వరంగల్

జనగామ ఆశలు ఆవిరి!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 6: వరంగల్ జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాట్లలో భారీ మార్పులు సంభవించాయి. జనగామ జిల్లా ఏర్పాటుకు దాదాపు అన్ని దారులు మూసుకపోయాయి. హన్మకొండ జిల్లా ప్రతిపాదన రద్దయతే ఆ స్ధానం జనగామజిల్లా ఏర్పాటు అనివార్యం అవుతుందని అనుకుంటే అందరి అంచనాలు తలకిందులు చేస్తు హన్మకొండ జిల్లా ప్రతిపాదిత స్ధానంలో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలు తెరపైకి వచ్చాయి. దీంతో జనగామ ఒంటరైంది. ఇక వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు ప్రతిపాదిత అన్ని జిల్లాలో కలిసిపోవడంతో జనగామను ముందుగా ప్రతిపాదించినట్టుగా యాదాద్రిజిల్లాలోనే కలుపనున్నారు. హన్మకొండ జిల్లా ప్రతిపాదన చేసిన వెంటనే చారిత్రక ఓరుగల్లు నగరాన్ని విడదీయవద్దంటూ ఉవ్వేత్తున ఆందోళలు వ్యక్తం అయ్యాయి. అంతే కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు హన్మకొండ జిల్లా ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. వరంగల్ మహానగరపాలక సంస్ధ పరిధితో పాటు హసన్‌పర్తి, ధర్మసాగర్, జఫర్‌గడ్, రఘునాధపల్లి, స్టేషన్‌ఘనపూర్, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, నర్మెట్ట మండలాలు, కరీనగర్ జిల్లాలోని హుజురాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరాపల్లి, కమలాపూర్, జమ్మికుండ, ఇల్లంతకుంట మండలాలు కలుపుతూ వరంగల్ అర్బన్ జిల్లాగా, వరంగల్ రూరల్ లేదా కాకతీయ జిల్లాలో వర్ధన్నపేట, ఐనవోలు, పర్వతగిరి, ఆత్మకూరు,గీసుకొండ, సంగెం, పరకాల, శాయంపేట, నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపురం, దుగ్గొండి, నల్లబెల్లి మండలాలు కలుపనున్నారు. అయితే జనగామ నియోజకవర్గ ప్రజలు ఎంత అరిచి మెత్తుకున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు. హైద్రాబాద్‌లో మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కెసిఆర్ హన్మకొండ జిల్లా ప్రతిపాదన విషయంలో స్పందించినట్టు తెలిసింది. దీంతో హన్మకొండ జిల్లా ప్రతిపాదన రద్దు యోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. ఓరుగల్లు నగరాన్ని విడగొట్టకుండానే అర్బన్ , రూరల్ పేరుతో రెండు జిల్లాలు అంటే ముందుగా ముసాయిదాలో ప్రకటించనట్లుగానే వరంగల్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. అయితే కలెక్టర్ల సమావేశంలో సిఎం కెసిఆర్ కనీసం జనగామ ప్రస్తావన కూడా తీయనట్టు తెలిసింది. దీంతో జనగామ ప్రజలు ముఖ్యమంత్రి కెసిఆర్, వరంగల్ జిల్లాకు చెందిన డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, జనగాం స్ధానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వాస్తు పేరుతోజనగామకు చెక్ పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగా ఏర్పాటుకానున్న యాదాద్రి జిల్లాకు ఈశన్యం పెరగాలనే పండితుల సూచనల మేరకే జనగామను యాదాద్రిలో కలుపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. అయినప్పటికి జనగామ ప్రజలు ఆందోళనలు మరింత ఉద్దృతం చేసారు. పోరుగడ్డ జనగామను ముక్కలు చెక్కలుగా చేసి వరంగల్, యాదాద్రి, సిద్దిపేట మూడు జిల్లాలో కలుపుతున్నారని, ఇది కేవలం రాజకీయ కుట్రేనన్న విమర్శలు వస్తున్నాయి.

తల్లిదండ్రుల చెంతకు
తప్పిపోయన చిన్నారి!
మహబూబాబాద్, సెప్టెంబర్ 6: ప్రసూతికోసం మానుకోట ఆసుపత్రికి వస్తే వెంట వచ్చిన నాలుగు సంవత్సరాల కూతురు తప్పిపోవడంతో ఆ గిరిజన కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. రాత్రంతా ఏడుస్తూ కూర్చున్న వారికి మంగళవారం ఉదయం పాపదొరికిందనే వార్త పండుగ వచ్చినంత సంతోషాన్ని తెచ్చింది. టౌన్ సిఐ నందిరాంనాయక్, చైల్డ్‌లైన్ సిబ్బంది సహకారంతో తమ బిడ్డ మళ్లి తమ ఒడిలోకి చెరడంతో ఆ గిరిజన కుటుంబం చేతులెత్తి దండం పెట్టింది. మానుకోటలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి... మరిపెడ మండలం ఎడ్జర్ల గ్రామ శివారు పెదలాల్‌తండాకు చెందిన భూక్య నరేష్, పద్మ దంపతులు సోమవారం రాత్రి మానుకోటకు వచ్చారు. పద్మ ప్రసూతి నిమిత్తమై స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. తల్లిదండ్రుల వెంట వచ్చిన నాలుగు సంవత్సరాల శ్యామల వారు అప్రమత్తంగాలేని సమయంలో రోడ్డుపైకి వచ్చి నడుచుకుంటు తొర్రూరు బస్టాండ్ ప్రాంతానికి చెరుకుంది. ఏడుస్తూ తిరుగుతున్న చిన్నారి శ్యామలను గుర్తించి అయోద్యగ్రామానికి చెందిన వాంకుడోతు మురళి అనే వ్యక్తి ఆ బాలికను తీసుకెళ్లి టౌన్ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. బాలిక తప్పిపోయి స్టేషన్‌కు వచ్చిన సమాచారాన్ని చైల్డ్‌లైన్‌కు అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, చైల్డ్‌లైన్ సిబ్బంది ఆరా తీసి బాలిక తల్లిదండ్రుల చిరునామ తెలుసుకున్నారు. మంగళవారం టౌన్ పోలీసుస్టేషన్‌కు పిలిచి తండ్రి నరేష్‌కు చిన్నారిని అప్పగించారు. మన పనుల్లో పడి పిల్లలను పట్టించుకోకుంటే తర్వాత పరిణామాలకు తీవ్రంగా ఉంటాయని, అప్పుడు జీవితాంతం చింతించాల్సి వస్తుందని, అప్రమత్తంగా ఉండాలని సిఐ నందిరాంనాయక్ అన్నారు. తప్పిపోయిందనుకున్న తమ బిడ్డను తిరిగి అప్పగించిన సిఐ నందిరాంనాయక్‌కు, చైల్డ్‌లైన్ సిబ్బందికి ఆ గిరిజన దంపతులు చేతులెత్తి దండం పెట్టారు. ఈ కార్యక్రమంలో చైల్డ్‌లైన్ సిబ్బంది బైరి ఉమారాణి, నలమాస అరుణ, కుందునూరు నరేష్‌గౌడ్, దంతాల అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

కార్యకర్తలే నా బలం
* ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం
* ఇనగాల వెంకట్రాంరెడ్డి
ఆత్మకూరు, సెప్టెంబర్ 6: ఇనగాల జన్మదిన వేడుకలు కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో గుడెప్పాడు సెంటర్‌లోని ఇందిరాగాంధి చౌరస్తాలో అట్టహాసంగా కార్యకర్తలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెసు పరకాల నియోజక వర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాం రెడ్డి కార్యకర్తల సమావేశంలో కేక్ కట్‌చేసి స్వీట్లను అందచేసారు. కార్యకర్తలు ఇనగాలను పూలమాలలు, శాలువ, బొకేలతో సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ తన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు తనకు సంపూర్ణ బలమని ప్రజాసేవయే తన లక్ష్యమని అన్నారు. పరకాల నియోజవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుండెల్లో పెట్లుకొని చూసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ లేతాకుల సంజీవరెడ్డి, సర్పంచ్ నాగెళ్లి సామ్యెల్, ఎంపిటిసి కమాలపురం రమేష్, మాజి జడ్పిటిసి సూరం రంగారెడ్డి, డోలి చిన్ని, రేవూరి ప్రవీణ్‌రెడ్డి, దేవారాజ్, నరహరి, పొనుగోటి సత్యనారాయణ, రఫీ, జయపాల్‌రెడ్డి, పెరుమాండ్ల బిక్షపతి, రజినీకర్ రెడ్డి, డాక్టర్ పైడి, గోవర్థన్, మలకపేట రవీందర్, పర్వతగిరి రాజు పాల్గొన్నారు.

అడవి పుత్రుల
జీవితాలతో ఆటలా?
హరితహారం పేరిట ఉరితాళ్లు పేనుతారా? * నిర్బంధాలకు బెదరం
పద్ధతి మార్చుకుంటే ప్రభుత్వానికే మంచిది * వామపక్ష పార్టీల హెచ్చరిక
మహబూబాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యమాలే ఉండవని.. అంతా మేలే జరుగుతుందని చెప్పిన ముఖ్యమంత్రి గద్దెనెక్కిన నాటి నుంచి వరుస ఉద్యమాలే రాష్ట్రంలో కొనసాగుతున్నాయని అడవి పుత్రుల జీవితాలతో ఆటలాడుకునే విధానాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని సిపియం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు. మానుకోటలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడురైతులకు పట్టాలు ఇవ్వాలని, అధికారంలోకి రాకముందు ఈ నినాదానికి మద్దతు పలికిన కేసిఆర్.. ముఖ్యమంత్రి కాగానే అడవిబిడ్డల అరణ్యరోదనకు కారణవౌతున్నారని అన్నారు. హరితహారం పేరుతో పోడుభూములను స్వాధీనం చేసుకుంటూ హరితహారం కార్యక్రమాన్ని పోడురైతుల పాలిట ఉరితాళ్లుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందన్నారు. తరతరాలుగా పోడుభూములపై ఆధారపడి పొట్టనింపుకొంటున్న పేద కుటుంబాలను భూమికి దూరం చేస్తే ఉరిపెట్టుకోవాలా.. విషంతాగి చావాలా ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ప్రశ్నించారు. పోడురైతులకు న్యాయం చేయాలని వామపక్షాలు పోరాటానికి దిగితే అక్రమ కేసులు బనాయించి, పిడియాక్టులు పెట్టి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. అణచివేతలకు, నిర్బంధాలకు వామపక్ష పార్టీలు ఎప్పుడూ భయపడవని ప్రజల పక్షాన పోరాడే క్రమంలో ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసేందుకు ఎలాంటి త్యాగాలకైనా ఎర్రజెండా పార్టీలు సిద్ధంగా ఉంటాయని వారు తెలిపారు. నయాంను అడ్డుపెట్టుకొని వేల ఎకరాలు కాజేసిన వ్యక్తుల నుంచి భూములు లాక్కునేందుకు మీనమేషాలు లెక్కపెడుతున్న ప్రభుత్వం.. పోడురైతుల ఎకరం, రెండెకరాల భూములను మాత్రం లాక్కోవడానికి అత్యంత ఉత్సాహం చూపుతుందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడంకోసం దళిత, గిరిజనులకు మూడెకరాల వ్యవసాయభూమి అందిస్తామని చెప్పిన కేసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఎన్నో దశాబ్దాలుగా హరిజన, గిరిజన వర్గాల స్వాధీనంలో ఉన్న పోడుభూములను లాక్కునేందుకు సిద్ధపడడం విచారకరమన్నారు. హరితహారాన్ని తాయు స్వాగతిస్తున్నామని అంతమాత్రాన పోడు రైతుల భూములు లాక్కుంటే చూస్తూ ఉరుకోం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన పద్ధతి మార్చుకుంటే మంచిదని లేదంటే ఉద్యమ తీవ్రతను రుచిచూడాల్సి వస్తుందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పోటు రంగారావు, ఎంసిపిఐ రాష్ట్ర బాధ్యులు భూమయ్యలతోపాటు వామపక్షపార్టీల నాయకులు సుదర్శన్, విజయసారథి, కొత్తపల్లి రవి, సాధుల శ్రీనివాస్, బి.అజయ్, ఆకుల రాజు, సూర్నపు సోమయ్య, నున్న నారాయణ, గునిగంటి రాజన్న, దాస్యం రాంమూర్తి, పెరుగుకుమార్, చింతకుంట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఇనగాల
జన్మదిన వేడుకలు
కార్యకర్తలను కంటి రెప్పలా కాపాడుకుంటా * కాంగ్రెస్ నేత వెంకట్రాంరెడ్డి హామీ
పరకాల, సెప్టెంబర్ 6: పరకాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి జన్మదిన వేడుకలు పరకాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంఎన్‌ఆర్ గార్డెన్‌లో పరకాల పట్టణ, మండల పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఇనగాల వెంకట్రాంరెడ్డి హాజరై కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. మొదట పరకాల, ఆత్మకూర్, సంగెం, గీసుకొండ మండలాల నుండి వచ్చిన కార్యకర్తలు ఇనగాలను గజమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నియోజకవర్గం నుండి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల మద్య ఆయన కేక్‌ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇనగాల మాట్లాడుతూ కార్యకర్తలను కంటి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. ఇప్పటికే ఇనగాల ఆధ్వర్యంలో కార్యకర్తలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అధైర్య పడవద్దని అండగా ఉంటానని ఆయన తెలిపారు. తన జన్మదిన వేడుకలను కార్యకర్తల మద్య జరుపుకోవడం అనందంగా ఉందన్నారు.
పండ్లు, బ్రెడ్లు పంపిణీ
ఇనగాల జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పరకాల కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన పండ్లు, బ్రెడ్లను ఇనగాల వెంకట్రాంరెడ్డి పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పంపిణీ చేశారు. అదేవిధంగా జ్యోతి భవన్‌లోని వికలాంగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఆయన వెంట ఆత్మకూర్ జడ్పీటిసి లేతాకుల సంజీవరెడ్డి, పరకాల పిఎఎసిఎస్ చైర్మన్ కట్కూరి దేవేందర్‌రెడ్డి, ఓడిసిఎంఎస్ వైస్ చైర్మన్ గొల్కండ సదానందం, కొమురారెడ్డి, కొయ్యడ శ్రీనివాస్, చిన్న, రాజేశ్వర్‌రావు, మడికొండ సంపత్‌కుమార్, పోరండ్ల సంతోష్, పసుల రమేష్, రఘుపతిగౌడ్, ఎండి రజాక్, క్రాంతి, విజయ ఆగ్రో తిరుపతిరెడ్డి, సుమన్, దుప్పటి సాంబశివుడు, రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సంగెంలో...
కాంగ్రెస్ జిల్లా నాయకులు, ప్రజా సేవే లక్ష్యంగా కృషి చేస్తున్న ఇనగాల వెంకట్రాంరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగెం మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మునికుంట కోటేశ్వర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వర్ మాట్లాడుతూ ఎలాంటి పదవులు లేకుండా ఇనగాల ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఇనగాలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తూ కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకొని ప్రజల మన్ననలను పొందుతున్న ఇనగాల ప్రజలకు మరింత సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాంబయ్య, రవి, భాస్కర్, ఏలియా, కృష్ణ, రాజేష్, సునీల్, శ్రీనివాస్, సమ్మయ్య, రాజు, బాబు తదితరులు పాల్గొన్నారు.