మెయిన్ ఫీచర్

సర్వ పాపాలను హరించే చక్రతీర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలకా పట్టణ ప్రభువైన కుబేరుడు ఒకసారి కైలాసానికి ఉత్తరం వైపున వైష్ణవ యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి విష్ణుమూర్తి వచ్చాడు. ఆయనతోపాటు సూర్యుడు, చంద్రుడు, దిక్పాలకులు, గంధర్వులు విచ్చేశారు. ఆ యజ్ఞంలో కుబేరుని కొడుకు నలకూబరుడు ధనాగారానికి పాలకుడిగా, వీరభద్రుడు రక్షకుడుగా, గణపతి సేవా కార్యక్రమమునకు గాను వియోగింపబడ్డారు. ధర్మతత్పరుడైన కార్తికేయుడు సదస్యులకు మర్యాదచేయసాగాడు. కుబేరుని మంత్రులు ఘంటానాథుడు, పార్శ్వవౌళి- శాస్తక్రారులకు పెద్దలుగా దానాధ్యక్షులుగా వ్యవహరింపసాగారు.
మహావైభవంగా యజ్ఞం ముగిసింది. యజ్ఞానంతరం కుబేరుడు దేవతలకు, వేద పండితులకు దానధర్మాలు చేశాడు. శుభావహంగా యజ్ఞ కార్యక్రమం పరిసమాప్తి అవుతున్న దశలో మహర్షి దుర్వాసుడు అక్కడకు వచ్చాడు. ఆయన శరీరం కృశించి ఉంది. ముఖం కోపంతో తీక్షణంగా ఉంది. కుబేరుడు భయభక్తులతో ఆయనను పూజించి, ‘‘మహాత్మా! మీ రాకతో నా జీవనం, ఈ యజ్ఞం పావనమయ్యాయి’’ అన్నాడు వినయంగా.
అందుకు దుర్వాసుడు సంతోషించి ‘‘ఓ రాజాధిరాజా! నీవు ధర్మాత్ముడవు. నీ దాతృత్వం బ్రాహ్మణ భక్తి నిరుపమానం! శ్రీ మహావిష్ణువును మెప్పించే విధంగా యజ్ఞం నిర్వహించావు. నీవు మంచి దాతవని విన్నాను. మీ ఇంటనున్న నవ నిధులు నాకు కావాలి. అవి ఇస్తే నీకు శుభం కలుగుతుంది. లేకుంటే నిన్ను శపిస్తాను!’’అన్నాడు నిర్మొహమాటంగా. దానశీలుడైన కుబేరుడు మారుమాట్లాడకుండా అందుకు అంగీకరించాడు.
కానీ ఆ సమయంలో దానాధ్యక్షులుగా ఉన్న ఘంటానాథుడు, పార్శ్వవౌళిలిద్దరూ లోభగుణ మోహితులై కుబేరునితో, ‘‘ఈ మహర్షి ఒంటరివాడు. నవ నిధులనూ తీసికొని వెళ్ళి ఏంచేసుకుంటాడు? పోనీ ఒక లక్షకాసులు ఇచ్చి మిగిలిన ధనం మీరు ఉంచుకోవడం మంచిది’’ అన్నారు. వీరి మాటలు విని దుర్వాసుడు ఆగ్రహావేశాలతో కళ్ళెర్ర చేశాడు. కుబేరుడు భయపడుతూ వినయభావంతో ఆయనచెంత నిలబడ్డాడు.
దుర్వాసుడు ఆ మంత్రులవైపు తీక్షణంగా చూస్తూ ‘‘ఓ ఘంటానాథా! నీవు దుష్టబుద్ధివి. లోభుడవు. నువ్వొక మొసలిగా మారిపో... ఓరీ పార్శ్వవౌళీ! మత్త్భేమువలె మదించి యజమానికి దుష్టబోధ చేశావు గనక నీవు ఏనుగువై జీవించు’’అని శపించాడు. పిమ్మట ఆ మహర్షి కుబేరుని చూచి ‘‘ఓ రాజ రాజా! నీ దాతృత్వానికి ప్రసన్నుడనయ్యాను. నీవుచేసిన ఈ దానంవల్ల నీ నవ నిధులు రెండింతలు అగుగాక!’’అని పలికి నిష్క్రమించాడు.
మహర్షి శాపంవల్ల దీనులై దుఃఖిస్తున్న మంత్రులను చూసి కుబేరుడు రక్షించమని అక్కడే ఉన్న శ్రీమహావిష్ణువును శరణువేడాడు. అప్పుడు మహావిష్ణువు ‘‘ఆయన శాపాన్ని పరిహరించే శక్తి నాకులేదు. మీరిద్దరూ మకర, మద గజాలుగా మారక తప్పదు. కొంతకాలం తరువాత మీ ఇద్దరికీ భీకరమైన పోరు జరుగుతుంది. ఆ సమయంలో నా అనుగ్రహంవల్ల మీకు మీమీ రూ పాలు కలుగుతాయి! అన్నాడు. మహావిష్ణువు ఇలా పలికిన కొంత సేపటికి ఆ మంత్రులిద్దరూ మొసలిగా, ఏనుగుగా మారిపోయారు. ఘంటానాధుడు గోమ తీ నదిలోనూ, పార్శ్వావౌళి రైవతగిరి ప్రాంతంలోనూ జీవింపసాగారు...
ఒక పర్యాయం గజరాజుగా జీవిస్తున్న పార్శ్వవౌళి తన బృందంతో సమీపంలోవున్న గోమతీనదికి వచ్చి స్నానం చేయసాగాడు. ఏనుగుల బృం దమంతా నదిలోకి క్రీడిస్తూ ఒకదానిపై ఒకటి తొండాలతో నీళ్ళు జల్లుకోసాగాయి. అవలా జలకాలాటలో ఉండగా ఒక మొసలి కోపంతో వచ్చి గజరాజు కాలుపట్టుకొని లోపలకు లాగసాగింది. గజేంద్రుడు ఆ మొసలిని బయటకులాగడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆమె తన పట్టువిడువలేదు. ఆ గజేంద్రుణ్ణి విడిపించడానికి మిగిలిన ఏనుగుల వశం. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు వాటి పోరు కొనసాగింది. క్రమంగా నీరసించిపోతున్న గజరాజుకి అప్పుడు పూర్వజన్మ స్ఫురణ కలిగింది. అది భక్తిపూర్వకంగా శ్రీమహావిష్ణువును, ‘‘ఓ పరమపావనా! పరమేశ్వరా! నన్ను ఈ మొసలి బయటినుంచి రక్షించు... రక్షించు!’’అని ప్రార్థించసాగింది. దీనవత్సలుడైన భగవానుడు గజేంద్రుని మొర విని గరుత్మంతుని అధిరోహించి వేగంగావస్తూ- ఇంకా ఆత్రంగా గరుత్మంతుని కూడా వదిలిపెట్టి మరింత వేగంగా ముందుకువచ్చి తన చక్రాన్ని విసిరివేశాడు.
ఆ విష్ణుచక్రం వచ్చి తగిలీ తగలకముందే ఆశ్చర్యకరంగా ఆ మొసలి తన శరీరంనుంచి వేరయిపోయింది. అప్పు డా చక్రం వృథాపోకుండా ఆ గోమతీ నదిలోని రాయి చక్ర చిహ్నితముల నొనర్చింది. మహావిష్ణువు చక్రం ప్రవర్తిల్లిన స్థలంకాబట్టి అది చక్రతీర్థం అయింది. పరమాత్ముని అనుగ్రహంవల్ల మకర గజేంద్రులు ఆ రూపాలను వదలి తమ పూర్వ రూపాలను పొందాయి. కుబేరుని మంత్రులైన ఘంటానాథుడు, పార్శ్వవౌలిలు శ్రీమహావిష్ణువుకు నమస్కరించి ఆ స్వామిని స్తుతించి తమ నివాసాలకు వెళ్ళిపోయారు. ఆనాటినుంచి గోమతీనది విష్ణుచక్ర ప్రభావంతో చక్రతీర్థంగా పేరుపొందింది. ఈ చక్రతీర్థగాథను విన్నవారికి చక్రతీర్థంలో స్నానం చేసిన ఫలం లభిస్తుందని సర్వపాపాలు హరించబడతాయని అంటారు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు