సంజీవని

జ్వర చికిత్స మరో కోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-డి.జయకాంత్, నిజామాబాద్
జ్వరం అన్ని సందర్భాల్లోనూ సూక్ష్మజీవుల కారణంగానే వస్తుందనుకోనవసరం లేదు. జ్వరానికి రకరకాల కారణాలున్నాయి. సూక్ష్మజీవుల దాడి (ఇన్‌ఫెక్షన్) అనేది ఒక కారణం. శరీరంలో వాతాది దోషాలవలన జ్వరం వస్తుంది. ఈ దోష జ్వరాలే ఎక్కువ సందర్భాల్లో వస్తాయి. తరుణ జ్వరాలు అంటే జ్వరం వచ్చిన ఒకటి రెండు రోజుల్లో టైఫాయిడ్ లేదా మలేరియా లాంటి జ్వరాలు కావచ్చని తొందరపడి మందులు వాడించరు వైద్యులు. దోషాన్ని గుర్తించి అది తగ్గే ఉపాయాలు పాటిస్తే జ్వరం దానికదే తగ్గిపోతుంటుంది. రెండు మూడు రోజుల్లో మార్పు రాకపోతే పరీక్షలు చేయించుకుని రోగ నిర్థారణ జరిపి అపుడు యాంటిబయాటిక్స్ వాడటం చికిత్స మర్యాద. ఇది మామూలుగా వచ్చే జ్వరాల సంగతి.
శరీరంలో వాత దోషం పెరిగితే, ఒళ్లంతా విపరీతంగా నొప్పులు ఒకసారి ఉన్నట్టు, ఒకసారి లేనట్టు బాధపెడతాయి. దీన్ని ‘ఆగమాపగ క్షోభ’ అంటాడు బసవరాజీయం అనే వైద్య గ్రంథంలో. నోట్లో నీళ్లూరటం, అరుచి, అజీర్తి, కీళ్ళన్నీ పట్టుకుపోయినట్టుండటం, ఇవన్నీ వాత జ్వరంలో కనిపిస్తాయి. పొడి దగ్గు కూడా రావచ్చు.
పిత్తదోషంవలన కాళ్లూ చేతులూ ఇతర శరీర భాగాలలో మంటలూ, పోట్లూ వుంటాయి. దీన్ని ‘సర్వాంగ దాహం’ అంటారు. తల తిరుగుడు, నోరు పొక్కటం, నోరు చేదు, దప్పిక లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పైత్యం (ఎసిడిటీ) పెరిగినా ఈ జ్వరం రావచ్చు. శరీరంలో బాగా వేడి చేసినపుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి.
ఇంకొకసారి ఒళ్లంతా బరువెక్కినట్లు ఉంటుంది. దీన్ని సె్తైమిత్యం అంటారు. కఫ దోషంవలన కలిగే లక్షణాలు ఇవి. దగ్గు జలుబు, నోరు తియ్యగా ఉండి, అన్నం సహించకపోటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. గాలి పీల్చుకునే శబ్దం గురగురమని రావటం, అతి నిద్ర, మత్తుగా ఉండటం, ఇవన్నీ కఫం పెరిగినపుడు కలిగే లక్షణాలు.
ఒక్కోసారి వాత పిత్త కఫ దోషాల్లో రెండుగానీ, మూడు గానీ కలిపిన మిశ్రమ లక్షణాలు కన్పించవచ్చు. అనుభవం మీద ఆయుర్వేద వైద్యుడు దోష నిర్థాణ చేయగలుగుతాడు.
ఈ దోషాలు మిధ్యాహార విహారాలవలన కలుగుతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా లేకపోవటం, జీవించే పరిసరాలు, వాతావరణం లాంటివి మనకు వ్యతిరేకంగా ఉండటం, అర్థరాత్రి దాకా టీవీలకు అంటుకుపోవడం, ఏది పడితే అది తినటం- ఇవన్నీ మిధ్యాహార విహారాలే ఔతాయి. ఏది సరిపడితే దానే్న తినాలి! జీర్ణశక్తి విఫలం కావటం జ్వరానికి ముఖ్య కారణం అని గమనించాలి. కడుపులో అగ్ని చల్లారిపోయి పొట్ట బరువుగా వుంటుంది. కీళ్ళు నొప్పి పెడతాయి. నాలికమీద తెల్లని పొర ఏర్పడుతుంది. ముక్కుల్లోంచి గొంతుదాకా విపరీతంగా మంట, వాంతి, వికారం ఏర్పడతాయి. జీర్ణశక్తిని పెంచే చికిత్స చేయటం, అజీర్తికి కారణవౌతున్న దోషాలను తొలగించటం, అగ్ని బలాన్ని పెంచటం వలన జ్వర లక్షణాలు నెమ్మదిస్తాయి.
వ్యాధి స్వరూపాన్ని అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు పాటిస్తే, చాలా జ్వరాలు తరుణస్థితిలోనే తగ్గిపోతాయి. ప్రయత్న పూర్వకంగా జఠరాగ్ని బలాన్ని కాపాడితే జ్వరం తేలికగా తగ్గుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. దోమల నుండి, దుమ్మూ ధూళి నుండి, ఎండ, వానల నుండి, సరిపడని ఆహార పదార్థాల నుండి దూరంగా ఉంటే, జ్వర కారణాలను చాలావరకూ నివారించినట్టే అవుతుంది.
శరీరానికి తగిన విశ్రాంతినివ్వండి. విరేచనం బాగా సాఫీగా అయ్యేలా చూసుకోండి. దోషం ఏదైనా జ్వరం అనేది శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రత కాబట్టి దాన్ని చల్లార్చేందుకు బాగా చలవ చేసే బార్లీ జావ, మజ్జిగ లాంటివి ఎక్కువగా తాగండి. చలవ చేసే ఆహార పదార్థాలు జ్వరంలో అపకారం చెయ్యవు. వాత, కఫ దోషాలు ఎక్కువగా ఉన్నపుడు మిరియాల పొడి వేసి కాచిన పాలుగానీ, ధనియాలు, జీలకఱ్ఱ, శొంఠి మూడూ దంచిన పొడిగానీ కలిపి తాగితే వెంటనే ఉపశమనం కనిపిస్తుంది.
లంఖణం పరవౌషధం అనే సూక్తి తరుణ జ్వరంలో వర్తిస్తుంది. జ్వరం వచ్చిన తొలి రెండు మూడు రోజుల కాలాన్ని తరుణ జ్వరం అంటారు. ఈ కాలంలో తేలికగా అరిగే ఆహారాన్ని తీసుకొంటే జ్వరం పెద్ద జ్వరంగా మారకుండా తగ్గిపోతుంది. రోగి బలాన్ని కాపాడితే రోగబలం తగ్గుతుందని సూక్తి. అగ్నిబలం కాపాడాలనే సూత్రం కూడా ఇందులో ఇమిడి ఉంది.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com