వరంగల్

కుడా రోడ్డును అడ్డంగా తవ్వేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 20: కాకతీయ పట్టణాభివృద్ధి కుడా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసి తమ స్థలంలో కలుపుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్న సంఘటన ఇది. రోడ్డును అడ్డంగా తవ్వటాన్ని నివారించేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై దౌర్జన్యం చేయటంతోపాటు తాము జిల్లాకు చెందిన ముఖ్యప్రజాప్రతినిధి అనుచరులమని, తమను ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరింపులు చేస్తున్నారని ఆ ప్రాంతం ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్న రోడ్డును తవ్వివేసి పక్క ప్లాట్ల నుంచి రోడ్డు నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తుండటంతో వాటి యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
నగరంలోని హంటర్ రోడ్డు ప్రాంతంలో దీన్‌దయాళ్‌నగర్‌లో సర్వే నెంబరు 967 పక్కనుంచి 15సంవత్సరాల కిందట కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రోడ్డు నిర్మించింది. కానీ తాజాగా 15రోజుల కిందట కొందరు వ్యక్తులు రాకపోకలు నిలిచిపోయేలా ఈ రోడ్డును అడ్డంగా తవ్వి 967సర్వేనెంబరులోని స్థలం నుంచి కొత్త రోడ్డు నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 15ఏళ్ల కిందట నిర్మించిన రోడ్డును అడ్డంగా తవ్వటాన్ని చుట్టుపక్కలవారు ప్రశ్నిస్తే రోడ్డు వెడుతున్న స్థలం తమ సొంతమని సమాధానం చెప్పారు.
తాజాగా బుధవారం అడ్డంగా తవ్విన రోడ్డును పూర్తిగా తొలగించి అక్కడ రోడ్డు ఉన్నట్లు ఆనవాళ్లు లేకుండా చేయటంతో ఈ సంఘటనపై ఆ ప్రాంతానికి చెందిన మాధవరెడ్డి అనే స్థల యజమాని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మర్రి యాదవరెడ్డికి గురువారం ఫిర్యాదు చేసారు.
ఉన్న రోడ్డును తొలగించి కొత్తరోడ్డును తన స్థలం నుంచి నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డును ధ్వంసం చేసిన సంఘటనపై విచారణ జరిపించి తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన కుడా చైర్మన్‌ను, అధికారులను కోరారు.

టిఆర్‌ఎస్ ఆవిర్భావ మహాసభ ఏర్పాట్ల పరిశీలన

వరంగల్, ఏప్రిల్ 20: రాష్ట్ర శాంతిభద్రతల విభాగం అదనపు డిజిపి అంజనీకుమార్ గురువారం సాయంత్రం వరంగల్ పర్యటనకు వచ్చారు. ఈనెల 27న వరంగల్ నగరంలోని ప్రకాష్‌రెడ్డిపేటలో నిర్వహించే టిఆర్‌ఎస్ ఆవిర్భావ మహాసభ ఏర్పాట్లను పరిశీలించేందుకు, చేపట్టవలసిన బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులతో చర్చించేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు.
సాయంత్రం ప్రకాష్‌రెడ్డిపేటలోని బహిరంగస్థలిని అదనపు డిజిపి అంజనీకుమార్ నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు, అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలితో కలిసి పరిశీలించారు.
రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే ప్రజల కోసం చేస్తున్న ఏర్పాట్లను, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను పరిశీలించారు. ముందస్తు జాగ్రత్తల కోసం తీసుకుంటున్న చర్యల గురించి పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు అదనపు డిజిపికి వివరించారు. బహిరంగ సభకు భారీగా జనాలు వచ్చే అవకాశం ఉన్నందున సభా ప్రాంగణంలో పెద్దసంఖ్యలో అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని అదనపు డిజిపి సూచించారు. బహిరంగ సభకు తరలివచ్చే వాహనాలు సాంకేతిక సమస్యలతో రోడ్డుపై నిలిచిపోతే ఆ వాహనాలను రోడ్డుపక్కకు తప్పించేందుకు వెహికల్ లిఫ్టింగ్ వాహనాలను అందుబాటులో ఉంచాలని పోలీసు కమిషనర్‌కు తెలిపారు. అనంతరం పోలీసు కమీషనేట్ పరిధిలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న అశ్వికదళం కోసం వరంగల్ కోట ప్రాంతంలో నిర్మిస్తున్న అశ్వశాలను అదనపు డిజిపి పరిశీలించారు.
కాగా, అంతకుముందు తెలంగాణ రాష్టస్రమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 27న వరంగల్ నగరంలో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్ల కోసం నగర పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. బహిరంగ సభ జరిగే ప్రకాష్‌రెడ్డిపేటలోని సభాస్థలిని గురువారం పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు సందర్శించి భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో, బహిరంగ సభ నిర్వాహకులతో సమీక్ష జరిపారు. బహిరంగ సభ జరిగే రోజున వరంగల్ నగరంలో, నగరానికి వచ్చే వివిధ మార్గాలలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. బహిరంగ సభ రోజున ముఖ్యమంత్రి వచ్చే మార్గాన్ని, వివిఐపిలు వచ్చే మార్గాలను పోలీసు కమిషనర్, ఇతర పోలీసు అధికారులు పరిశీలించారు. ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ వేదిక వద్ద చేపట్టవలసిన బందోబస్తుపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఐదుమార్గాల ద్వారా టిఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు వరంగల్ బహిరంగ స్థలికి చేరుకుంటున్న నేపథ్యంలో ఆయా మార్గాలలోనే వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని పార్టీ ముఖ్యులకు కమీషనర్ సూచించారు. జిల్లాల నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలు, ఆర్టీసి బస్సులు పార్కింగ్ చేసేందుకు పార్కింగ్ స్థలాలను ఎంపికచేసి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, పోలీసు అధికారులు నిర్ణీత జిల్లాల వాహనాలు నిర్ణీత పార్కింగ్ స్థలాలలో నిలిపేలా చూడాలని టిఆర్‌ఎస్ నాయకులు కోరారు. ఈ సందర్భగా ఏ జిల్లాల వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో పోలీసు అధికారులు, టిఆర్‌ఎస్ నాయకులకు సూచించారు. పార్కింగ్ స్థలాల్లో వాహనాలను వెంటవెంటనే పార్కింగ్ చేసేందుకు, బహిరంగ సభ అనంతరం వాహనాలు త్వరితగతిన పంపించేందుకు పార్కింగ్ స్థలాల్లో ఐదు ర్యాంపులను ఏర్పాటు చేయాలని పోలీసు కమీషనర్ సూచించారు. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందజాగ్రత్తగా భట్టుపల్లి-ఉర్సు మార్గంలో ఎస్‌ఆర్ కళాశాల వెనకప్రాంతంలో మరో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని కమీషనర్ టిఆర్‌ఎస్ నాయకులకు సూచించారు. ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం జరుగుతుండటం, ఇరుకైన వంతెన ఉన్న కారణంగా ట్రాఫిక్ జాం ఏర్పడకుండా, ప్రమాదాలు జరగకుండా పోలీసు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సెంట్రల్ జోన్ డిసిపి వేణుగోపాలరావు, ఈస్ట్ జోన్ డిసిపి ఇస్మాయిల్, ఏసిపిలు మురళీధర్, శోభన్‌కుమార్, జనార్ధన్, సురేంద్రనాథ్, టిఆర్‌ఎస్ పార్టీ ముఖ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

అన్ని వర్గాల ప్రజల
అభ్యున్నతికి ముఖ్యమంత్రి కృషి

గోవిందరావుపేట, ఏప్రిల్ 20: తెలంగాణలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు పాటుపడుతున్నారని గిరిజన, పర్యాటకశాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూలి పనిదినాలలో భాగంగా గురువారం మండలంలోని పస్రా, గోవిందరావుపేట గ్రామాలలో కూలి పనిచేసిన మంత్రి 2.5లక్షల రూపాయలను అందుకున్నారు. మండల కేంద్రంలో పురుగుమందుల దుకాణంలో పనిచేసిన మంత్రి రైతులకు పురుగుమందులను అమ్మారు. దీంతో దుకాణాల యజమానుల నుండి లక్ష రూపాయల కూలి తీసుకున్నారు. అంతేకాక పస్రాలో రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంటాతో కొలిచినందుకు మిల్లర్స్ అసోసియేషన్ నుండి 1.5 లక్షల రూపాయలను కూలిగా అందుకున్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ జన జాతరలో పార్టీ సమావేశానికి ప్రజలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు సూడి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు రైస్‌మిల్లర్స్ నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో పోలీస్ రాజ్యం

వరంగల్, ఏప్రిల్ 20: రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు చేస్తున్న ఉద్యమాలను, ఆందోళనలను అణచివేసే ప్రయత్నాలు చేస్తోందని, రాష్ట్రాన్ని పోలీసు రాజ్యాంగా మారుస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు ప్రజలను నేరుగా కలసి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేవారని, కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను కలవటం అటుంచి ఆయనను కలిసేందుకు వచ్చిన ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, దీనికితోడు ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు ఆయా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవటం లేదని అన్నారు. వరంగల్ పర్యటన సందర్భంగా గురువారం చాడ వెంకటరెడ్డి పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లాసమితి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ చాలాకాలంగా ధర్నాచౌక్ వద్ద రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు వివిధ సమస్యలపై ఆందోళనల నిర్వహించటం ద్వారా సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకవెళ్లేవని, కానీ రాష్ట్రప్రభుత్వం కుట్రపూరితంగా ధర్నాచౌక్‌ను ఎత్తివేయటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు దళితులకు మూడుఎకరాల వ్యవసాయ భూమి, ఇళ్లులేని పేదకుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇళ్లస్థలాలు, విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసారు. కెజి టు పిజి విద్య కేవలం ఎన్నికల హామీగానే మిగిలిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని అన్నారు. దేశంలో దళితులు, మైనారిటీలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ నోరు విప్పాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, అర్బన్ జిల్లా కార్యదర్శి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

హరితహారం మొక్కలను బతికించాలి

మహబూబాబాద్, ఏప్రిల్ 20: తెలంగాణ రాష్ట్రంలో హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను బతికించేలా చర్యలు తీసుకొవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశమందిరంలో హరితహారం, ఎన్‌ఆర్‌ఈజిఎస్, మరుగుదొడ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా ఇన్సుట్యూషన్, అలవెన్సులలో నాటిన మొక్కలు వందశాతం బ్రతికేలా చూడాలని, ఒక వేళ మొక్క చనిపోతే దాని స్థానంలో కొత్త మొక్కను నాటాలని అన్నారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరుపోయాలని అన్నారు. ప్రతి శుక్రవారం గ్రీన్‌ఫ్రైడే పాటిస్తూ మండలంలోని మండలస్థాయి అధికారులందరూ ఒక చోట చేరాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మండలాల వారీగా సమీక్షించారు. బండ్ ప్లాంటేషన్ లక్ష్యం 24లక్షలు కాగా 1.5లక్షల మొక్కలు పెంచామని తెలిపారు. కేసముద్రం, మరిపెడ, నెల్లికుదురు, తొర్రూరులలో మొక్కలు పెంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి జీపిలో డంపింగ్‌యార్డు ఉండేలా చర్యలు చెపట్టాలని అన్నారు. 109డంపింగ్ యార్డులు మంజూరు కాగా 47వివిధ దశల్లో ఉన్నాయన్నారు, 8పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. జిల్లాలో 6874ప్రాం ఫాండ్స్ మంజూరు కాగా 4పూర్తి అయ్యాయని చెప్పారు.

వేసవి ముగిసేలోగా పాఠశాలల్లో
వౌలిక వసతులు ఏర్పాటు చేయాలి

వరంగల్, ఏప్రిల్ 20: వరంగల్ రూరల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వౌళిక సదుపాయాల ఏర్పాటు పనులను ఈ వేసవిలోగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. వివిధ పథకాల కింద చేపట్టి అసంపూర్తిగా నిలచిన పనులను మే నెలలోగా పూర్తిచేయాలని చెప్పారు. గురువారం రూరల్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో వివిధ శాఖలు చేపట్టిన పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్, కిచెన్‌షెడ్, మంచినీటి సౌకర్యం, గ్రీనరీ పనులను సత్వరం పూర్తిచేయాలని చెప్పారు. ఎండిపిడిఓలు, ఎంఇఓలు గ్రామస్థాయి ప్రజాప్రతినిధులతో సమన్వయం ఏర్పాటుచేసుకుని పనులు సత్వరం పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. జిల్లాను బహిరంగ మలవిసర్జనరహిత జిల్లాగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఓడిఎఫ్ గ్రామాలను గుర్తించి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అన్నారు. పరకాల, ఆత్మకూరు, గీసుకొండ మండలాల్లో ఓడిఎఫ్ గ్రామాల గుర్తింపు జరిగిందని, మిగతా మండలాల్లో కూడా గుర్తింపు పూర్తిచేయాలని చెప్పారు. గ్రామాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి భూమిలేని దళితులకు మూడు ఎకరాల చొప్పున పంపిణీకి నివేదికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఫించన్ల పంపిణీలో పారదర్శకతతో వ్యవహరించాలని, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఫించన్లు అందాలని అన్నారు. గ్రామాలలో స్మశానవాటికల ఏర్పాటుకు అవసరమై స్థలాన్ని గుర్తించాలని చెప్పారు. గొర్రెల, మేకల పెంపకందారుల సహకార సంఘాలలో 18సంవత్సరాలు నిండిన యువకులకు సభ్యత్వం ఇవ్వవచ్చని కలెక్టర్ స్పష్టం చేసారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కుటుంబంలోని సభ్యులను సంఘాలలో సభ్యులుగా చేర్చుకోవచ్చని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, డిఎఫ్‌ఓ పురుషోత్తం, పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

అనుమానాస్పద
స్థితిలో వ్యక్తి మృతి
కమలాపూర్, ఏప్రిల్ 20: కమలాపూర్ మండలంలోని గుండేడు గ్రామానికి చెందిన ఆకునూరి మహేందర్(34) అనే వ్యక్తి చెరువులో పడి మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మహేందర్ ఇంటినుండి వెళ్లి తిరిగిరాకపోవడంతో గురువారం ఉదయం గ్రామస్థులు చెరువు పక్క నుండి వెళ్తుండగా, మహేందర్ మృతదేహాన్ని గుర్తించారు, దీంతో మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు ప్రమాదంతో మృతి చెందాడా, లేదా హత్యకు గురయ్యాడా? అనే సందేహాం మేరకు ఎస్సై నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వడదెబ్బ తగిలి
గొర్రెల కాపరి మృతి
నల్లబెల్లి, ఏప్రిల్ 20: నల్లబెల్లి మండలంలో వడదెబ్బ తగిలి గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి నల్లబెల్లి మండలం మేడేపల్లి గ్రామ పంచాయితీ పరిధి గొల్లపల్లి గ్రామానికి చెందిన గట్టుమల్లు(70) అనే గొర్రెల కాపరి తన గొర్రెలను మేపడానికి వెళ్లారు. వేడి వడగాల్పులకు అస్వస్థకు గురైన గట్టుమల్లు కుప్పకులాడు, తోటి కాపరి హుటాహుటిన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అస్వస్థకు గురైన గట్టుమల్లును నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజి ఎంకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు.
తహశీల్ కార్యాలయం ఎదుట
బిజెపి నాయకుల నిరసన
కమలాపూర్, ఏప్రిల్ 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్లను కేటాయించినందుకు నిరసనగా కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో బిజెపి నాయకులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ బిజెపి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కుమారస్వామి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ అమలు కాని హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తానంటూ ప్రజలను మాయ మాటలతో మభ్య పెడుతున్నారని అన్నారు. రైతులకు పంటలు సరైన గిట్టుబాటు ధరలు కల్పించకుండా ఎకరాకి 4వేలు కల్పిస్తానని ఓట్ల రాజకీయం చేస్తున్నాడని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.
సమాజ సేవలో ముందుండాలి
నెక్కొండ,ఏప్రిల్ 20: సమాజ సేవలో యువత, విద్యార్థులు మందుండాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కన్వీనర్ మాంకాల యాదగిరి అన్నారు. నెక్కొండలో గురువారం ఉచిత కోచింగ్ సెంటర్ గోడపత్రికను సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ మాట్లాడుతూ గత పదిహేనేళ్లుగా నెక్కొండలో టిటిసి, టిఎస్‌ఆర్‌జెసి, స్పొకెన్ ఇంగ్లీష్ పరీక్షలకు ఉచితంగా శిక్షణనిస్తున్నట్లు చెప్పారు.
సమాజ సేవలో ముందుండాలని, ప్రతిభ కల్గిన నిరుపేద విద్యార్థులకు కోచింగ్ సెంటర్ ద్వారా అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఈనెల 23 నుండి మే 31 వరకు స్థానిక విద్యోదయ ఉన్నత పాఠశాలలో రెండు బ్యాచులకు శిక్షణనివ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నాగార్జున్‌రెడ్డి, సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు యాకుబ్ భోదన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడాలి
పరకాల, ఏప్రిల్ 20: అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడాలని పరకాల ఏసిపి సుధీంద్ర అన్నారు. గురువారం అంబేద్కర్ జయంతి వారోత్సవాల సందర్భంగా అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావులలో ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావడం చాలా గొప్ప విషయమన్నారు. భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన మహా వ్యక్తి అని ఆయన కొనియాడారు.
అనంతరం ఏబిఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదని అన్ని వర్గాల ప్రజల కోసం పని చేసిన మేధావి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మేకల రంజిత్, మారపెల్లి క్రాంతి, గౌతం, వెంకటేష్, రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు.