర్లు కృష్ణారావు, అన్నప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

అతివేగం ప్రాణం తీసింది
జనగామ టౌన్, డిసెంబర్ 31: రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై నుంచి ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతిచెందగా.. మరో ఇద్దరు మహిళా కూలీలకు తీవ్రగాయాలైన సంఘటన శనివారం జనగామలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం... ఇటుక లోడును దింపి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి బస్టాండ్ వైపు అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి స్థానిక అండర్ బ్రిడ్జి వద్ద కిందపడి పల్టీకొట్టింది. ఈ సంఘటనలో జనగామ మండలం గానుగుపహాడ్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ దావెర రాజు(43) తల బలమైన గాయాలు కాగా, రఘునాథపల్లి మండలం మేకలగట్టు ఆంధ్రతండాకు చెందిన మాలోతు నీలమ్మ, నెల్లుట్ల గ్రామానికి చెందిన బండి స్వరూపల తలలతో పాటు నడుము భాగంలో తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా అందులో డ్రైవర్ రాజు మృతిచెందాడు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వరంగల్ ఎంజిఎంకు తరలించారు. రైల్వే బ్రిడ్జి నుంచి ట్రాక్టర్ కిందపడిన సమయంలో రోడ్డుపై ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు బాటసారులు ఊపిరిపీల్చుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ముస్కె శ్రీనివాస్ తెలిపారు.

కొత్తసంవత్సరంలో మరింత అభివృద్ధి

మహబూబాబాద్, డిసెంబర్ 31: నూతనంగా ఏర్పడ్డ మహబూబాబాద్ జిల్లా అభివృద్ధిలో మరిం త ముదడుగు వెయ్యాలని జిల్లా అభివృద్ధిలో అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అన్నారు. మహబూబాబాద్‌లోని జిల్లా కలెక్టరేట్‌లో శనివారం పిఆర్టీయు ఆధ్వర్యంలో ముద్రించిన డైరీని, క్యాలేండర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఉపాద్యాయ వర్గాలతోపాటు జిల్లా ప్రజలందరికి కలెక్టర్ ప్రీతిమీనా శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాను విద్యా పరం గా ముందంజలో నిలిపే విధంగా ప్రతి ఉపాద్యాయుడు కృషి చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో మహబూబాబాద్ జిల్లా విద్యారంగంలో రాష్ట్రానికే ఆదర్శవంతంగా ఉండే విధంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిఆర్టీయు రాష్ట్ర నాయకులు సంకా బద్రినారాయణ, జిల్లా అధ్యక్షులు సమ్మయ్య, నాయకులు నిమ్మ వెంకటేశ్వర్లు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహా అధ్యక్షుడు షెక్ హుస్సేన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రీతిమీనాను కలసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా అధ్యక్షుడు సైదులు, కార్యదర్శి పూర్ణ ఆనంద్, కోశాధికారి శంకర్‌గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకట్రాములు, ప్రచార కార్యదర్శి సం దాని, సంయుక్త కార్యదర్శి లక్ష్మి, నాగరాజు తదితరులు ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటు పనిచేయాలని కలెక్టర్ ప్రీతిమీనా సూచించారు.

మోసపూరిత వాగ్దానాలను మానుకోవాలి
వడ్డేపల్లి,డిసెంబర్ 31:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై స్పష్టత లేదని, ప్రతిపక్షనాయకులపై ఆరోపణలు చేయడం మానుకోవాలని నగర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజనాల శ్రీహరి తెరాస నాయకులను హెచ్చరించారు. శనివారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నగరంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లపై బహిరంగ చర్చకు సిద్దమా అని తెరాస నాయకుల సవాల్‌ను స్వీకరిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం 13వందల డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రకటిస్తే, ఎస్సార్ నగర్ 80 ఇండ్ల నిర్మాణాలు మాత్రమే కొనసాగుతున్నాయని, అంబేద్కర్ నగర్, జితేంద్రనగర్‌లలో కూడా 32 బ్లాకులకు గాను, 20 ఇండ్ల నిర్మాణాలు మాత్రమే కొనసాగుతున్నాయని వివరించారు. కెసి ఆర్ దత్తత గ్రామాలలో ఒక్కో ఇంటికి 8లక్షల రూపాయలను చెల్లిస్తే, మిగ తా ప్రాంతాలలో ఐదు లక్షల రూపాయలు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతి పక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడడం తెరాస నాయకులకు తగదని హితవు పలికారు. నగరంలోని నాళాలపై ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతలో తెరాస నాయకుల ఇండ్లను వదిలివేసి, మిగతా అక్రమ కట్టడాలను కూల్చివేయడం సమంజసం కాద ని అన్నారు. రూపాయికే నల్లా కనెక్షన్ అని ఆర్భాటంగా ప్రకటించి, ఇప్పటి వరకు నల్లాలను ఇవ్వడంలోకాని, ప్రజలకు తాగునీరు అందించడంలో నగర పాలక సంస్థ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మాజీ మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ది పనులను ఒర్వలేకనే తెరాస నాయకులు విమర్శలు చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకులపై నోరుపారేసుకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు అయూబ్, బిసి సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు విజయ్‌కుమార్, ఖాజాపాషా తదితరులు పాల్గొన్నారు.

కళాశాలకు స్వంత భవనాలు నిర్మిస్తాం
కాటారం, డిసెంబర్ 31: కాటారం ప్రభు త్వ జూనియర్ కళాశాలకు స్వంత భవనాల ను త్వరలోనే నిర్మాణాలు చేపడుతామని మంథని శాసనసభ్యులు పుట్ట మధూకర్, జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి అన్నారు. శనివారం వారు కాటారం మండల కేంద్రంలోని 501 సర్వే నెంబరులో గల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. కాగా స్వంత భవనాలు నిర్మాణాలు జరిగేంత వరకు పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన భవనసముదాయంలో తరగతులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రూ. 65 లక్షలు ప్రభుత్వం నిధులు మంజూరీ చేసిందని పేర్కొన్నారు. ఆరు రూములకు గాను నిధులను వినియోగించాల్సి ఉందని అన్నారు. ఇదిలా ఉండగా 501 సర్వే నెంబరులో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పడంతో వేరే ప్రాంతంలో స్థలాన్ని సమకూరుస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు బుర్ర రాజబాపుగౌడ్, దేవోజి, యూకుబ్, సంపత్, స్వామి, లచ్చిరెడ్డి, తైనేని సతీష్, కుంభం రమేష్‌రెడ్డి, చల్ల జక్కిరెడ్డి, పంతకాని సడవలి, గాలి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి
ఎకె మల్లారం రెవెన్యూ సదస్సులో గ్రామస్తుల వినతి
మంగపేట, డిసెంబర్ 31: అకినేపల్లి మల్లారం గ్రామంలో స్మశాన వాటికకు స్థలం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కావున స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. రెవెన్యూ సదస్సులలో భాగంగా చివరి రోజైన శనివారం జిల్లా సరిహద్దు గ్రామమైన అకినేపల్లి మల్లారంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. మంగపేట తహశీల్దార్ పాలకుర్తి భిక్షం అధ్యక్షతన జరిగిన రెవెన్యూ సదస్సులో గ్రామంలోని సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలోని చెరువులు, కుంటలు కబ్జాకు గురికాకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు రెవెన్యూ అధికారులను కోరారు. గ్రామం నుండి గోదావరికి వెళ్ళడానికి రోడ్డు తీయాలని అధికారులకు విన్నవించారు. అకినేపల్లి మల్లారం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు సంబందించి మొత్తం 6 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగపేట తహశీల్దార్ పాలకుర్తి భిక్షం, ఆర్‌ఐ రహమాన్, అకినేపల్లి మల్లారం విఆర్‌ఓ పి.బాణయ్య, టిఆర్‌ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు రాసమల్ల సుకుమార్, గ్రామస్తులు ముద్దుకృష్ణ, లక్కి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలి
ములుగులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
ములుగుటౌన్, డిసెంబర్ 31 : కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ములుగులో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐల ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా లెక్చరర్ల నిరవధిక సమ్మె వద్దకు చేరుకుని సంఘీభావం తెలిపారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి సాగర్, డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ రత్నం ప్రవీణ్‌లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కార్మిక, విద్యారంగాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తానని చెప్పిన సిఎం కెసిఆర్ వాటి అమలుకు కృషిచేయడంలేదని అన్నారు. ఒప్పంద ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న లెక్చరర్లను పర్మినెంట్ చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం సరైందికాదని అన్నారు. పదో పిఆర్‌సి ప్రకారం లెక్చరర్లను పర్మినెంట్ చేయడంతోపాటు వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అక్కడి నుండి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని సబ్ కలెక్టర్ పివి.గౌతంకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు గణేష్, నరేష్, నవీన్, ప్రవీణ్, శశి, దిలీప్, ప్రణీత, శ్రావణ్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్ చెల్లింపులపై అవగాహణ
కెయు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రవీందర్‌రెడ్డి
నక్కలగుట్ట,డిసెంబర్ 31:దేశంలో రానున్నది నగదు రహిత సమాజమని, దీనికి అందరూ సంసిద్దులు కావాలని, ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపులు, మార్పిడి విధానాలపై అవగాహణ పెంచుకోవాలని కెయు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రవీందర్‌రెడ్డి అన్నారు. శనివారం కెయు ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఎస్‌బిహెచ్ వారు సిబ్బందికి అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో నగదు రహిత లావాదేవీలకు అందరూ సిద్దం కావాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. కెయు ఉద్యోగులు అందరూ నగదు రహిత విధానంపై అవగాహణ పెంచుకోవాలని సూచించారు. కెయు ఎస్‌బిహెచ్ చీఫ్ మేనేజరు ఆర్‌ఆర్ జయంతి మాట్లాడుతూ స్టేట్ బ్యాంకు బడ్డీ మిగతా ఆప్‌ల కన్నా ఎంతో సురక్షితమైనదని, రిజిస్ట్రర్ చేసుకోవడం, ఉపయోగించడం చాలా తేలిక అని అన్నారు. ఎస్‌బిహెచ్ బడ్డీ ద్వారా గరిష్టంగా 50 వేల వరకు చెల్లింపులు చేయవచ్చునని, స్మార్ట్ ఫోన్లు ఉన్న వారందరూ దీని ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు చేయవచ్చునని తెలిపారు. ఎస్‌బిహెచ్ మేనేజర్లు శ్రీనివాస్, మహేష్‌లు బడ్డీని ఉపయోగించడంపై అవగాహణ కల్పించారు. వైస్ ప్రిన్సిపాల్ దయాకర్‌రావు, కెయు ఉద్యోగులు పాల్గొన్నారు.

గౌడకులస్తులను ఎస్‌టిలుగా గుర్తించాలి
ములుగుటౌన్, డిసెంబర్ 31 : గౌడ కులస్తులను ఎస్‌టిలుగా గుర్తించాలని తెలంగాణ ఏజెన్సీ గౌడ హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారుపోతుల నర్సయ్య డిమాండ్ చేశారు. శనివారం ములుగులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు గౌడ కులస్తులకు తీరని అన్యాయం చేశాయని అన్నారు. జిఒ 5,2 ప్రకారం ఎస్‌టిలుగా ఉన్న గౌడ కులస్తులకు తహసిల్దార్లు సహకరించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 1950 రాజ్యాంగంలోని జిఒ ప్రకారం గౌడకులస్తులను ఎస్‌టిలుగా గుర్తించాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.