శ్రీకాకుళం

ముంపు అంచుల్లో మడ్డువలస జలాశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 23: అల్పపీడన ప్రభావంతో జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కరుస్తున్న వర్షాలతో జిల్లా వ్యాప్తంగా జలాశయాలు, నదులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. సువర్ణముఖి, వేగావతి నదులు నుంచి మడ్డువలస ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి నాగావళి నదిలోకి 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు తోటపల్లి జలాశయానికి భారీగా వరదనీరు చేరుతుండటంతో రెండు గేట్లు ఎత్తి నాగావళిలోకి 3800 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. వంశధార జలాశయం నుంచి 7 గేట్లు ఎత్తి ఏడు వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఉత్తరకోస్తాంధ్రపై తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రాంతాలకు ఆనుకుని తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో 24 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అప్రమత్తమవుతున్నారు. జిల్లా అంతటా సగటు వర్షపాతం 29.4 మి.మీ వివిధ మండలాల్లో వర్షం నమోదయ్యింది. ఉదయం ఆరు గంటల నుంచి కురిసిన వర్షం మధ్యమధ్యలో లేతసూర్యకిరణాలు చిటపట చినుకుల మధ్య దూసుకువస్తున్నా.. వర్షం భారీగా కురిసే సమయంలో మాత్రం మేఘాలు చిమ్మచీకటిగా ఆకాశమంతా సర్దుకుని ఆకాశానే్న చిల్లుపెట్టేలా కుండపోత వర్షం శుక్రవారం రోజుంతా కురిసింది. ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో మడ్డువలస జలాశయానికి జలకళ వచ్చింది. గంటగంటకూ నీటిమట్టం పెరుగుతుండటంతో జిల్లా అధికారులు అప్రమత్తమవుతున్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం సూచించారు. ఇప్పటికే, వంగర మండలంలో సుమారు 14 గ్రామాల్లో వరదనీరు చేరిందన్నారు. శిథిలావస్థకు చేరిన భవనాల విషయంలో అప్రమత్తంగా ఉండి అవసరమతే వాటిని కూల్చివేయాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించామన్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేకుజాము నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో జనవజీవనం అస్తవ్యస్తమైంది. కుండపోత వర్షం వల్ల ఇప్పటి వరకూ రెండు పూరిగుడెసెలు నేలమట్టం అయ్యాయి. మడ్డువలస, తోటపల్లి ప్రాజెక్టుల నుంచి నాగావళి నదిలోకి నీటిని విడుదల చేయడంతో వరదనీటి ఉద్ధృతి శుక్రవారం సాయంత్రానికి పెరిగింది. ఉదయం మడ్డువలసలో 60 వేల క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి రాత్రి సమయానికి 80 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదిపైన నాటు పడవలతో ప్రయాణాలు చేయరాదని హెచ్చరించారు. మండల ప్రత్యేకాధికారి జి.కృష్ణారావు, తహశీల్దార్ జి.సత్యన్నారాయణ, వీఆర్వోలు, వీఆర్‌ఏలు నదిలో వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు. వర్షాలు కురుస్తున్నందన నిదికి వరద నీరు పెరిగే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో దండోరా వేయించారు. మడ్డువలస జలాశయానికి చేరుతున్న వరదనీటి ఉదృత వల్ల ఇప్పటికే ఏడు గేట్లు ఎత్తివేసినట్లు జలాశయం డీఈ పద్మజ తెలిపారు. జలాశయంలోకి స్వర్ణముఖి, వేగావతి నదుల ద్వారా వేలాది క్యూసెక్కుల నీరు చేరడంతో ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 82.4 మీటర్లుగా నమోదైనట్టు తెలిపారు. జలాశయానికి దిగువనున్న గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉండాలనంటూ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మన్యంలో పొంగుతున్న వాగులు
సీతంపేట మన్యంలో శుక్రవారం కురిసిన భారీ వర్షంతో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. పాలకొండ, హడ్డుబంగి రహదారిపై కుసుమి, వాబ కూడలి వద్ద రహదారికి ఆనుకుని వాగు నీరు ప్రవహించడంతో ఆ రోడ్డులో రవాణాలు స్తంభించిపోయాయి. అలాగే, భామిని మండలంలో భారీ వర్షం కురస్తుండడంతో పత్తి, ఇతర పంటలకు భారీ నష్టం సంభవిస్తుందంటూ మన్యప్రాంతం రైతులు ఆందోళన చెందుతున్నారు.
వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తం
జిల్లాలో భారీవర్షాలు నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సనపల తిరుపతిరావు తెలిపారు. ముంపుప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాపించకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్యం పట్ల ప్రజలు అమ్రత్తంగా ఉండాలని పరిశుభ్రమైన ఆహారానే్న తినాలని, సురక్షితమైన నీటిని తాగాలని సూచించారు. అనారోగ్యం ఉన్న వారు వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు.
పరిశుభ్రతతోనే డెంగీ నివారణ
శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 23: పరిసరాల పరిశుభ్రతతోనే డెంగీని పూర్తిగా నివారించగలమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సనపల తిరుపతిరావు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ డెంగీ నిర్మూలనపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, దీనికి ప్రజా సహకారం అవసరమన్నారు. ఆకస్మికంగా జ్వరంతో కూడిన కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, కంటిలోపల భాగంలో నొప్పులు, వాంతులు ఉన్నట్లైతే డెంగ్యూ లక్షణాలుగా గుర్తించవచ్చన్నారు. వ్యాధి నిర్థారణ పరీక్షలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోను, ర్యాపిడ్ కిట్‌తో ప్రిలిమనరీ పరీక్ష చేస్తారని, వ్యాధి తీవ్రతను బట్టి ఎం.సి. ఎలిసా పరీక్షను రిమ్స్ బోధనాసుపత్రిలో చేస్తారన్నారు. ఈ వ్యాధి సులభంగానే తగ్గిపోతుందని, అలాగే అవసరమైన వారికి మాత్రమే ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రభుత్వం డెంగీ రాకుండా ముందస్తు చర్యలు చేపట్టిందని, రోడ్లపై చెత్తను తొలగించడం, డెంగీ నిర్ధారణ మందుతో పిచికారీ చేయటం, వారానికి ఒకసారి ఫాగింగ్ చేయటం వలన దోమలను సమూలంగా నాశనం చేయవచ్చన్నారు. ప్రతి నాలుగో శనివారం నివారణ చర్యలపై సమీక్ష ఉంటుందని, ముఖ్యమంగా ప్రతి ఒక్కరూ కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటిలోపల, ఆవరణలో విరిగిపోయిన పెంకులు, పూల కుండీల కింద నీళ్లు ఉండకుండా చూడాలని తెలిపారు. మంచినీళ్లపై మూతలు తప్పనిసరిగా ఉంచాలని వారానికి ఒకసారి నిల్వనీటిని పారబోసి పాత్రలను శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో బంతి, పుదీనా వంటి మస్కిటో రీఫిల్లెంట్ మొక్కలను పెంచుకోవాలని, వ్యాధి సోకినట్టు అనుమానం వస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి పరీక్ష చేయించాలని సూచించారు. వాడని, పనికిరాని వస్తువుల్లో వర్షపు నీటిని నిల్వ ఉంచడం, నిలువనీరు, ట్యాంకులు మూతలు లేకుండా ఉంచడం, పరిసరాల్లో చెత్తా చెదారం వంటి ద్వారా డెంగీ వ్యాపిస్తుందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగీ వ్యాధినుండి రక్షింపబడతారని ఆయన పేర్కొన్నారు.

‘పేకాట శ్రీమంతులు’!

శ్రీకాకుళం, సెప్టెంబర్ 23: నగరంలో ఒక స్టార్ హోటల్‌లో ప్రముఖ డాక్టర్లు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల డైరక్టర్లు, విద్యావేత్తలంతా పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిపోయారు. వారి స్థానంలో బినామీలు హాజరై వారి గౌరవాన్ని, పరువుప్రతిష్ఠలను రక్షించారు. ఇదంతా జరిగి మూడురోజులైంది. కానీ, నిందితులకు ‘రక్షణ’ కల్పించేందుకు కరెన్సీ కట్టలు చేతులుమారినట్టు నగరంలో ‘శ్రీమంతుల’కథ గుప్పుమంటోంది. గతంలో కూడా కొంతమంది వైద్యులు నాన్-డ్యూటీపెయిడ్ స్కాచ్ లిక్కర్‌తో సంబరాలు చేసుకుంటూ అప్పటి ఎక్సైజ్ సిఐ ప్రసాద్ చేసిన దాడిలో దొరికిపోయిన సంగతి తెలిసిందే. మితిమీరిన ఆర్జనలతో విలాసవంతమైన సంబరాలు చేసుకోవడం సిక్కోల్‌లో కొంతమంది శ్రీమంతులకు హాబీయే! కార్డుషోను కొంతమంది డాక్టర్లు విలాస ఆటగా మార్చుకుని వారి హోదా బట్టి లక్షలాది రూ.లు పూల్‌గేమ్, స్టేక్ కింద ముందస్తు మూటలు సిద్ధం చేసుకుని ఆటలో కుషీ కావడం వారందరికీ అలవాటే! ప్రతీ వారం మాదిరిగానే ఈ వీకెండ్‌లో కూడా నగరంలో ఒక స్టార్ హోటల్‌లో ప్రముఖ వైద్యులు, విద్యా, వ్యాపార వేత్తలు ఒక చోటకు చేరి కార్డుషో నిర్వహిస్తున్న సమాచారాన్ని ఎస్పీకి చేరడంతో ఆయన హుకుం మేరకు పట్టణ ఒకటి, రెండు ఠాణాల సిబ్బంది హుటాహుటిన వెళ్ళి అక్కడ ఉన్న వారందరినీ అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. సంఘటన స్థలంలో సుమారు ఆరు లక్షల నగదు, మోబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అక్కడ నుంచే ఎస్పీకి శ్రీమంతుల వివరాలు అందించినట్టు తెలిసింది. దొరికిన నిందితులంతా ఎంపీ సిఫార్సులతోపాటు, పెద్దమొత్తంలో కరెన్సీ కట్టలు చేతులుమారాయన్న ఆరోపణలు బయటకుపొక్కాయి! పోలీసులే బేరసారాలకు దిగి డీల్ సెట్ చేసుకుని పెద్దమొత్తంలో ఆ వైద్యులు పరువును కాపాడుకునేందుకు కరెన్సీ కట్టలు ముట్టచెప్పినట్టు తెలుస్తోంది. పోలీసు అధికారులు కూడా దీనిపై నోరుమెదిపేందుకు ఇష్టపడడం లేదు. నిబద్ధతతో జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షణే లక్ష్యంగా దూకుడు పెంచిన ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి ప్లేకార్డ్సు వ్యవహారంలో మెతకవైఖరి అవలంబించారన్న విమర్శల వెనుక రాజకీయ ఒత్తిడి ఉందా? అన్నది చర్చానీయాంశమైంది. కలెక్టర్ సమక్షంలో ఇటీవల జరిగిన ఒక సమీక్ష సమావేశంలో ఎం.పి., స్థానిక ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎస్పీ బ్రహ్మారెడ్డి ‘మీరు ఉంచాలంటూ సిఫార్సులు చేసిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను పేకాటరాయళ్ళను పట్టుకోమని ఆదేశిస్తే - సైరన్ వేసుకుంటూ ఆ స్థలం వద్దకు వెళ్ళేసరికి వారంతా పరారయ్యారు’ అటువంటి సిఐకి రాజకీయనేతలు కొమ్ముకాస్తే శాంతిభద్రతలు పరిరక్షణ ఏ విధంగా అదుపులోకి వస్తుందంటూ పేర్కొన్న కొద్దిరోజులకే - డాక్టర్ల నుంచి లక్షలాది రూపాయలు కొంతమంది నొక్కేసారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. పోలీసులే ఈ పేకాట శ్రీమంతులు స్థానంలో బినామీలను తెరపైకి తెచ్చి ఈ ప్లేకార్డు కథను కంచికి పంపేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, గతంలో ఒకటో పోలీసు స్టేషన్ హౌస్ పరిధిలో కానిస్టేబుళ్ళు పేకాట ఆడుతూ పట్టుబడితే అప్పటి ఎస్పీ ఎ.కె.ఖాన్ వారిపై కేసులు నమోదు చేసిన చరిత్ర శ్రీకాకుళం నగరానికి ఉంది. అటువంటి చరిత్రను బ్రేక్ చేసి కొంతమంది పోలీసులే బినామీలను తెరపైకి తెచ్చి డాక్టర్లను ఈ కార్డు షో నుంచి తప్పించినట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై డిఎస్పీ భార్గవరావునాయుడును ‘ఆంధ్రభూమి’ వివరణకోరగా, తాను ఢిల్లీలో ఉన్నట్టు, వివరాలు, సమాచారం లేదని చెప్పారు.

రోడ్డు పనులు అడ్డుకున్న కుప్పిలి వాసులు
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 23: 50 ఏళ్ళుగా పశువులు, గొర్రెలు, మేకలు మేసుకునేందుకు కేటాయించిన పచ్చిక భూమిని అధికారులు ఇష్టారాజ్యంగా రొయ్యి పిల్లల కేంద్రానికి కేటాయించడాన్ని కుప్పిలి గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరంతా రొయ్యి పిల్లల కేంద్రానికి ఆర్ అండ్ బి అధికారుల పర్యవేక్షణలో నిర్మిస్తున్న రోడ్డుపనులను శుక్రవారం అడ్డుకున్నారు. గ్రామంలో అనేకమంది పేదలు ఉన్నారని ఇటువంటి వారికి కేటాయించాల్సిన భూమిని స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోకుండా అధికారులు ఏకపక్షంగా నిర్ణయాన్ని తీసుకోవడాన్ని వారంతా తప్పుపట్టారు. తక్షణమే ఈ భూమిని పేదలకు పంపిణీ చేసి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేంద్రం వలన సమీపంలో ఉన్న పంటపొలాలు నిస్సారంగా మారుతాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డు పనులకు నిర్మించే జె.సి.బిలు, ప్రొక్లయినర్, రోలర్‌ను నిలిపివేసి గ్రామస్తులతో సభను ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించిన తరువాతే ఈపనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. సుమారు 500 మంది ఈపనులను అడ్డుకున్న వారిలో ఉన్నారు. ఈ విషయాన్ని ఫిషరీస్ డిడి కృష్ణమూర్తి దృష్టికి తీసుకువెళ్ళగా రాష్ట్ర ప్రభుత్వం ఒనామి రొయ్యి పిల్లల కేంద్రం ఏర్పాటుకు అన్ని అనుమతులు జారీ చేసిందని దీనికి రూ.2కోట్లతో రోడ్డు పనులు కలెక్టర్ ఆదేశాల మేరకు చేపడుతున్నారని స్పష్టంచేశారు. రూ.150 కోట్లు విలువ చేసే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ రూపుదిద్దుకుంటే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని డిడి స్పష్టంచేశారు.

అభివృద్ధిని జగన్ అడ్డుకోవడం సరికాదు
శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 23: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి యువతను తప్పుదోవ పట్టించేలా యువభేరి కార్యక్రమంతో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి విమర్శించారు. శుక్రవారం ఈ మేరకు స్థానిక ఆమె నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషిచేస్తున్నారని అన్నారు. రాజధాని కడతామంటే అడ్డు, పట్టిసీమ అంటే ఆనాడు నవ్వారు. మరి నేడు ఎందుకు పట్టిసీమ గూర్చి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గత పదేళ్లలో పాలకులు అధికారంలో ఉండగా రక్షించాల్సిన ప్రభుత్వ ఆస్తులను స్వార్థానికి గండి కొట్టి నేడు అవినీతి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న నేతలు, ప్రజాభీష్టంతో అధికారం చేపట్టిన చంద్రబాబును ఏమీ చేయలేరని అన్నారు. యువభేరి పేరుతో అసలు విద్యార్థులకు సందేశం ఇచ్చే నైతిక హక్కు జగన్‌కు లేదని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి రాత్రి, పగలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడుపై నిందారోపణలు చేయడానికి జగన్మోహనరెడ్డి ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో 11 సెంట్రల్ యూనివర్శిటీల స్థాపనతో విద్యార్థిలోకానికి ఆ ఫలితాలు అందివ్వాలన్నదే బాబు ఉద్దేశమన్నారు. ఇక ప్రత్యేక హోదా విషయానికి వస్తే ఆనాడు రాష్ట్ర విభజన సమయంలో జగన్మోహనరెడ్డి పార్లమెంటు సభ్యునిగా ఉన్నారని, మరి ఆనాడు ఎందుకు చట్టంలో చేర్చాలని ప్రశ్నించలేదని అన్నారు. నేడు హోదాపై రాద్ధాంతం చేసి రాజకీయం చేయడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిని జగన్మోహనరెడ్డి కాంక్షిస్తే చంద్రబాబుకు సహకరించాలని ఆయన కోరారు. పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణం, రోణంకి మల్లేశ్వరరావు, గంగు నాగేశ్వరరావు, గుమ్మా నాగరాజు, ప్రధాన విజయరామ్, ఎస్.వి.రమణ మాదిగ, బస్వా రాజేష్‌రెడ్డి, కరగాన రాము, కరగాన భాస్కరరావు పాల్గొన్నారు.

అగ్రిగోల్డ్‌లో బాబుకు ముట్టింది ఎంత?
శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 23: రాష్టవ్య్రాప్తంగా లక్షలాదిమంది అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయారని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూడటం పట్ల ముఖ్యమంత్రికి యాజమాన్యం నుండి ముడుపులు ముట్టినట్టున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆరోపించారు. శుక్రవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో బాబును ముఖ్యమంత్రిని చేస్తే ఆయన ప్రజలను నిండా ముంచేశారని అన్నారు. కోట్లాది రూపాయలు దిగమింగిన అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులు అమ్మి అయినా ఖాతాదారులకు చెల్లించాలని, లేదంటే అగ్రిగోల్డ్ యాజమాన్యంను ఎందుకు బాబు జైలులో పెట్టలేక పోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బాబు అధికారం చేపట్టాక ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసేశారని, పేదవానికి వైద్యం అందని ద్రాక్షగా మార్చేశారని విమర్శించారు. ఇక జన్మభూమి కమిటీల పేరుతో వారికి నచ్చిన వారు అనర్హులైనా పింఛన్లు మంజూరుచేస్తున్నారని అన్నారు. తాము జిల్లాలో గ్రామాల్లోకి వెళ్తుంటే రాజశేఖర రెడ్డి పాలన రావాలంటే జగన్మోహనరెడ్డి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.

బాబు మోసాలపై ప్రశ్నించండి
* వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన
శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 23: మోసపూరిత వాగ్దానాలతో అధికారం చేపట్టి రెండున్నరేళ్లు కావస్తున్నా ఒక్క హామీని నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలపై ప్రజలు ప్రశ్నించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ మేరకు స్థానిక 11వ వార్డు పరిధిలోని విజయగణపతి ఆలయం, ఆదాయపు పన్నుశాఖ కార్యాలయం పరిధిలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలతో స్థానికులను కలిసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నేటికి ఒక్క జాబు కల్పించలేకపోయారని అన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అంటూ ఎన్నికల్లో వాగ్దానం చేసి నేటికి పైసా కూడా మాఫీ చేయకపోవడంతో బ్యాంకు సిబ్బంది వడ్డీల భారంతో మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే రైతు రుణమాఫీ అని చెప్పి, నేడు రెండు విడతలు, మూడు విడతలు అంటూ రోజుకో మాటమార్చి కాలం గడుపుతున్నారని తెలిపారు. అటువంటి చంద్రబాబు నాయుడు మోసాలపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు మీ ముందుకు వస్తే నిలదీయాలన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ నేతలు ఎం.వి.పద్మావతి, సాధు వైకుంఠం, ఎన్ని ధనుంజయ, చల్లా అలివేలుమంగ, మండవిల్లి రవి, కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పొన్నాడలో కొట్లాట
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 23: పొన్నాడ గ్రామంలో భూ తగాదాకు సంబంధించిన వివాదం కొట్లాటకు దారి తీసింది. 66 సెంట్లు భూమి విషయంలో బగ్గు ధనలక్ష్మీని సమీప బంధువులు అల్లు తులసీరావు, మల్లీశ్వరి, కునుకు కన్నప్పడు, నీలవేణి, రాజారావులు గాయపరిచినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. పాతకక్షలను దృష్టిలో ఉంచుకొని పొలంలో కలుపుతీస్తుండగా తుమ్మకర్రలతో దాడి చేశారని ధనలక్ష్మి ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ సందీప్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రతీ పోలింగ్ బూత్‌కు పొలిటికల్ ఏజెంట్
* ఆర్డీవో దయానిధి
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 23: ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో పొలిటికల్ పార్టీల తరపున ఒక ఏజెంట్‌ను నియమించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని అందుకు పొలిటికల్ పార్టీలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆర్డీవో దయానిధి అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి తహశీల్దార్ కార్యాలయంలో పొలిటికల్ పార్టీ ప్రతినిధులు, వి ఆర్‌వోలతో సమావేశాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 249 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటిని పెంచాలా తగ్గించాలా అనే అంశంపై పొలిటికల్ పార్టీ అభిప్రాయాలను అడిగి తెలుసుకోగా ఇవే కేంద్రాలను కొనసాగించాలని వారు స్పష్టంచేశారు. టిడిపి, బిజెపి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైసిపి, బిఎస్పీలపార్టీల ప్రతినిధులతోపాటు, తహశీల్దార్ ఎస్.సుధాసాగర్, ఎలక్షన్ టిడి సతీష్, కార్యాలయ సిబ్బంది విఆర్‌వోలు పాల్గొన్నారు.
జూ. బాలుర హ్యాండ్‌బాల్
పోటీలకు ఎంపికలు
బలగ, సెప్టెంబర్ 23: రాష్టస్థ్రాయిలో జరగనున్న హ్యాండ్‌బాల్ పోటీలకు జూ. బాయ్స్ జిల్లాస్థాయి ఎంపికలను ఈనెల 25న నిర్వహించనున్నట్టు జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంఎస్‌సి శేఖర్ తెలిపారు. అక్టోబర్ 1, 2వ తేదీల్లో ఒంగోలులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ ఎంపికలను కోడిరామ్మూర్తి స్టేడియంలో మధ్యాహ్నం 2గంటలకు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీతో హాజరు కావాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.కృష్ణకుమార్, ఐతమ్ గౌరీశంకర్‌లు సూచించారు. అదే విధంగా ఈనెల 25న రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం కూడా స్థానికంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మనోహర్, వెంకటేశ్వరరావులు హాజరవుతారని పేర్కొన్నారు.

‘టిడిపి అవినీతిపై నిలదీయండి’
నందిగాం, సెప్టెంబర్ 23: తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న అవినీతి కార్యక్రమాలపై నిలదీయాలని టెక్కలి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త పేరాడ తిలక్ కోరారు. శుక్రవారం మండలంలోని నరేంద్రపురం పంచాయతీ పరిధిలోని పాలవలస గ్రామంలో గడపగడపకూ వైకాపా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశం ప్రభుత్వం కార్యకర్తల స్వప్రయోజనాలు కోసం పనిచేస్తోం దన్నారు. రైతులను, మహిళలను మోసగించి అధికారం చేపట్టిన చంద్రబాబు ఆ హామీలను అమలు చేయకుండా తుంగలో తొక్కారని విమర్శించారు. జెడ్‌పిటిసి కె.బాలకృష్ణారావు, ఎంపిపి ప్రతినిధి చక్రవర్తి, ఎంపిటిసిలు శ్రీరామ్మూర్తి, రామారావు, మధు, నారాయణమూర్తి, సర్పంచ్‌లు జోగారావు, దేవేంద్రరావు, మండల కన్వీనర్ లక్ష్మినారాయణ, వైకాపా నాయకులు జయరాం పాల్గొన్నారు.

వర్షాలపై యంత్రాంగం అప్రమత్తం

శ్రీకాకుళం, సెప్టెంబర్ 23: ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వరద పరిస్థితులు తదితర అంశాల దృష్ట్యా యంత్రంగాన్ని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం అప్రమత్తం చేశారు. అధికారులు జాగరుకతతో వ్యవహరించి పరిస్థితులను అంచనా వేయాలంటూ సూచించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం సహా రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెం. 08942 240557, శ్రీకాకుళం ఆర్డీవో కార్యాలయంలో 08942 222314, పాలకొండ ఆర్డీవో కార్యాలయంలో 08941 260144, టెక్కలి ఆర్డీవో కార్యాలయంలో 08945 244188 ఫోన్ నెంబర్లును ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్‌లో రౌండ్ ది క్లాక్ పనిచేసేందుకు ఏర్పాట్లు చేశారు. వర్షాల వల్ల నష్టాలు లేదా ఇతర సమాచారాన్ని కంట్రోల్ రూంలకు తెలియజేయవచ్చంటూ కలెక్టర్ ప్రజలకు తెలిపారు.