శ్రీకాకుళం

ఆరోగ్యకరమైన సమాజాన్ని నెలకొల్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఆరోగ్య కర సమాజ స్థాపనకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బహిరంగ మల విసర్జనపై అవగాహన కల్పనలో భాగంగా ఆదివారం ఉదయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయ జంక్షన్ నుండి ఎన్టీ ఆర్ మున్సిపల్ పాఠశాల వరకు 3కె రన్ నిర్వహించారు. ఈ రన్‌ను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. రన్‌లో స్టార్ వాకర్స్ సభ్యులు భీమేశ్వర బాక్సింగ్‌క్లబ్, నేతాజీ డిఫెన్స్ అకాడమీ, గిరిజన సంక్షేమ బాలుర వసతిగృహం విద్యార్థులు హ్యాండ్‌బాల్, బాస్కెట్ బాల్ తదితర క్రీడలకు సంబంధించిన క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 14 సంవత్సరాలలోపు వయస్సు గల విద్యార్థులు ఒక బృందంగా, 14 సంవత్సరాలు పైబడిన విద్యార్థులకు ఒక బృందంగా రన్‌ను నిర్వహించారు. 14 సంవత్సరాలలోపు విభాగంలో గిరిజన బాలుర వసతిగృహం విద్యార్థులు అరుణ్‌కుమార్ ప్రథమ స్థానం పొందగా ఎస్.రవి, ఐ.అఖిల్ ద్వితీయ, తృతీయ స్థానాలు పొందారు. 14 సంవత్సరాల పైవిభాగంలో ఎం.వెంకటరమణ ప్రధమస్థానం కైవశం చేసుకోగా నేతాజీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు జి.వెంకటరమణ, సతీష్ ద్వితీయ, తృతీయ స్థానాలు పొందారు. బాలికల విభాగంలో బాస్కెల్‌బాల్ క్రీడాకారాణి జి.దుర్గాప్రశాంతి ప్రధమస్థానం పొందగా, ఎల్.జ్యోత్స్న, మనీషా ద్వితీయ, తృతీయ స్థానాలను పొందారు. ఈసంర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందమైన ఆహ్లాదకరమైన సమాజాన్ని నెలకొల్పాలన్నారు. ముఖ్యంగా పరిసర పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఇందుకు బహిరంగ మలవిసర్జన లేకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. బహిరంగ మలవిసర్జన వలన అనేక గ్రామాలు అపారిశుద్ధ్యంతో ఉంటున్నాయని అనాగరిక ప్రపంచాన్ని తలిపిస్తున్నాయని ఆమె అన్నారు. ఇది ఒక సాంఘీక దురాచారంగా పరిగణించాలని ఆమె పిలుపునిచ్చారు. గత రోజుల్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలనే ఆలోచన ఉండేది కాదని ఆరుబయట మల విసర్జనకు వెళ్లేవారని అన్నారు. అయితే పరిస్థితులు మారాయని అందుకు తగిన విధంగా మనుషుల్లో మార్పు రావాలని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత మంచి మార్పును కోరుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులను, పెద్దలను ఒప్పించాలని సాంఘీక దురాచారంగా ఉన్న వ్యవహారాలను విడనాడాలని పిలుపునిచ్చారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని ఆమె చెప్పారు. ఇంటివద్ద స్తలం ఉంటే నిర్మించుకోవచ్చునని లేదా ప్రభుత్వమే సామాజికమరుగుదొడ్లను నిర్మిస్తుందన్నారు. ప్రతీ ఇళ్లు మరుగుదొడ్డి కలిగి ఉండాలని ఇందుకు అందరూ సహకరించాలని చెప్పారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థను మలవిసర్జన రహిత నగరంగా స్వచ్ఛ్భారత్ కార్పొరేషన్ ప్రకటించిందని చెప్పారు.
ప్రజల సహకారంతోనే ఇది సాధ్యపడిందన్నారు. మొక్కలు నాటాలని పచ్చని వాతావరణం తేవాలని కోరారు. నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి దవళ భాస్కరరావు మాట్లాడుతూ బహిరంగ మల విసర్జన వలన రోగాలకు కారణమయ్యే బాక్టీరియా భూ పొరల ద్వారా వ్యాప్తి చెందుతాయన్నారు. బహిరంగ మల విసర్జన నిషేదించాలన్నారు. ప్రతీ ఒక్కరూ దీనిపై అవగాహన పొంది సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలోజిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్, స్టార్ వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ గేదెల ఇందిరప్రసాదరావు, నేతాజీ డిఫెన్స్ అకాడమీ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, భీమేశ్వర బాక్సింగ్‌క్లబ్ నిర్వాహకులు ఉమామహేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఆర్ సి రెడ్డి, జి.అర్జున్ రెడ్డి,టేకి పురుషోత్తం, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

వంశధార నిర్వాసిత గ్రామాల్లో ‘అష్టదిగ్బంధం’
శ్రీకాకుళం: వంశధార ప్రాజెక్టు నిర్మాణం పనులు మరింత వేగవంతం చేసేందుకు మరో అస్త్రాన్ని జిల్లా యంత్రాం గం ప్రయోగించింది. నిర్వాసితుల సమస్యలు పరిష్కారంపై ఒకపక్క చర్యలు తీసుకుంటూనే, మరోపక్క పరిహారాలు తీసుకున్న వారు సమస్యలు పరిష్కారంకాని వాళ్ళతో మళ్లీ మూకుమ్మడిగా పనులు అడ్డుకుంటామంటూ వచ్చేవారి ముందరకాళ్ళకుబంధంగా రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్.గున్నయ్య, తహశీల్థార్ ఎం.కాళీప్రసాద్‌లు వంశధార నిర్వాసిత గ్రామాల్లో నష్టపరిహారాలు చెల్లించి, భూసేకరణ జరిగిన భూముల్లో పంటలు పండించవద్దని నోటీసులు జారీ చేసారు. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ నాటికి వంశధార పనులు పూర్తికావాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశయమని, ఆ దిశగానే పనులు వేగవంతం చేస్తేనే ప్రాజెక్టు జాతికి అంకితం చేయడం జరుగుతుందన్న లక్ష్యంతోనే జిల్లా కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి, జాయింట్ కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధరబాబు, పోలీసు సూపరిటెండెంట్ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమవర్మ సమాలోచనలతో అడుగులు ముందుకు వేస్తూ యంత్రాంగంతో పనిచేయించేందుకు అష్టదిగ్బంధం చేస్తున్నారు. ఇప్పటివరకూ చౌకధరల దుకాణాల ద్వారా అందజేసే సరుకులు నిలిపివేయడం, సర్కార్ పింఛన్లు విడుదల చేయకపోవడం, సర్కార్ సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడం, అభివృద్ధి ఫలాలు అందించకపోవడం, పంట రుణాలు మంజూరు చేయడం, డ్వాక్రా సంఘాలకు ఆర్థిక లింకేజీలు ఇవ్వకపోవడం, యువతకు అండదండలు అందించకపోవడం...ఇప్పుడు పరిహారం చెల్లించే నిర్వాసితులు వారి భూముల్లో పంటలు పండించోద్దంటూ దండోరా వేయించి, నోటీసులు జారీ చేయడం. ఇలా..అష్టదిగ్బంధంలో నిర్వాసిత గ్రామాలను పకడ్బందీగా జిల్లా అధికారులు ఇరుకునపెడుతున్నా ప్రాజెక్టు పనులు అడ్డుకునేందుకే నిర్వాసితులు ఉద్యమబాట పడుతున్నారు. వేలాది మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు నిబంధనలు, కఠోరమైన 30, 144 సెక్షన్లు అమలు, గ్రామాల నుంచి నిర్వాసితులు కదలికలే లేకుండా పికెటింగ్‌లు ఇలా..ఎన్ని నిర్భంధనలు చేసినా చివరికి పనులు నిలుపుదల చేస్తామంటూ నిర్వాసితులు ఎగిసిపడుతున్నారు. ఇటువంటి పరిస్థితులపై ప్రతీరోజూ నిఘా విభాగాలు పనిచేస్తునే ఉన్నాయి. మఫ్టీలో పోలీసు సిబ్బంది నిర్వాసిత గ్రామాల్లో, పొరిమేరల్లో ఉంటూ ఎప్పటికప్పుడు నిర్వాసితుల మనోభావాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. నిర్వాసిత గ్రామాలకు ఎవరెవరు వస్తున్నారు, గ్రామాల నుంచి ఎవరెవరు వెళ్తున్నారు వాహనాలు నెంబర్లు నమోదు చేసుకోవడం, తులగాం, పాడలి, దుగ్గుపురం రహదారి కూడలి వద్ద కొత్తగా సంచరించే వ్యక్తుల వివరాలు తీసుకోవడం, అనుమాన పరిస్థితులు ఉంటే వారిని అదుపులోకి తీసుకోవడం వంటి పోలీసింగ్ మాత్రం చాలా చాకచక్యంగా నడిపిస్తున్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు అసలు ఎందుకు నిర్వాసితులు వారికి కట్టించిన ఇళ్ళకు, నిర్మించిన కాలనీలకు వెళ్ళడం లేదన్న ప్రశ్నకు సమాధానం వెతికినట్టయితే - ప్రాజెక్టు పనులు నిలిచిపోయేంత ప్రమాదకరమైన వ్యవస్థ నిర్మాణం కాకపోయిండేదన్న భావన వ్యక్తం అవుతుంది.
నిర్వాసితులు వాదనలో వాస్తవం లేకపోలేదు
గత కొన్ని సంవత్సరాలుగా నిర్వాసితుల కోసం నిర్మాణాలు సాగించిన కాలనీలు నివాసయోగ్యంగా లేకపోవడం వల్లే గ్రామాలను విడిచి వెళ్ళడం లేదన్న ప్రధాన కారణం కన్పిస్తోంది. రూ. కోట్లు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి నిర్మించిన కాలనీలు ఇప్పుడు శిధిలావస్థకు చేరుకున్నాయి. అలాగే, వౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, కమ్యూనిటీ హాల్స్ వంటి నిర్మాణాలు పూర్తికాలేదు. ప్రధానంగా ప్రజలు రాకపోకలు సాగించేందుకు రోడ్ల నిర్మాణం అరకొర సాగించడం వల్ల ఇటువంటి జనం కనె్నత్తికూడా చూడడం లేదు. వౌలిక వసతులు లేమి వల్లే తాతతండ్రుల నుంచి ఉన్న గ్రామాలతో ఉన్న మమకారాన్ని తెంచుకోలేక కాలనీల్లో నివాసలు ఏర్పాటు చేసుకునేందుకు అనుకూల పరిస్థితులు సర్కార్ కల్పించకపోవడం వల్ల పోలీసులు జోక్యం తప్పనిసరి అయ్యింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా, ప్రాధాన్యతా ప్రాతిపదికన వ్యవహారించకుండా ముఖ్యమంత్రి హుకుం, న్యాయవ్యవస్థకు సమాధానం చెప్పాలనే ప్రయత్నం వంటి పరిణామాలు అధికారుల దూకుడు పెంచేలా చేసాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 85 శాతం మంది నిర్వాసితులు సర్కార్ నుంచి పరిహారాలు తీసుకుని కూడా కాలనీలకు కదలకపోవడానికి కారణాలు అనే్వషిస్తే అధికారులకు తలనొప్పులు తగ్గేవి. అటువంటి విషయాల జోలికి వెళ్ళకుండా మంత్రులు, ఉన్నతాధికారులు ఆదేశించారని పోలీసింగ్ నిర్వాసితులపై ఒత్తిడి పెంచితే - సమస్య మరింత జఠిలం కాక తప్పదని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కాలనీలకు వెళ్ళేవారిని గమనించి, గుర్తించి వారి వౌలిక సదుపాయాలకు సహకారం అందిస్తే కొంతమేరకు వ్యతిరేక గళం చల్లారే అవకాశం లేకపోలేదు.

వంశధార పనుల ప్రగతిపై చర్చ
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం: వంశధార- కొవ్వాడ ప్రాజెక్టుపనుల ప్రగతిపై జాయింట్ కలెక్టర్ కె.వి. ఎన్ చక్రధరబాబు, ఎస్పీ త్రివిక్రమవర్మతో రాష్ట్ర ఇంధన శాఖామంత్రి కిమిడి కళావెంకటరావు ఆదివారం ఆర్ అండ్ బి అతిధిగృహంలో చర్చించారు. శ్రీకాకుళం నగరానికి వచ్చేసిన ఇంధన శాఖామంత్రి ఆర్ అండ్ బి అతిధిగృహంలో వంశధార పనుల ప్రగతిపై అధికారులతో చర్చించారు. వంశధార నిర్వాసితుల సమస్యలు త్వరితగతిన పరిష్కారంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే జనవరి 5 నాటికి వంశధార పనులు పూర్తి కావాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశయమన్నారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుతో సహా వంశదార ప్రాజెక్టును ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల జాబితాలో ముఖ్యమంత్రి చేర్చి వాటి పనులపై ప్రతీ సోమవారం సమీక్షిస్తున్నారని తెలిపారు. నిర్వాసితుల సమస్య పరిష్కారం వరకు సామరస్యపూర్వకంగా వ్యవహరించి పనులు పూర్తిచేయాలన్నారు. నిర్వాసితులు ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగించరాదని ఆయన కోరారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమైన ప్రాజెక్టు అని నిర్వాసితులు పెద్దమనషుతో ప్రాజెక్టు పూర్తికావడానికి చేయూతనివ్వాలని పేర్కొన్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా రూ.421 కోట్లను విడుదల చేసి యూత్‌ప్యాకేజీగా విడుదల చేసిందని మంత్రి అన్నారు. అర్హులైనవారు ఉంటే వారి సమస్యలను నిబంధనలకు అనుగుణంగా పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు. కొవ్వాడ ప్రాజెక్టు టౌన్‌షిప్ నిర్మాణాలు, ఇతర అంశాలపై చర్యలు చేపట్టాలని మంత్రి అన్నారు. జెసి చక్రధరబాబు, ఎస్పీ త్రివిక్రమవర్మ ప్రాజెక్టు ప్రాంతాల్లో చేపట్టిన చర్యలను మంత్రికి వివరించారు.

ఉల్లి ధరకు రెక్కలు
ఎచ్చెర్ల: నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందడంతో వినియోగదారులకు అవస్థలు తప్పడం లేదు. నిన్నటికినిన్న టమాటా ధరలు కొండెక్కాయి. వీటిని మరువక ముందే ఉల్లిధరలు కొనుగోలుదారులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఎప్పుడూ రూ.20 ధర పలికిన ఉల్లి కిలో అమాంతంగా రూ.40కు పెరగడంతో సామాన్యులను ఉంచి అసమాన్యుల వరకు గగ్గోలు పెడుతున్నారు. ధరలు బాదుడుపై వినియోగదారులు వ్యాపారులను నిలదీస్తే వర్షాభావ పరిస్థితులు, అలాగే మహారాష్ట్ర నుంచి దిగుమతి చేయడం వలన ధరలు పెరిగాయని సమాధానం చెప్పడంతో వారంతా నిరాశకు లోనౌతున్నారు. కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటువంటి ధరఘాతాన్ని సామాన్య మధ్య తరగతి కుటుంబాలు భరించలేని దయనీయ పరిస్థితులు వెంటాడుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కనీస శ్రద్ధ కనబర్చడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయాలు అంతంతమాత్రంగా ఉన్న కుటుంబాలు ధరాఘాతానికి జీవన ప్రమాణాలు మరింత దిగజారుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం రేషన్ కార్డుల ద్వారా ఉల్లిపాయలను సరఫరా చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.

రైల్వే సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి హామీ
శ్రీకాకుళం(రూరల్): జిల్లాలో వివిధ రైల్వేస్టేషన్లలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కేంద్ర రైల్వే శాఖామంత్రి సురేష్‌ప్రభు హామీ ఇచ్చారని బీజెపి రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం తెలిపారు. శాంతినగర్ కాలనీలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 5న జిల్లా సమస్యలపై పలువురు మంత్రులను కలిసేందుకు ఆరుగురు బృందం ఢిల్లీ వెళ్లడం జరిగిందని తెలియజేశారు. ఉప రాష్టప్రతి ఎన్నిక అనంతరం వెంకయ్యనాయుడును కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని అలాగే రైల్వేమంత్రి సురేష్‌ప్రభును కలవడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఉన్న రైల్వే స్టేషన్లలో వౌలిక వసతుల కల్పనకు ఫ్లాట్‌ఫారం షెడ్‌ల అభివృద్ధికి, ఫాస్ట్‌రైళ్లను శ్రీకాకుళం రోడ్‌లో హాల్టింగ్ చేసేందుకు నిర్ణయించారని తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు సుముఖిత వ్యక్తం చేసినట్లు తెలియజేశారు. అలాగే కేంద్ర కార్మిక శాఖామంత్రి దత్తాత్రేయను కలిసినట్లు తెలియజేశారు. జిల్లాలో కార్మికుల కోసం 50పడకల ఈ ఎస్ ఐ ఆసుపత్రి నిర్మించాలని పైడిభీమవరంలో ఉన్న పది పడకల ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయాలని కోరినట్లు తెలియజేశారు. ఆలిండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్‌మాదవ్‌ను కూడా కలిసినట్లు తెలియజేశారు. జిల్లాలో ఉన్న ఐదు నదుల్లో వేస్ట్‌వాటర్ కలిసి కలుషితవౌతుందని నదుల అనుసందానానికి కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యూనివర్శిటీని అప్‌గ్రేడ్ చేయాలని కోరినట్లు స్పష్టంచేశారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పూడి తిరుపతిరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రాన్ని అదుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులను మంజూరు చేసిందని అయితే వాటిలో శ్రీకాకుళం జిల్లా మినహా అన్ని జిల్లాలకు వచ్చాయని తెలియజేశారు. ఇక్కడ ప్రజా ప్రతినిధులు వాటిపై దృష్టి పెట్టకపోవడమే ఇందుకు కారణమన్నారు. వివిధ సమస్యలపై బిజెపి బృంద సభ్యులను వినతిపత్రాలు సమర్పించారని బిజెపి ప్రభుత్వానికి జిల్లా అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందని తెలియజేశారు. అలాగే ఈనెల 15న తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు స్పష్టంచేశారు. క్విట్ ఇండియా ఉద్యమం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ తిరంగ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈవిలేఖర్ల సమావేశంలో నగర అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు, సంపతిరావు రమణమూర్తి, రెడ్డి నారాయణరావు, దయాసాగర్, కద్దాల ఈశ్వరమ్మ, గంగు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
రూ. 15 కోట్లతో స్టేడియం నిర్మాణం
బలగ: క్రీడాకారుల ఖిల్లాగా పేరొందిన సిక్కోలులోగల ఏకైక స్టేడియమైన కోడిరామ్మూర్తి స్టేడియం శిథిలావస్థకు చేరుకోవడం, వాటిస్థానే కొత్త స్టేడియం పునర్ నిర్మాణానికి సిద్ధవౌతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టడం జిల్లాకు చెందిన కింజరాపు అచ్చెన్నాయుడుకు రాష్ట్ర మంత్రి వర్గంలో క్రీడామంత్రిగా కేటాయించడం, జిల్లాకు ఏదో చేయాలన్న సంకల్పంతో శిథిలావస్థకు చేరిన కోడిరామ్మూర్తి స్టేడియం స్థానంలో కొత్తగా నిర్మించేందుకు ప్రతిపాదించారు. అప్పటి నుంచి స్వల్ప మార్పులు పేరిట రెండేళ్లు దాటించుకుంటూ వచ్చారు. అయితే గత ఏడాది ఇదే సమయానికి కొత్త స్టేడియం నిర్మాణానికి 15 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ప్రభుత్వం ప్రకటించడం, దీనిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉడా సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు ప్రకటించి హడావిడిగా స్టేడియం గ్యాలరీ పడగొట్టడంతో పనులు ప్రారంభవౌతాయని క్రీడాకారులు అనుకున్నారు. అయితే స్టేడియం నిర్మాణంలో సాంకేతిక లోపాలు, సరికొత్త డిజైన్లు మార్చడంతో ఏడాదిపాటు లాగుకుంటూ వచ్చింది. ఇప్పుడున్న ట్రాక్ తూర్పు, పడమర దిక్కు కాకుండా ఉత్తర, దక్షిణ దిక్కుగా అంతర్జాతీయ ప్రమాణాలతో మార్చడంతోపాటు మరికొన్ని స్వల్ప మార్పులు జోడుకావడంతో ఏడాది పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ పనులను ఎన్.పి.సి.సికు అప్పజెప్పడం దీనికి మార్చి నెలలో 20 నెలల్లో పూర్తిచేస్తామని ఎంవోయు కుదర్చుకోవడం అందరికీ విధితమే. అయితే ఈ పనులను అప్పజెప్పేందుకు ఎన్‌పిసిసి సబ్ కాంట్రాక్టర్లుకు ఈ నెల నాల్గవ తేదీన టెండర్లు పిలిచి ఖరారు చేసింది. ఇందుకై ఒప్పంద పత్రాలు అయిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నట్లు అధికార వర్గాల నుంచి తెలియవచ్చింది. పనులు ప్రారంభించాలంటే తొలుత ఇండోర్ పడగొట్టాల్సి ఉంటుంది. ఇండోర్ స్టేడియం నుంచి అన్ని గేమ్స్‌కు సంబంధించి కోర్టుల వరకు త్వరిగతిన పనులు చేయాల్సి ఉంటుంది. ఎన్‌పిసిసి 20 నెలల్లో ఒప్పందం కుదుర్చుకుని.. వాటిని కాంట్రాక్టర్లను అప్పజెప్పేందుకు మరో పది నెలలు పట్టటడంతో మరో పది నెలల్లో ఈ పనులన్నీ చేయాల్సి ఉంటుంది. ఇదిలా వుండగా కోడిరామ్మూర్తి స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు మరో 8 కోట్ల రూపాయలు మంజూరు కావడంతో ఈ పనులతోపాటు వీటి టెండర్లు పూర్తి అవుతుందని శాప్ వర్గాల నుంచి తెలుస్తోంది. ఈ సౌకర్యాలన్నీ క్రీడాకారులకు అందినట్టయితే మరిందరు క్రీడాకారులు సిక్కోలు గడ్డకు పరిచయవౌతారని క్రీడావిశే్లషకులు భావిస్తున్నారు.
విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటుతో తీరనున్న లో వోల్టేజి సమస్య
గార: మండలం కళింగపట్నం, అంపోలు ప్రాంతాల్లో నిర్మితం అవుతున్న విద్యుత్ సబ్‌స్టేషన్లు పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ సబ్‌స్టేషన్లు నిర్మాణాలు పూరె్తై తమ సేవలను వినియోగదారులకు అందజేసినట్లైతే మండలంలో ప్రస్తుతం ఉన్న లోవోల్టేజి సమస్య దాదాపుగా తీరినట్లు అవుతుంది. గతంలో తూలుగు ప్రాంతంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషను ద్వారానే శ్రీకూర్మం, గార, కళింగపట్నం ఫీడర్లు ద్వారా విద్యుత్ వ్యవసాయ, గృహ అవసరాలకు సరఫరా అయ్యేది. కాలక్రమంలో మండలంలో విద్యుత్ వినియోగదారులు ఎదుర్కోంటున్న విద్యుత్ లోవోల్టేజి సమస్యలను దృష్టిలో ఉంచుకొని అంపోలు పంచాయతీ రామక్రిష్ణాపురం వద్ద మరో 33కె.వి. విద్యుత్ సబ్‌స్టేషనును నిర్మింపజే యడంతో ఆయా ప్రాంతాల్లో కొంత వరకు లోవోల్టేజి సమస్యను అధిగమించినట్లు అయ్యింది. పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని వినియోగదారులకు లోవోల్టేజి సమస్యలు తలెత్తకుండా ప్రస్తుతం కళింగపట్నంలో మరో 33కె.వి. విద్యుత్ సబ్‌స్టేషను నిర్మాణాన్ని చేపట్టి దాదాపుగా పనులు పూర్తి కావచ్చాయి. మరి కొద్ది రోజుల్లో ఈ సబ్‌స్టేషను నిర్మాణం పనులు పూర్తిచేసుకొని తన సేవలు అందజేసేందుకు సన్నద్ధం కానుంది. ఈ క్రమంలోనే అంపోలు ప్రాంతంలో మరో విద్యుత్ సబ్‌స్టేషను నిర్మాణం కూడా పూర్తి కావచ్చింది. దీంతో మండలానికి లోవోల్టేజి సమస్య దాదాపుగా తొలగినట్లు అవుతుంది. తొందరలోనే ఈ విద్యుత్ సబ్‌స్టేషన్లు ప్రారంభం కానున్నాయి.

అరసవల్లి దేవాలయానికి భక్తుల తాకిడి
శ్రీకాకుళం(రూరల్) : ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తుల తాకిడి పెరిగింది. శ్రావణమాసం మూడవ ఆదివారం కావడంతో ఉదయం నుంచే భక్తులు దర్శనానికి క్యూ కట్టారు. ఉదయం 6గంటలకు భక్తులకు స్వామివారి దర్శనానికి అధికారులు అనుమతించారు. సుప్రభాత సేవ నుండి ఆదివారపు ప్రత్యేక పూజలను అర్చకులు స్వామివారికి నిర్వహించారు.
మధ్యాహ్నం 30 నిముషాల పాటు భోగం మినహా రాత్రి వరకు స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. సూర్యనమస్కార పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిత్య అన్నదాన పథకంలో కూడా భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
బీమా పత్రాలు పంపిణీ
గార: స్థానిక శాసన సభ్యురాలు గుండ లక్ష్మీదేవి చేతులు మీదుగా ఆగస్టు నెల చంద్రన్న బీమా ప్రొసీడింగ్స్‌ను అందజేయనున్నట్లు వెలుగు ఎ.పి.ఎం జి.శ్రీ్ధర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అంపోలు పంచాయతీ రామక్రిష్ణాపురం గ్రామంలో సోమవారం నిర్వహింపజేయనున్నట్లు ఆయన స్పష్టం చేసారు. మండలంలోని అంపోలు పంచాయతీ గ్రామంలో ఆగస్టు మాసానికి సంబంధించి 4, బందరువానిపేట 1, గార 2, కొర్లాం 1, రామచంద్రాపురం 2, సతివాడ 1, శ్రీకూర్మం 8, వాడాడ 1 చొప్పున చంద్రన్న భీమా లబ్ధిదారులు ఉన్నారని, వీరికి ఎమ్మెల్యే చేతులు మీదుగా చంద్రన్న భీమా ప్రొసీడింగ్స్‌ను అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేసారు.

మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ వైకాపా మహిళ నేతలు
శ్రీకాకుళం(రూరల్):మంత్రి ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్యే రోజాపై చేసిన వ్యాఖ్యలపై వైకాపా మహిళా విభాగానికి చెందిన నాయకులు మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో టి.కామేశ్వరి, చింతాడ మంజులు మాట్లాడుతూ మంత్రి రోజాను చెల్లెమ్మ అని సంబోధిస్తూ ఆమె నెత్తిపై మంట పెట్టడం సరికాదన్నారు. ఆదినారాయణరెడ్డి వైకాపాకు చెందినవాడేనని ఇంకా టిడిపి తీర్థం పుచ్చుకోలేదని అయితే ఈవిధంగా వ్యాఖ్యానించడం బాదాకరమన్నారు. నంధ్యాలలో తెలుగుదేశం పార్టీ గెలిచేలా ఉప ఎన్నికల్లో లేనిపోని మోసపూరిత హామీలు గుప్పిస్తున్నారని అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేస్తారని తెలియజేశారు. ప్రతిపక్షాన్ని విమర్శిస్తే మరింత ముందుకు దూసుకుపోతుందని మంత్రి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేకుంటే పోరాటం ముందుకు సాగుతుందని తెలియజేశారు. అనంతరం మంత్రి నారాయణరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బిడ్డిక లక్ష్మీ, సుగుణారెడ్డి, చల్లా అలివేలుమంగ, బొత్స సంధ్య, కె.చంద్రావతి, పద్మావతి, గుంట జ్యోతి తదితరులు పాల్గొన్నారు.