అదిలాబాద్

వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఏప్రిల్ 28: ఎండల తీవ్రత.. ఉక్కపోత, వడగాల్పుల తాకిడి జిల్లా ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. జిల్లాలో సాధారణం కంటే 4 నుండి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండుతున్నాయి. గురువారం పగటి ఉష్ణోగ్రత 44.5 డిగ్రీలు నమోదు కాగా సాయంత్రం ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం కాస్త చల్లబడింది. గత పదేళ్లకిందటి ఎండల తీవ్రతను తిరగరాస్తూ ఏప్రిల్ మాసంలోనే రికార్డుస్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, ఉట్నూర్, నిర్మల్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, భైంసా పట్టణాలు తీక్షణమైన ఎండల తీవ్రతకు జనసంచారం లేక బోసిపోయాయి. మార్కెట్ వీధులన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. మరో వైపు ఎండల తీవ్రతతో వడదెబ్బ తగిలి జిల్లాలో ఇప్పటి వరకు 40 మందికి పైన మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉంటే ఎండల ప్రభావంగా అడవుల్లోని వన్యప్రాణులు, మూగజీవాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు బొగ్గుగనులు విస్తరించి ఉన్న తూర్పు జిల్లాలో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంది. గనుల ప్రాంతంలో నిల్వ చేసే బొగ్గు ఎండల తీవ్రతకు మండడంతో కోల్‌బెల్ట్ ప్రాంతం నిప్పుల కుంపటిగా మారుతోంది. ఎండల తీవ్రతతో కార్మికులు షిప్ట్ పద్దతిన బొగ్గుబావుల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. ఇదిలా ఉంటేరోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను అధికారులు నిలిపివేశారు. మరోవైపు ఎండల తాకిడితో వ్యవసాయ రైతుల పనులు ముందుకు సాగడం లేదు. ఎండ తీవ్రతకు తోడు తీక్షణమైన వడగాల్పులు జిల్లా ప్రజలను కలవరపెట్టిస్తున్నాయి. గురువారం పగటి ఉష్ణోగ్రత 44.5 డిగ్రీలు నమోదు కాగా భీకరమైన వడ గాల్పుల కారణంగా జిల్లా వాసులు బెంబేలెత్తిపోయారు. ఇదిలా ఉంటే వడదెబ్బ మృతుల సంక్య రోజు రోజుకు పెరుగుతోంది. ఖానాపూర్ మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో గంగ నర్సాగౌడ్ (68) అనే వృద్దుడు వడదెబ్బ సోకి ఇంట్లో ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం 7 గంటలకే పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలు నమోదు కాగా మిట్ట మధ్యాహ్నం 44.5 డిగ్రీలకు చేరుకోవడం వేసవి తీవ్రతకు నిదర్శనంగా చెప్పవచ్చు. భరించలేని వడగాల్పులకు పిల్లలు, వృద్దులు, మహిళలు తల్లడిల్లిపోయారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలైనా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ పట్టణాలు సాయంత్రం 6 గంటల వరకు జన సంచారం లేక కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో సామాన్య ప్రజలు తమ కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నారు. మరో మూడు రోజుల పాటు జిల్లాలో ఎండ తీవ్రత , వడ గాల్పుల ప్రభావం ఇదే స్థాయిలో ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటుండగా మే మాసంలో 48 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం లేకపోలేదని పలువురు అందోళన వ్యక్తం చేస్తున్నారు.