తూర్పుగోదావరి

పి.రాయవరంలో 13వ శతాబ్దపు ఆనవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఠాపురం, అక్టోబర్ 22: పిఠాపురం మండలం పి.రాయవరం గ్రామంలో ఉన్న పురాతన రామాలయం వద్ద రెడ్డిరాజుల కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా పిఠాపురం ప్రతినిధులు మిరపల నారాయణరావు, పోతుల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఈ బృందం సభ్యులు పి.రాయవరం గ్రామంలోని రామాలయాన్ని పరిశీలించారు. రామాలయం చుట్టూ నిర్మాణం, ఆలయం వద్ద ఉన్న కోనేరు, పురాతన విగ్రహాలను పరిశీలించి, ఈ ఆలయం 13వ శతాబ్దం నాటిదన్నారు. ఇక్కడ క్షేత్ర విశిష్టతను బట్టి చూస్తే అతి పురాతనమైన ఆలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. అలాగే ఆలయానికి చెందిన కొంత భూమి ఆక్రమణలో ఉన్నందున దానిని రక్షించాలన్నారు. పురాతన విగ్రహాలు కూడా ఇక్కడ ప్రాంతంలో పడి ఉన్నాయని, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వారికి సమాచారాన్ని అందజేస్తామని బుద్ధిస్ట్ సొసైటీ ప్రతినిధులు పోతుల శ్రీనివాస్, ఇనకోటి రాంబాబు తెలిపారు.

గర్జన కాదు జాతర

రాజమహేంద్రవరం, అక్టోబర్ 22: యాధృచ్ఛికమో ఏమో ‘ఇది బీసీ గర్జన కాదు.. బీసీల జాతర, తిరునాళ్ల మాదిరిగా ఉంది‘ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. అలాగే బీసీల ఐక్యత మాటెలా ఉన్నప్పటికీ తీవ్ర గందరగోళం మధ్య ఈ సభ సాగింది. బీసీ గర్జన కార్తీక సమారాధన శనివారం రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్‌లో జరిగింది. బీసీ సంఘాల నాయకులను వేదిక పైకి భారీ సంఖ్యలో పిలిచినప్పటికీ ఇంకా మిగిలిపోయిన వారిని పిలవలేదని అలకలు, ఆందోళనలతో సభ రసాభాసగా మారింది. ఒక దశలో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఒకింత పోలీసులు పహారా కాయాల్సి వచ్చింది. వేదిక పైకి పిలవలేదని కొంతమంది కోపతాపాలతో ఊగిపోయారు. ఆర్ కృష్ణయ్య ప్రసంగించేసి వెళిపోయిన తర్వాత పలువురు నాయకులు తమకు ప్రాతినిధ్యం దక్కలేదని ఆందోళన వ్యక్తం చేయడం కన్పించింది. కొంతమంది దౌర్జన్యానికి కూడా దిగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు తన సోదరుని అకాల మరణ వార్త రాజమహేంద్రవరం వచ్చిన తర్వాత తెలియడంతో ఆ బాధతోనే ఆయన బీసీ గర్జన సభలో పాల్గొనాల్సి వచ్చింది. వేదికపై పలువురు ముఖ్య నేతలు మాట్లాడిన తర్వాత ముందుగా ఆర్ కృష్ణయ్య ప్రసంగించి సభ నుంచి నిష్క్రమించారు. పలువురు బీసీ మంత్రులు హాజరవుతారని అంచనా వేసినప్పటికీ తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనమండలి ఇన్‌చార్జి ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు తుని మార్కెట్ కమిటీ ఛైర్మన్ యనమల కృష్ణుడు సభకు ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తప్ప మిగిలిన వారు ఇటువైపు చూడని పరిస్థితి కన్పించింది. ఉస్మానియా యూనివర్సిటీలో రెండు మాస్టర్ డిగ్రీలు సాధించిన తెలంగాణా బీసీ గాయకుడు రామలింగం బృందం బహుజనులపై ఆలపించిన గీతాలాపన ఈ గర్జన సభలో విశేషంగా అలరించింది. గ్రేటర్ రాజమహేంద్రవరం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరవ గోపాలకృష్ణ కులాలపై ప్రదర్శించిన కళారూపం విశేషంగా ఆకట్టుకుంది. గర్జనతో పాటు బీసీ కులాల కార్తీక సమారాధన ఏర్పాటు చేయడంతో ఇటు గర్జన కంటే అత్యధికంగా భోజనాల తంతు వద్దే అధిక జనాభా కన్పించారు. గర్జన సభకు సుమారు 30 వేల మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేసినప్పటికీ ఆశించినంతగా బీసీ జనం రాలేదని స్పష్టమైంది. సభా వేదికపై చేనేత కుల సంఘ నేత పంపన రామకృష్ణ స్వాగతం పలుకగా ఏర్పాట్లను నరవ గోపాలకృష్ణ, మార్గాని నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పర్యవేక్షించారు. సభకు ముందుగా ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జ్యోతిరావ్ పూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
సభలో డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, బీసీ సంఘాల నేతలు బొమ్మన రాజ్‌కుమార్, మార్గాని రామకృష్ణగౌడ్, నరవ గోపాలకృష్ణ, ఎమ్మెల్సీ పోతుల సునీత, రెడ్డి రాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యనమల కృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నక్కెళ్ల బాబూరావు, పితాని తారకేశ్వరరావు, వాసంశెట్టి సత్య, జివివిఎస్‌ఎస్ లక్ష్మీతులసి, అంకం గోపి, అంకం నాగేశ్వరరావు, చొల్లంగి వేణుగోపాల్, రుంకాని వెంకటేశ్వరరావు, షేక్ సుభాన్, మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, గింజాల శ్రీనివాసరావు, కుడిపూడి పార్థసారధి, కెకె సంజీవరావు, అల్లు బాబి, కురగంటి సతీష్, పేట రామకృష్ణ, నొడగల సుధ, మార్గాని చంటిబాబు, గుత్తుల అప్పారావు, కార్పొరేటర్ మజ్జి నూకరత్నం, దంగేటి సత్తిబాబు, అరవ సత్యం, రాష్టవ్య్రాప్తంగా బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు.
కాకినాడ నగరపాలక సంస్థలో కో-ఆప్షన్ సభ్యులపై కసరత్తు
-రెండు కేటగిరీల్లో ఐదుగురికి అవకాశం-31 వరకు దరఖాస్తుల స్వీకరణ

కాకినాడ, అక్టోబర్ 22: కాకినాడ నగరపాలక సంస్థ పాలకవర్గంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు అధికారులు కసరత్తుచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం-1955లోని సెక్షన్-5 (1బి) మరియు (1సి) ప్రకారం కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి దరఖాస్తు చేసుకోవల్సిందిగా అధికారులు ఇటీవల ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుండి నగరపాలక సంస్థ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారు. కాకినాడ నగరపాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లున్నాయి. ఇటీవల కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో కోర్టు వివాదాల కారణంగా 42, 48 డివిజన్లకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 48 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా 48 మంది కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. వీరిలో తెలుగుదేశానికి చెందిన 32 మంది విజయం సాధించారు. టిడిపి మిత్రపక్షమైన బిజెపికి చెందిన మరో ముగ్గురు విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుండి పదిమంది విజయం సాధించగా, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలిచారు. కార్పొరేషన్‌లో అత్యధిక స్థానాలను సాధించిన తెలుగుదేశం నుండి మేయర్‌గా సుంకర పావని, డిప్యూటీ మేయర్‌గా కాలా సత్తిబాబును పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ నేపథ్యంలో నిబంధనల మేరకు మరో ఐదుగురు కో-ఆప్షన్ సభ్యులుగా నియమితులు కావలసివుంది. ప్రభుత్వ ఉత్తర్వులలో జారీ చేసిన నిబంధనలను అనుసరించి, పురపాలక పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కలిగిన వ్యక్తుల కేటగిరీ కింద ముగ్గురిని కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోవలసి ఉంది. వీరిలో ఒక మహిళ ఉంటారు. అలాగే మైనారిటీ కేటగిరీ కింద ఇద్దరికి అవకాశం కల్పిస్తారు. ఈ కేటగిరీలోనూ ఒక స్థానాన్ని మహిళకు కేటాయించారు. దరఖాస్తుల దాఖలు గడువు తేదీ ముగిసిన అనంతరం ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా నగరపాలక సంస్థలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేరాల్సి ఉంది.

ఎర్ర సూరీడుకి కొమరం భీం పురస్కారం
-స్వగ్రామంలో హర్షాతిరేకాలు
రౌతులపూడి, అక్టోబర్ 22: శ్రమ జీవుల కష్టాన్ని దోపిడీ చేస్తున్న భూస్వాములపై ఏవిధంగా హక్కులు సాధించుకోవాలో వెండి తెరపై కళ్లకు కట్టినట్టు చూపించి, ఎర్ర సూరీడుగా పేరొందిన సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి 2017 తెలంగాణ ప్రభుత్వ కొమరం భీం పురస్కారానికి ఎంపికయ్యారు. దీనితో ఆయన స్వగ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయ. అవార్డు ఎంపిక కమిటీ ఛైర్మన్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, తెలంగాణ టెలివిజన్ డెవలప్‌మెంట్ ఫోరం, ఆదివాసీ సాంస్కృతిక పరిషత్, గోండ్వానా ప్రొటెక్షన్ ఫోర్స్, భారత కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ఈ అవార్డుకు ఆర్ నారాయణమూర్తిని ఎంపిక చేశాయి. కొమరం భీం జాతీయ అవార్డు కింద 51 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ఈ జ్ఞాపికను కొమరం భీం జయంతి రోజున అందజేయనున్నారు. నారాయణమూర్తి రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించి జీవితంలో తనకంటూ ఏమీ దాచుకోకుండా ప్రజాసేవకే అంకితమయ్యారు. పీడిత వర్గాలను దృష్టిలో ఉంచుకుని అనేక సినిమాలను వెండితెరపై చిత్రీకరించారు. ఇందులో అర్ధరాత్రి స్వాతంత్య్రం, లాల్ సలాం, అడవి దివిటీలు, ఎర్ర సైన్యం, చీమల దండు, దండోరా, చీకటి సూరీడు, ఊరు మనదిరా, వేగుచుక్కలు, సింగన్న, అరణ్యం తదితర సినిమాల్లో కొమరం భీం ఆశయాలకు అనుగుణంగా చిత్రీకరించారు. సినిమాల్లోనే కాకుండా ఆయన జీవితంలో ఎన్నో సేవాకార్యక్రమాలను చేశారు. రౌతులపూడిలో ఉన్న ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి సొంత సొమ్ముతో స్థలాన్ని సేకరించి ప్రభుత్వానికి ఉచితంగా అందజేశారు. ఈయనకు జాతీయ అవార్డు రావడంపై ఆయన స్వగ్రామమైన మల్లంలో సంబరాలు జరుపుకున్నారు. ఈయన రౌతులపూడి నుండి విద్యాభాస్యం ప్రారంభించి, పెద్దాపురం మహారాణి కళాశాల నుండి డిగ్రీ పట్టా పొందారు. తాజాగా ఈ మధ్యకాలంలో ఏలేశ్వరం, గండేపల్లి ప్రాంతాల్లో సుఖీభవ అనే చిత్రాన్ని చిత్రీకరించారు. ఈయన ఇటీవల గ్రామానికి వచ్చిన సందర్భంగా విలేఖరులు పలకరించగా ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల చాలా ఆనందంగా ఉందని జల్‌జింగిల్ జమీన్ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు కొమరం భీముడని, ఆయన పేరు మీద అవార్డు రావడం తనకెంతో గర్వంగా ఉందని అన్నారు. రైతు కూలీలంతా సంబరపడేలా మరిన్ని చిత్రాలను వెండి తెరపైకి తీసుకురానున్నట్టు తెలిపారు. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు తెలంగాణా ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.
ప్రజారోగ్యానికి ప్రాధాన్యత
ప్రత్తిపాడు, అక్టోబర్ 22: పేదల ఆరోగ్యమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం ప్రత్తిపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా యాభై వేల నుండి రెండు లక్షల వరకు పేదలకు వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ప్రభుత్వం పేదల ఆరోగ్యం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించడంతో పాటు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోనే గర్భిణీలు ప్రసవాలు జరుపుకొనేలా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని గుర్తించి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో, శాసనమండలి ఇన్‌చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎంపి తోట నరసింహం, ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, డిసిసిబి చైర్మన్ వరుపుల రాజా, జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎ లక్ష్మీ శివకుమారి, ఎఎంసి చైర్మన్ కొమ్ముల కన్నబాబు, టిడిపి నాయకులు పర్వత సురేష్, పర్వత రాజబాబు, సర్పంచ్ యాళ్ల విశే్వశ్వరరావు, డిఎంహెచ్‌ఒ చంద్రయ్య, డిసిహెచ్‌ఎస్ రమేష్ కిశోర్, ఆర్డీవో విశే్వశ్వరరావు, డిఎస్‌ఒ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో సుమారు 35 వేల మందికి వైద్య పరీక్షలు అందించి మందులు పంపిణీ చేసినట్టు డిసిసిబి చైర్మన్ వరుపుల రాజా తెలిపారు.
అడవిలో పేలిన తుపాకీ
*వేటగాళ్ల ఘాతుకానికి యువకుడు బలి - అటవీ, పోలీసు శాఖల్లో కలకలం
దేవీపట్నం, అక్టోబర్ 22: ఏజెన్సీలో వేటగాళ్లు నాటు తుపాకీతో జరిపిన కాల్పుల్లో అటవీశాఖ ఉద్యోగినికి సహాయకునిగా వెళ్లిన యువకుడు మృతిచెందడం జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడటం నిత్యం జరిగే వ్యవహారమే. అయితే తమను పట్టుకోవడానికి ప్రయత్నించిన సిబ్బందిపై వేటగాళ్లు కాల్పులకు తెగడబడటం జిల్లాలో ఇదే ప్రథమం. ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినా గతంలో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు జోరుగా సాగిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో కాల్పుల వ్యవహారం అటవీశాఖ కంటే పోలీసు శాఖలో ఎక్కువ కలవరం సృష్టించిందని చెప్పవచ్చు. దీనితో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. దేవీపట్నం మండలం నాగళ్లపల్లి గ్రామం వద్ద అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం 10గంటల ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. గోకవరం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోగల దండంగి బీటులో ఫారెస్ట్ గార్డ్ వరలక్ష్మి దండంగి గ్రామానికి చెందిన పోసియ్య (21) అనే సహాయకునితో కలిసి నాగళ్లపల్లి గ్రామం వద్దగల అడవిలో పర్యటిస్తుండగా పది మంది వేటగాళ్లు తుపాకులతో తారసపడ్డారు. వారిని పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపినట్టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ త్రిమూర్తులు తెలిపారు. ఇదే విషయం గార్డు వరలక్ష్మి తమకు తెలియజేసిందన్నారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పోసియ్య కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. కాల్పుల ఘటనపై దేవీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు రేంజ్ ఆఫీసర్ త్రిమూర్తులు తెలిపారు. నాగళ్లపల్లి, నేలకోట తదితర ప్రాంతాల్లో గత నెలలో అడవి దున్నలు సంచరించి ప్రజలకు హాని కలిగిస్తున్నాయని ప్రచారం జరిగింది. దానిపై ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఆదివారం కూడా తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగిందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ త్రిమూర్తులు తెలిపారు. కాగా రంపచోడవరం సిఐ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనాస్థలాన్ని సందర్శించారు. సంఘటనాస్థలంలో ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కాల్పులపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పదిమంది వేటగాళ్లు నాటు తుపాకీలతో ఎదురుపడి, కాల్పులు జరిపినపుడు ఒక తుపాకీని మాత్రం ఎందుకు వదిలి పరారయ్యారనేది ప్రశ్నార్థకంగా మారింది.

పేదలకు నూరు శాతం రేషన్
ప్రత్తిపాడు, అక్టోబర్ 22: రాష్ట్రంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ నూరుశాతం అమలు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం ఆయన ప్రత్తిపాడులో జరిగిన మెగా వైద్య శిబిరం ప్రారంభించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 1.42 కోట్ల రేషన్ కార్డుల ద్వారా 4.4 కోట్ల మందికి నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. సాంకేతిక కారణాలు, ఇతర కారణాల వల్ల వేలిముద్రలు పడని కార్డుదారులకు రెవెన్యూ సిబ్బంది ద్వారా సరుకులు అందించడానికి టార్గెట్లు నిర్దేశించామన్నారు. ఇంటి నుండి బయటకు రాలేని లబ్ధిదారులకు నేరుగా సరుకులు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జనవరి నెల నుండి యాభై శాతం సబ్సిడీపై పంచదార సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటుకు ఒక్కొక్క డీలరుకు సరుకులు పంపి వౌలిక సదుపాయాల కల్పనకు 1.25 లక్షలు చెల్లిస్తామన్నారు. మార్కెట్ ధరలో 29 శాతం తక్కువ ధరకు సరుకులు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో పది జిల్లాల్లో రిలయన్స్ సంస్థ, మూడు జిల్లాల్లో ఫ్యూచర్ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి ప్రతి రోజు 15 నుండి యాభై వేల మంది ప్రజలతో పౌర సరఫరాల విషయమై మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న 4,600 రేషను డీలర్ల ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సమావేశంలో మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, జ్యోతుల నెహ్రు, జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఓటు ద్వారానే బిసిలకు రాజ్యాధికారం

రాజమహేంద్రవరం, అక్టోబర్ 22: బీసీల రాజ్యాధికారం ఓటు హక్కు ద్వారా సాధ్యమని బిసి సంఘాల నేతలు అన్నారు. రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్‌లో ఆదివారం బీసీ గర్జన కార్తీక సమారాధన సభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన బీసీ సంఘాల జెఎసి కన్వీనర్ మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ జనాభాలో 52 శాతం వున్న బీసీలకు న్యాయం దక్కడం లేదన్నారు. జనాభా దామాషా ప్రకారం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కులాన్ని బీసీల్లో చేర్చితే బీసీలు మనుగడ కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అధ్యక్షోపన్యాసం చేస్తూ బీసీ కులాల చేతి వృత్తులను కొన్ని అగ్రవర్ణాలు చేజిక్కించుకుంటున్నాయన్నారు. బీసీల చేతి వృత్తులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ప్రభుత్వం మళ్లీ ఆదరణ పథకం ద్వారా బీసీ చేతి వృత్తులను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని వేడుకుంటున్నామన్నారు. నియోజకవర్గానికొక గురుకుల పాఠశాలను, కళాశాల హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతీ జిల్లాలోనూ బీసీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. బీసీ సబ్ ప్లాన్‌కు రూ.10 వేల కోట్లు కేటాయించారని, అయితే ఈ నిధులకు చట్టబద్ధత సాధించాలన్నారు. బీసీల హక్కులను వినతి ద్వారా సాధించుకోవాలని, డిమాండ్ ద్వారా కాదని, బీసీలు సౌమ్యంగా వుంటారన్నారు.
బీసీ నేత పట్టపగలు వెంకట్రావు మాట్లాడుతూ బీసీల్లో ఐక్యత వుంటేనే ఏ ప్రభుత్వమైనా, పార్టీ అయినా గుర్తిస్తుందన్నారు. బీసీలంతా ఒక్కటేనని చాటేందుకు చిహ్నంగానే బీసీ కులాల కార్తీక సమారాధన ఏర్పాటు చేశామన్నారు. బీసీలు ఎవరికీ వ్యతిరేకం కాదని, హక్కుల సంరక్షణ కోసం, ఎంత కాలం పల్లకీ మోస్తామని ప్రశ్నించుకుని పల్లకీ ఎక్కేందుకు అభివృద్ధి సాధించాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆల్మండ్ రాజు మాట్లాడుతూ కులాలకు అతీతంగా జాతి కోసం ఆలోచించాలని, కుల రహిత సమాజం కోసం ప్రయత్నిస్తే ఐక్యత వస్తుందన్నారు.
శాసనమండలి ఇన్‌చార్జి ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంఘంగా వుంటేనే ఏదైనా సాధించుకునేందుకు సంఘాలు ఆదినుంచి ఏర్పాటయ్యాయన్నారు. సంఘం మనకు ఏమి చేసిందనే విధంగా కాకుండా సంఘానికి మనం ఏమి చేశామని ఆలోచించినపుడే జాతి బాగుపడుతుందన్నారు. బీసీ సంఘాల ఐక్యతకు ఈ సభ నాంది పలకాలన్నారు. బీసీల తరఫున సాగే ఏ కార్యక్రమానికైనా ముందుంటానని, బీసీ గర్జనకు సంఘీభావంగా హాజరయ్యాయని అన్నారు. బీసీల్లో పుట్టినందుకు తాను గర్వపడుతున్నానని రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాల్లోనూ అగ్ర వర్ణాలకు దీటుగా ఎదగాలని, బీసీల అభ్యున్నతి కోసం కృషిచేసిన మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి సాధించాలన్నారు. నాయకులు కడలి వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం మార్కెట్ కమిటీ ఛైర్మన్ తనకాల నాగేశ్వరరావు, బీసీ ఎంప్లారుూస్ జెఎసి ఛైర్మన్ కేతా శ్రీనివాసరావు, కుండల సాయికుమార్ మాట్లాడారు.
దళిత హక్కుల పోరాట యోధుడు పివి రావు

అమలాపురం, అక్టోబర్ 22: దళితులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల రక్షణ కోసం పోరాడిన యోధుడు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత పివి రావు అని అమలాపురం ఎంపి పండుల రవీంద్రబాబు అన్నారు. ముమ్మిడివరం మండలం అనాతవరంలో నిర్మించనున్న పివిరావు ఘాట్ నిర్మాణ పనులకు ఎంపి పండుల ఆదివారం శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఎంపి మాట్లాడుతూ అనాతవరంలో నిర్మించే పివి రావు ఘాట్‌ను చారిత్రాత్మక, పర్యాటక, విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఘాట్ నిర్మాణానికి అవసరం అయిన నిధులు ప్రభుత్వం నుండి, ఎన్జీవోల నుండి సేకరిస్తానని, అప్పటికీ ఘాట్ నిర్మాణం పూర్తికాకపోతే తన సొంత నిధులతో ఘాట్‌ను సుందరంగా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. రాజోలు, పి గన్నవరం ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, పులపర్తి నారాయణమూర్తి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు పివి రావు చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ మాట్లాడుతూ దళిత విద్యార్థులు ఐఎయస్, ఐపియస్‌లుగా తీర్చిదిద్దే కేంద్రంగా ఘాట్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే బుచ్చిబాబు నియోజకవర్గ అభివృద్ధి నిదుల నుండి ఘాట్ నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. పివి రావు సోదరుడు, మాజీ ఐఎఎస్ అధికారి పియస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో మూడు ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, చెల్లి వివేకానంద మాట్లాడుతూ పివి రావు ఘాట్ దళిత జాతి అభివృద్ధికి చిహ్నంగా ఉండాలని సూచించారు. డిఎస్పీ మోకా సత్తిబాబు మాట్లాడుతూ పివి రావు ఘాట్ లక్షలాది మంది దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలంగాణా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు జి చిన్నయ్య, ఎంఎకె భీమారావు, పెయ్యిల శ్రీనివాసరావు, ఉండ్రు బుల్లియ్య, పెయ్యిల పరుసరాముడు, దోనిపాటి ఆంజనేయులు, వడ్డి నాగేశ్వరరావు, చెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

భారీ కొండచిలువ హతం
మారేడుమిల్లి, అక్టోబర్ 22: మారేడుమిల్లి మండలం మద్దులూరు గ్రామంలో ఆదివారం కొంత మంది తుప్పలు నరుకుతుండగా భారీ కొండ చిలువ కన్పించడంతో దానిని హతమార్చారు. ఇది సుమారు 12 అడుగులకు పైగా ఉండడంతో స్థానికులు దీనిని చూసేందుకు తరలి వచ్చారు.
కోటిపల్లి ఆలయాన్ని దర్శించిన చాగంటి

రామచంద్రపురం, అక్టోబర్ 22: ఆధ్యాత్మిక ప్రసంగకర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కె గంగవరం మండలం కోటిపల్లిలోని శ్రీ ఛాయా సోమేశ్వరస్వామి వారిని ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించిన బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు.. కోటిపల్లి ఆలయానికి చేరుకున్నారు. శ్రీ ఛాయా సోమేశ్వర స్వామివారికి, శ్రీ సిద్ధి జనార్దన స్వామివారికి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయ అర్చకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్రరావు బ్రహ్మశ్రీ కోటేశ్వరరావుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు, అనువంశిక అర్చకులు బ్రహ్మశ్రీ కోటేశ్వరరావుకు వేదాశీర్వచనం చేశారు. గ్రామ ప్రముఖులు పప్పుల సాయిబాబు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కండువా కప్పి, సత్కరించారు.
లక్ష్యాన్ని మించి పాల ఉత్పత్తి
రాయవరం, అక్టోబర్ 22: జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 4.61 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి లక్ష్యం కాగా, లక్ష్యాన్ని మించి 4 4.73 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి సాధించినట్టు పశుసంవర్థక శాఖ జెడి కె శివాజీ తెలిపారు. ఆదివారం ఆయన రాయవరం పశువైద్య శాల నూతన భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో పాల వినియోగం కాగా, మిగిలిన వాటిని ఇతర జిల్లాలకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 25 వేల టన్నుల మాంసం ఉత్పత్తి లక్ష్యం కాగా, ఇది కూడా లక్ష్యానికి మించి 26వేల టన్నుల మాంసం ఉత్పత్తి అయినట్టు తెలిపారు. కోడిగుడ్ల ఉత్పత్తిలో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి 250 కోట్ల గుడ్ల ఉత్పత్తి లక్ష్యం కాగా, 251 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయినట్టు చెప్పారు. జిల్లాలో 1500 ఎకరాలలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటుచేయడం లక్ష్యం కాగా, 1050 ఎకరాలను గుర్తించామన్నారు. ఇప్పటికే 550 ఎకరాల్లో సాగు చేపట్టినట్టు తెలిపారు. 2వేల మెట్రిక్ టన్నుల పాతర గడ్డిని పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. దీనిలో ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు పాతర గడ్డి కిలో రూ.2లకే విక్రయిస్తామన్నారు. సమావేశంలో పశువైద్య శాఖ ఎడి డాక్టర్ ఎం రామకోటేశ్వరరావు, రాజమహేంద్రవరం ఇన్‌ఛార్జి డిడి డాక్టర్ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.