వరంగల్

ఏడాదిలోగా కాజీపేట-బలార్షా .. మూడవ లైన్ పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 20: వచ్చే ఏడాదిలోగా కాజీపేట- బళ్లార్షా మూడవ లైన్ పనులు పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా అన్నారు.
బుధవారం కాజీపేట రైల్వేస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు చేరుకున్న ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.
ముందుగా కాజీపేట స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిశుభ్రతపై అసంతృప్తి చేశారు. అక్కడి నుంచి డీజిల్ లోకోషెడ్, ఎలక్ట్రికల్ లోకోషెడ్, రైల్వే ఆసుపత్రితో పాటు రిజర్వేషన్ కౌంటర్, స్టేషన్ ప్రాంగణాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట రైల్వే జంక్షన్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు.
కాజీపేట జంక్షన్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే కాజీపేటలో ఫిట్‌లైన్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా కాజీపేటలో పివోహెచ్ ఏర్పాటుకు రైల్వేబోర్డుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
ఇక్కడ ఎలక్ట్రికల్ లోకోషెడ్, డీజిల్ లోకోషెడ్లు ఉన్నందున పివోహెచ్ ఏర్పాటు తప్పనిసరి తాను రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపామన్నారు. కాజీపేట రైల్వేజంక్షన్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాననానరు. జిఎం వెంట డిఆర్‌ఎం ఆశిష్ అగర్వాల్, సిఇసి సోలాంగ్ గుప్తా, జిఎంఎస్ డా. నాగప్రసూన్నాంబా, సిఎంఈ నాగేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.

వచ్చిండు.. పోయిండు...
*తొమ్మిది నిమిషాల్లో ముగిసిన గవర్నర్ వరంగల్ పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జనవరి 20: రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ వరంగల్ జిల్లా పర్యటన తొమ్మిది నిముషాల్లో ముగిసింది. బుధవారం జిల్లాలో మిషన్ భగీరథ పనులను పరిశీలించేందుకు ఆయన వరంగల్‌కు వచ్చారు. షెడ్యూల్ ప్రకారం అరగంట ఆలస్యంగా వచ్చిన గవర్నర్ ముందుగా కొమురవెల్లి కమాన్ వద్ద జరుగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. సరిగ్గా 12.39గంటలకు కొమురవెల్లి వద్దకు చేరుకున్న గవర్నర్ ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ట్యాంకు పనులను పరిశీలించి 12.48నిముషాలకు అక్కడి నుంచి మెదక్ జిల్లా రాజేంద్రనగర్‌కు బయలుదేరారు. మొత్తం 9 నిముషాల్లోనే గవర్నర్ పర్యటన ముగిసింది. కొమురవెల్లి నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్ వద్దకు వెళ్లాల్సి ఉండగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. కొమురవెల్లి నుండే నేరుగా మెదక్ జిల్లా రాజేంద్రనగర్‌కు బయలుదేరి వెళ్లారు.

మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం
చేర్యాల, జనవరి 20: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశంలోని రాష్ట్రాలన్నింటికీ ఆదర్శమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు అన్నారు. మండలంలోని కొమురవెల్లి గ్రామం రాజీవ్ రహదారి పక్కన నిర్మిస్తున్న ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులను గవర్నర్ నరసింహన్‌తో కలిసి వారు బుధవారం పరిశీలించారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలందరికి తాగునీరు అందించే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఏప్రిల్ చివరి నాటికి జనగామ, మెదక్ జిల్లా కొండపాక మండల పరిధిలోని గ్రామాల ప్రజలకు పైప్‌లైన్ల ద్వారా తాగునీటిని అందించడం జరుగుతుందని అన్నారు. రూ.840 కోట్ల వ్యయంతో తాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశ పెట్టిందని, ఈ ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. జనగామతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాలలోని 11 మండలాలకు తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. నాణ్యతతో త్వరితగతిన పనులను పూర్తి చేయాలని వారు అధికారులతో పాటు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మనర్సింగరావు, ఎంపిపి మేడిశెట్టి శ్రీ్ధర్, జడ్పీటిసి సుంకరి సరిత, నాయకులు అంకుగారి శ్రీ్ధర్‌రెడ్డి, ఎంపిటిసి బందెల మహిపాల్‌రెడ్డి, మంగోలు చంటి, ఒగ్గు శ్రీశైలం, బొంగు సురేందర్‌రెడ్డిలు ఉన్నారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
చేర్యాల, జనవరి 20: అధికారులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ హెచ్చరించారు. బుధవారం స్థానిక వీరభద్ర గార్డెన్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారుల పనితీరు పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి పనితీరుపై ఎంపిపి మేడిశెట్టి శ్రీ్ధర్, ఎంపిటిసి కొమ్ము నర్సింగరావులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. షిఫ్టు పద్ధతిలో విధులు నిర్వర్తించడం చేస్తున్నారని, ఆసుపత్రిలో ఒక్క ప్రసూతి ఆపరేషన్ కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రయివేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని, గతంలోనే ఆసుపత్రి బాగా ఉండేదని నూతన భవనంలోకి వచ్చినప్పటి నుంచి సేవలు సరిగా లేవని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కలెక్టర్ డాక్టర్ల పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. సేవలు సరిగా అందని పక్షంలో వారిపై క్రిమినల్ చర్యలకు సైతం వెనకాడబోనని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్డీవో వెంకట్‌రెడ్డి, డిఎం అండ్ హెచ్‌వో సాంబశివరావు, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు, తహశీల్దార్ విజయ్‌సాగర్, ఎంపిడివో జ్యోతిరాణిలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఘరానా దొంగ అరెస్ట్
వడ్డేపల్లి, జనవరి 20: కల్యాణ మండపాలలో దొంగతనాలకు పాల్పడుతున్న గట్టికొప్పుల చంద్రవౌళిని వరంగల్ కమీషనరేట్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి నగదును, బంగారాన్ని స్వాదీనం చేసుకున్ననట్లు సిసిఎస్ ఎసిపి ఈశ్వర్‌రావు బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. వివరాల్లోకి వెళితె..జిల్లాలోని సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన గట్టికొప్పుల చంద్రవౌళి గత కొంతకాలంగా చదువును మానేసి హైదరాబాదు ఉప్పల్ రామంతాపూర్‌లోని జెర్సిమిల్క్ డైరీలో సంవత్సరం కాలం పనిచేశాడు. ఇదే సమయంలో నిందితుడు తాగుడుకు, జల్సాలకు అలవాటు పడి ఉద్యోగానికి గైర్హాజరు కావడంతో, యాజమాన్యం పనిలోనుండి తొలగించారు. నిందితుడు ఉద్యోగం పోవడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. జల్సాలకు అలవాటు పడిన నిందితుడు డబ్బులు లేకపోవడంతో చోరీలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాడు. మొదటగా హంటర్‌రోడ్డులోని కోడెం కళ్యాణ మండపంలో వివాహాలు జరుగుతున్న సమయంలో చిన్నారి మెడలోని 18 గ్రాముల బంగారు ఆభరణం, డిసెంబర్ మాసంలో ఇదే కళ్యాణ మండపంలో డెస్సింగ్ రూంలోని హైండ్‌బ్యాగ్‌లోనుండి 45 గ్రాముల బంగారు నల్లపూసల గొలుగుతోపాటు, ఒక చరవాణిని దొంగిలించాడు. అదే విధంగా నవంబర్ మాసంలో పెళ్లి ఊరేగింపులో మహిళ మెడలోనుండి 30 గ్రాముల బంగారు ఆభరణాన్ని దొంగిలించాడు. దొంగిలించిన సొత్తును వరంగల్ బులియన్ మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రయత్నించగా, ఖచ్చితమైన సమాచారంతో క్రైం ఎసిపి ఈశ్వర్‌రావు ఆదేశాల మేరకు ఇన్స్‌పెక్టర్ శ్రీ్ధర్ తన సిబ్బందితో వెళ్లి నిందితున్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుని విచారించగా తను చేసిన నేరాలను ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. నిందితుని గుర్తించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన ఇన్స్‌పెక్టర్ శ్రీ్ధర్, ఎస్సై సుమన్, హెడ్ కానిస్టేబుల్స్ వీరస్వామి, శివకుమార్, కానిస్టేబుల్స్ మహేష్, జంపయ్య,రాజులను ఎసిపి అభినందించారు.

మల్లన్న సన్నిధిలో
మంత్రి ప్రత్యేక పూజలు
చేర్యాల, జనవరి 20: ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి సన్నిధిలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, జడ్పీచైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు బుధవారం ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అర్చకులు వారికి సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకుల మంత్రోచ్చారనల మధ్య పూజలు నిర్వహించారు. అర్చకులు వారిని దీవించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ అంబరుకిషోర్ ఝా, జనగామ ఆర్డీవో వెంకట్‌రెడ్డి, జనగామ డిఎస్పీ పద్మనాభరెడ్డి, సిఐ వెంకటేశ్వర్‌రెడ్డి, తహశీల్దార్ విజయ్‌సాగర్, చేర్యాల, మద్దూరు ఎంపిపిలు మేడిశెట్టి శ్రీ్ధర్, మంద మాధవి, జడ్పీటిసి సుంకరి సరితమల్లేశం, నాయకులు అంకుగారి శ్రీ్ధర్‌రెడ్డి, మేర్గు శ్రీనివాస్, బద్దిపడిగ క్రిష్ణారెడ్డి, శివగారి అంజయ్య, మంగోలు చంటి, ఒగ్గు శ్రీశైలం, బొంగు సురేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు సూటిపల్లి బుచ్చిరెడ్డి, గీస బిక్షపతి, పెడతల ఎల్లారెడ్డి, ఎంపిటిసిలు బందెల మహిపాల్‌రెడ్డిలు వారి వెంట ఉన్నారు.

ఆంగ్ల మాధ్యమంతో అంతర్జాతీయ గుర్తింపు
నక్కలగుట్ట, జనవరి 20: ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం ద్వారా లక్షలాది తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుందని, విద్యార్థులు అంతర్జాతీయ పోటీలలో నిలువగలరని శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. జిల్లా విద్యాశాఖ, ఆంగ్లబాషోపాద్యాయ సంఘం, వందేమాతరం ఫౌండేషన్ అధ్వర్యంలో ఆంగ్లబాషోపాద్యాయులకు ఐదురోజుల శిక్షణ ముగింపు సమావేశం డైట్‌లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మధుసూధనాచారి మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల బోధనతో విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. వచ్చే సంవత్సరం నుండి వరంగల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్లూ హైదరాబాదు ప్రొఫెసర్ వెంకట్‌రెడ్డి సహకారంతో అమలుకు ఎల్టా కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ప్రొఫెసర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రాధమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం బోధించడం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్లమంటే భయం పోతుందని వివరించారు. దీంతో వారు ఉన్నత చదువులలో రాణించడానికి వీలుకలుగుతుందని అన్నారు. ఎల్టా అధ్యక్షుడు బత్తిని కొమురయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆంగ్ల భాషాభివృద్దికి ఆంగ్లభాష శిక్షణ కేంద్రాన్ని వరంగల్‌లో స్థాపించుటకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఆంగ్ల ఉపాద్యాయులకు ఉపయోగపడేలా తయారుచేసిన కరదీపికను స్పీకర్ తదితరులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రాజీవ్, డైట్ ప్రిన్సిపాల్ సోమయ్య, కోర్సు కో- ఆర్డినేటర్ రవీందర్‌రావు ఉపాద్యాయులు పాల్గొన్నారు.

గొత్తికోయల గుడిసెలు దగ్ధం
మంగపేట, జనవరి 20 : మండలంలోని నీలాద్రిపేట సమీపంలో రిజర్వుడ్ ఫారెస్ట్‌లో ఉన్న గొత్తికోయల గుడిసెలను బుధవారం అటవీ శాఖ అధికారులు, సిబ్బంది దగ్ధం చేశారు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రంకు చెందిన కొంతమంది గొత్తికోయులు వలస వచ్చి తిమ్మంపేట బీట్ పరిధిలోని 17వ కంపార్ట్‌మెంట్‌లో రిజర్వుడ్ పారెస్ట్‌లో గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. అయితే గొత్తికోయులు నిభంధనలకు విరుద్ద్ధంగా రిజర్వుడ్ ఫారెస్ట్‌లో అడవిని నరికి గుడిసెలు వేసుకోవడంతో బుధవారం సబ్ డిఎఫ్‌ఓ వజ్రా రెడ్డి ఆధ్వర్యంలోని ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని అటవీ భూములలో ఉన్న గొత్తికోయలకకు చెందిన సుమారు 8 గుడిసెలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో రేంజర్ ఆఫీసర్ షకీల్ పాషా, డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ పోరిక జై సింగ్, సెక్షన్ ఆఫీసర్ సిహెచ్. ఆదినారాయణ, బీట్ ఆఫీసర్లు సింగారపు మమత, కాకా విజయ, అశోక్, వేణుగోపాల్, రేంజ్ సిబ్బంది, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు
* ట్రాఫిక్ ఎసిపి వెంకటేశ్వరరావు
నక్కలగుట్ట, జనవరి 20: రహదారి ప్రమాదాలు సాంకేతిక పరమైన ప్రమాదాలు కావని, అవి కేవలం మానవ తప్పిదాల వలననే జరుగుతున్నాయని ట్రాఫిక్ ఎసిపి వెంకటేశ్వరరావుఅన్నారు. రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని త్రాగడం మరియు నడపడంపై అవగాహణ సదస్సును బుధవారం ట్రాఫిక్ విభాగం అధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ ఆవరణలో నిర్వహించారు.
ఈ సందర్బంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో లక్షల సంఖ్యలో రహదారి ప్రమాదాలకు గురై ప్రజలు అనేకమంది మరణిస్తున్నారని, ఈ సంఖ్య జాతీయ ప్రకృతి విపత్తులో సంభవించే మరణాలకన్నా రెట్టింపు స్థాయిలో ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా వాహన డ్రైవర్లు మద్యం సేవించి వాహణాలు నడపడం వలన జరిగిన రహదారి ప్రమాదాలే ఎక్కువని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను అతిక్రమించి, మద్యం సేవించి వాహనాలను నడిపితే ఆరునెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని వివరించారు. ఈ అవగాహణ సదస్సులో మద్యం సేవించి వాహనాలను నడిపితే జరిగే అనర్థాలపై ప్రముఖ సైకాలజిస్టు బైరి నరేష్ ఆటో డ్రైవర్లకు వివరించారు. ఈ సదస్సులో హన్మకొండ, ఖాజీపేట ఇన్స్‌పెక్టర్లు వెంకటేష్, బాబురావులు, ఎస్సైలు హతీరాం, దత్తాద్రి, మధు, ప్రభాకర్‌రెడ్డి, విజయ్‌చందర్‌రావు, పూర్ణచందర్, ఆర్టీసీ, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.