వరంగల్

నల్లబజారుకు నీలి కిరోసిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, నవంబర్ 20: వినియోగదారులకు అందాల్సిన కిరోసిన్ పక్కదారి పడుతోంది. ప్రభుత్వం రేషన్ షాపు డీలర్ల నుండి తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రతి నెలా అందించాల్సిన కిరోసిన్ కొంతమంది డీలర్లు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో మండలంలో ప్రతి నెల వందలాది లీటర్ల నీలి కిరోసిన్ నల్ల బజారుకు తరలిపోతుంది. మండలంలోని రాజుపేట, మల్లూరు, మంగపేట గ్రామాలతో పాటు పారిశ్రామిక ప్రాంతమైన కమలాపురంలోని బిల్ట్ రెండవ గేట్ సమీపంలో కిరోసిన్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. కమలాపురంలో మహిళా సంఘాలకు మొత్తం ఆరు చౌక ధరల దుకాణాలు కేటాయించగా అందులో మూడు రేషన్ షాపుల నుండి ప్రతి నెలా కిరోసిన్ దందా కొనసాగుతోందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా సకాలంలో వినియోగదారులకు కిరోసిన్ పంపిణీ చేయకపోవడంతోనే కిరోసిన్ పక్కదారి పడుతుందనే విమర్శలు ఉన్నాయి. రేషన్ షాపు డీలర్లు కిరోసిన్ నిత్యావసర సరుకులతో ఇవ్వడంలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కిరోసిన్ కోసం మళ్ళీ ఇంకొక రోజు రేషన్ షాపుకి వెళ్ళాల్సి వస్తోంది. దీంతో రేషన్ షాపు చుట్టూ రెండు, మూడు సార్లు తిరగలేక కొంతమంది లబ్ధిదారులు కిరోసిన్ తీసుకెళ్ళడంలేదు. రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీపై రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతోనే నీలి కిరోసిన్ పక్కదారి పడుతుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. కొంతమంది డీలర్లు కిరోసిన్ బ్లాక్ మార్కెట్ చేసే వ్యాపారులతో కుమ్మక్కై కిరోసిన్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మండలంలో పెద్ద ఎత్తున అక్రమంగా కిరోసిన్ బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతున్నా పట్టించుకోవాల్సిన అధికారులు చోద్యం చూడడం అనుమానాలకు తావిస్తోంది. మండలంలోని పలువురు డీలర్లు రేషన్ కార్డుదారులకు అందాల్సిన కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నా రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలో పలు గ్రామాలలో బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్న కిరోసిన్‌ను స్థానిక ప్రజలు పట్టుకుని అధికారులకు అప్పచెప్పారే తప్పా కనీసం ఒక్కసారి కూడా అధికారులు పట్టుకున్న దాఖలాలు లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ. దీనిని గమనిస్తే అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు ఎంత చిత్తశుద్ధితో పని చేస్తున్నారో అర్ధమవుతోందని మండల ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్న సందర్భాల్లో స్థానికులు అధికారులకు సమాచారం అందించగా సంఘటనా స్థలంకు వచ్చి నానా హంగామా చేసే అధికారులు అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లపై ‘‘మామూలు’’ చర్యలు మాత్రమే తీసుకుంటున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఇదే కిరోసిన్ పక్కదారి పట్టడానికి కారణమని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. కిరోసిన్‌ను సకాలంలో వినియోగదారులకు పంపిణీ చేయకుండా నెలాఖరున పంపిణీ చేయడం ఆ తర్వాత అక్కడ నుండి బ్లాక్ మార్కెట్‌కు తరలించడం పరిపాటిగా మారిందని వినియోగదారులు అంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు రేషన్ షాపులపై నిఘా పెట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేసి తగిన చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.