విజయవాడ

జక్కంపూడి కాలనీలో తీవ్ర ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూన్ 3: జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని పండిత్ నెహ్రూ బస్టాండ్ వద్ద గల రాజీవ్‌గాంధీ పూల మార్కెట్ పక్కన 5నెలల క్రితం ఇళ్లు కాలిపోగా ఆ సమయంలో అక్కడ దాదాపు 400మంది నిర్వాసితులకు అధికారులు జక్కంపూడి కాలనీలో ఇళ్లు కేటాయించారు. స్లిప్పులపై నెంబర్లు వేసి మరీ ఆయా ప్లాట్‌లోనే ఉండాలన్నారు. అయితే శుక్రవారం ఉదయం 9గంటల ప్రాంతంలో పెద్దసంఖ్యలో పోలీసు బలగాలతో కాలనీలోకి చేరుకున్న విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు ఆ రోజున ఇళ్లు కేటాయించిన వారిలో 292 మంది బోగస్ అని తేలిందని, వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని కోరారు. ఇందుకోసం హౌసింగ్ ఇఇ శ్రీనివాస్‌తో పాటుగా టూటౌన్, భవానీపురం సిఐల నేతృత్వంలో ఐదు బృందాలుగా ఏర్పడి తమ వద్ద ఉన్న జాబితా ప్రకారం అధికారులు వివిధ బ్లాకుల వద్దకు వెళ్లి జాబితా ప్రకారం బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించేందుకు రంగంలోకి దిగారు. ఇళ్లలో ఉంటున్న వారు మేము కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్లాలంటూ వాపోయినా మాకు సంబంధం లేదనే రీతిలో పోలీసులు, విఎంసి అధికారులు ఇంట్లోని సామానులు సైతం లాగేసి బయట పడేశారు. అడ్డుకున్న వారిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ సామానులు బయటపడేసి తలుపులకు ఇనుప చువ్వలతో తాళం వేశారు. ముందుగా ఒకటి రెండు బ్లాక్‌లలో ఇదే రీతిలో జరగడంతో ఒక్కసారిగా అధికారులు చెప్తున్న ఇళ్ల జాబితా వారంతా ఒక్కటై అధికారులను ఎక్కడికక్కడే చుట్టుముట్టారు. ఇళ్లలో సామానులు బయట పడేయిస్తున్న వారిని అడ్డుకున్నారు. ఆ రోజున ఇళ్లు కాలిపోయి సర్వం కోల్పోయిన మా పట్ల దయచూపుతున్నట్లుగా అధికారులు, మంత్రులు నటించి ఇప్పుడు మమ్నల్ని నకిలీలంటూ రోడ్డున పడేస్తారా, ఎక్కడ ఉండాలంటూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న సిపిఎం నగర కమిటీ సభ్యులు బాధితుల పక్షాన నిలబడి అధికారులతో మాట్లాడారు. కొద్దిసేపు అధికారుల తీరుకు నిరసనగా స్థానికులంతా ఐక్యమై ధర్నా చేశారు. పరిస్థితి విషమించడంతో ఎసిపి జి.రామకృష్ణతో పాటుగా దాదాపుగా 100 మంది పోలీసులు కాలనీకి చేరుకున్నారు. సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ కాలనీకి చేరుకుని అధికారుల తీరును తప్పుబట్టారు. ఇటువంటి చర్యలు అన్యాయమని, పేదలకు ఆనాడు ఇళ్లు ఇచ్చి ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికిపోతారని ఇఇ శ్రీనివాస్‌ను, ఎసిపి హరికృష్ణను ప్రశ్నించారు. పేదలను రోడ్డు పాలు చేయవద్దన్నారు. అక్కడ నుండే మున్సిపల్ కమిషనర్ వీరపాండయన్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు. అధికారులే నిర్వాసితులను గుర్తించి ఇళ్లు కేటాయించి, ఇప్పుడు కాదనటం సరికాదని వెంటనే ఇటువంటి చర్యలను విడనాడాలని కోరారు. ఇఇ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆ రోజున కేవలం అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో అందరికీ తాత్కాలికంగా ఉండేందుకు మాత్రమే ఇళ్లు ఇచ్చామని, శాశ్వతం కాదని తెలిపారు. రెవెన్యూ లెక్కల ప్రకారం, అంగన్‌వాడీ జాబితా మేరకు తమ వద్ద కేవలం 84 మంది మాత్రమే అర్హులని తేలిందని మిగిలిన వారిని ఖాళీ చేయిస్తున్నామన్నారు. ఐదునెలల తర్వాత ఇప్పుడు ఆ విషయం గుర్తుకు వచ్చిందా అని నాయకులు ప్రశ్నించగా దానికి ఇఇ సమాధానం చెప్పలేకపోగా దాటవేత ధోరణి అవలంభించారు. మరోవైపు ఒకరిద్దరిని పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించగా స్థానికులంతా పోలీస్ వ్యాన్‌కు అడ్డుపడి అడ్డుకున్నారు. అయినా పోలీస్ వ్యాన్‌ను అధికారులు ముందుకు నడిపే క్రమంలో ఒకరి కాలికి గాయం కాగా, మహిళలని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చి పారేశారు. పరిస్థితి విషమించడంతో అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టారు. సిపిఎం నేతల ఆందోళనతో వెనక్కి తగ్గిన అధికారగణం ఎట్టకేలకు సర్వే చేసి ఇళ్లు ఖాళీ చేయిస్తామని, అర్హులను ఇబ్బందిపెట్టమని చెప్పడంతో ఆ మేరకు సర్వేకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు బి.రమణారావు, ఎల్.మోహన్‌రావు, శ్రీదేవి, డి.విష్ణువర్థన్, పి.సాంబిరెడ్డి, వి.గురుమూర్తి, పి.మాధవ్, జి.ఝాన్సీ, పి.వెంకటరెడ్డి పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ సిపి కార్పొరేటర్ చందన సురేష్ బాధితులకు మద్దతు పలికారు.