తూర్పుగోదావరి

భవిష్యత్తుపై భరోసాకే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 3: విభజన ఫలితంగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను ప్రజలకు వివరించి భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్షలు నిర్వహిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్ర నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా స్థానిక అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సభలో యనమల ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన ఏకపక్ష విధానం, కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులు, విధులు వంటి అంశాలను వివరించారు. రాష్ట్ర ప్రజలేవ్వరూ విభజన కోరుకోకపోయినా చీకటి గదిలో పార్లమెంటు తలుపు మూసి ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించారన్నారు. విభజనలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సమతుల్యత పాటించలేదన్నారు. నిధులు, సహాయం విషయంలో నవ్యాంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జనాభా ప్రాతిపదికన అప్పులు ఎక్కువగా చూపి సాయం తక్కువగా ఇచ్చారన్నారు. విభజన నాటికి రాష్ట్రానికి రూ.16 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉందన్నారు. దీనిని భర్తీ చేయమని అడగడం జరిగిందని, 14వ ఆర్థిక సంఘం కూడా ఇదే చెప్పిందన్నారు. లోటుకు సంబంధించి ఇప్పటి వరకూ రూ.3 వేల కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. మిగిలిన నిధులు రావాల్సి ఉందని, అవి ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదన్నారు. కంఫ్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా తన నివేదికలో 15 వేల కోట్లు లోటు ఉన్నట్టు నిర్ధారించిందన్నారు. ఆ నిధులు తప్పక వస్తాయనే ఆశాభావాన్ని యనమల వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే నెంబర్‌వన్ రాజధానిగా అమరావతి నిర్మించాలన్న లక్ష్యంతో జపాన్, చైనా, సింగపూర్ వంటి ప్రపంచ దేశాల సహకారం తీసుకుంటామన్నారు. ఐఐటి లాంటి ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు రావాలంటే ఇక్కడ వారికి అనువైన పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందని యనమల అన్నారు. రాష్ట్రం సంబరాలు చేసుకునే పరిస్థితిలో లేదని, విభజన కావాలని ఎవ్వరూ కోరలేదని, రాష్ట్ర నష్టాన్ని భర్తీ చేసేందుకు గతేడాది రూ.17 వేలు కోట్లు అప్పు తెచ్చామన్నారు. ఈ ఏడాది రూ. 24వేలు కోట్లు అప్పు తెచ్చేందుకు కృషిచేస్తున్నామని యనమల అన్నారు. సముద్రంలోకి వృధాగాపోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించడంతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. ప్రపంచ దేశాల్లో దేశాల్లో గుర్తింపు పొందిన హైదరాబాద్ రెవెన్యూ పరంగా పెట్టుబడులు, ఆదాయం, ఉద్యోగుల కల్పన వంటి రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని దానితో సమానమైన నగరం నవ్యాంధ్రప్రదేశ్‌లో లేదని, ఇది విభజన రాష్ట్రానికి ప్రధాన నష్టంగా మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగుల స్థానికతలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, ఆమోదం తెలిపితే ఇక్కడ ఉద్యోగాల్లో వారి పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని యనమల అన్నారు. ఈ నెల 8న మహాసంకల్పం పేరుతో ఒంగోలులో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యనమల కోరారు. మరో ముఖ్య అతిధి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ విభజన కారణంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. రాజధాని లేని కారణంగా పరిపాలన పరంగా ఉన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. విద్య, ఉపాధి పరంగా హైదరాబాద్ వంటి నగరాన్ని కోల్పోవడం సీమాంధ్ర వాసుల దురదృష్టమన్నారు. ఇటువంటి అన్ని సమస్యలపై నవ నిర్మాణ దీక్ష పేరుతో చర్చ జరగాల్సి ఉందని సూచించారు. కార్యక్రమంలో పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు చిల్లా జగదీశ్వరి, బండారు సత్యానందరావు, అమలాపురం మున్సిపల్ ఇన్‌ఛార్జి ఛైర్‌పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎన్ వీర్రెడ్డి, బిసి కార్పోరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రవౌళి, అమలాపురం ఎఎంసి ఛైర్మన్ గునిశెట్టి చినబాబు, ఎంపిపిలు బొర్రా ఈశ్వరరావు, గుబ్బల మాతాకస్తూరి, జడ్పీటీసీలు అధికారి జయవెంకటలక్ష్మి, దేశింశెట్టి లక్ష్మీనారాయణ, ఉద్యోగ జెఎసి కన్వీనర్ వి దివాకర్, మెట్ల రమణబాబు, దాట్ల గోపీరాజు, అల్లాడి స్వామినాయుడు, నల్లా స్వామి, ఆర్డీవో జి గణేష్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్, తహసీల్దార్ నక్కా చిట్టిబాబు, బండారు రామ్మోహనరావు, యిళ్ల సత్యనారాయణ, చిక్కాల గణేష్ పాల్గొన్నారు.