అదిలాబాద్

బాసరలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, సెప్టెంబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా బాసరలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. గ్రామంలోని పలు ప్రైవేటు పాఠశాలలు వర్షం కురవడంతో నీటిలో మునిగాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. గ్రామంలోని రవీంద్రపూర్, మైలాపూర్, శారదానగర్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ఇబ్బందుల పాలయ్యారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
* కలెక్టర్ జగన్మోహన్

ఆదిలాబాద్, సెప్టెంబర్ 23: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందునా వైద్య శాఖ అధికారులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ జగన్మోహన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు, వర్షాల ప్రభావంపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు చిత్తడిగా మారి మురికి కాలువలు రోగాలకు ఆస్కారంగా ఏర్పడ్డాయని అన్నారు. నీరు నిల్వ ఉండకుండా అధికారులు చర్యలు తీసుకుంటూ గ్రామపంచాయతీల్లో వైద్య ఆరోగ్యం, ఆర్ డబ్ల్యూ ఎస్, అంగన్వాడి సిబ్బందిని అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి శుక్రవారం మురికి కాలువల క్రమబద్దీకరణ కోసం డ్రైడే పాటిస్తూ చైతన్యవంతం చేయాలని అన్నారు. నీరు నిల్వ ఉన్న చోట దోమలు వృద్దిచెందకుండా, తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, గ్రామాల్లో బ్లిచింగ్‌పౌడర్ క్లోరినేషన్ చేపట్టాలని అన్నారు. ప్రతి గ్రామంలో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, డిఆర్‌వో సంజీవరెడ్డి, ఆర్డీవోలు ఐలయ్య, శివలింగయ్య, ఆయేషా మస్రత్‌ఖానం, జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

ఆయిల్ సీడ్స్ మేనేజ్‌మెంట్ సభ్యునిగా భూమయ్య

ఆదిలాబాద్, సెప్టెంబర్ 23: జాతీయ వ్యవసాయ అనుబంధ పరిశోధన సంస్థ ఆయిల్ సీడ్స్ మేనేజ్‌మెంట్ పాలకవర్గ సభ్యునిగా బిజెపి సీనియర్ నాయకుడు అయ్యన్నగారి భూమయ్యను నియమిస్తూ శుక్రవారం రాజేంద్రనగర్ ఆయిల్ సీడ్స్ పరిశోధన మండలి డైరెక్టరేట్ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిర్మల్‌కు చెందిన అయ్యన్నగారి భూమయ్య 35ఏళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ 1991 నుండి బిజెపిలో కీలకనేతగా గుర్తింపు సాధించారు. 1995లో ఆయన సతీమణి భూలక్ష్మి నిర్మల్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బిజెపి నుండి ఎన్నికయ్యారు. 1996-99 వరకు బిజెపి జిల్లా అధ్యక్షునిగా ఆ తర్వాత రెండు పర్యాయాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, 2012 నుండి 2014 వరకు మరోదఫా బిజెపి జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర నూనె గింజల పరిశోధన మండలి తరుపున రాష్ట్రం నుండి ఇద్దరిని నామినేట్ చేశారు. భూమయ్యకు కీలక పదవి లభించడం పట్ల బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ అభినందనలు తెలిపారు. వెనకబడిన జిల్లాలో రైతులకు ఉపయోగపడే నూనె గింజల పరిశోధన మండలిలో సేవలందించేందుకు గుర్తింపునిచ్చారన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నగారి భూమయ్య మాట్లాడుతూ నిబద్దత గల కార్యకర్తగా పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగానే తనకు ఈ పదవి వరించిందని, అక్టోబర్ 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లోని రాజేందర్‌నగర్‌లో జరిగే మండలి సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు.

మిషన్ భగీరథకు ఎస్సారెస్పీ నీటినివ్వాలి
* సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్
భైంసా రూరల్, సెప్టెంబర్ 23: ముధోల్ నియోజకవర్గ పరిధిలో మిషన్ భగీరథ( వాటర్‌గ్రిడ్) పథకానికి పోచంపాడ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని ఇవ్వాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్‌చేసింది. శుక్రవారం భైంసా పట్టణంలోని ప్రభుత్వ విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు రాజు మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో 237 గ్రామాలు భైంసా మున్సిపాలిటికి నీటి సరఫరాకై పట్టణం సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టునుండి నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించి పనులను ప్రారంభించిందని తెలిపారు. అయితే రోజుకు 16 గంటలపాటు నీరందించే లక్ష్యంగా ప్రారంభించిన పథకానికి గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నీటిలభ్యత తక్కువగా ఉండడంతో పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు నీటినిల్వ తక్కువగా ఉండి పథకం నీరుగారే అవకాశం ఉంటుందన్నారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటే ప్రాజెక్టులో నీటి లభ్యత లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. ప్రాజెక్టు నుండి పట్టణానికి నీరు సరిపోని పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలకు ఏమేరకు సరఫరాచేస్తారన్నారు. నియోజకవర్గం భూములు కోల్పోయి ప్రాజెక్టును నిర్మించిన దృష్ట్యా నియోజకవర్గంలోని సుద్దవాగు ప్రాజెక్టులోకి లిఫ్ట్‌ల ద్వారా నీటిని అందించాలని డిమాండ్‌చేశారు. లేనిపక్షంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయి కేవలం తాగునీటి అవసరాలు తీర్చడం కోసమే ప్రాజెక్టు మిగిలిపోయే అవకాశం ఉండడంతో ఆయకట్టు రైతాంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. సమావేశంలో పివోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి హరిత, ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు కత్తిగంగారాం, బి.లక్ష్మణ్, అడెల్లు, పిడిఎస్‌యు మాజీ కార్యదర్శి చంటి తదితరులు పాల్గొన్నారు.

ముస్లిం మైనార్టీల ర్యాలీ
ఉట్నూరు, సెప్టెంబర్ 23: దేశంలో పెట్రేగిపోతున్న ఉగ్రవాదుల తీరును నిరసిస్తూ ముస్లిం మైనార్టీలు శుక్రవారం ఉట్నూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. వినాయక చౌక్ నుండి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశాన్ని ప్రేమిద్దాం.. ఉగ్రవాదాన్ని తరిమికొడుదాం, ఉరి అమరజవానులకు జోహార్లు అంటూ నినాదాలు చేయగా ఉట్నూరు హోరెత్తి పోయింది. అనంతరం ఆర్డీవో కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సంధర్భంగా పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ పాకిస్తాన్ తీరును ఖండిస్తున్నామని అన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ సాయంతోనే ఉగ్రవాదులు రెచ్చిపోతూ దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటిస్తూ ప్రపంచ దేశాలు సహాయ సహకారాలు నిలిపివేయాలన్నారు. ఉరి సైనికస్థావరంలో నిద్రిస్తున్న భారత జవాన్‌లపై ఉగ్రవాదులు దాడి చేసి హతమార్చడం పరికిపంద చర్యగా అభివర్ణించారు. దమ్ముంటే ముఖాముఖిగా దాడులు చేస్తే తామేంటో, తమ దేశం తాడాఖ ఎంటో చూపిస్తామన్నారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు ఇబ్రహీం, రహీస్, ఎక్బాల్, మోసీన్, పర్వీద్, వజీద్, షబ్బీర్, ఆబీద్, సర్పంచ్ బొంత అశారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంధకారంలో హన్మంతుపల్లి
* ఆందోళనలో గ్రామ ప్రజలు
లక్సెట్టిపేట, సెప్టెంబర్ 23: మండలంలోని చందారం గ్రామ పంచాయతీ పరిధిలో గల హన్మంతు పల్లి గ్రామంలో గత నాలుగు నెలలుగా వీధి దీపాలు పెట్టించకపోవడంతో గ్రామం అంధకారంగా మారడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామపెద్దలు పొన్నం శంకర్ గౌడ్, తిరుపతి, రేగుంట మహేష్, పందిరి వెంకటేష్, రాజాగౌడ్, బొలిశెట్టి లచ్చయ్య, తోట చుక్కయ్యలు సర్పంచ్‌తో పాటు అధికారుల దృష్టికి నెలకొన్న సమస్యలను తీసుకెళ్లినా కూడా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం అయినందున గ్రామాల్లోని పలు వీధుల్లో పిచ్చి గడ్డి పెరిగిపోయి అందులో పాములు, విష కీటకాలు సంచరిస్తున్నాయి, వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి పూట బయటకు వెళ్లడానికి జంకుతున్నామన్నారు. అలాగే డ్రైనేజీల్లో పూడిక తీసి మట్టిని షిఫ్టు చేయకపోవడంతో వర్షాలు కురవడం వల్ల మళ్లీ అట్టి మట్టి డ్రైనేజీల్లోనే నిండిపోయిందని తెలిపారు. వర్షపునీరు, తదితర వృథా నీరు రోడ్డుపైనే వెళ్లడంతో కంపు వాసన కొడుతుందన్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ద్య పనులు చేపట్టిన పాపాన పోలేదన్నారు. వర్షాకాలం ఆరంభమై రెండు నెలలు గడుస్తున్నా బావుల్లో క్లోరినేషన్ చేయలేదన్నారు. ఇటీవల జరిగిన వినాయక నవరాత్రుల సమయంలో గ్రామాల్లో వినాయక నవరాత్రులు జరిపినపుడు వీధి దీపాలు పెట్టాలని సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఆ సమయంలో కూడా రాత్రి వేళల్లో బయటికి వెళ్లాలంటే పిల్లా పెద్దలంతా భయాందోళనలకు గురయ్యారని వారు తెలిపారు. రానున్న సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు ఉన్నందున కనీసం ఆ పండగల వరకైనా గ్రామంలో పారిశుద్ద్య పనులు చేపట్టి, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. లేనిపక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని దిగ్బందం చేస్తామని వారు హెచ్చరించారు.

గుడిపేటలో జిల్లా కార్యాలయాల
మంచిర్యాల, సెప్టెంబర్ 23: మండలంలోని గుడిపేట గ్రామంలో నూతన జిల్లా కొమురంభీం (మంచిర్యాల)లో జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. గుడిపేట ప్రభుత్వ పాఠశాలలో జిల్లా పంచాయతీ కార్యాలయ ఏర్పాటు కోసం పలు భవనాలు సిద్దం చేసి శుక్రవారం ఈవోపిఆర్‌డి శంకర్, పంచాయతీ కార్యదర్శి శ్రీపతి బాపు, ప్రదీప్‌కుమార్ పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన బోర్డును ఏర్పాటు చేశారు. నూతన జిల్లా కార్యాలయాలకు సంబంధించిన నివేదికలను కలెక్టర్‌కు సమర్పించగా, పలు కార్యాలయాలకు సంబంధించిన ప్రొసీడింగ్‌లను జిల్లా కలెక్టర్ జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గుడిపేటలో జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ గదులను సిద్దం చేసి విద్యుత్‌తో పాటు ఫర్నీచర్ ఏర్పాట్లను స్థానిక పంచాయతీ అధికారులు చేస్తున్నారు. గుడిపేటలో పలు కార్యాలయాల ఏర్పాట్లకు అనువుగా ఉంటుందని అధికారులు అందించిన నివేదిక ఆధారంగా సంబంధిత అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. డిపివో కార్యాలయంతో పాటు సోషల్ వెల్ఫేర్, బిసి వెల్ఫేర్, ఎస్సీ కార్పోరేషన్, బిసి కార్పోరేషన్ తదితర జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి సిద్దం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలోని ఆయా గదులను ఆయా శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు. జిల్లా పశు సంవర్థక శాఖ కార్యాలయాన్ని సైతం గుడిపేటలోనే ఉంచాలన్నారు.

ఐఎన్‌టియుసి కలహాల వల్లే వేజ్‌బోర్డు ఆలస్యం
* కార్మికులకిచ్చిన హమీలను నెరవేర్చాం
* త్వరలో వారసత్వ ఉద్యోగాలు
* టిబిజికెఎస్ అధ్యక్షుడు వెంకట్రావు
శ్రీరాంపూర్ రూరల్, సెప్టెంబర్ 23: ఐఎన్‌టియుసి అంతర్గత కలహాల వల్లే వేజ్‌బోర్డు ఆలస్యమవుతోందని టిబిజికెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు అన్నారు. శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కెంగెర్ల మల్లయ్యతో కలసి మాట్లాడారు. ఐఎన్‌టియుసిలో వర్గపోరువల్లే వేజ్ బోర్డు ఆలస్యమవుతోందన్నారు. సింగరేణిలో బెల్లంపల్లి రీజియన్‌లో ఐదు నెలల కాల వ్యవధిలో ఆరుగురు కార్మికులు గని ప్రమాదంలో మృతిచెందారని, సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి లక్ష్యంపై ఉన్న శ్రద్ద కార్మికుల రక్షణపై లేదన్నారు. ఉత్పత్తిలో సంవత్సరానికి వేల కోట్లు లాభాలు అర్జిస్తున్న సంస్థ కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని, గని ప్రమాదాలపై డిజిఎంఎస్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి దోషులైన అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో టిబిజికేఎస్ గుర్తింపు కార్మిక సంఘంగా కార్మికులకు ఎన్నో హక్కులు సాదించి పెట్టామన్నారు. తెలంగాణ ఇంక్రిమెంట్, వీఆర్‌ఎస్ కార్మికులకు 3001మందికి ఉద్యోగావకాశం కల్పించామన్నారు. పిఎంఇ మాస్టర్, యునిఫాం, రెండవ కాన్పు, గనులపై రెస్ట్ హాల్, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. త్వరలోనే వారసత్వ ఉద్యోగాలపై కెసిఆర్‌ను ఒప్పించి వారసత్వ ఉద్యోగాలను సాదిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో టిబిజికేఎస్ నాయకులు పెద్దపెల్లి కోటిలింగం, బంటు సారయ్య, బండి రమేష్, లెక్కల విజయ్, పానుగంటి సత్తయ్య, సురేందర్ రెడ్డి, నెల్కి మల్లేష్, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

సంఘ భవనాలకు చేయూతనందిస్తా
* ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
బాసర, సెప్టెంబర్ 23: కుల సంఘ భవనాలకు ఆర్థిక చేయూతనందిస్తానని ముధోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామంలోని మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుల సంఘాల అభివృద్దికి ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. సంఘాల ఐక్యతతో అభివృద్ది సాధించుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఎస్సీ సంఘ నాయకులు ఎస్సీ కమ్యూనిటి హాల్, సిసి రోడ్లు నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. పద్మశాలి సంఘ కులస్తులు,మైనార్టీ నాయకులు ఆయా సంఘాలకు నిధులివ్వాలని ఎమ్మెల్యేలు కోరారు. నిధుల విడుదలకు కృషిచేస్తానని ఎమ్మెల్యే వారికి హామీనిచ్చారు. అనంతరం గ్రామంలో ఇటీవలే మృతిచెందిన గంగవ్వ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శైలజా సతీశ్వర్‌రావు, పి ఎసి ఎస్ మాజీ ఛైర్మెన్ నూకం రామారావు, ఎంపిటిసిలు గెంటిల శ్యాంసుందర్, పోతన్న, పి ఎసి ఎస్ డైరెక్టర్ హన్మంత్‌రావు, తెరాసా నాయకులు బల్గం దేవెంధర్, అరుణ్‌కుమార్, మల్కన్నయాదవ్, సుఖేష్, సుజిత్, వార్డు మెంబర్ యోగేష్, బాసర ఎస్సై తోట మహేష్, తదితరులు పాల్గొన్నారు.

వడివడిగా పునర్విభజన
* ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో ఇచ్చోడ, నేరడిగొండ
* నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవు
* సమీక్షా సమావేశంలో కలెక్టర్ జగన్మోహన్

ఆదిలాబాద్, సెప్టెంబర్ 23: దసరా పండగ రోజున కొమరంభీం (మంచిర్యాల), నిర్మల్ జిల్లాల్లో ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, విధులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని, నేరడిగొండ, ఇచ్చోడ, బజార్‌హత్నూర్ మండలాలు ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోనే కొనసాగేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఆయా శాఖల వారీగా చేపడుతున్న కసరత్తు, ఉద్యోగుల విభజన, కార్యాలయాల ఏర్పాటు అంశాలపై సమీక్షించారు. నూతన కార్యాలయాల వద్ద ఆయా శాఖల బోర్డులను ఏర్పాటు చేయాలని, భవనాలకు ఏవైన మరమ్మత్తులు ఉంటే వెంటనే యుద్ద ప్రతిపాదికన మరమ్మత్తులు చేపట్టి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల పునర్విభజన కసరత్తు ప్రక్రియ మందకొడిగా సాగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల పునర్విభజన, కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని అన్నారు. శాస్ర్తియ పద్దతిలో సాగుతున్న ప్రక్రియ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోతే ఆర్ అండ్‌బి శాఖ అధికారులు నిర్ణయించిన ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకోవాలని, అదే విధంగా జిల్లా కేంద్రంతో పాటు కొత్తగా ఏర్పడే మంచిర్యాల, నిర్మల్ డివిజన్లలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలను కలెక్టర్ కార్యాలయంలో అందించాలని అన్నారు. విభజన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, నూతనంగా కొమరంభీం, నిర్మల్ జిల్లాల్లో ఉద్యోగులు, అధికారులకు అవసరమైన వసతులు, వౌలిక ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. కొత్తగా ప్రభుత్వం నిర్మల్, కొమరంభీం జిల్లాతో పాటు భైంసా, బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేస్తున్నందునా ఈ విషయంలో ప్రత్యేక కసరత్తు నిర్వహించి, కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేయాలని అన్నారు. కొత్తగా నస్పూర్, మావల మండలాలు డ్రాప్ట్ నోటిఫికేషన్ ముసాయిదాలో జారీ చేయడం జరిగిందని, అదనంగా హాజీపూర్, ఆదిలాబాద్ అర్బన్, పెంచికల్ పేట్, చింతల మానేపల్లి, బాసర, సోన్, గాధీగూడలో నూతన మండలాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ప్రభుత్వం నుండి వచ్చే ఆదేశాల మేరకు తగు విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పివో ఆర్‌వి కర్ణన్, ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్, డిఆర్‌వో సంజీవరెడ్డి, ఆర్డీవోలు ఐలయ్య, శివలింగయ్య, ఆయేషామస్రత్‌ఖానం, జడ్పీ సిఈవో జితేందర్ రెడడ్డి, సిపివో కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

ఎల్లంపల్లికి భారీగా వరద నీరు
* నాలుగు గేట్లు ఎత్తివేత
మంచిర్యాల, సెప్టెంబర్ 23: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా, వర్షపు నీరంతా ప్రాజెక్టులోకి చేరడంతో ప్రస్తుతం 147.72 మీటర్లుగా నీటి మట్టం ఉంది. శుక్రవారం ఉదయం ప్రాజెక్టు అధికారులు ఎనిమిది గేట్లు ఎత్తి 17,421 క్యూసెక్కుల నీటిని దిగవన ఉన్న గోదావరి నదిలోకి వదిలారు. సాయంత్రం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో తగ్గడంతో నాలుగు గేట్లు మూసివేసి మిగిలిన నాలుగు గేట్ల ద్వారా 5,120 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1,640 క్యూసెక్కుల నీరు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎగువన వర్షాలు కురిస్తే ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం కంటే ఎక్కువ పెరగకుండా అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు నీటిని గేట్ల ద్వారా కిందకు వదులుతున్నారు.