అదిలాబాద్

రంజాన్‌కు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 25: నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే రంజాన్ పండగను సోమవారం జిల్లావ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఆదివారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో ముస్లిం సోదరుల్లో పండగ సందడి నెలకొంది. జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఉట్నూరు, భైంసా పట్టణాల్లో ఆదివారం సెలవు దినం అయినప్పటికీ మార్కెట్ వీదులన్నీ కళకళలాడాయి. పండగ రోజు సేవించే సేమియా, డ్రైప్రూట్స్, పండ్లు, కూరగాయలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది. ఆదిలాబాద్‌లోని రైతుబజార్, ఆశోక్‌రోడ్డు, గాంధీచౌక్, శివాజీ, అంబేద్కర్ చౌక్ మార్కెట్ వీదుల్లో కొనుగోలుదారులతో వ్యాపారాలు జోరందుకున్నాయి. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ముస్లిం కుటుంబాలకు పండగ కానుకగా ఉచితంగా గిప్ట్‌ప్యాక్‌లు పంపిణీ చేయగా ఇటీవలే జిల్లాలో అన్ని మసీదుల వద్ద ఇఫ్తార్ విందులను కూడా ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్‌లో మంత్రి జోగురామన్న, నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో శాసన సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరై ఇఫ్తారు విందుల్లో పాలుపంచుకున్నారు. కాంగ్రెస్, టిడిపి, టీఆర్‌ఎస్ అధ్వర్యంలోనూ జిల్లావ్యాప్తంగా ఇఫ్తార్ విందులు జోరుగాసాగాయి. మతసామరస్యం, శాంతి, స్నేహభావానికి ప్రతీకగా నిలిచే రంజాన్ సోమవారం జరుపుకుంటున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుండే పోలీసు బందోబస్తు మోహరించారు. ఇటీవలే ఉట్నూరు, ఆదిలాబాద్ పట్టణాల్లో స్వల్ప ఘర్షణలు చోటుచేసుకొని పోలీసులు కేసులు నమోదైన సంఘటనల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రార్థన స్థలాల వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. వర్షాకాలం నేపథ్యంలో ఈద్గా మైదానంతో పాటు ప్రార్థన స్థలాల వద్ద రోడ్ల మరమ్మత్తులు చేపట్టి మొరం వేశారు. ఇదిలా ఉంటే నెల రోజుల పాటు కఠినమైన నియమాలతో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లిం సోదరులు సోమవారం రంజాన్ పండగ సందర్భంగా దీక్షలు విరమించనున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండగ వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ముస్లిం వర్గాల్లో ఆత్మగౌరవాన్ని నింపేందుకే ఉచితంగా దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ముస్లీం వర్గాలకు ప్రభుత్వం సమప్రాధాన్యతనిస్తూ పండగ ప్రశాంతవాతావరణంలో జరిగేలా జిల్లా పోలీసు యంత్రాంగం చేయూతనందిస్తుందని ఎస్పీ శ్రీనివాస్ పేర్కొన్నారు. హిందూ ముస్లీంల సమైక్యతకు నాంది పలకాలని ఆకాంక్షించారు. పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా సామరస్యంగా ఉపవాస దీక్షలు విరమించడం ఆధ్యాత్మిక చింతనకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. పండగ సందర్భంగా ఈద్గా మైదానాలు, ప్రార్థన స్థలాల వద్ద భారీ ఏర్పాట్లు గావించామని, ప్రతి ఒక్కరు శాంతియుత వాతావరణంలో పండగ జరుపుకోవాలని సూచించారు.