అంతర్జాతీయం

వ్యూహాత్మక బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలేం, జూలై 5: భారత్- ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. ఈ బంధాన్ని మరింత పటిష్టం చేసుకునే రీతిలో వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుస్తున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బుధవారం ఇక్కడ ప్రకటించారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిళించేందుకు ఇరుదేశాలు మరింత లోతైన సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ఉగ్రవాదానే్న కాకుండా అతివాదాన్ని కూడా ఇదే ఉమ్మడి శక్తితో ఎదుర్కోవాలని సంకల్పించారు. రక్షణ, భద్రత, జలవనరులు, వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన, పశ్చిమాసియా సమస్య వంటి అనేక అంశాలు మోదీ, నెతన్యాహు మధ్య జరిగిన విస్తృతస్థాయి వ్యూహాత్మక చర్చల్లో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఇదే సందర్భంగా రెండు దేశాలూ అనేక అంశాలపై పరస్పర సహకారాన్ని విస్తరించుకుంటూ ఏడు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఇటు ప్రభత్వాల మధ్య, అటు ప్రజల మధ్య అనుబంధాన్ని, సహకారాన్ని పెంపొందించుకోవాలన్నదే తమ ధ్యేయమని చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరువురు ప్రధానులు మీడియా ముందు సంయుక్తంగా మాట్లాడారు. భారత్ -ఇజ్రాయెల్‌లో అత్యంత సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో మనుగడ సాగిస్తున్నాయని, ప్రాంతీయ శాంతి సుస్థిరతకు ఎదురవుతున్న ముప్పును ఉమ్మడి శక్తితో ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. ఉగ్రవాదం కారణంగా దశాబ్దాలుగా భారత్ ఎన్నో కష్టనష్టాలను చవిచూసిందన్నారు. వైషమ్య బాధ నూ అనుభవించిందని గుర్తు చేశారు. ఇదే రకమైన సమస్యను, సవాళ్లనూ ఇజ్రాయెల్ కూడా ఎదుర్కొంటోందని మోదీ తెలిపారు. దాదాపు అన్ని అంశాలపైనా తమమధ్య భావసారూప్యత ద్యోతకమైందని, అందుకే వ్యూహాత్మక ప్రయోజనాలకు పరిరక్షించుకునేందుకు ఉగ్రవాదాన్ని, అతివాదాన్ని నిర్మూలించేందుకు కలసికట్టుగా పని చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. 26/11 దాడిని అత్యంత భయానకమైన ఉగ్రవాద కృత్యంగా అభివర్ణించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఈ జాడ్యాన్ని నిర్మూలించేందుకు రెండు దేశాలూ మరింతగా సహకారాన్ని విస్తరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. మోదీ పర్యటన రెండోరోజైన బుధవారం ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల వివరాలను భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ మీడియాకు వివరించారు. రెండు దేశాల సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరడం వల్ల ఇటు సహకారం, అటు సయోధ్య కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉగ్రవాదులపైనా, ఉగ్రవాద సంస్థలపైనా, వాటి నెట్‌వర్క్‌లపైనా కూడా ఉక్కుపాదం మోపాల్సిందేనన్న కృతనిశ్చయాన్ని ఇరువురు ప్రధానులూ వ్యక్తం చేశారన్నారు. ఈ సందర్భంగా ఏ దేశం పేరునూ ప్రస్తావించకపోయినా, భారత్ మాటల్లో మాత్రం దాని లక్ష్యం పాకిస్తానేనన్న సంకేతాలు చాలా స్పష్టంగానే కనిపించాయి. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఉగ్రవాదం పెను సవాలేనన్న వాస్తవాన్ని గుర్తించిన మోదీ, నెతన్యాహులు ‘ఉగ్రవాదం ఏ రూపంలోవున్నా దాన్ని తుదముట్టించాల్సిందే’నన్న ప్రతిన చేశారు. ఏరకంగానూ ఉగ్రవాద చర్యలు సమర్థనీయం కాదని సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు. అదేవిధంగా అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమీకృత ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరలో చేపట్టేలా ప్రయత్నాలు సాగించాలని నిర్ణయించుకున్నారు.
భారత్, ఇజ్రాయెల్ చేతులు కలిపితే, వాటి మధ్య సహకారం ఎంత విస్తృతమైతే అంతగానూ ఫలితాలను సాధించే అవకాశం ఉంటుందని నెతన్యాహు అన్నారు. వీటిమధ్య స్నేహం ప్రపంచంలోనే చాలా ప్రస్ఫుటమైన మార్పు తీసుకొస్తుందని తెలిపారు. నరేంద్ర మోదీ పర్యటన మొదలైనప్పటి నుంచీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అనుక్షణం ఆయనతోనే గడపటం భారత్‌తో లోతైన బలమైన సంబంధాలకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు.
చిత్రం.. టెల్ అవీవ్ కనె్వన్షన్ కేంద్రానికి తరలివచ్చిన వేలాది మంది ఎన్నారైలను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రధాని నరేంద్రమోదీ