మంచి మాట

శరీరం - మనస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాలంటే శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండూ అవసరమే. శరీరానికి మనస్సుకు ఎంతో సంబంధం ఉంటుంది. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా కలిగి వున్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అనిపించుకుంటాడు. ‘దేహమే దేవాలయం’ అన్నారు.
దేహాభిమానం కలిగివుండడంతోపాటు శరీరాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం. రెండు పూటలా స్నానం చేయడం, ఉతికిన శుభ్రమైన బట్టలు ధరించడం వలన శుచిగా ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే శుచి, శుభ్రతలను పాటించడం ప్రధానమైన విషయం. ఇంద్రియ నిగ్రహం కలిగిఉండి సాత్వికమైన ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. తగినంత వ్యాయామం చేయడం వలన శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది.
పాంచభౌతికమైన ఈ శరీరం భగవంతుడు మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం. వాత, పిత్త, కఫ దోషాల వలన అనారోగ్యం రాకుండా దీనిని కాపాడుకోవాలి.చిన్న చిన్న అనారోగ్యాలు ఏర్పడినా వాటిని తనంత తానే నయం చేసుకోగల శక్తి శరీర వ్యవస్థకు ఉంది. దీనినే రోగ నిరోధక శక్తి అంటారు. ఈ శక్తిని మనం కాపాడుకోవాలంటే శరీర శుభ్రత, ఆహార నియమాలు, వ్యాయామం, తగినంత నిద్ర మొదలైనవి ప్రధానమైనవి.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనస్సును కూడా దానికి తగినట్టుగా ఆరోగ్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. మన జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు మన మనస్సు సాక్షిగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కుంగిపోవడం, నిరాశా నిస్పృహలకు గురికావడం, అధికంగా కోపాన్ని ప్రదర్శించడం ఇవన్నీ మనసు మీద తద్వారా శారీరక ఆరోగ్యంమీదా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి.
కనుక మనస్సును ప్రశాంతంగా వుంచుకోవడానికి ప్రయత్నించాలి.అందుకోసం ప్రాణాయమం, ధ్యానం, నడక, సద్గ్రంధ పఠనం, పురాణ శ్రవణం మొదలైనవి ఎంతో ఉపయోగపడతాయి.
ఆధ్యాత్మిక విషయాలవైపు మనస్సును మళ్లించడం వలన భగవంతునికి చేరువ కాగలుగుతారు. అపుడు మనస్సుకు ప్రశాంతత ఏర్పడి చేయాల్సిన పనుల పట్ల ఏకాగ్రత కుదురుతుంది. ఎంతటి వారికైనా ఏ పరిస్థితులోనైనా ఆధ్యాత్మిక చింతన మనసుకు సాంత్వనను చేకూరుస్తుంది.
ఈరోజుల్లో పిల్లలు మొదలుకుని పెద్దల వరకు ఎంతో మానసిక వత్తిడిని ఎదుర్కొంటు అనారోగ్యాలకు గురవుతున్నారు. దైవ ప్రార్ధనకు వయసుతో నిమిత్తంలేదు. ధ్యానం, దైవచింతన మనలోని వత్తిడిని తగ్గించి సరైన దారిలో మనం ప్రయాణించడానికి సహకరిస్తాయి.
మానసిక వత్తిడిని, ఉద్రిక్తతను తగ్గించడానికి శారీరక ఆరోగ్యానికి యోగ, ఆసనాలు వంటివి ఔషధాలుగా పనిచేస్తాయని నేడు ఎందరో విశ్వశిస్తున్నారు. మన నిత్య కృత్యంలో వీటిని ఒక భాగంగా చేసుకుంటే అద్భుత ఫలితాలను సాధించవచ్చని ఎందరో నిరూపించారు.
శరీరానికి తగినంత విశ్రాంతి కూడా అవసరమే. ఆధునిక జీవనంలో అనేక కారణాలవలన మనిషి విశ్రాంతి తీసుకునే సమయం తగ్గిపోతున్నది. దానికి తోడు వాతావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఆహార పదార్ధాల కల్తీ ఇవన్నీకూడా అనారోగ్యాలకు కారణం అవుతున్నాయి.
ఎవరికి వారే ఇటువంటి విషయాల్లో నిజాయితీగా వ్యవహరిస్తు సాధ్యమైనంత వరకు కల్తీకి, కాలుష్యానికి కారకులు కాకుండా వుంటే ప్రకృతిని పరిరక్షించడమే కాక, మనతోపాటు భావి తరాల వారికి కూడ స్వచ్ఛమైన ప్రకృతి వనరులను అందించినవారమవుతాము.
శరీరానికి తగిన పోషణ, ఆహార నియమాలు, వ్యాయామం మొదలైనవాటివలన శరీరం ఆరోగ్యంగా వుంటుంది. నిరంతరం భగవన్నామాన్ని స్మరించడం వలన మనసు నిర్మలం పవిత్రంగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరికి శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండూ ముఖ్యమైనవే. కనుకనే మనసు వికాసం చెందేట్టుగా మహానుభావుల జీవిత చరిత్రలు చదవాలి. పురాణ వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. వారి జీవితాల్లో వచ్చిన మార్పులకు కారణమేమిటో ఆలోచించాలి. మానవ జన్మకు సార్థకత ఒనగూరేలా పనులుచేయాలి. అపుడే దేహం దేవాలయంగా భాసిస్తుంది.

- అబ్బరాజు జయలక్ష్మి