మెయిన్ ఫీచర్

తారావళి ధీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తైలే లక్ష్మీర్జతే గంగా దీపావళి ఆధావసేత్
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే’’
దీపావళినాడు నూనెలో (నువ్వెల నూనె) లక్ష్మీదేవి, నదులు చెఱువులు బావులు మొదలైన జల వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి ఉంటారు. ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయంలో అభ్యంతన స్నానం చేయడంవలన దారిద్య్రం తొలగడమేకాక, గంగానదీ స్నాన ఫలం లభించి నరక భయం ఉండదని పురాణాలు చెప్తున్నాయి.
ఇళ్ళముందు ముగ్గులువేసి, గుమ్మాలకు పసుపు కుంకుమలు పెట్టి, మామిడాకుల తోరణాలు కట్టి, రకరకాలైన పిండి వంటలు చేస్తారు. సాయంత్రం మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి, దూది ఏకులతో వత్తుల్ని చేసి, వాటిని ప్రమిదలలో వేసి, మొదటగా ఇంట్లో దేవుని గదిలో దీపారాధన చేసి, తరువాత యింటి బయట అమర్చిన ప్రమిదలలోని వత్తులను వెలిగించి ఒక పంక్తిగా, వరుసగా శోభాయమానంగా, కమనీయంగా రమణీయంగా దీపాలు పెడాతారు.
‘‘అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ’’ అసత్యం నుండి సత్యం, చీకటి నుండి వెలుగును, అజ్ఞానము జ్ఞానమును మృత్యువునుండి అమృతమును నాకు కల్గించమని ప్రార్థిస్తాం. ఆ జ్ఞాన దీపమునే, ఈ విశ్వానికి మొదట యిచ్చింది- వేద శబ్దములు. కనుక ఆ వేద శబ్దావళియే ‘‘దీపావళి’’.
ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుండి కార్తిక శుద్ధ విదియవరకు సమగ్రమైన దీపావళి పండుగగా అయిదురోజులు జరుపుకుంటారు.
ధన త్రయోదశి: దీనినే ధన్‌తేరాస్ అని కూడా అంటారు. గృహాలను శుభ్రం చేసి రంగు రంగుల ముగ్గులు పెడతారు. వీధిలో వారి గుమ్మాలకెదురుగా కూడా శుభ్రం చేసి రంగ వల్లులు దిద్దుతారు. ఈనాటి నుంచి దీపాలు పెట్టటం మొదలుపెడతారు. శుచి శుభ్రత ఉన్న గృహంలోకి దీపమున్న ఇంటికి మహాలక్ష్మీదేవి వస్తుందని విశ్వాసం. అపమృత్యుభయం నివారణార్థం నువ్వుల నూనెతో దీపాల్ని వెలిగించి, పూజించి ఇంటి ముందు పెడతారు. దీనినే యమ దీపమంటారు. ధన్‌తేరస్ అని, త్రయోదశి నాడు కొంతైనా బంగారాన్ని కొని, దీపావళి పండుగనాడు పూజలో ఉంచుతారు.
నరక చతుర్దశి: ప్రతి పండుగ నేపథ్యంలోనూ ఒక అంతరార్థం ఉంటుంది. నరక చతుర్దశి, తరువాతి రోజు అమావాస్య- దీపావళి. మొదటి రోజు నరకాసురుణ్ణి వధిస్తాము. రెండవ రోజు వరుసగా దీపాలు వెలిగిస్తాము.
ఆత్మ చైతన్యమే దీపం. అది అవిచ్ఛిన్నంగా ఎడ తెగకుండా అనుసంధానమవుతూపోతే అది దీపావళి. అజ్ఞాన తమస్సును తరిమివేసే తారావళి. సత్వ రజ తమో త్రిగుణాత్మకమైన సృష్టికంతా జవాబు చెప్పే త్రిలోకహారావళి. అమావాస్యనాడే రానుంది. ‘‘అమా’’ అంటే, దానితోపాటు అని అర్థం. ‘‘వాస్య’’ అంటే వసించటం. అంటే చంద్రుడు సూర్యుడిలో చేరి, వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు. సూర్యుడు స్వయంప్రకాశమైన పరమాత్మ చైతన్యం. చంద్రుడు- జీవుడు- మనస్సు ఆయన ఉపాధి. మన మనస్సు పరమాత్మ చైతన్యంలో లయమైతే, జీవుడికి జీవభావం పోయి దైవభావం సిద్ధించటమే నిజమైన అమావాస్య. కనుకనే రుూ అమావాస్య అంధకారం కాదు జ్ఞాన వెలుగులో మునిగి దీపావళిగా మారింది. జాగ్రత్, స్వప్న, సుషుప్త్యావస్థలైన మూడు అవస్థలను దాటి తురీయమైన చతుర్దశినందుకొంటేనే అమావాస్య చూడగలుగుతాం. దాన్ని చూస్తేనే దీపకాంతికి నోచుకుంటాం. కనుకనే చతుర్దశినాడు మనలో ఉన్న నరకాసురుణ్ణి వధించి, అమావాస్యనాడు జ్ఞాన దీపాన్ని వెలిగించాలి. అందుకు సత్యమైన చైతన్య దీప్తిగా యోగీశ్వరేశ్వరుడైన పరమాత్మ తోడు పడాలి. ఇదే దీపావళి పండుగలోని ఆధ్యాత్మికత.
దీపావళి అంటే దీపోత్సవమే. ఈరోజు దీపలక్ష్మి తన వెలుగులతో అమావాస్య చీకట్లను పారద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది.
మహాలక్ష్మీ పూజ
‘‘హిరణ్య వర్ణాం హరిణీమ్ సువర్ణ రజతస్రజామ్ చంద్రాం హిరణ్మరుూం లక్ష్మీం జాతవేదో మమావహా’’ అన్నది శ్రీసూక్తం.
హితము రమ్యము అయినది బంగారం. బంగారంలో ‘అగ్ని’ ఉంటుందని వేదం చెప్పింది. బంగారపు కాంతి వంటి పచ్చని వర్ణం కలిగి, బంగారు వెండి ఆభరణములతో, పూల దండలతో అలంకరింపబడి చంద్రునివలె మనోరంజకమై, సువర్ణ రూపమైన శ్రీ మహాలక్ష్మిని మా కొరకు ఆహ్వానించవలసినదిగా, దీపారాధన చేసి అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు. త్రిమాతా స్వరూపిణి అయిన మహాలక్ష్మీ దేవికి సంధ్యాసమయంలో స్వాగతం పలికి, ఎల్లప్పుడూ తమ ఇళ్ళలో కొలువుతీరమని ముంగిళ్ళలో దీపాలుపెట్టి, దివ్య తేజస్సును పొందే హిరణ్మయ పండుగ దీపావళి.
మానవ శరీరం- నరకం వంటి ఇల్లు. భ్రమలో శరీరమే తాననుకునే వాడు- నరకుడు. నరకుని జ్ఞానజ్యోతితో అణచిన వాడు- నారాయణుడు, అనగా మనలోని చైతన్యం. చైతన్యానికి బాహ్య చిహ్నం దీపారాధన, దీపముల పంక్తి ఇదే నరక చతుర్దశి, దీపావళి అని అన్నారు- భగవాన్ రమణ మహర్షి.
యాంత్రిక యుగంలో ఉన్న మానవుడు, జీవితంలో ఎదురయ్యే సమస్యలతో నిరాశ నిస్పృహ చెందక ఓర్పుతో ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ‘శక్తి’ని కూడకట్టుకొని తనలో ఉండే కామక్రోధాదులనే ఆరు విధములైన అజ్ఞాన తిమిర శత్రువులను సాత్విక సామరస్యమనే విజ్ఞాన జ్ఞాన జ్యోతిచే పారద్రోలి, జీవితాన్ని సుఖమయం సుసంపన్నం చేసుకోవాలనే ఆధ్యాత్మిక తత్త్వాన్ని బోధించి, ఆనందమయ జీవన సరళికి మార్గాన్ని దర్శింపచేసే వెలుగుల పండుగ ‘‘దీపావళి’’.
మనిషిలోని ఈర్ష్య అసూయ ద్వేషం స్వార్థం అధర్మం, అవినీతి అనేవి చీకటికి సంకేతం. ప్రేమ మంచితనం సత్ప్రవర్తన ధర్మం అనేవి వెలుగుకు సంకేతం. చీకటిని పారద్రోలి జ్ఞాన వెలుగును అనుగ్రహించి, జీవితానికి చైతన్యదీప్తినిచ్చే పండుగ- దీపావళి.
‘్భ’ అంటే కాంతి, వెలుగు, అగ్ని, దీపము, దీప్తి. కనుక దీపమును అనగా అగ్నిని ఆరాధించేవారు- భారతీయులు. అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టుకోవటానికి, జ్ఞాన వెలుగును అర్చించి సత్యానే్వషణ చేసేవారు. భారతీయులు భారతదేశంలో దీపారాధన చేయకుండా ఏ కార్యక్రమము ప్రారంభము కాదు. దీపారాధన ఒక యజ్ఞం. ‘‘యజ్ఞోవైవిష్ణుః’’అన్నారు.
సమస్త విశ్వము దేని చేత ప్రకాశింపబడునో దానినే ‘’‘దీపము’’ అని అంటారని ‘‘దీప్యతే అనేన’’ అనే వ్యుత్పత్యర్థాన్ని చెప్పారు. పరమేశ్వరుడు లేకపోతే జగత్తు లేదు. కనుక పరమాత్మ మొదటి దీపము.
‘‘నతత్ర సూర్యో భాతి న చంద్ర తారకమే యస్య భాసా సర్వమిదం విభాతి’’
ఆ పరమేశ్వర రూప దీపంతోనే ఈ విశ్వము సూర్యచంద్ర నక్షత్రాదులు ప్రకాశిస్తున్నాయి. కనుక, సూర్యచంద్ర నక్షత్రములు కూడా దీపములే. దీనినే వేదము ‘‘వేదాహమేతం పురుషం మహాంతమ్ ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్’’ చీకటిని తరిమేసి వెలుగునిస్తూ ఆదిత్య స్వరూపుడైన ఆ పరమాత్మయే ప్రథమ దీపము అని చెప్తుంది దీపావళి పండుగ. ఆ వెలుగే, ఆ చైతన్యమే మన శరీరంలో అగ్నిజ్వాలగా అణువుకొన్న సూక్ష్మంగా ఉంటుందన్నది- మంత్ర పుష్పంలో వెలుగును బాహ్యంగా దర్శించటానికే ‘‘దీపారాధన’’. దీపాలను వరుసగా పెట్టే రోజు- ఆశ్వయుజ అమావాస్య సాయంత్రం, సంధ్యా సమయం- అదే దీప ఆవళి, దీపముల పంక్తి లేక వరుస, ‘‘దీపావళి’’.
‘‘దీపం జ్యోతి పరబ్రహ్మమ్ దీపం సర్వతమోహరం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే’’
సాయం సంధ్యా సమయంలో ప్రతిరోజూ పెట్టే దీపాన్ని ఆశ్వయుజ బహుళ అమావాస్యనాటి సంధ్యా సమయంలో వరుసగా దీపాల్ని పెట్టి ఇంటిని దీపములతో అలరించి, ఆ వెలుగులో మహాలక్ష్మీదేవిని దర్శించి ఆరాధించే దీపాల పండుగ దీపావళి.
దీపమున్న గృహంలో లక్ష్మీదేవి ఉంటుంది. దీపారాధన చేసి, ‘ఉద్దీప్యస్య జాతవేదో పఘ్నన్ నిర్ ఋతింమమ’’ అగ్నిదేవా నా పాపములను పోగొట్టి నాకు వెలుగు అనగా జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తాం.
పితృదేవతలకు తర్పణాలు
చంద్ర మండలం ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు, అమావాస్య తిథి- మిట్టమధ్యాహ్నం అవుతుంది. సూర్యుడు తులారాశిలో ఉండగా వచ్చే దీపావళి అమావాస్యనాడు పితృ తర్పణాలు ఇస్తే వారికి ఉత్తమ లోకప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు పేర్కొన్నాయి. నరకంలో ఉన్న పితరులు ఈ రోజులలో బయటకు వస్తారని, వారికి కొరువులు అనగా దివ్వెలు దారి చూపిస్తాయని, నరక నివారణార్థం బాణా సంచా కాలుస్తారు. అమావాస్యనాడు పితృదేవతలకు తర్పణాలు యివ్వడం విధాయకం. ఇది తల్లిదండ్రులు లేని వారికి మాత్రమే తల్లిదండ్రులు జీవించి ఉండగా చేయకూడదు.
వర్థమాన మహావీరుడు: దీపావళి
జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు దీపావళి అమావాస్యనాడు సిద్ధి పొందాడు. ఆ మహనీయుని దివ్య ఆత్మకు శ్రద్ధాంజలి చిహ్నంగా మహావీరుని జ్యోతి స్వరూపంలో ఆరాధించటానికి దీపావళిని జ్యోతిర్మయి పండుగగా జరుపుకుంటారు జైనులు.
బలి పాడ్యమి
దీపావళి మరునాడు బలి పాడ్యమి. బలిదాన గుణానికి సంతోషించి, వామనుడు అతనికి జ్ఞాన జ్యోతిని ప్రసాదించాడు. అజ్ఞాన జీకటిని పారద్రోలి జ్ఞాన దీపాల్ని వెలిగించటానికి సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి పాతాళంనుంచి భూమి మీదకు వచ్చే వరాన్ని పొందాడు. ఆ కారణంగా ఈ పండుగ చేసికొంటారు.
యమవిదియ: భగినీ హస్త్భోజనం
కార్తిక శుద్ధ విదియని, యమ విదియ- ‘్భగినీ హస్త్భోజనం’ అని పిలుస్తారు. యమధర్మరాజు చెల్లెలైన యమున యింటికి ఈరోజున భోజనానికి వస్తాడు. చెల్లెల్ని ఏదైనా కోరుకోమంటాడు. ఈరోజున సోదరి చేతి వంట తినే సోదరుడికి, నరక లోకప్రాప్తి, అపమృత్యు దోషం లేకుండా వరం ప్రసాదించవలసిందిగా కోరింది. ‘తథాస్తు’ అన్నాడు యముడు. అందుకే ఈరోజు సోదరులు, సోదరీమణుల ఇంట్లో భోజనం చేస్తారు.
‘‘ఏహి అన్నపూర్ణే సన్నిదేహి సదాపూర్ణే సువర్ణే మాంపాహి...’’ అని ముచ్చటగా కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు. ‘కాశీ’ అంటే వెలుగు. వెలుగుల పండుగైన దీపావళినాడు సువర్ణ అన్నపూర్ణాదేవి కాంతులీనుతూ దివ్య తేజస్సుతో భువనావళికి చైతన్య దీప్తినిస్తుంది. సర్వమానవ సౌభ్రాత్రతలో విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షించే ‘‘వెలుగు’’ను పొందాలని మానవాళికి దివ్య సందేశాన్నిస్తోంది దివ్య దీపావళి.

- పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464