తూర్పుగోదావరి

గోదావరికి పులకరింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, జూలై 31: అంత్య పుష్కరాలను పురస్కరించుకుని భక్తజనుల పుణ్యస్నానాలతో గోదావరి మాత పులకరిస్తోంది. గోదావరి మహానదికి అంత్య పుష్కరాలను ఆదివారం ఉదయం కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు గోదావరి మాతకు అర్చనలు చేసి, ప్రారంభించారు. పుష్కరుడు గత సంవత్సరం గోదావరి నదిలో ప్రవేశించి సంవత్సర కాలం ఉన్నారని, అంత్య పుష్కరాల అనంతరం కృష్ణా పుష్కరాలు జరిగి, అంత్య పుష్కరాల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండటం అదృష్టమని ఈసందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆర్డీవో కె సుబ్బారావు, ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ వర్ధినీడి వెంకటేశ్వరరావు (నాని), డిఎస్పీ ఎన్‌బిఎమ్ మురళీకృష్ణ, సిఐ పచ్చా కాశీవిశ్వనాథ్, తహసీల్దార్ కెజె ప్రకాష్‌బాబు గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, సూర్యకుమారి దంపతులు గోదావరి పుణ్యస్నానమాచరించి, స్థానికంగా గల శ్రీ ఛాయా సోమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రామచంద్రపురం డిఎస్పీ ఎన్‌బిఎం మురళీకృష్ణ కుటుంబ సమేతంగా అంత్య పుష్కర స్నానం చేశారు. ఆదివారం గోదావరిలో సుమారు 18 వందల మంది పుణ్యస్నానాలు ఆచరించి, శ్రీ ఛాయా సోమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గ్రామ సర్పంచ్ కర్రి నాగవేణి చిట్టిబాబు నేతృత్వంలో గ్రామంలో పర్యవేక్షించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శకుంతల, ఇరిగేషన్, కన్జర్వెన్సీ అధికారులు యాత్రీకులకు సౌకర్యాలందించారు. ఇఒపిఆర్‌ఆర్‌డి జి భీమారావు, గ్రామ సచివాలయ కార్యదర్శి రాయుడు ఈశ్వరరావు (మోహన్)లతో పాటు గ్రామ ప్రముఖులు పప్పుల మసేను వెంకన్న (రేవు శ్రీను), చిల్లే నాగేశ్వర రావు, కర్రి చిట్టిబాబు యాత్రీకులకు సేవలందించారు.
రావులపాలెంలో...
రావులపాలెం: గోదావరి తీరం అంత్య పుష్కరాల ప్రారంభంతో మరోసారి భక్తజనులతో కళకళలాడింది. మండలంలోని ప్రధాన స్నాన ఘట్టం రావులపాలెం గౌతమీ ఘాట్‌లో ఆదివారం ఉదయం నుండీ వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలకు పోటెత్తారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ ఘాట్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు స్థానిక సిఆర్సీ ఆధ్వర్యంలో బాదం పాలు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని సిఆర్సీ అధ్యక్షుడు నందం వీరవెంకట సత్యనారాయణ, సేవా విభాగం డైరెక్టర్ కర్రి సుబ్బారెడ్డి ప్రారంభించారు. అలాగే రావులపాలెం టింబర్ బేంబు అండ్ సామిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు పోతంశెట్టి కనికిరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యం కల్పించి పారిశుద్ధ్యం, వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించారు. ఏర్పాట్లను డిసిఎంఎస్ ఛైర్మన్ కెవి సత్యనారాయణరెడ్డి, సర్పంచ్ పోతుమూడి విజయలక్ష్మి, ఉప సర్పంచ్ కె జగన్నాధరెడ్డి, తహసీల్దార్ సిహెచ్ ఉదయ్‌భాస్కర్, ఎస్సై పివి త్రినాధ్, కార్యదర్శి దుర్గాప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు. ఘాట్‌లో నాలుగు నావలు, వలలు ఏర్పాటుచేసి రక్షణ చర్యలు చేపట్టారు. పలువురు ప్రముఖులు ఈ ఘాట్‌లో స్నానాలు ఆచరించారు. బ్రాహ్మణులు పిండ ప్రదానాలు ఆచరించారు. ఆదివారం ఉదయం నీటి ప్రవాహం నిలకడగా ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి కొంత మేర తగ్గడంతో అందుకు తగినట్లు నావలను మార్చి ఏర్పాట్లు కొనసాగించారు. ఇదిలా ఉంటే..మండలంలోని గోపాలపురం ఘాట్‌కు కూడా ఆదివారం నాటికి అధికారుల నుండి అనుమతులు లభించడంతో అక్కడ కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రెండు నావలు, మత్స్యకారులను ఏర్పాటుచేసి రక్షణ చర్యలు చేపట్టారు. ఆదివారం సాయంత్రానికి రావులపాలెం ఘాట్‌లో సుమారు 8వేల మంది, గోపాలపురం ఘాట్‌లో సుమారు 2వేల మంది స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. ఉదయం 4నుండి రాత్రి 7 గంటల వరకూ మాత్రమే స్నానానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
పి.గన్నవరంలో...
డి గన్నవరం: వైనతేయ నదీ తీరాన ఉన్న పి గన్నవరం పుష్కర ఘాట్ వద్ద ఆదివారం అంత్యపుష్కరాల స్నానాలకు భక్తులు పోటెత్తారు. అంత్యపుష్కరాలకు అధికార స్నానఘట్టం మండలంలో లేకపోయినా భక్తులు పుష్కరస్నానాలు ఆచరిస్తుండటంతో లంకల గన్నవరం, పి గన్నవరం ఘాట్లలో భక్తులకు రక్షణగా రెండేసి బోట్లను ఏర్పాటు చేసారు. లంకల గన్నవరంలో పురోహితుడు మిర్తిపాటి నారాయణ వైనతేయ నదీ స్నాన విశిష్ఠత, పుష్కర ప్రాముఖ్యతను వివరిస్తూ పుస్తకాన్ని ముద్రించి భక్తులకు పంచారు.
మునికూడలిలో...
సీతానగరం: సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో దేవాన్షు ఘాట్‌లో ఆదివారం రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అంత్యపుష్కరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కర యాత్రికులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు కనకం చంద్రశేఖర్, ఎంపిడిఒ డి శ్రీనివాస్, జడ్పీటీసీ కాండ్రు త్రివేణి శ్రీనివాస్, ఎంపిపి చిట్టూరి శారదారంగారావు, వైస్ ఎంపిపి కోసూరి త్రిమూర్తులు, మాజీ ఎంపిపి పెందుర్తి దేవదాస్, ఎంపిటిసి కరుటూరి విశ్వనాధ్, సర్పంచ్ కవల కృష్ణమూర్తి, ఎస్సై ఎం పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జొన్నాడలో...
ఆలమూరు: గోదావరి అంత్యపుష్కరాల సందర్భంగా ఆదివారం జొన్నాడ పుష్కరఘాట్‌లో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం ఉదయం సుమారు 2500 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు చెప్పారు. తెల్లవారుజామున అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు స్నానాల అనంతరం పుష్కర ఘాట్‌కు ఇరువైపులా గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మరికొందరు తమ పూర్వీకులకు పిండ ప్రదానాలు చేశారు. ఎంపిడిఒ నాతి బుజ్జి, ఇవోపిఆర్డీ బోజిరాజు, తహసీల్దారు టిఆర్ రాజేశ్వరరావు ఏర్పాట్లు పర్యవేక్షించగా, ఎస్సై శేఖర్‌బాబు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు.
కపిలేశ్వరపురం మండలంలో...
కపిలేశ్వరపురం: గోదావరి అంత్య పుష్కరాల సందర్భంగా ఆదివారం నదీ పరివాహక గ్రామాలైన కోరుమిల్లి, కపిలేశ్వరపురం, కేదార్లంక, తాతపూడి గ్రామాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు పూజలు చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆయా పుష్కరఘాట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆయా పంచాయితీలు ఏర్పాట్లు చేశారు. ఎంపిడిఒ వి అబ్రహంలింకన్, అంగర ఎస్సై దుర్గాప్రసాద్, సర్పంచులు పాల్గొన్నారు.
కేదార్లంకలో...
కొత్తపేట: అంత్య పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆదివారం గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. కొత్తపేటలోని సూర్యగుండాల రేవులో గోదావరిలో నీరు లేకపోవడంతో ఇక్కడికి సమీపంలోని కేదార్లంక గోదావరి గౌతమి ప్రధాన నదిలో భక్తులు స్నానాలు చేశారు. అయితే ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో ప్రమాదాలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రమాదాన్ని తెలిపే కనీసం హెచ్చరికలు బోర్డులు కానీ, బారికేడ్లు కానీ ఏర్పాటు చేయకపోవడం పట్ల భక్తులు అధికార్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.