వరంగల్

* వరంగల్ ప్రజలకు ఉగాది కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 26: వరంగల్ ప్రజలకు ఉగాది కానుకగా రోజు విడిచి రోజు తాగునీరు అందించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని నగర మేయర్ నన్నపనేని నరేందర్ అన్నారు. శనివారం మున్సిపల్ కౌన్సిల్‌లో మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు మూడు రోజులకోమారు పట్టణ ప్రజలకు తాగునీరు అందిస్తున్నామని, ఉగాది నుండి రోజువిడిచి రోజు అందించే విధంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వచ్చే మూడు నెలలకు గాను నీటి నిల్వలు సమకూర్చుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. పైపులైన్లు, మోటార్ల మరమ్మతు లాంటి కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని ఆయన అన్నారు. ఎండలు మండిపోతున్నందున ఇప్పటికే నీటి నిల్వలు తగ్గిపోయాయని, ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలన్నారు. బోర్లు, మోటార్లను మరమ్మతు చేసుకోవాలని, అందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విలీన గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని అధికారులను కోరారు. విలీన గ్రామాల్లో స్థానిక వనరులను, బావులను వినియోగంలోకి ఉపయోగించుకొని నీటి ఎద్దడి తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళికతో అధికారులు ముందుకు పోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డిప్యూటీ మేయర్ సిరాజొద్దీన్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

వడదెబ్బకు
మరో ఇద్దరు మృతి
మంగపేట / ములుగు, మార్చి 26: వడదెబ్బతో అస్వస్థతకు గురై మంగపేట, ములుగు మండలాల్లో శనివారం ఇద్దరు మరణించారు. ములుగు మండలంలోని నర్సింహసాగర్ గ్రామానికి చెందిన కుంట వీరమ్మ (80) అనే వృద్ధురాలు శనివారం మృతి చెందింది. ఇందుకు సంబందించి మృతురాలు వీరమ్మ కుమారుడు కుంట ఏడుకొండలు వివరాలు మేరకు.. నాలుగు రోజులుగా విపరీతంగా ఉన్న ఎండ వేడికి వీరమ్మ అస్వస్థతకు గురయింది. శనివారం ఎండ మరింత ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ సోకి మధ్యాహ్నం వీరమ్మ మృతి చెందింది. మాతృ వియోగంతో ఉన్న కుంట ఏడుకొండలను టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కడారి రాజన్నతో పాటు పలు పార్టీల నాయకులు పరామర్శించారు. ములుగు మండలం కాసిందేవిపేట గ్రామానికి చెందిన అజ్మీరా శ్రీనివాస్ (39) అనే రైతు వడదెబ్బకు గురై మృతిచెందాడు. శ్రీనివాస్ వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లి మధ్యాహ్నం వరకు పనిచేశాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంటికి చేరుకుని అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడు. మృతుడికి భార్య చోది, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో చోరీ
వర్ధన్నపేట, మార్చి 26: భక్తులకు అభయమిచ్చే అభయాంజనేయస్వామి దేవాలయంలో శనివారం తెల్లవారుఝామున హుండీ చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పంథిని గ్రామంలో అభయాంజనేయస్వామి ఆలయంలోని హుండీపై దొంగలు చేతివాటం చూపించారు. ఈ దొంగతనంలో సుమారు 30వేల రూపాయల నగదు అపహరణకు గురైనట్లు గ్రామస్థులు తెలిపారు. వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారి వెంబడి ఉన్న గ్రామాలలోనే దొంగలు ఆలయాలపై కనే్నస్తున్నారని పోలీసులు తగిన విధంగా స్పందించి ఇలాంటి సంఘటనలు మల్లి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మండలంలోని ప్రజలు కోరుతున్నారు. గ్రామంలోని ఆలయ పరిసరాలలోదేవుడి హుండీ పగలకొట్టిన సంఘటనలో గ్రామస్థుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జనంలోంచి వనంలోకి..
* ముగిసిన నాగులమ్మ జాతర
మంగపేట, మార్చి 26 : మండలంలోని రాజుపేట శివారు లక్ష్మీనర్సాపురంలోప్రసిద్ధి చెందిన నాగులమ్మ ఆలయంలో ఈ నెల 21వ తేదీ నుండి జరుగుతున్న శ్రీనాగులమ్మ జాతర శనివారం అమ్మవారు తిరిగి వన ప్రవేశం చేయడంతో ముగిసింది. ఈ ఆరు రోజులు భక్తుల పూజలు, శివ సత్తుల పూనకాలు, గిరిజన సంప్రదాయం ఉట్టిపడే పలురకాల విన్యాసాలు, థింసా నృత్యాలు తదితర కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం సందడి సందడిగా ఉంది. శనివారం ఆలయ మేనేజింగ్ ట్రస్టీ, ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామిజీ, నాగులమ్మ ప్రధాన పూజారి బాడిశ నాగ రమేష్‌ల ఆధ్వర్యంలో జలాభిషేకాలు, జెండా కర్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో చివరి రోజు శనివారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం వన దేవత తిరిగి వన ప్రవేశం చేయడంతో జాతర ముగిసింది.
ఈ కార్యక్రమంలో వడ్డెలు, పూజారులు, అర్తిలు, కుల పెద్దలు కొమరం మాధవరావు, ధనలక్ష్మి, ఇర్ప రామకృష్ణ, నాగలక్ష్మి, కొమరం పాపారావు, గాయిత్రి, మడకం లక్ష్మయ్య, సోడి శ్రీను, ఈసం సమ్మక్క,బాడిశ దేవి, కట్టం సమ్మక్క, కట్టం నాగరాజు, కుర్సం పుల్లయ్య, ఈసం రామనాధం, బాడిశ శ్రీను, నాగుల నాగేశ్వరరావు, వినోద్, చౌళం వెంకటేశ్వర్లు, కుర్సం విష్ణుమూర్తి, కారం సాంబయ్య, కారం సాంబశివరావు, కొర్స వెంకటేశ్వర్లు, కొర్స నర్సింహారావు, చౌళవ కృష్ణమూర్తి, బాడిశ శ్రావణ్, గద్ద రమేష్, యడం సంజీవ తదితరులు పాల్గొన్నారు.

కల్యాణం.. కమనీయం
జనగామ టౌన్, మార్చి 26: జనగామ బాణాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారి కల్యాణం ఎంతో కమనీయంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి పద్మావతి, అలివేలు మంగల సహిత కల్యాణోత్సవం ఆద్యంతం నేత్రపర్వంగా ముగిసింది. దేవాలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తొమ్మిది రోజులుగా కన్నుల పండువగా నిర్వహించిన ఈ ఉత్సవాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధానంగా సాగర మథనం, లక్ష్మీ అవతారం, శ్రీవరాహస్వామి ప్రతిష్ఠ, శ్రీరామ పాదుకల పట్ట్భాషేక ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిద్ధాంతి సంపత్కుమార కృష్ణమాచార్యులు సమక్షంలో నిర్వహించిన ఈ కల్యాణానికి సింహాచలం దేవస్థానం వారు పంపించిన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సతీమణి పద్మలతారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డిలు సమర్పించారు. అలాగే, ఆలయ చైర్మన్ పజ్జూరి కృష్ణమూర్తి, అధ్యక్షుడు గోపయ్య, కార్యదర్శి అంజనేయులు, జయహరి, పోతుగంటి సిద్ధయ్యలు అమ్మవార్ల తరపున, స్వామివారి తరపున సిద్ధాంతి కృష్ణమాచార్యులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఎదుర్కోళ్లు, ఓయినాల కార్యక్రమాలు ఎంతో విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం సిద్ధాంతి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ వరాహస్వామి, వెంకటేశ్వర స్వామిల అనుబంధాన్ని వివరించారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఇరువురి కల్యాణోత్సవాలు నిర్వహిస్తామని, అందుకు భక్తులు సహకరించాలని కోరారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు
వేసవి సెలవులు

* మంత్రి తుమ్మలకు అంగన్‌వాడీల విజ్ఞప్తి
నర్సంపేట, మార్చి 26: గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవి కాలంలో ఎండలు మండుతున్న క్రమంలో అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను ప్రకటించాలని సిఐటియు అనుబంధ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును నల్లా భారతి ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నల్లా భారతి మాట్లాడుతూ ఎండకాలంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయని, చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యం దృష్ట్యా వేసవి సెలవులను ఇవ్వాలని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు తగిన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 5వ తేదీలోగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు ఇవ్వాలని, అదే విధంగా పెండింగ్ మూడు నెలల వేతనాలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి తుమ్మల హామీ ఇచ్చినట్లు ఆమె వివరించారు. మంత్రి తుమ్మలను కలిసిన వారిలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ప్రాజెక్టు కార్యదర్శి బత్తిని శిరీష తదితరులున్నారు.

వేసవి జాగ్రత్తలపై
జనంలో అవగాహన
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, మార్చి 26: ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. శనివారం కలెక్టర్ తన చాంబర్‌లో ఎండ తీవ్రత అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృత ప్రచారం, రైతు సంఘాల బలోపేతంపై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వడదెబ్బ లక్షణాలు, నివారణపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. అందులో భాగంగా అవగాహనకు కరపత్రాలు, పోస్టర్లు, సదస్సులు నిర్వహించాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, బయటకు వెళ్లాల్సివస్తే గొడుగు తప్పనిసరిగా వినియోగించాలని, నీరు ఎక్కువగా తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా రైతు సంఘాల ఏర్పాటుపై దృష్టిసారిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వంద శాతం కిసాన్ అకౌంట్ తెరిచామని, ప్రభుత్వ సబ్సిడీని నేరుగా వారి అకౌంట్‌లో జమ చేస్తున్నామని తెలిపారు. ఈ నెల నుండి మట్టి నమూనా పరిశీలన చేస్తున్నామని, మే నెలలోగా ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు. రైతులకు వ్యవసాయానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని, అందులో భాగంగానే రైతు సంఘాల బలోపేతం చేస్తామన్నారు.