మంచి మాట

నడిచే దేవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శత వసంతాల సంపూర్ణ జీవితంలో 87 సంవత్సరాలు తొలి పీఠాధిపతులుగా ఉపస్థితులైన, జగద్గురువులు శ్రీ శంకరాచార్యుల పరంపరలో ఆశీనులైన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి జీవితం ఎంతో అపరూపమైనది. శ్రీ స్వామివారి హస్తంలో త్రిదండాలు ఆధ్యాత్మిక శక్తికి, పాండితీ ప్రకర్షకు, మానవత్వానికి ప్రతీకలు. శ్రీ శంకర భగవత్పాదుల వారసత్వాన్ని అందుకుని, సనాతన వైదిక సంస్కృతీ వైభవాలను దిగ్దిదంతాలలో పరీవ్యాప్తం చేసిన జ్ఞాన సరస్వతి, ‘నడిచే దేవుడు’గా ఆసేతు శీతనగ పర్యంతం అపర శంకరులుగా కీర్తినందినవారు శ్రీ మహాస్వామివారు.
శ్రీమహాస్వామివారు త్రికాల జ్ఞాన సంపన్నులు. సిద్ధి పురుషులు. బహుభాషాకోవిదులు. నాటి చరిత్రకు సంబంధించిన విషయ పరిజ్ఞానం ఇంతింతని చెప్పనలవికానిది. యోగులు ఆతనిని యోగీశ్వరుడన్నారు. ధార్మికులు మూర్త్భీవించిన ధర్మమన్నారు. నైతికవాదులు నైతిక సార్వభౌముడన్నారు. సర్వతంత్ర స్వతంత్రుడన్నారు. వేదాంతులు జీవన్ముక్తుడని అన్నారు. శ్రీ మహాస్వామివారు కానిదేది? అందుకే సామాన్యులు నడిచే దేవుడన్నారు.
శతాబ్దాల ఘన చరిత్రను కలిగిన కంచి పీఠాన్ని శ్రీ మహాస్వామివారు అధిష్ఠించడం ఒక అపూర్వఘట్టం. శ్రీస్వామివారి మాటల్లోనే ‘‘వైరాగ్యంతో నేను సన్యాసం తీసుకోలేదు. సన్యాసం అంటే ఏమిటో తెలియని వయస్సులో అది నన్ను వరించి వచ్చింది. నేను పీఠాధిపతిగా కూర్చోవడంవల్ల పీఠానికీ, నాకంటే ముందు పీఠాధిపత్యం వహించినవారికీ చెడ్డపేరు రాకూడదనుకున్నాను.. ‘‘ఆ శంకరాచార్యులే నన్ను నడిపించారు’’- పదమూడేళ్ళ వయస్సులో అతని అంతరంగం నుంచి వెలువడిన అక్షరసత్యాలు.
శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారి పూర్వనామం స్వామినాథుడు. 1894 మే నెల 20వ తేదీన విల్లిపురంలో శ్రీ సుబ్రహ్మణ్యం శాస్ర్తీ, మహాలక్ష్మి దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. పెద్దకుమారుడు లక్ష్మీనాథుడు. తల్లిదండ్రులు కుమారస్వామి భక్తులు. స్వామిమలైలో కొలువుదీరిన సుబ్రహ్మణ్యుని వరప్రసాదంగా భావించి స్వామినాథుడని నామకరణం చేశారు. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు బదిలీ అవుతున్న కారణంగా స్వామినాథుని చదువు సక్రమంగా జరగలేదు. మొదటి తరగతి చదువుతున్న సమయంలో, విల్లిపురం అమెరికన్ మిషనరీ పాఠశాలకు పర్యవేక్షణాధికారి వచ్చి పరీక్షిస్తూ స్వామినాథునిలోగల తెలివితేటలకు మెచ్చి మూడవ తరగతిలో వేశాడు. అక్కడే చదువు కొనసాగింది.
1907వ సంవత్సరంలో కంచిలో భయంకరమైన మశూచి వ్యాధి వ్యాపించింది. 66వ పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర స్వాములవారికి కూడా సోకింది. స్వామినాథుని తన తరువాత పీఠాధిపతిని చేయాలన్న ఆతని సంకల్పానికి అవరోధం కలుగుతుందేమోనని సందేహించారు. వెంటనే స్వామినాథుని తీసుకురమ్మని తండ్రికి వర్తమానం పంపించారు. పీఠాధిపతులకు సేవ చేయడానికి స్వామినాథుని సోదరుడు లక్ష్మీనాథులు ఉన్నారు. తమ్ముని రాక ఆలస్యం జరుగుతుందేమోనని, ఆతడు వచ్చేలోగా తనువు చాలిస్తే పీఠాధిపతి లేకుండా పీఠం ఉండకూడదని భావించి, లక్ష్మీనాథునికి సన్యాస దీక్షనిచ్చి శ్రీ మహేంద్ర సరస్వతి అనుసన్యాసనామం ఇచ్చారు. అంతేకాదు, ఆతని తరువాత స్వామినాథుడే పీఠాన్ని అధిష్ఠించాలన్న తన సంకల్పాన్ని చెప్పి, వస్త్రం, దండం, కమండలం ఇచ్చారు. తను ఉన్నా లేకున్నా స్వామినాథునికి పీఠాధిపత్యం ఇచ్చినట్లేనని చెప్పి తనువు చాలించారు.
శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆదేశానుసారం స్వామినాథుడు కంచి చేరగానే శ్రీ మహేంద్ర సరస్వతి స్వామినాథునికి సన్యాసం ఇచ్చి తమ ముందు పీఠాధిపతులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నామాన్నిచ్చి కంచి పీఠం 68వ పీఠాధిపతులుగా నియమించారు. మరికొద్ది దినాలకు శ్రీ మహేంద్ర సరస్వతి కూడా మశూచి సోకి తనువు చాలించారు. అప్పటికి పూర్వనామధేయుడైన స్వామినాథుని వయస్సు పదమూడేళ్లు. ప్రతిష్ఠాత్మకమైన కంచి పీఠాన్ని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిగా 68వ పీఠాధిపతి అధిష్ఠించారు.

- ఎ.సీతారామారావు