మంచి మాట

దేహమే దేవాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేద ప్రమాణానుసారం ప్రతి జీవి దేహం ఒక దేవాలయమే. ప్రతి జీవి కూడా పరబ్రహ్మమే.ఈ విషయం తెలుసుకొన్నది మాత్రం మానవుడే అంటే అతిశయం కాదు. ప్రకృతిని చూచి భయపడిన మానవుడు ఆ ప్రకృతినే తనకు అనుకూలం చేసుకొన్నాడు
శీతోష్ణస్థితిగతుల నుంచి తన్ను తాను కాపాడుకోవడానికి గుహలను ఆసరా చేసుకొన్న మానవుడు రాళ్లతోను, నేడు కాంక్రీటుతోను అంతస్థుల మీద అంతస్థులు కట్టి అధునాతన సౌకర్యాలను సమకూర్చుకున్నాడు. అమ్మ బామ్మ నాన్న తాత అంటూ ఎన్నో సంబంధాలను కట్టి కుటుంబాన్ని ఏర్పరుచుకున్నాడు. ప్రేమలు, మమతలు రంగరించి ఆవిష్కరించి మనిషి మరో మనిషిని తన దగ్గరకు చేర్చుకున్నాడు. తన ఉనికిని నిబహిర్గతం చేయడానికి ఎన్నో యాతనలు పడి తన కుటుంబాన్ని తనకు వూతం చేసుకొన్నాడు. కాని శిఖరం ఎక్కిన మనిషి ఆ కుటుంబానే్న నేలవిడిచి తానుఒక్కడే ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ఎగబాకాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడే అనేకానేక చిక్కులు రాసాగాయ. కుటుంబం నుంచి విడవడ్డ మనిషి నేలవిడిచి సాము చేయనారంభించాడు. కుటుంబానికి దూరమైన మనిషి చెడు అలవాట్ల కు లోనైయ్యాడు. బంధాలకు దూరమైన మనిషి తానుఒక్కడే బాగుంటే చాలు అనుకొన్నాడు. ఆ స్వార్థంతోనే మనిషి ప్రకృతిని, తన చుట్టూ ఉన్న వారిని దూరం చేసుకొన్నాడు.
దీనికి కారణం ఏమిటా అని ఆలోచిస్తే మాత్రం - శృతి జ్ఞానహీనః పశుభిస్సమానః అంటే జ్ఞానంలేని ప్రతి వ్యక్తి పశువుతో సమానమని అర్థం. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటని విచారిస్తే చతుర్వేదములనుండి గ్రహించబడిన నాలుగు మహా వాక్యములు అంటే- నాలుగు వేదాలసారం. 1.అహం బ్రహ్మర్షి= నేనే పరబ్రహ్మను, 2.అయమాత్మా బ్రహ్మ = నా ఆత్మయే బ్రహ్మ అంటే దేవుడు. 3.ప్రజ్ఞానం బ్రహ్మ = విశేషణమైన జ్ఞానమేది కలదో అదియే బ్రహ్మ. 4.తత్వమసి=ఏదైతే దేవుడు పరబ్రహ్మము ఉన్నదో అది నీవే అయి ఉన్నావు? పై నాలుగు మహా వాక్యములు నీవే భగవంతుడవు అనే నగ్న సత్యాన్ని ముందుంచినా, సముద్రము తలాపున ఉంచుకొని చేప నీళ్లకు ఏడ్చినట్లుగా, మనం జ్ఞాన స్వరూపులం అయి వుండి కూడా నాకు సుఖం లేదు, శాంతి లేదు అని బాధపడుతున్నట్టు తెలుస్తుంది.
ప్రకృతితో మనిషి మమేకం అవుతూ ప్రకృతి నేర్పే పాఠాలను గుణపాఠాలుగా నేర్చుకుంటూ ముందుకు అడుగు వేస్తూ తానే సుఖంగా ఉండాలని కాక తనతోపాటు నలుగురు సుఖంగా ఉండాలని సర్వేజనాసుఖినోభవన్తు అనే వేద ప్రమాణాన్ని నిత్య జీవన యానంగా చేసుకుంటే తన చుట్టూ తాను తిరుగుతున్న ట్లుగానే మళ్లీ జీవన సౌంథ ర్యం ఆవిష్కరించబడుతుంది. నలువైపుల నుంచి సద్భావనలు నాకు రావాలి అనుకొనమనే వేదాన్ని ప్రమాణంగా తీసుకొని సత్యధర్మా చరణలతో జీవనం సాగిస్తే కేవలం మనిషి జీవితమే కాక అతని చుట్టూ ఉన్న ప్రకృతి, అందులో ఇతర ప్రాణులంతా కూడా సంతోషాన్ని అనుభవించవచ్చు.
ప్రాచీన కాలంలో మహర్షులు మంచిని ఆచరించి వారి స్వార్థాన్ని విడిచి వారి జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసి లోక కళ్యాణ నిమిత్తం వారి జీవితాల్ని గడపడం మనం విని ఉన్నాం. అక్కడక్కడా ఇపుడూ చూస్తునే ఉన్నాం. అన్నదాతలు, నీటి దాతలు, ఏదైనా కష్టం వచ్చినపుడు మేమున్నాం అంటూ ముందుకు వచ్చి ఎదుటి వారి కష్టాన్ని దూరంచేయగల సత్తా ఉన్నవారు ఉన్నారు. అటువంటి వారు నూటికో కోటికో ఏఒక్కరో కాక ప్రతి వీధిలోను, ప్రతి ఇంట్లను పుట్టాలి.
ఎదుటివారు మనకేమి చేస్తున్నారని కాక ఎదుటివారికి మేమేం చేస్తున్నాం అని ఆలోచించే నైపుణ్యాన్ని ఇపుడు మనిషి అలవర్చుకోవాలి. రోదసీ లో ప్రయాణం చేసినా ఉపగ్రహాలను రోదసిలోకి పంపినా, మనిషి మనిషిగానే జీవించాలి. మృగాలకన్నా హీనంగా బతకకూడదు. ఎందుకంటే ఆఖరికి నరమాంసం తినే సింహమైనా తన ఆకలి తీరే వరకు తిని తర్వాతది వదిలివేస్తుంది. మనిషి మాత్రమే తను ఎన్నాళ్లు బతుకుతాడన్న విషయం తెలీక పోయనా సరే కాని చనిపోయే ఆఖరి నిమిషం వరకూ సంపాదన మీద వ్యామోహం వదలడు. ఇటువంటి ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. సొంతలాభం కొంతమానుకు పొరుగు వాడికి తోడు పడవోయ్ అన్న గురజాడ పలుకులు కూడా వేదప్రమాణాన్ని అనుసరించినవే. ఆ పలుకులను నిజం చేస్తూ మనిషి మనుగడ సాగించాలి.

- చివుకుల రామమోహన్