అదిలాబాద్

స్కూల్ బస్సులో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జనవరి 22: పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన బస్సులో శుక్రవారం సాయంత్రం మంటలు చెలరేగడం కలకలం సృష్టించింది. పాఠశాల ముగిసిన వెంటనే దాదాపు 25 మంది విద్యార్థులు వారి ఇళ్ల వద్ద దింపేందుకు బయలుదేరిన బస్సు ఈద్గాం చౌరస్తా వరకు చేరుకోగానే బస్సు ఇంజన్‌లో పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ స్థానికుల సహకారంతో పిల్లలను బస్సు నుండి దింపేశాడు. విద్యార్థులను దింపిన కాసేపటికే ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి ఫైరింజన్ చేరుకుని మంటలను ఆర్పివేసింది. అప్పటికే బస్సు పాక్షికంగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదమే తప్పింది. వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యం మరో బస్సును తెప్పించి విద్యార్థులను వారి ఇంటి వద్దకు చేర్చింది. సంఘటన స్థలాన్ని పట్టణ సి ఐ జీవన్‌రెడ్డి, ఎస్సై సునీల్ కుమార్‌లు పరిశీలించారు.

ఆసుపత్రిలో ప్రసవాలు జరగాలి
* డిఎం అండ్ హెచ్‌వో జలపతి నాయక్
చెన్నూర్, జనవరి 22: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే గర్భీనీల ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి జలపతి నాయక్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ సివిల్ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుటుంబ నియంత్రణ చేసుకున్న వారిని వివరాలు అడిగి తెల్సుకున్నారు. వైద్య సేవల గురించి రోగులను అడిగి తెల్సుకున్నారు. ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించి ఒపి వివరాలు సేకరించారు. నిర్దేశించిన కుటుంబ నియంత్రణ లక్ష్యాలను మార్చి నెల లోపే సాధించాలని సిబ్బందికి సూచించారు. మాతశిశు మరణాలను అరికట్టాల్సి అవసరం ఎంతైనా ఉందని, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ సకాలంలో వైద్యం అందించాలని అన్నారు. పల్స్‌పోలియో విజయవంతం చేసినందుకు వైద్యాధికారులతో పాటు సిబ్బందిని అభినందించారు. వ్యాధి నిరోదక టీకాల లక్ష్యాలను కూడ చేదించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డాక్టర్ సత్యనారాయణ, అరుణశ్రీ, రాధికరాణి, సహెచ్‌వోలు పద్మనాభాచారి, జగదీష్, స్థానిక వైద్య సిబ్బంది ఉన్నారు.

సింగరేణి ఆణిముత్యాలు నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళ
సింగరేణి డైరెక్టర్ పిఅండ్‌పి మనోహర్ రావు
శ్రీరాంపూర్ రూరల్, జనవరి 22: సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న ఆణిముత్యాలు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు సింగరేణిలో ఉద్యోగ మేళా నిర్వహిస్తోందని సింగరేణి డైరెక్టర్ పి అండ్ పి మనోహర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్‌లోని సిసిసి సింగరేణి వసతి గృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సింగరేణి పరిసర ప్రాంతాల గ్రామాల నిరుద్యోగులకు, పదీవ విరమణ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగ మేళా అవకాశం ఉంటుందని, గత జూలై నెలలో సింగరేణి ఆణిముత్యాల పేరుతో అవగహన కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమంలో 22వేల మంది నిరుద్యోగ యువత పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ నెల 27నుంచి శ్రీరాంపూర్‌లోని సింగరేణి పాలిటెక్నికల్ కళాశాలలో ఉద్యోగ మేళ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళలో 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులను ఒక గ్రూప్‌గా, డిగ్రీ ఆపై విద్యార్థులను ఒక గ్రూప్‌గా, ఐటి ఐ, డిప్లోమా, ఇంజినీరింగ్ అభ్యర్థులను ఒక గ్రూపుగా విభజించడం జరుగుతుందని పేర్కొన్నారు. 18నుంచి 32 సంవత్సరాల లోపుగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. యాజమాన్యం నిర్వహించే ఉద్యోగ మేళాలో తమ ఒరిజినల్ సర్ట్ఫికేట్స్‌తో పాటు దృవపత్రాలు, నాలుగు పాస్‌పోర్టు సైజు ఫోటోలతో హాజరు కావాలని కోరారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు చెందిన ఐటి వాణిజ్య పారిశ్రామిక సంస్థల్లో ఉద్యోగాలు ఇస్తారని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి అనంతరం ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జీ ఎం ఎస్‌డి ఎం సుబాని, డీజీ ఎం పర్సనల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
* కలెక్టర్ జగన్మోహన్
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జనవరి 22: జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఈనెల 25న ఘనంగా నిర్వహించాలని ముఖ్య ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సంధర్భంగా జిల్లా కేంద్రంతో పాటు పది అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకవచ్చేలా ఓటు హక్కుపై కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సంధర్భంగా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2322 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. సీనియర్ ఓటర్లను ఆహ్వానించి వారిని సన్మానిస్తామని తెలిపారు. వ్యాసరచన, వకృత్వ, పెయింటింగ్, డ్రైయింగ్ పోటీలను నిర్వహిస్తామని, విద్యార్థుల్లోను అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ముఖ్యంగా ఓటు హక్కుపై రూపొందించిన శకటాన్ని జిల్లా వ్యాప్తంగా పర్యటించేలా చూస్తామని, ఎపిక్‌కార్డులను ప్రింటింగ్ చేసి అందిస్తామని అన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి సంజీవరెడ్డి, ఉట్నూరు ఆర్డీవో ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

50 మంది నిరుద్యోగ యువకులకు వాహనాల మంజూరి
* కలెక్టర్ జగన్మోహన్
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జనవరి 22: జిల్లా పరిశ్రమల శాఖ అధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతీ యువకులకు రాయితీపై అందిస్తున్న రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చాంబర్‌లో పరిశ్రమల శాఖ అధ్వర్యంలో నిరుద్యోగ యువతకు యూనిట్ల మంజూరిపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో టి ఎస్ ఐపాస్ కింద ఎస్సీ, ఎస్టీ యువతీ యువకులు మొత్తం 84 మంది వాహనాల కోసం దరఖాస్తు చేసుకోగా 9 మందికి అర్హత లేకపోవడంతో తిరస్కరించడం జరిగిందన్నారు. మిగిలిన 58 మందితో కూడిన జాబితా పరిశీలించి, 12 మంది ఎస్సీ జనరల్‌కు, 25 మంది ఎస్సీ మహిళలకు, 11 మంది ఎస్టీ జనరల్‌కు, 10 మంది ఎస్సీ మహిళలకు వాహనాలను 35 నుండి 45 శాతం రాయితీపై అందజేస్తామని అన్నారు. రూ.4కోట్ల 2లక్షల విలువైన రవాణా వాహనాలను ప్రభుత్వం కోటి 60 లక్షల 81వేల రాయితీ అందిస్తుందని అన్నారు. ఈ కమిటీ సమావేశానికి హాజరుకాని కమర్షియల్ ట్యాక్స్ రవాణా ఉప కమీషనర్, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేయాలని జిఎంని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జిఎం కృష్ణారావు, డిడి జేమ్స్, ఏడి రామ్‌కిషన్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య, సహాయ మున్సిపల్ కమిషనర్ రవిబాబు, జిల్లా ఆగ్నిమాపక అధికారి సందన్న, ఎల్‌డిఎం మాతుర్, సాంఘీక సంక్షేమ శాఖ పిడి ప్రేమ్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా గిరిజన క్రీడలకు ఏర్పాట్లు పూర్తి
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పివో
ఉట్నూరు, జనవరి 22: ఐటిడిఏ పరిధిలోని జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల క్రీడలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి ప్రతిష్టాత్మకంగా క్రీడలు నిర్వహించాలన్న తపనతో దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండడంతో కనివిని ఎరగని రీతిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక కొమరం భీం క్రీడా మైదానంలో 23 నుండి 25వ తేదీ వరకు జరిగే జిల్లా స్థాయి క్రీడలకు సుమారు 1500 మంది క్రీడాకారులతో పాటు మరో 2వేల మంది కళాకారులు పాల్గొననున్నారు. ఇందుకు క్రీడామైదానాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దగా షమీయాలు సైతం ఏర్పాటు చేశారు. అదే విధంగా జిల్లా క్రీడలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బాబా సాహెబ్ బోస్లే, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.లక్ష్మణ్ హాజరై ప్రారంభించనుండగా వేదికను సైతం అందంగా అలంకరిస్తున్నారు. అంతేకాకుండా గిరిజన క్రీడలను చాటిచెప్పే విధంగా ఐటిడిఏకు సంబంధించిన లోగోతో ఫైలాన్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. మద్య మద్యలో క్రీడాకారులకు ఆట విడుపుగా సేదా తీరేందుకు రెండవ క్రీడామైదానంలో రంగులరాత్నం, రైల్వేట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లో సైతం క్రీడలు జరగనుండడంతో ఫ్లడ్‌లైట్లు సైతం ఏర్పాటు చేశారు. జైనూర్ ఏటిడబ్ల్యూవో భాస్కర్ నేతృత్వంలో క్రీడా మైదానాన్ని సర్వంగాసుందరంగా తీర్చిదిద్ది క్రీడలకు సిద్దం చేశారు. అదే విధంగా వాతావరణాన్ని బట్టి క్రీడాకారులు, ప్రేక్షకుల కోసం షమీయాలు సైతం ఏర్పాటు చేవారు. ఏది ఏమైనా జిల్లా స్థాయి గిరిజన క్రీడలను విజయవంతం చేసేందుకు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రత్యేక పర్యవేక్షణలో కనివిని ఎరగని రీతిలో అన్ని సౌకర్యాలను అధికారుల సహకారంతో ఏర్పాటు చేశారు.

వెన్నులో వణికిస్తున్న చలి
* ఆదిలాబాద్‌లో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జనవరి 22: మొన్నటి వరకు చలికాలానే్న మైమర్చిపోయిన జిల్లా ప్రజలు మళ్ళి వెన్నులో వణికిస్తున్న చలి తీవ్రతతో బెంబేలెత్తిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతంలోని మద్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించి ఆదిలాబాద్‌లో శుక్రవారం 6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. వారం రోజుల కిందట జిల్లాలో 21 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా సంక్రాంతి పండగ తర్వాత అసలు చలికాలమే ఉండదని అందరూ భావిస్తున్న తరుణంలోనే రెండు రోజులుగా అతి శీతల గాలులు, ఉదయం రాత్రి వేళల్లో చలితీవ్రత ఉదృతం కావడంతో జిల్లా వాసులు వణికిపోతున్నారు. ఉదయం పూటనే పట్టణాలు, మండల కేంద్రాలకు వెళ్ళి చిరువ్యాపారం చేసుకునే రైతు కూలీలు, పాలు విక్రయదారులు చలితో తట్టుకోలేక నానా తంటాలు పడుతున్నారు. బడి పిల్లల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఉదయం 9 గంటలకే పాఠశాలలకు వెళ్లాల్సిన చిన్నారులు చలిగాలుల దాటికి అల్లాడిపోతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో యాచకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారగా, చలి ప్రభావంగా శ్వాసకోశ సంబంధ వ్యాదులు, చర్మ, జలుబు వంటి వ్యాధులతో ఆసుపత్రులో రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్ పట్టణాల్లో వెలిసిన ఉన్ని దుస్తుల షాపులకు గిరాకి విపరీతంగా పెరిగింది. ఇదిలా ఉంటే శుక్రవారం ఉట్నూరు ఏజెన్సీలో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. జిల్లా సరిహద్దు చత్తీస్‌ఘడ్‌కు ఆనుకొని దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు అక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని కృషి విజ్ఞాన కేంద్రం వాతావరణ నిపుణుడు ప్రశాంత్ పేర్కొన్నాడు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొంటుందని ఆయన తెలిపారు.

మహిళల అక్రమ రవాణాపై సంఘటితంగా ప్రతిఘటించాలి
* జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జనవరి 22: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించి, సమాజంలో పెనుజాడ్యంగా విస్తరించిన మానవ అక్రమ రవాణాను మహిళలు సంఘటితమై ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని జిల్లా సెషన్స్ జడ్జి కుంచాల సునీత ఉద్బోదించారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని ఎస్టీయూ భవనంలో పాయిడ్స్ స్వచ్ఛంద సంస్థ, ఐసిడిఎస్ సంయుక్త అధ్వర్యంలో మానవ సంబంధ అక్రమ రవాణా అంశంపై నిర్వహించిన సదస్సును జిల్లా జడ్జి కుంచాల సునీత, కలెక్టర్ జగన్మోహన్, డిఆర్‌డిఏ పిడి అరుణకుమారిలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళలనుద్దేశించి న్యాయమూర్తి కుంచాల సునీత మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, మానవ సంబంధాల విషయంలో మహిళలంతా సంఘటితంగా ముందుకువచ్చి ఇలాంటివి పునరావృతం కాకుండా స్పందించాలని అన్నారు. మహిళలపై జరిగే దాడుల విషయంలో చట్టాలు అండగా ఉంటాయని, ధైర్యంగా ఎదుర్కొనేందుకు అంగన్వాడీలు, మహిళా సంఘాల సభ్యులు చైతన్యపర్చాలని అన్నారు. ముఖ్యంగా ప్రజ్వల సంస్థ అధ్వర్యంలో మహిళలకు రక్షణ కవచంగా నిలుస్తూ అత్యాచారాలకు గురైన బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నందుకు అభినందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఓరిస్సా రాష్ట్రంలోని 53 జిల్లాలో బస్సు యాత్ర నిర్వహించి మహిళల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించుట అభినందనీయమని అన్నారు. ఆడ పిల్లలు బాగా చదువుకొని తమ కాళ్లపై నిలబడాలని, అంగన్వాడీ టీచర్లు ఆడ పిల్లలో కలిగే శారీరక మానసిక మార్పులను ఎప్పటికప్పుడు గమనించి వారికి సామాజిక పరిస్థితులపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రేమ పేరుతో జరిగే పెళ్ళీళ్ళ ద్వారా మోసపోయి, ఇంట్లో సరైన ఆధరాభిమానాలు లభించక మోసపోతున్న ఘటన నేపథ్యంలో స్వతంత్రంగా తమ బాధలు చెప్పే విధంగా పిల్లలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ మహిళలంతా ఐక్యమక్యంగా ఉంటే సమాజంలో ఇటువంటి సంఘటనలు జరగవన్నారు. ప్రజ్వల ఎన్‌జివో సంస్థ మహిళలకు మేము సాయం చేయగలమని ముందుకు వస్తుందని, జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారని, వారిపై జరుగుతున్న అత్యాచారాలని నిరోదించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మగ పిల్లలు మహిళలపట్ల గౌరవభావంతో ఉండాలని, అత్యాచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగం మీవెంట ఉందని, ఎమ్మార్వోలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారని, సంఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. డిఆర్‌డిఏ పిడి అరుణకుమారి మాట్లాడుతూ పురుషుడు ప్రతి స్ర్తిని తల్లిగానో, అక్కగానో చూచినప్పుడు నేరాలు జరగవన్నారు. మహిళలకు పురుషుల వల్లేకాక సాటి మహిలల వల్లకూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయని, అందుకే మన ఆలోచన సరళి మారాలన్నారు. చిన్నప్పటి నుండే సెక్స్ ఎడ్యుకేషన్ తెలిసి ఉంటే ఇతరుల ద్వారా మోసపోయే అవకాశాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి మీరాబెనర్జీ, ప్రజ్వల సంస్థ సబ్యులు కె.బాలరామకృష్ణ, సాయిడ్స్ ఎన్జీవో సంస్థ సభ్యులు సురేందర్, అంగన్వాడీ టీచర్లు, సిడిపివోలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.