తూర్పుగోదావరి

త్వరితగతిన పోలవరం పునరావాస పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 21: పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ, పునరావాస పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ సంబంధిత శాఖల అధికారులను కోరారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో గురువారం పోలవరం ప్రాజెక్ట్ పునరావాస పనుల ప్రగతిపై ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పునరావాస చర్యల్లో భాగంగా నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వడం, పునరావాస కాలనీల్లో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. రంపచోడవరంలో విలీనమైన నాలుగు మండలాల సమస్యలను చర్చించేందుకు చింతూరు ఎంపిడిఒ కార్యాలయంలో ఫిబ్రవరి 3న ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 4న దేవీపట్నం ఎంపిడిఒ కార్యాలయంలో కూడా ఉదయం 10.30 గంటలకు మరో సమావేశం నిర్వహించి కొండమొదలు గ్రామానికి సంబంధించిన సమస్యపై చర్చిస్తామన్నారు. ఈలోగా ఆయా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్ట్‌కోసం సేకరిస్తున్న భూములపై గిరిజనులకు, గిరజనేతరులకు మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవల్సి ఉందని జెసి పేర్కొన్నారు. సమావేశంలో రంపచోడవరం సబ్ కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి, పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ డి సుదర్శన్, డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
క్రమంగా తప్పకుండా ఆరోగ్య పరీక్షలు
డిఎం అండ్ హెచ్‌ఒ ఉమాసుందరి
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జనవరి 21: గర్భిణీ స్ర్తిలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఉమా సుందరి సూచించారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని గాంధీభవన్‌లో గురువారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్ర్తిలకు ఆరోగ్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ ఉమా సుందరి మాట్లాడుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ తరచూ గాడిమొగ, కాకినాడ నగరాలలో ఈ విధమైన ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తుండటం హర్షణీయమన్నారు. గర్భిణులతో పాటు బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ఆరోగ్యకరమైన ప్రపంచ స్థాపనకు సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు డాక్టర్ ఉమాసుందరి పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో రిలయన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ గాడిమొగ, భైరవపాలెం పంచాయితీల ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. సంస్థ అధికారులు ఎన్ రవిచంద్రన్, ఎం నాగిరెడ్డి, ఎన్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడవద్దు
ప్రత్యేకాధికారి కృష్ణశృతి:‘్భమి’వార్తకు స్పందన
రావులపాలెం, జనవరి 21: ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా ఇసుక తవ్వకాలు జరపాలని ప్రత్యేకాధికారి కె కృష్ణశృతి అన్నారు. ఇసుక ర్యాంపులో జరుగుతున్న అక్రమాలపై ఆంధ్రభూమిలో గురువారం గోదారమ్మకు గర్భశోకం శీర్షికన వెలువడిన కథనం అధికారుల్లో కదలిక తెచ్చింది. జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం డివిజనల్ కో-ఆపరేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కృష్ణశృతిని ఊబలంక ర్యాంపునకు ప్రత్యేకాధికారిగా నియమించారు. దీంతో ఆమె ఊబలంక ర్యాంపును గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ర్యాంపులో జరుగుతున్న తవ్వకాలపై ఆరా తీశారు. జాప్యం లేకుండా ఆర్డర్లు పొందిన వినియోగదారులకు నిబంధనల ప్రకారం ఇసుక లోడింగ్ జరపాలని సిబ్బందికి సూచించారు. ఉదయం నుండి తనిఖీ సమయానికి కేవలం 20 లారీలకు మాత్రమే ఇసుక ఎగుమతి చేసినట్టు రికార్డులో ఉండటంతో ఆమె ర్యాంపు ఇన్‌ఛార్జి కె రమేష్‌ను ప్రశ్నించారు. విద్యుత్ కోత ఉండటంతో వే బిల్లులు మంజూరు చేయడం ఆలస్యమైందని ఆయన వివరణ ఇచ్చారు. మొత్తం ఎన్ని యూనిట్లు ఎన్ని వాహనాలకు ఎగుమతి చేశారో వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి అక్రమాలకూ తావు లేకుండా ఇసుక తవ్వకాలు జరపాలని సూచించారు. ఆయన వెంట అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుబ్బారావు, విఆర్వో రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

సువర్ణ వర్తకుల బంద్
రాజమహేంద్రవరం, జనవరి 21: రాజమహేంద్రవరంనకు చెందిన ఒక సువర్ణ వర్తకుడు విజయవాడ వన్‌టౌన్ క్రైం పోలీసుల అదుపులో మృతి చెందిన సంఘటనపై సువర్ణవర్తకులు గురువారం నగరంలో ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపులకు నిరసనగా సువర్ణ వర్తక దుకాణాలను బంద్ చేసి మానవహారం ఏర్పాటు చేశారు. వర్తకుల కథనం ప్రకారం క్రితం స్థానిక నల్లమందుసందులో స్వర్ణ్భారణాల దుకాణం నిర్వహించే వినోద్ కదమ్(26)ను చోరీ బంగారాన్ని కొనుగోలు చేశాడన్న ఆరోపణలపై 3రోజుల క్రితం విజయవాడ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈసందర్భంగా పోలీసుల తీరుకు తీవ్రంగా భయపడిన కదమ్ విజయవాడ వన్‌టౌన్ క్రైం పోలీసుస్టేషన్ భవనం పైనుంచి దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతను చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించాడు. దీంతో రాజమహేంద్రవరం సువర్ణవర్తక సంఘం నేతలు పోలీసుల వేధింపులను నిరసిస్తూ బంద్ పాటించారు. మెయిన్‌రోడ్డులో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. కదమ్‌ను అదుపులోకి తీసుకుని వేధింపులకు గురిచేసి, అతని మృతికి బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సువర్ణ వర్తక సంఘం ఆందోళనకు టిడిపి సీనియర్ నేత గన్ని కృష్ణ, వైసిపి నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, సిపిఐ నాయకుడు మీసాల సత్యనారాయణ, చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు అశోక్‌కుమార్‌జైన్, బూర్లగడ్డ వెంకటసుబ్బారాయుడు, నందెపు శ్రీనివాస్ తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈసందర్భంగా గన్ని కృష్ణ ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు ఫోన్ చేసి వర్తకుల ఫిర్యాదును ఆయనకు వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఇప్పటికే వారు తనను కలిసి ఫిర్యాదు చేశారని, ఈసంఘటనపై విచారణ జరిపిస్తున్నట్లు చెప్పారు. విచారణ అనంతరం బాధ్యులైన చర్యలు తీసుకుంటామన్నారు. కదమ్ కుటుంబానికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, గురువారం రాత్రికి విజయవాడ నుంచి వినోద్‌కదమ్ మృతదేహాన్ని రాజమహేంద్రవరంలోని మెరకవీధి నివాసానికి తరలించారు. కదమ్‌కు తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులు ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కదమ్ మృతితో ఆకుటుంబంలో విషాదం నెలకొంది.
ఇసుక నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జనవరి 21: ప్రభుత్వం ప్రకటించిన నూతన ఇసుక విధానం-2016కు సంబంధించి నోటిఫికేషన్‌ను జిల్లా యంత్రాంగం గురువారం విడుదల చేసింది. ఇ-టెండర్-కం, ఇ-వేలం విధానంలో ఇసుక రీచ్‌లను ఈ దఫా వేలం ద్వారా కేటాయించనున్నారు. కొత్త పాలసీ ప్రకారం జిల్లాలోని 19 రీచ్‌ల్లో ఇ-పర్మిట్ల ద్వారా ఇసుక అమ్మకాలను చేపట్టనున్నారు. టెండర్ డాక్యుమెంట్లను 2016 ఫిబ్రవరి 4వ తేదీలోగా కొనుగోలు చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్లు తమ బిడ్‌లను ఫిబ్రవరి 6వ తేదీలోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సవరణల కోసం ఎంఎస్‌టిసి వెబ్‌సైట్, గనులు, భూగర్భ శాఖ సంచాలకుల కార్యాలయం వెబ్‌సైట్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఏ విధమైన కారణాన్ని చూపకుండా ఏ బిడ్‌ను గాని లేక అన్ని బిడ్‌లను గాని తిరస్కరించే అవకాశం ఉన్నట్టు జిల్లా ఇసుక కమిటీ ఛైర్మన్, జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ చెప్పారు. ఇ-టెండర్-కం- ఇ-వేలం ప్రక్రియను ఏ దశలోనైనా, ఏదైనా అనుకోని పరిస్థితుల కారణంగా నిర్వహించే అవకాశం లేక, వాయిదా వేసే అవకాశం కమిటీకి ఉంటుందన్నారు. టెండర్లను రద్దు చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. కౌలు ఒప్పందాన్ని కుదుర్చుకున్న కాలం నుండి ఒక ఏడాదికి ఈ టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి కొత్త పాలసీ అమలులోకి రానున్నట్టు తెలిపారు. ఇసుక రీచ్‌లలో ఇసుక తవ్వకాలు, కౌలు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇతర వివరాలను డిజిటల్ రూపంలో వెబ్‌సైట్‌లో పొందుపరచినట్టు పేర్కొన్నారు. 19 రీచ్‌ల్లో ఉన్న 19.85 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ఇ-టెండర్ కం-ఇ-వేలంను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. వేలం ద్వారా క్యూబిక్ మీటరు ఇసుకను 550 రూపాయలకు మించుకుండా అమ్మకాలు జరపాల్సి ఉంటుందన్నారు. ఆయా రీచ్‌లలో 20 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు, మూడు మీటర్ల లోతు నిల్వ ఉన్న ప్రాంతాలలో అనుమతులు ఇస్తామని తెలిపారు. జిల్లాలో ఫిబ్రవరి 1నుండి అనుమతించే 19 రీచ్‌లలో 13 ఓపెన్ రీచ్‌లు, 2 డిస్టిలేషన్ రీచ్‌లు ఉన్నాయని తెలిపారు. ఈ రీచ్‌లలో బ్రిడ్జిలు, డ్యామ్‌లు ఇతర కట్టడాల సమీపంలో 500 మీటర్లలోపు తవ్వకాలు అనుమతించరని చెప్పారు. వాల్టా చట్టాన్ని పరిగణలోకి తీసుకుని, నిబంధనలు వ్యతిరేకించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. వేలంలో పాల్గొనే కాంట్రాక్టర్లు ముందుగా సాంకేతిక బిడ్‌లో అర్హత సంపాదించాలన్నారు. ఈ ఆర్హత లేని పక్షంలో ఇఎండిని కోల్పోతారని స్పష్టం చేశారు. వేలంలో పాల్గొనేవారికి నేర చరిత్ర ఉండకూడదని, ఇసుక విధానంలో అవకతవకలకు పాల్పడితే భారీ పెనాల్టీలను చెల్లించుకోవల్సి ఉంటుందని జెసి స్పష్టం చేశారు.