తూర్పుగోదావరి

ఎవరికి వారే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం-బిజెపి మధ్య పొత్తు వ్యవహారం ఓ కొలిక్కిరాకపోవడంతో ఇరు పార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓవైపు నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారంతో పూర్తికాగా, మరోవైపు ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. పొత్తుపై స్పష్టత లేకపోవడంతో బిజెపి నేతలు తమకు నచ్చిన డివిజన్ల నుండి పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. నగర పాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లకు గాను రెండు డివిజన్లకు ఎన్నికలను కోర్టు వివాదాల కారణంగా మినహాయించారు. మొత్తం 48 డివిజన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే బిజెపి అభ్యర్ధులు మొత్తం 26డివిజన్లలో పోటీకి నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు తెలుగుదేశం నుండి ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో బిజెపి నుండి దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, బిజెపి శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు తదితరులు గురువారం కూడా చర్చలు జరిపారు. తొలి నుండి బిజెపి నేతలు 24 డివిజన్లను కేటాయించాలని తెలుగుదేశం నేతలను డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే రెండు లేక మూడు డివిజన్లకు మించి ఇచ్చేది లేదని టిడిపి నేతలు స్పష్టం చేయడంతో బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, తమకు ఏ విధమైన పొత్తు అవసరం లేదని, తమ పార్టీ బ్యానర్‌పైనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో తాజాగా జరిగిన చర్చల్లో 8సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం నేతలు సానుకూలంగా స్పందించారు. కాగా దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విలేఖరులతో మాట్లాడుతూ టిడిపి-బిజెపి మధ్య అంగీకారం కుదిరిందని, తమకు ఇచ్చే సీట్లు డబుల్ డిజిట్‌లోనే ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారంతో ముగిసింది. శుక్రవారం నుండి నామినేషన్లను పరిశీలిస్తారు. ఈనెల 16వ తేదీన ఉప సంహరణకు అవకాశం కల్పించారు. ఈలోగా ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరిన పక్షంలో పొత్తు ఉన్న డివిజన్లు మినహా మిగిలిన అభ్యర్ధులు బరి నుండి తప్పుకునే అవకాశం ఉంటుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు.

అభ్యర్థుల తలనొప్పిపై వైసిపి చర్చలు
కాకినాడ రూరల్: కార్పొరేషన్ ఎన్నికల అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఇబ్బంది లేకుండా చూసేందుకు వైసిపి నాయకులు రమణయ్యపేటలోని జిల్లా పార్టీ అధ్యక్షుడు కన్నబాబు నివాస గృహంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ సిటీ కో-ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. కాకినాడ కార్పొరేషన్‌లోని కొన్ని డివిజన్‌లలో వైసిపి నుండి టికెట్లు ఆశిస్తూ ఇద్దరు,ముగ్గురు అభ్యర్ధులు నామినేషన్‌లు దాఖలు చేసి పార్టీకి తలనొప్పిగా తయారవ్వడంతో వారిని సముదాయించి ఓ కొలిక్కి తెచ్చే పనిలో భాగంగా చర్చలు సాగాయి. ఇప్పటికే అభ్యర్ధుల వ్యక్తిగత డేటా, గెలుపు అంశాలపై సర్వేలు కూడా నిర్వహించారు. దాని ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక జరగనుంది. అయితే కొన్ని సీట్ల విషయంలో ప్రధాన నాయకులు పట్టు విడుపులపై కూడా చర్చలు సాగుతున్నాయి.

రాష్టప్రతిని కలిసిన ఎంపి పండుల
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం: నూతన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను అమలాపురం ఎంపి పండుల రవీంద్రబాబు గురువారం ఢిల్లీలో కలిసి రాష్ట్ర ప్రజల తరుపున అభినందనలు తెలియజేశారు. గురువారం ఆయన రాష్టప్రతి భవన్‌లో సుమారు 20 నిమిషాలపాటు కోవింద్‌తో సమావేశమై రాష్ట్ర సమస్యలను వివరించినట్టు పోన్‌లో స్థానిక విలేఖరులకు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వేలైను పనులు, రహదారులు నిర్మాణాలకు సహకరించాలని, ఒఎన్‌జిసి కార్యకలాపాలవల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను రాష్టప్రతికి వివరించినట్టు పండుల తెలిపారు. అలాగే దేశంలోనే అత్యధిక ఎస్సీ జనాభా కలిగిన నియోజకవర్గం అమలాపురం అని రాష్టప్రతి దృష్టికి తీసుకువెళ్లినట్టు ఎంపి వివరించారు.

పాదయాత్ర ఆగదు
కాపు ఉద్యమ నేత ముద్రగడ స్పష్టీకరణ:నేటి నుంచి చలో కిర్లంపూడి:జెఎసి పిలుపు
ప్రత్తిపాడు/జగ్గంపేట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అణివేత చర్యలు చేపట్టినా అమరావతి వరకు తాను పాదయాత్ర చేసి తీరతానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టంచేశారు. మరోవైపు ముద్రగడ పాదయాత్రను పోలీసులు నిలువరిస్తున్న కారణంగా రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి చలో కిర్లంపూడి కార్యక్రమం నిర్వహించాలని కాపు జెఎసి నిర్ణయంచింది. కిర్లంపూడిలోని ముద్రగడ నివాస ఆవరణలో గురువారం జరిగిన రాష్ట్ర కాపు జెఎసి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 13 జిల్లాలకు చెందిన జెఎసి నాయకులు, కాపు సంఘాలు, మహిళా ప్రతినిధులు, పలు జిల్లాల కాపు సంఘాల అధ్యక్షులు సమావేశానికి హాజరయ్యారు. కాపుల రిజర్వేషన్లు ఉద్యమం ఆఖరి ఘట్టంలో ఉందని, ఇప్పుడే కనీసం మూడు నెలలు విశ్రాంతి లేకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా చంద్రబాబు పాలనలో కాపుజాతిని అణిచివేస్తున్నారన్నారు. కాపులు పాదయాత్ర తలపెడితే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్, 144, 30 సెక్షన్ల కింద నిషేధాజ్ఞలున్నాయని పోలీసు ఉన్నతాధికార్లతో చెప్పిస్తూ ఉద్యమ నాయకులను గృహల్లో నిర్బంధించడం, బైండోవర్ కేసులతో వేధించడం దారుమణమన్నారు. తనను గెలిపిస్తే కాపులను బీసీల్లో చేరుస్తానని చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీనే అమలుచేయమని తాము కోరుతున్నామన్నారు. అన్ని జిల్లా నాయకుల సూచన మేరకు అమరావతి పాదయాత్ర తలపెట్టామన్నారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసు అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా యాత్రను అడ్డగిస్తున్నారన్నారు. పోలీసులు వైదొలగిన వెంటనే పాదయాత్ర చేస్తానన్నారు. గ్రామస్థాయిలో రాష్టవ్య్రాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని, రోడ్లపైకి వచ్చి తమకు నచ్చిన రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాపులకు ఆయన పిలుపునిచ్చారు. కాపుల ఉద్యమసెగ చంద్రబాబుకు గట్టిగా తగిలేలా చేయాలన్నారు. ఇప్పుడు సాధించుకోలేకపోతే ఎన్ని జన్మలెత్తినా కాపులకు రిజర్వేషన్లు రావన్నారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసం ప్రతి కాపు సోదరుడు, సోదరి రోడ్డెక్కాలన్నారు. 90 రోజులు కష్టపడితే నూరేళ్లపాటు పిల్లలకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని ఈసందర్భగా ముద్రగడ సభకు హాజరైన నాయకులకు పిలుపునిచ్చారు. తనను జెఎసి నాయకులను సంఘవిద్రోహులు, తీవ్రవాదులుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి, అరెస్టుచేసుకోవచ్చని, అరెస్టవ్వడానికి తాము సిద్ధమేనన్నారు. తాను ఇంటి గేటుదాటి పాదయాత్ర చేసే ఉద్దేశం లేకే ప్రతీరోజూ పోలీసులను పలకరించి వెళుతున్నానని ముఖ్యమంత్రి తన అనుచర మంత్రులతో ప్రకటనలు చేయిస్తున్నారని, పోలీసులను కాపలా తీసేస్తే, తాను అమరావతి వరకు పాదయాత్ర చేసి చూపిస్తానన్నారు. అలా తాను నడవకపోతే ఉద్యమాన్ని వదిలేస్తానన్నారు. తాను పాదయాత్ర కొనసాగిస్తే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అని సవాల్‌చేశారు.
ప్రకాశం, గుంటూరు, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల నుండి వచ్చిన పలువురు జెఎసి నేతలు మాట్లాడుతూ ముద్రగడ ఉద్యమం ప్రారంభించిన తర్వాతే మంజునాథ్ కమిషన్, కాపు కార్పొరేషన్ ఏర్పాటయ్యాయన్నారు. అంతవరకు ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీని గాలికి వదిలేశారన్నారు. నంద్యాలలో జరిగే ఉప ఎన్నికలో కూడా బలిజలకు కాపు ఉద్యమంవల్ల గుర్తింపు లభించిందన్నారు. అక్కడ 46వేల మంది బలిజలున్నారని ప్రభుత్వమే లెక్కలు చెబుతోందన్నారు. కాపులకు రిజర్వేషన్ ముద్రగడ వల్లే సాధ్యమని విశాఖ జిల్లాకు చెందిన తోట రాజీవ్ అన్నారు. ముద్రగడ ఏ పిలుపిచ్చినా తామంతా ఆయన వెంట నడుస్తామన్నారు. శుక్రవారం నుండి 13 జిల్లాల వ్యాప్తంగా కాపు జెఎసి సారథ్యంలో చలో కిర్లంపూడి పేరుతో ముద్రగడకు సంఘీభావంగా తరలివస్తామన్నారు. ఏదేమైనా పోలీసు చర్యలకు తామెవ్వరమూ భయపడటంలేదని, గృహ నిర్బంధాలు చేస్తున్నట్టు ఎవరైనా పోలీసు అధికారులు బెదిరిస్తే, లిఖితపూర్వక ఆదేశాలు చూపాలని అడగాలని సమావేశంలో మాట్లాడిన జెఎసి నేత ఆకుల రామకృష్ణ సూచించారు. కోనసీమలో మహిళలంతా గత 15 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. ముద్రగడకు తామంతా అండగా ఉంటామని ఈసందర్భంగా కాపు జెఎసి మహిళా నేతలు ప్రకటించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరిగింది. ఇకనుండి నెలకు మూడుసార్లు సమావేశాలు జరపాలని జెఎసి నేతలకు ముద్రగడ సూచించారు. ఈ నెలాఖరుకు జెఎసి సమావేశం కిర్లంరపూడిలో జరుగుతుందని ఈసందర్భంగా ముద్రగడ ప్రకటించారు.

అనుమానాల నివృత్తికే పోలవరం సందర్శన
ఉండవల్లి వెళ్తున్నారని తెలుసుకుని వచ్చా:అంతకుమించిన ఆంతర్యమేమీ లేదు:మాజీ మంత్రి దగ్గుబాటి
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం: పోలవరం పనులు అమరావతి మాదిరి గ్రాఫిక్సా లేక నిజమేనా అనే అనుమానాలను నివృత్తి చేసుకునేందుకే పోలవరం పనుల సందర్శనకు వచ్చానని, మాజీ ఎంపి ఉండవల్లి పనుల సందర్శనకు వెళ్తారనే విషయం మీడియాలో తెలుసుకుని ఆయనకు ఫోన్ చేస్తే రెండు, మూడు సార్లు వాయిదా పడి ఇప్పటికి వీలు కుదిరిందని, అంతకుమించి తన పర్యటనలో ఆంతర్యమేదీ లేదని మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముందుగా పోలవరం చేరుకుని అక్కడ హెడ్‌వర్క్సును సందర్శించారు. అక్కడ వారికి పోలవరం స్పిల్ వే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టివిఎంఎఆర్ కుమార్ పోలవరం నమూనాలో స్పిల్ వే, కాఫర్ డ్యామ్, రాక్‌ఫిల్ డ్యామ్, పవర్ ప్రాజెక్టు, కుడి, ఎడమ కాల్వలు, అండర్ టనె్నల్స్ నిర్మాణాలు, ఐకాన్ బ్రిడ్జి నిర్మాణం తదితరాలు ఎక్కడెక్కడ నిర్మిస్తున్నదీ వివరించారు. అనంతరం ప్రాజెక్టు వ్యూ వద్ద పనుల పురోగతిని తిలకించారు. అక్కడ నుంచి మళ్లీ పోలవరం చేరుకుని లాంచీపై ఎడమగట్టు వైపు పురుషోత్తపట్నం ప్రాజెక్టు వద్దకు చేరుకుని కొద్దిసేపు ఆ పనులను తిలకించారు. అనంతరం దేవీపట్నం మండలం గండికోట గ్రామం వద్దకు చేరుకుని పోలవరం అండర్ ట్విన్ టనె్నల్స్ పనులను పరిశీలించారు.
అంతకు ముందు రాజమహేంద్రవరం నుంచి పోలవరం వెళ్లేటప్పుడు బస్సులో మీడియాతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన ఎప్పటి నుంచి ఉన్నదనే విషయాలపై ఉపోద్ఘాతాన్ని వివరించారు. 1941 నుంచి ఉన్న పోలవరం ప్రతిపాదన కాస్తా ఎట్టకేలకు గత ప్రభుత్వ హయాంలో కార్యరూపంలోకి వచ్చిందన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే వడ్డి వీరభద్రరావు పోలవరం కోసం ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర కూడా చేశారని గుర్తుచేశారు. వైఎస్ హయాంలోనే కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులన్నీ వచ్చాయన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టులను పాడికుండలా భావిస్తున్నట్టుందని, ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధలో ఆంతర్యామేమిటో అర్ధం చేసుకోవాలని మీడియాను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తూ ఆరోపించారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా 45 టిఎంసిల నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆర్‌అండ్‌ఆర్ కోసం కేవలం రూ.100 కోట్లు ప్రస్తుత ప్రభుత్వం తక్షణం ఇవ్వలేకపోయిందని, దరిమిలా దఫదఫాలుగా చెల్లించిందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్సు కేటాయింపులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న ట్రాన్స్‌స్ట్రాయ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంలో ఉన్నత స్థాయిలో చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. డబ్బుల్లేకుండా పోలవరం ఎంతవరకు ముందుకు కదులుతుందోననేది సందేహమేనన్నారు. ఏదేమైనప్పటికీ కేంద్రంతో సత్సంబంధాలు కలిగిన దగ్గుబాటి పోలవరం సందర్శన పర్యటన ఆసక్తి కలిగించింది.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
-జిల్లా ఎస్పీ విశాల్ గున్ని -డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి 18 ఫిర్యాదులు
కాకినాడ సిటీ: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తున్నామని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని గురువారం ఉదయం 11గంటలకు ఎస్పీ తన కార్యాలయంలో నూతనంగా ప్రారంభించారు. సుమారు గంటసేపు నిర్వహించిన ఈకార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. జిల్లా నలుమూలలు నుండి 18మంది డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి ఫోన్‌చేసి తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. ఫోన్ ద్వారా అందిన ఫిర్యాదులపై ఎస్పీ విశాల్ గున్ని స్పందిస్తు తనకు వచ్చిన ఫిర్యాదులను ఆయా పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, వాటిని వెంటనే పరిస్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. సుదూర ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను తనకు తెలియజేసేందుకు ఇబ్బందులు పడి రావలసిన అవసరం లేదని, డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వృద్ధులు తమ సమస్యలను ప్రతీ గురువారం ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం 12గంటల మధ్య 0884-232000నంబర్‌కు ఫోన్‌చేసి తెలియజేయవచ్చని ఎస్పీ విశాల్ గున్ని తెలియజేశారు.

ఈ ఏడాది చివరికి గృహప్రవేశాలు జరగాలి
ఎన్టీఆర్ గృహ నిర్మాణాలపై అధికార్లకు కలెక్టర్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను సత్వరమే పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. గురువారం అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల సమావేశ మందిరంలో డివిజన్ స్థాయిలో అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపిడిఒలు, గృహ నిర్మాణ, ఉపాధి హామీ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, సిబ్బందితో ఎన్టీఆర్ గృహ నిర్మాణాల ప్రగతిపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం పథకంలో జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇవ్వగా, ఇందులో అమలాపురం డివిజన్‌కు అత్యధికంగా ఇళ్లు మంజూరయ్యాయన్నారు. మంజూరైన గృహాలన్నింటి పనులు ప్రారంభించేలా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది సత్యర చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాకు 14,189 గృహాలు మంజూరు కాగా, వాటిలో అమలాపురం డివిజన్‌కు అత్యధికంగా 10,314 గృహాలను మంజూర చేసినట్టు కలెక్టర్ వివరించారు. వాటిలో ఇంతవరకూ 2,869 గృహాలకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఇంకా 7,445 గృహాలకు శంకుస్థాపనలు చేయాల్సి ఉందని, వీటన్నింటికీ ఆగస్టు చివరికల్లా శంకుస్థాపనలు జరిగేలా లబ్ధిదారులను చైతన్యం చేయాలని సూచించారు. డివిజన్‌లో ఇంతవరకూ 27.82 శాతం మాత్రమే గృహాలు గ్రౌండ్ కాగా ఆగస్టు నెలాఖరుకు 60 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా హౌసింగ్ గృహాలకు గ్రౌండింగ్ మేళా నిర్వహించి 1091 గృహాలకు శంకుస్థాపనలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, 913 గృహాలకు శంకుస్థాపనలు చేశామని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో జి గణేష్‌కుమార్, గృహనిర్మాణ శాఖ పిడి జివి ప్రసాద్, మండలాల స్పెషల్ ఆఫీసర్లు ఎ శ్రీరామచంద్రమూర్తి, ఎన్ సీతామహాలక్ష్మి, డేవిడ్‌రాజ్, డిఎస్ సునీత, సుగుణకుమారి, హౌసింగ్ ఇఇ సుధాకర్ పట్నాయక్, ఎంపిడిఒలు, తహసీల్దార్లు, గృహనిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.

రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయాన్ని స్ఫూర్తిగా తీసుకోండి...
-నూతన కార్యాలయాల నిర్మాణంపై సిసిఎల్‌ఎ పునీత ఆదేశం
రామచంద్రపురం: రాష్ట్రంలో నూతనంగా మంజూరైన ఆర్డీవో కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణ ప్రక్రియ అంశంలో రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయ నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సిసిఎల్‌ఎ అనిల్ చంద్ర పునీత ఆదేశించారు. రాజధాని నుండి రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించి జిల్లా, డివిజనల్ రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ మేరకు ఆదేశించారు. రెవెన్యూ కార్యాలయాలకు మంజూరుచేసిన నిధులతో నిర్మాణాలను ఆధునిక వసతులతో పాటు శాస్త్ర సాంకేతిక నిపుణత్వం కలిగేలా భవనాలు తదితర వౌలిక సదుపాయాలు కల్పించుకోవాలని సిసిఎల్‌ఎ కమిషనర్ స్పష్టంచేశారు. జూలై 12న తాను రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించానని, అక్కడ నిర్మాణ విధానాలను పరిశీలించానని, ఆహ్లాదకర వాతావరణంలో పచ్చటి పరిసరాలను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వం అందించిన నిధులతో ఆర్డీవో అధికారిక నివాసం నిర్మితమయ్యిందని పేర్కొంటూ రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయం రాష్ట్రంలోనే నమూనాగా నిలిచిందన్నారు. జిల్లాలో పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంతో పాటు పలు తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణాలకు కూడా మంజూరు ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొంటూ నిధులను సద్వినియోగం చేయాలని ఆదేశించారు.

ముగిసిన నామినేషన్ల స్వీకరణ

మొత్తం 590 నామినేషన్లు దాఖలు:నేడు పరిశీలన:16న ఉపసంహరణ:ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం సాయంత్రంతో ముగిసింది. చివరి ఒక్కరోజు (గురువారం) 451 నామినేషన్లు దాఖలు కాగా మొత్తంమీద 590 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం నుండి 198, వైసిపి నుండి 206 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బిజెపి నుండి 44 నామినేషన్లు, కాంగ్రెస్ నుండి 20 నామినేషన్లు దాఖలు కాగా 144 మంది స్వతంత్య్ర అభ్యర్ధులుగా నామినేషన్లు వేశారు. బిఎస్‌పి నుండి 3, సిపిఐ 3, సిపిఎం 2 వంతున నామినేషన్లు దాఖలయ్యాయి. దాదాపు అన్ని డివిజన్లకు అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు చెందిన ఆశావహులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కొక్క డివిజన్ నుండి తెలుగుదేశానికి చెందిన ఇద్దరు లేక ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే వైసిపి నుండి ఎవరికి వారుగా తామే పార్టీ బి-్ఫరం పొందే అభ్యర్ధులమంటూ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నామినేషన్ల ఉప సంహరణ తేదీ నాటికి టిడిపి, వైసిపిలు తమ అభ్యర్ధులకు బి-్ఫరంలు ఇవ్వనున్నాయి. బి-్ఫరంలు తమకంటే తమకే వస్తాయన్న ఆశతో సదరు ఆశావహులున్నారు. ఒకవేళ బి-్ఫరం ఇవ్వకుండా హ్యాండిచ్చిన పక్షంలో రెబల్స్‌గా బరిలో ఉంటామని పలువురు స్పష్టం చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా టిక్కెట్ల విషయంలో నేతల నుండి హామీలు పొంది, చివరి నిముషంలో ప్రలోభాలకు లొంగి తమకు అన్యాయం చేస్తే సత్తా చూపుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన సదరు అభ్యర్ధులు చివరి నిముషం వరకు చూసి, బిఫారం రాని పక్షంలో స్వతంత్రులుగా బరిలో ఉంటామని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పటి నుండే ఆయా పార్టీల ముఖ్యనేతలు రెబల్స్‌ను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాగిరెడ్డి చంద్రకళ దీప్తి 30 డివిజన్‌కు నామినేషన్ దాఖలు చేశారు.
మహిళలకు తమ పార్టీ అధినేత జగన్ అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఆర్కిటెక్ట్ బాలార్క తెర్లి 43వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీకి చెందిన కార్యకర్తలతో పెద్ద ఎత్తున తరలివెళ్ళి నామినేషన్ పత్రాలను అందజేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఇతర నేతల సలహా సూచనల మేరకు పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ నుండి వైకాపా తీర్థం పుచ్చుకున్న మాజీ కార్పొరేటర్ చంద్రవౌళి 40వ డివిజన్‌కు వైసిపి అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. 7వ డివిజన్‌కు సత్తి ఇందిరారాణి, 38వ డివిజన్‌కు యార్లగడ్డ పద్మజ నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం నుండి 7వ డివిజన్‌కు అంబటి క్రాంతి, 8వ డివిజన్‌కు అడ్డూరి లక్ష్మీశ్రీనివాస్, 11వ డివిజన్‌కు పెద్దపల్లి దానమ్మ, 28వ డివిజన్‌కు వార్డుకు సుంకర పావని నామినేషన్లు దాఖలు చేశారు. 40వ డివిజన్‌కు తెలుగుదేశం నుండి జ్యోతుల ఇందిర నామినేషన్ వేయగా ఇదే డివిజన్‌కు సుంకర శివప్రసన్న దేశం అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. 35వ డివిజన్ నుండి సత్యంశెట్టి ఆదిలక్ష్మి, 35వ డివిజన్ నుండి బి రామకృష్ణ, 7వ డివిజన్‌కు అంబటి క్రాంతి, 14వ డివిజన్ నుండి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సోదరుడి తనయుడు ఉమాశంకర్ టిడిపి తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. బిజెపి నుండి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య 9వ డివిజన్‌కు, చెక్కా రమేష్ 29వ డివిజన్‌కు, గోడి వెంకట్ 41వ డివిజన్‌కు నామినేషన్లు దాఖలు చేశారు.

మట్టి వినాయకుని ప్రతిష్ఠించేవారికి ఉచితంగా ఐదు కిలోల లడ్డూ ప్రసాదం
-సురుచి అధినేత మల్లిబాబు
మండపేట: పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 2 అడుగుల మట్టి వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారికి సురుచి సంస్థల 5 కేజీల లడ్డూను ఉచితంగా పంపిణీ చేస్తుందని సురుచి అధినేత పోలిశెట్టి మల్లిబాబు అన్నారు. మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలోని సురుచి ఫుడ్స్ సంస్థలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రసమయి అవార్డు గ్రహీత మల్లిబాబు మాట్లాడుతూ 2010 నుండి వినాయకునికి ప్రతి సంవత్సరం లడ్డూ సమర్పిస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్‌లో వలె హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ దేవస్థానంలో ఏర్పాటు చేసిన వినాయకునికి 500 కేజీల లడ్డూను ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ భవన్ సమీపంలో పూరి జగన్నాథస్వామి దేవస్థానం ఆలయానికి వంద కేజీల లడ్డూను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అమెరికాలోని వర్జీనియా దేశంలో తెలుగువారి వినాయకుని పందిరిలో తయారు చేస్తున్న 500 కేజీల లడ్డూకు సురుచి సాంకేతిక సమాచారం అందిస్తున్నట్టు మల్లిబాబు తెలిపారు. అంతేగాకుండా జిల్లాలో బిక్కవోలు గణేశునికి 25 కేజీలు, అయినవిల్లి సిద్ధి వినాయకునికి 50 కేజీలు, రామచంద్రపురంలో వినాయకునికి 50 కేజీలు లడ్డూలు ఉచితంగా సరఫరా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ లడ్డూల తయారీకి సుమారు రూ.12 లక్షలు వ్యయమవుతుందన్నారు. సురుచి సంస్థ ఆధ్వర్యంలో వినాయక చవితి నుండి నవరాత్రుల తొమ్మిది రోజులూ తొమ్మిది చోట్ల పెద్ద మట్టి విగ్రహాల వద్ద జరిగే కార్యక్రమాలకు 25 కేజీల లడ్డూ కూడా ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ నెల 22వ తేదీ నుండి లడ్డూ తయారీ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 24న హైదరాబాద్ 500 కేజీల లడ్డూ తరలిస్తామన్నారు. 11 మంది సిబ్బందితోపాటు తాను గణేష్ మాల ధరించి లడ్డూ తయారు చేస్తామని మల్లిబాబు చెప్పారు. తన తల్లిదండ్రులు పోలిశెట్టి సత్తిరాజు, భూషణం ఆశయ సాధనకు ఈ లడ్డూను ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఎన్నికల సమాచారానికి గ్రహణం!
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మీడియాకు సమాచారాన్నిచ్చే నాథుడే కరవయ్యాడు. మీడియా ఇన్‌ఫర్మేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయకుండా, కనీసం ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్నివ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించారు. కార్పొరేషన్ అధికారుల అలసత్వంపై కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా ఉన్న కలెక్టర్ కార్తికేయ మిశ్రా సైతం దృష్టి సారించకపోవడం విమర్శలకు దారితీసింది. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి ఇంత వరకు కార్పొరేషన్ అధికారుల నుండి మీడియాకు సమాచారం లేకపోవడం గమనార్హం!

15న జగ్గంపేటలో ముఖ్యమంత్రి సభ
జగ్గంపేట: ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగ్గంపేట రానున్నారు. తొలుత చంద్రబాబు పురుషోత్తపట్నం స్టేజ్-2 పంపింగ్ స్కిమ్‌ను ప్రారంభిస్తారు. తరువాత పురుషోత్తపట్నం నుంచి ముఖ్యమంత్రి జగ్గంపేట-గోకవరం రోడ్డులో పోలవరం కాలువ సమీపంలో మోడల్ డిగ్రీ కళాశాల వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. దీనిలో భాగంగా గురువారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం ఆర్డీవో విశే్వశ్వరరావు, తహసీల్దారు ఎల్ శివమ్మ, ఆర్‌అండ్‌బి అధికారులు స్ధలాన్ని పరీశీలించారు. గతంలో ముఖ్యమంత్రి కొరకు గోకవరం రోడ్డులో వేసిన హెలిపాడ్‌ను పరిశీలించారు. అదేవిధంగా పోలవరం కాల్వ వద్ద బహిరంగ సభా వేదికను, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను అధికారులు, ప్రజా ప్రతినిధులు పరిశీలించారు. కార్యక్రమంలో జగ్గంపేట ఎఎంసి ఛైర్మన్ ఎస్‌విఎస్ అప్పలరాజు, వైఎస్-ఎంపిపి మారిశెట్టి భద్రం, తహసీల్దారు ఎల్ శివమ్మ, సిఐ పి కాశీవిశ్వనాథం, ఎస్ అలీఖాన్, అత్తులూరి సాయిబాబా, మంతెన నీలాద్రిరాజు, కరుటూరి శ్రీను, పీలా మహేష్, మండపాక అప్పనదొర పాల్గొన్నారు.