అదిలాబాద్

ప్లాస్టిక్ జాతీయ జెండాలను వినియోగించరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ రూరల్, జనవరి 20: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లాస్టిక్ జెండాలను వినియోగించరాదని జిల్లా ఎస్పీ తరుణ్ జోషి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ జెండాను తోరణాలుగా, అలంకరణ వస్తువుగా వాడొద్దని సూచించారు. ప్లాస్టిక్ జెండాకు బదులుగా కాగితంతో తయారు చేసిన రంగు రంగుల జెండాలనే కట్టాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌తో కూడిన జెండాలను వినియోగించినా, వ్యాపారస్తులు విక్రయించినా అండర్ సెక్షన్1 పార్ట్2, ఫ్లాగ్‌కోడ్ ఆఫ్ ఇండియా2002, సెక్షన్2 ప్రివేంషన్ ఆఫ్ ఇన్‌సల్ట్ టూ నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 ప్రకారం శిక్షర్హులవుతారని అన్నారు. ప్లాస్టిక్ జెండాలను వినియోగించకుండా జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు, ప్రభుత్వ అధికారులను చైతన్యపర్చాలని అన్నారు. జిల్లాలో ఎవరైన ఉద్దేశపూర్వకంగా ప్లాస్టిక్ జెండాలను వినియోగిస్తే వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం జాతీయజెండాలను గౌరవ ప్రదమైన చోట జాగ్రత్తగా భద్రపర్చాలని సూచించారు.

గోదుంపేట శివారు భూముల పరిశీలన
వేమనపల్లి, జనవరి 20: వేమనపల్లి మండలంలోని సర్వే నెం.3లోని గోదుంపేట శివారు భూములను బెల్లంపల్లి డిఎఫ్‌వో వెంకటేశ్వర్లు, స్థానిక తహసిల్దార్ పద్మజరాణిలు పరిశీలించారు. ఉన్నతాధికారుల అదేశాల మేరకు సర్వేయర్ గంగాధర్‌తో అటవీశాఖ అధికారులు శివారు ప్రాంతాన్ని మ్యాప్‌లో పరిశీలించారు. గతంలో ఈ శివారులోని భూమిని భూమి లేని నిరుపేదలను గుర్తించి రెవెన్యూ అధికారులు ఇందిరప్రభ కింద మండలంలోని రైతులకు పట్టాలు పంపీణీ చేశారు. ఈ భూమి పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్ ఆధీనంలో ఉందని రైతులు సాగేచేసేందుకు ప్రయత్నిస్తే అటవీ అధికారులు కేసులు నమోదు చేశారు. గత పది సంవత్సరాలుగా పట్టాలు పొందిన రైతులకు భూమిపై హక్కులు రాకపోవడంతో పలుమార్లు ఇరు శాఖల అధికారులు సర్వేలు నిర్వహించారు. అయినప్పటికీ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో తిరిగి రికార్డులను పరిశీలించి, మ్యాప్ ద్వారా వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఆరై శ్రావణి, వి ఆర్వో మల్లేష్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యలో ఆంగ్లబోధన అనివార్యం
* పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షులు సరోత్తంరెడ్డి
మంచిర్యాల, జనవరి 20: ప్రజలు ఇంగ్లీషు మీడియంపై మోజుపడి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యలో ఆంగ్లబోధన అనివార్యమైందని పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తం రెడ్డి అన్నారు. బుధవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లను రక్షించేబాధ్యత ఉపాధ్యాయులతో పాటు పిఆర్‌టియు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు డైస్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 62లక్షల మంది బడి ఈడు పిల్లలు ఉంటే అందులో 32లక్షల మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారని, కేవలం 28లక్షల మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా, భవిష్యత్తులో సర్కారు బడుల మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల మాదిరిగా ప్రభుత్వ స్కూళ్లలో ఎల్‌కెజి, యుకేజి ప్రారంభిస్తేనే ప్రభుత్వ బడులకు మనుగడ ఉంటుందన్నారు. ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్‌లే విద్యాబోధన చేయాలని, పీ ఈటీ, పండిట్ పోస్టులను ప్రభుత్వం వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సర్వీసు రూల్స్‌లో భాగంగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పంచాయతీ రాజ్ శాఖ ఉపాద్యాయ పోస్టులను లోకల్‌గా మార్చాలని ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. జూనియర్ లెక్చరర్ల పదోన్నతుల్లో ఉపాద్యాయులకు ఉన్న 40శాతం కోటా నుంచి ఇవ్వాలని , 9నెలల వేతన బకాయిలను జీపీఎఫ్‌లో కలపాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య కార్డులు కార్పోరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే ప్రీమియం చెల్లించేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు ఉపసంహరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను సామాజిక అంశంగా భావించి ప్రజల భాగస్వామ్యంతో ఉపాద్యాయులు రక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు జీవన్, కార్యదర్శి ఇన్నారెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు వీర శంకర్, జిల్లా నాయకులు కొండుశంకర్ పాల్గొన్నారు.

రైల్వే ట్రాక్ నిర్మాణానికి రైతులు సహకరించాలి
* కలెక్టర్ జగన్ మోహన్
జైపూర్, జనవరి 20: జైపూర్ పవర్ ప్లాంటుకు బొగ్గురవాణా కోసం నిర్మించనున్న రైల్వే ట్రాక్‌కు అవసరమైన భూములు ఇచ్చేవిధంగా రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్ జగన్‌మోహన్ రైతులను కోరారు. బుధవారం ట్రాక్ కోసం భూములు కోల్పోతున్న మండలంలోని రామరావుపేట, ఇందారం, టేకుమట్ల గ్రామాల రైతులతో స్థానిక తహసిల్దార్ కార్యాలయంలోసమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి విద్యుత్ చాలా అవసరంగా మారిన క్రమంలో రైతులు సహకరించాలని ఆయన కోరారు. భూములు కోల్పోయినవారికి జీవో నెంబర్ 123ప్రకారం సేకరించే భూములకు ఎకరానికి బంజరు భూమికి రూ. 7.5 లక్షలు, ఒక పంట భూమికి రూ. 8 లక్షలు, రెండుపంటల భూమికి 8.5 లక్షలు చెల్లిస్తామని తెలిపారు. అయితే తమకు ఎకరానికి రూ. 15 లక్షలు చెల్లించటంతో పాటుతప్పని సరిగా ప్లాంటులో శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. అయితే ఇంతకు మించి ధర చెల్లించటంతో పాటు ఉద్యోగాలు కల్పించటం తమ పరిధిలో లేదని ఇందుకోసం మొత్తం భూమి కోల్పోయిన వారికి అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు కల్పిస్తామని ఏ విషయమైనా రెండు రోజుల్లో తమకు తెలియజేయాలని ఆయన రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో జెసి సుందర్ అబ్నార్, నాయకులు గోనె నర్సయ్య, నామాల శ్రీనివాస్, గుండు తిరుపతి, సుంకరి శ్రీనివాస్, ముదం రమేష్, జిట్ట దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

కోర్టు భవన ప్రారంభోత్సవ ఏర్పాట్ల పరిశీలన
ఉట్నూరు, జనవరి 20: ఈనెల 23 నుండి 25 ఈనెల 23 నుండి 25 వరకు జరిగే క్రీడాపోటీలతో పాటు ఉట్నూరు జూనియర్ సివిల్ కోర్టు నూతన భవన 23వ తేదీన ప్రారంభమవుతున్న నేపథ్యంలో బుధవారం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత, అడిషనల్ న్యాయమూర్తి అరుణ సాదిక, సీనియర్ సివిల్ జడ్జి అజిత్ సిన్హారావులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సంధర్భంగా క్రీడా మైదానంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించడంతో పాటు కోర్టు నూతన భవన సముదాయంలో ఏర్పాట్లను సైతం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతన భవనం, జిల్లా క్రీడల ప్రారంభోత్సవానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంబేద్కర్ బాబాసాహెబ్ బోస్లే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారన్నారు. అనంతరం పివో మాట్లాడుతూ 23 నుండి 25 వరకు జరిగే క్రీడల్లో ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకే ప్రవేశం ఉందని, ఇతరులకు ప్రవేశం ఉండదని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ అన్నారు. క్రీడా మైదానం చదును చేయడం మొదలుకొని వచ్చే క్రీడాకారులకు, పిఈటీలకు వసతి తదితర సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన క్రీడలు నిర్వహించగా కళాశాల స్థాయి క్రీడాకారులు పాల్గొన్నట్లు తనకు ఫిర్యాదులు అందాయని, ఇకముందు అలా జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. అటువంటి సంఘటనలకు పాల్పడిన విద్యార్థులతో పాటు సంబంధిత పిఈటీలు, ఉపాధ్యాయులపై వేటు వేస్తామని అన్నారు. మూడు రోజుల పాటు జరిగే లాంగ్‌జంప్, హైజంప్, బ్యాడ్మింటన్, పరుగుపందెం, రంగులరాత్నం తదితర పనులను పూర్తిచేసి సిద్దంగా ఉంచాలన్నారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులతో పాటు ప్రధానోపాధ్యాయులు, పిఈటీలకు నూతనంగా నిర్మించిన బిఈడి కళాశాలలో, గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికల భవనంలో వసతి ఏర్పాట్లు పూర్తిచేశామని అన్నారు. క్రీడలు జరిగే తేదీలలో క్రీడా ప్రాంగణంలో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని అన్నారు. అనంతరం సభా వేదికతో పాటు క్రీడా మైదానాలు చదును చేస్తుండగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈఈ రమేష్, డిడి రాంమూర్తి, ఏపివో జనరల్ నాగోరావు తదితరులు పాల్గొన్నారు.

కష్టపడి కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలి
* బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్
బెల్లంపల్లి, జనవరి 20: ఆదిలాబాద్ జిల్లా పోలీసుల తరుపున నెల రోజుల పాటు కానిస్టేబుల్ శిక్షణ ఇస్తున్నామని , కష్టపడి చదివి శిక్షణ తీసుకునే అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలను సాదించుకోవాలని బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. బుధవారం పట్టణంలోని సీసీ ఓ ఏ క్లబ్‌లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే కానిస్టేబుల్ శిక్షణ తరగతులకు అడిషనల్ ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ తరగతులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో 9281 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని, అందులో మన జిల్లాకు 1235 ఉద్యోగాలున్నాయని తెలిపారు. శిక్షణ తీసుకునే అభ్యర్థులు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. కానిస్టేబుల్ శిక్షణ తీసుకునే అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు వెళ్లి వేల రూపాయలు పెడుతూ నష్టపోతున్నారని అన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో పోలీసులు, ఉపాద్యాయులు అందించే మెళకువలను నేర్చుకొని కానిస్టేబుల్ ఉద్యోగాలు సాదించి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని అభ్యర్థులకు సూచించారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నామని, ఈ శిక్షణ సందర్బంగా ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. శిక్షణ పొందే అభ్యర్థులు ఏకాగ్రతతో చదివి తమ లక్ష్యాలను నెవరేర్చుకోవాలన్నారు. ముఖ్యంగా మహిళలు సమయాన్ని వృథా చేయకుండా శిక్షణపై ఆసక్తి పెంచుకొని ఉద్యోగాలు సాదించుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులకు అవగాహన ఉండేందుకు ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి వారిని చైతన్యవంతులను చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా శిక్షణ తీసుకునే అభ్యర్థులకు మెటీరియల్ కూడా ఉచితంగా అందిస్తున్నామన్నారు. అనంతరం బెల్లంపల్లి డీ ఎస్పీ రమణారెడ్డి మాట్లాడుతూ శిక్షణ తీసుకునే అభ్యర్థులు క్రమశిక్షణతో చదివి ఉద్యోగాలు సాదించుకోవాలన్నారు. సమాజంలో మహిళల పట్ల నేరాలు జరుగుతున్నాయని, మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు కావాల్సిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆదిలాబాద్, కాగజ్‌నగర్, మంచిర్యాలలో ఈ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని, బెల్లంపల్లిలో ఫిబ్రవరి 20వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిఐలు కరీముల్లాఖాన్, ఎల్.రఘు, ఎస్సైలు ప్రసాద్, స్హ్ఘుకర్, అనిల్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి
* జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణరెడ్డి
కడెం, జనవరి 20: రాబోయే పదవ తరగతి పరీక్షల్లో పాఠశాలల విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు కృషిచేయాలని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని దస్తురాబాద్, మున్యాల్ గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను, ప్రాథమిక పాఠశాలలను డిఇవో సత్యనారాయణరెడ్డి సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అందుతున్న విద్యాబోధనపై ఆయన ఆరా తీశారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు పదవ తరగతి సిలబస్‌ను ఎలా బోధిస్తున్నారన్న విషయాలపై పలువురు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు ఏర్పాటుచేసి మంచి విద్యా బోధన అందించాలని ఉపాధ్యాయులకు కోరారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించడానికి ఇప్పటినుండే కృషిచేయాలని ఆయన కోరారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుపట్టికను డిఇవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న ఏజెన్సీ నిర్వాహకులైన గ్రూపు మహిళలతో డిఇవో సమావేశమై వారితో చర్చించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్భందీగా మెనూ ప్రకారం అమలుచేయాలని సూచించారు. మధ్యాహ్న భోజన నిర్వహణ సమయంలో పరిశుభ్రత పాటించాలని, నాణ్యమైన ఆకుకూరలు, కూరగాయలతో వంటలుచేయాలని సూచించారు. భోజన నిర్వాహకులు సేవాభావంతో పనిచేయాలన్నారు. మున్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో 15రోజుల క్రితం మధ్యాహ్న భోజనంతిని 30మంది విద్యార్థుల అస్వస్థతకు గురైన విషయంపై డిఇవో ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఏజెన్సీ నిర్వాహకులకు ఆయన తెలిపారు. ఆయన వెంట మండల విద్యాశాఖ అధికారి గోపాల్, మున్యాల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఎల్లాగౌడ్, మండల పిఆర్‌టియు అధ్యక్షుడు కోట వేణు తదితరులు ఉన్నారు.

అడుగంటిన జలాలు... తాగునీటికి తంటాలు
* వేసవికి ముందే పల్లెల్లో నీటి ఎద్దడి షురూ
* నేటికీ గుత్తెదార్లకు అందని 8.6కోట్ల బకాయిలు
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జనవరి 20: వర్షాభావ పరిస్థితులకు తోడు భూగర్భజలాలు అడుగంటి పోవడంతో వేసవికి ముందే జిల్లాలో తాగునీటి సమస్య ప్రజలను కలవరపెట్టిస్తోంది. పట్టణాలు, పల్లెల్లో గుక్కెడు నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతూనే ఉన్నారు. గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు సమీక్షలతో సరిపెడుతున్నా వేసవి నీటి ఎద్దడి కార్యాచరణపై ముందస్తు ప్రణాళికలు రూపొందించడం లేదు. కాంటిన్‌జెన్సి ప్రణాళిక కింద వేసవికి ముందు నిధుల కేటాయింపులపై ప్రతిపాదనలు పంపుతున్నా ప్రభుత్వం నుండి నిధులు మంజూరి కాకపోవడంతో పలు పథకాలు అర్ధాంతరంగా పడకేస్తున్నాయి. మంచినీటి ట్యాంకుల మరమ్మత్తులు, చెడిపోయిన బోర్లు, అస్తవ్యస్తంగా పైపులైన్ల నిర్మాణంతో తాగునీటి సరఫరాకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. తాగునీటి బావుల్లో, మంచినీటి పథకాల జలాశయాల్లో జలమట్టం అడుగంటి పోవడంతో వేసవిలో ఈసారి కష్టాలు తప్పేట్లు కనిపించడం లేదు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, 866 గ్రామపంచాయతీలు ఉండగా ఆదిలాబాద్, నిర్మల్ మినహా మిగితా మున్సిపాలిటీల్లో నీటి కోసం కష్టాలు తప్పేట్లు కనిపించడం లేదు. ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గతంలో ట్రైబల్ ప్లాన్‌కింద చేపట్టిన పథకాలు నిధుల కొరత కారణంగా పెండింగ్‌లో మగ్గుతుండగా కొత్త పథకాలకు సరైన విధంగా నిధులు కేటాయింపులు జరగకపోవడంతో రక్షిత మంచినీటి పథకాలు నిర్లక్ష్యంగానే వదిలేయాల్సి వచ్చింది. ఫలితంగా గిరిజనులు వాగులు, వంకలపైనే ఆధారపడి తాగునీటిని సేకరించి రోగాల పాలవుతున్నారు. సమస్యత్మాక గ్రామాల్లో నీటి ఎద్దడి నివారించేందుకు ఆర్‌డబ్ల్యూ ఎస్ అధికారులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించడం లేదు. ఏఆర్‌డబ్ల్యూఎస్ కింద మంజూరవుతున్న నిధులు అసంపూర్తిగానే దర్శణమిస్తున్నాయి. పైగా మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని అధికారులు నిర్ణయిస్తుండగా గతంలో గుత్తెదారులకు ఇవ్వాల్సిన బిల్లులు ఇప్పటి వరకు చెల్లింపులు చేయకపోవడంతో వారు అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. గతంలో 418 గ్రామాల్లో రూ.8,8,20,800తో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయగా, 30 బోర్లు అద్దెకు తీసుకున్నారు. ఇందుకు గాను రూ.23.20 లక్షల బిల్లులయ్యాయి. మరో 1072 బోర్లు ఫ్లషింగ్‌తో పాటు ఎక్కువ లోతు తవ్వగా ఇందుకోసం రూ.48,24లక్షలు, 221 ఓపెన్‌వెల్స్ పూడికతీతతో పాటు మరింత లోతు తవ్వేందుకుగాను రూ.1.87 కోట్లు వెచ్చించారు. దీంతో మొత్తం రూ.10.67 కోట్లు వ్యయం కాగా, 201415లో పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. నాన్ సీఆర్‌పిఎఫ్‌లో 201516లో నాన్‌ప్లాన్‌లో రూ.19,58కోట్లు, ప్లాన్‌లో రూ.8,58 కోట్లు మొత్తం రూ.28,14 కోట్ల మేర నిధులు వచ్చాయి. ఇందులో ఇప్పటికి రూ.4.55 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. నాన్‌ప్లాన్‌లో రూ.2.99 కోట్లు, ప్లాన్‌లో రూ.1.58 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. జిల్లా స్థాయిలో రూ.2,75 కోట్లు, డివిజన్ స్థాయిలో రూ.180 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. గతేడాది సీఆర్‌ఎఫ్ బిల్లులకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులు సరిగా పర్యవేక్షణ లేకపోవడం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ దుస్థితి నెలకొందని చెప్పవచ్చు. తీరా గుత్తెదారులు బిల్లుల చెల్లింపుల కోసం అధికారులపై ఒత్తిడి పెంచడంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాకే బిల్లులు చెల్లిస్తామమని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయం మంత్రులు, ఎమ్మెల్యేల దృష్టికి రావడంతో వారు అధికారులపై మండిపడడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ సారి నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాల్లో ట్యాంకర్లద్వారా నీటిని సరఫరా చేసేందుకు గుత్తెదారులు మందుకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తాగునీటి ఎద్దడిపై ముందస్తు కార్యాచరణతో పాటు నిధులు విడుదల చేస్తేనే సమస్యకు కాస్త పరిష్కారం లభించే అవకాశం ఉంది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును పర్యవేక్షించాలి
* రెఫర్‌కు కారణాలను రికార్డులో నమోదు చేయాలి
* జెసి సుందర్ అబ్నార్
మంచిర్యాల, జనవరి 20: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ అన్నారు. బుధవారం మంచిర్యాల ఏరియాస్పత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు ఎక్కువగా జరిగేవిధంగా వైద్య సిబ్బంది విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతంలోని మహిళలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సమీప ఏరియాస్పత్రిలో ప్రసవాలు జరిగేవిధంగా ప్రణాళికలు రూపొందించుకొని ఆ దిశగా గర్బిణీలను ప్రోత్సహించాలని సూచించారు. గతంలో కరీంనగర్ జిల్లా ఆస్పత్రి ప్రసవాలను పెంచేవిధంగా ప్రణాళికను రూపొందించుకొని ఎక్కువ మొత్తంలో ప్రసవాలు జరిగేవిధంగా చేపట్టాయని అన్నారు. గైనకాలజిస్టులు గర్బిణీలకు సుఖప్రసవాలు జరిగేవిధంగా చూడాలని, ప్రసవాల సమయంలో ప్రాథమిక కేంద్రం నుంచి సమీప ఏరియాస్పత్రి వరకు 108 వాహనాల్లో తరలించాలన్నారు. మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలో చిన్న చిన్న కారణాల వల్ల వైద్యాధికారులు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు గాను ఇతర ప్రాంతాల ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నట్లు ఫిర్యాదులతో పాటు గమనించడం జరుగుతుందని అన్నారు. ఏ కారణాలతో రెఫర్ చేస్తున్నారో రికార్డుల్లో చూపకుండా కేవలం ప్రిస్కిప్షన్‌పై రాయడం జరుగుతుందని అన్నారు. ఇకముందు నుంచి రెఫర్ చేసే కారణాలను రికార్డులో నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో ఆయిషా మస్రత్ ఖానం, డీసీహెచ్ ఎస్ వైద్యులు చంద్రవౌళి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

హెలిప్యాడ్ నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్
మంచిర్యాల, జనవరి 20: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు పనులతోపాటు ప్లాంటు సమీపంలో శాశ్వతంగా నిర్మిస్తున్న హెలిప్యాడ్‌ను కలెక్టర్ జగన్‌మోహన్ బుధవారం పవర్ ప్లాంటు అధికారులతో కలసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీ ఆర్ పర్యటన సందర్బంగా ఏయే ప్రాంతాల్లో ఎలాంటి సదుపాయాలు చేపడుతున్నారో వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం జైపూర్ తహసిల్దార్ మదుతో మాట్లాడుతూ బహిరంగ సభ ప్రాంతానికి సంబంధించిన భూమి పట్టాదారు వివరాలు తెలుసుకొని సభ నిర్వహణ అనుమతి కొరకు అంగీకార లేఖ రాయాలని ఆదేశించారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బందితో పాటు సింగరేణి అధికారులున్నారు.

తహశీల్ ఎదుట జడ్పీటీసీ ఆత్మహత్యాయత్నం
తాండూర్, జనవరి 20: తహశీల్దార్ కార్యాలయం ముందు బుధవారం సాయంత్రం తాండూర్ జడ్పీటీసీ మంగపతి సురేష్ సూపర్ వాస్మోల్ 33 మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమకు సంబంధించిన సొంత భూమిని రెవెన్యూ అధికారులు బెల్లంపల్లికి చెందిన ఆరె వరలక్ష్మికి పట్టాచేసి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జడ్పీటీసీ సురేష్ తహశీల్దార్ కార్యాలయం ముందు విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 669/1 సర్వే నెంబర్‌లో ఆరె వరలక్ష్మి తండ్రి పురంశెట్టి బాపు తమకు కొంత భూమిని అమ్మినాడని తెలిపారు. ఈ భూమి జడ్పీటీసీ కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ వరలక్ష్మి గతంలో బెల్లంపల్లిలో ముగ్గురు మంత్రుల సమక్షంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మంత్రుల సమక్షంలో ఆత్మహత్యకు పాల్పడటం వల్లనే రెవెన్యూ అధికారులు వరలక్ష్మికి మా భూమిని పట్టాచేసి ఇచ్చారని ఆయన ఆరోపించారు. సరైన ఆధారాలు లేకుండా మా భూమిని కోర్టును విచారణ జరుగుతుండగా రెవెన్యూ అధికారులు వరలక్ష్మికి పట్టా ఎలా జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. తన సొంత భూమిని కాపాడుకోలేని నేను ప్రజలకు ఏమి న్యాయం చేస్తానని మనోవేదన వ్యక్తం చేస్తూ జడ్పీటీసీ తన వెంట తెచ్చుకున్న సూపర్‌వాస్మోల్ 33ని వెంటనే తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనకు అక్కడే ఉన్న విలేకర్లు, స్థానికులు నిచ్చేష్ఠులయ్యారు. ఆత్మహత్యకు పాల్పడిన సురేష్‌ను వెంటనే చికిత్స నిమిత్తం మంచిర్యాలకు తరలించారు.
కుటుంబ సభ్యుల రాస్తారోకో...
మండల కేంద్రంలోని ఐబీ రాష్ట్రీయ రహదారిపై జడ్పీటీసీ కుటుంబ సభ్యులు రాస్తారోకో చేశారు. తమ భూమిని అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి వరలక్ష్మి అనే మహిళకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తాండూర్ ఎస్సై అశోక్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. ఎస్సై జోక్యంతో జడ్పీటీసీ కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.