శ్రీకాకుళం

ముద్దాడపేట వద్ద వంతెనకు గ్రీన్‌సిగ్నల్: విప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, డిసెంబర్ 8: ముద్దాడపేట వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుమతించినట్టు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తెలిపారు. మండలంలోగల దూసిపేట జెడ్పిహైస్కూల్ వద్ద రూ.32లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ముద్దాడపేట నుండి బెలమాం మీదుగా సంతకవిటి, రాజాం, రేగిడి ఆమదాలవలస, జి.సిగడాం వంటి మండలాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్టును రూ.130కోట్ల నిధులతో ఆధునీకరించేందుకు రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామనివిప్ తెలిపారు. ఈ ఆనకట్టుకు తమ్మినేని పాపారావుపేరును నామకరణం చేసి సిఎం చంద్రబాబునాయుడుకు పంపిస్తారని ఆయన తెలిపారు.
సంక్రాంతి నాటికి దూసిలో గుణుపూర్ హాల్ట్
గుణుపూర్ విశాఖపట్న మధ్య నడుస్తున్న గుణుపూర్ పాసింజర్ రైలు సంక్రాంతి నాటికి హాల్ట్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు విప్ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు డిఆర్‌ఎం చంద్రలేఖముఖర్జీ ద్వారా రైల్వే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని ఈ నెలాఖరు నాటికి ఉత్తర్వులు రానున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దశరథ్, ఎంపిటిసి తమ్మినేని అప్పలనాయుడు, ఇఇ సుగుణాకర్, తమ్మినేని శేఖర్, దేశం నాయకులు మెట్ట సుజాత, హెచ్‌ఎం వినోదిని పాల్గొన్నారు.

వత్తిడి!
శ్రీకాకుళం: నేను మారాను... మీరు మారండి.. అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు పలుమార్లు హితోపదేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి 2వ తేదీ నుంచి జన్మభూమి-మావూరు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. నేటికీ కొలిక్కిరాని ప్రజాసాధికారిత సర్వే వత్తిడి, ఇంతలో పెద్దనోట్ల రద్దు- తలెత్తిన జీతాలు సమస్య! ఆపై బట్వాడాకాని పింఛన్లు వల్ల పండుటాకుల కష్టాలు అధికారి నుంచి సిబ్బంది వరకూ ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అడుగడుగునా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో మనస్సాంతి లేకుండా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మానసిక అశాంతి
ఒకవైపు మానసిక వత్తిడి, మరోకవైపు జవాబుచెప్పేందుకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలతో అధికారులు సతమతవుతున్నారు. ఉదయం పది గంటలకు కార్యాలయానికి చేరుకుంటే రాత్రి తొమ్మిది గంటల వరకూ విధులు నిర్వహించినా ఇంకా లక్ష్యాలు నెరవేరలేదని, వీడియోకాన్ఫరెన్స్‌లు, టెలికాన్ఫరెన్స్‌లు, సెట్‌కాన్ఫరెన్స్‌లతో ప్రభుత్వ ఉద్యోగులను రాచిరంపాన పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నీ విభాగాల్లో కూడా ఇటువంటి వాతావరణం సర్కార్ ఉద్యోగులను హడలెత్తిస్తోంది.
‘ప్రతిపక్షం’ గుర్తొస్తోంది..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిదేళ్ళుపాటు ముఖ్యమంత్రిగా పనిచేసినా బాబు ఇటువంటి వత్తిడి అధికారులపై తేవడం వల్లే ప్రతిపక్షంలో కూర్చున్న విషయాన్ని ఉద్యోగసంఘాలు గుర్తుచేస్తున్నాయి. బాబు కూడా ఎన్నికల ముందు ఉద్యోగులపై సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతానంటూ చెప్పిన మాటలకు..ఇచ్చిన హామీలకు నేడు తీసుకుంటున్న నిర్ణయాలకు పొంతనలేకుండాపోయిందంటూ ఆఫీసు సబార్డనేట్స్ నుంచి బ్యూరోకట్స్ వరకూ పలు సందర్భాల్లో వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ళుగా ఏకఛక్రాధిపత్యం కొనసాగలని, 80 శాతం ప్రజలు టిడిపితో ఉండాలని, మున్ముందు విపక్షమే లేకుండా చేయాలంటూ పదేసార్లు పార్టీశ్రేణులకు సందేశాన్ని వినిపించే హైటెక్‌బాబు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మళ్లీ అదే బాణీ, తప్పిదాలు చేస్తున్నారన్న ఆరోపణల నడుమ ప్రజల సానుకూలతకు 80 శాతం మార్కులు రావంటూ తమ్ముళ్లే తెగేసి చెబుతున్నారు.
ఎస్సార్‌సి సంగతి?
పదేళ్ళు విపక్షనేతగా ప్రభుత్వ ఉద్యోగులను మచ్చికచేసుకుందామనే ఐడియాలజీతో మళ్లీ అధికారిలోకి వచ్చిన ముఖ్యమంత్రి అదే ప్రభుత్వ ఉద్యోగులను ఇక్కట్లుకు గురిచేస్తున్నారన్న వాదనలు బలమెక్కాయి. ఎస్సార్‌సి ఇవ్వకపోవడం, జీతభత్యాల్లో కోతలు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానంటూ ఇచ్చిన హామీని వదిలేయడం, ఔట్‌సోర్సింగ్ విధానానికి మంగళం పాడడం వంటి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల బాబు కవ్వింపు చర్యలు అధికార యంత్రాంగాన్ని మరోసారి తీవ్రనిరాశకు గురిచేస్తున్నాయి.
పెద్దనోట్ల రద్దుతో ఇక్కట్లు
దిగువస్థాయి ఉద్యోగులు జీతాలు సరిగ్గా అందక, పెద్దనోట్లు రద్దుతో అవస్థలు పడుతూ ఉద్యోగాలు చేయలేమంటూ సెలవులపై వెళ్ళిపోతున్నారు. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇంతలో జన్మభూమి షెడ్యూల్‌ను సంక్రాంతి పండగ ముందు ఖరారు చేయడాన్ని కూడా అధికారులతోపాటు తెలుగుతమ్ముళ్ళను కూడా భయం పుట్టిస్తోంది. జనచైతన్యయాత్రలంటూ నెలరోజుల పాటు ఊరూరురా తిరగాలని, టిడీపీ కుటుంబ పెద్దగా బాబు హుకుం జారీ చేయడం అధికారంలో ఉండడం వల్ల కాసులు వెచ్చించి జెండాలు పట్టుకునేందుకు కార్యకర్తలను సభల్లో కూర్చున్నబెట్టిన విషయం ఇప్పటికీ తమ్ముళ్ళను ఆర్థిక ఇబ్బందుల నుంచి పెద్దనోట్ల రద్దు తేరుకోకుండా చేసింది. ఇంతలోనే జన్మభూమి సభలంటూ బాబు ఆదేశించడంతో జనంలోకి మళ్లీ హామీలు నెరవేర్చకుండా మాటలతో కాలయాపన చేసేందుకు ఏలా వెళ్ళాలంటూ పసుపుదళం వారిలోవారు చర్చించుకుంటుంది.
‘నీరు-చెట్టు’ బిల్లులు ఏవి?
నీరు-చెట్టు పథకం బిల్లులు కోట్లాది రూ.లు బకాయిలు ఉన్నప్పటికీ, వాటిని విడుదల చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రికి జిల్లా పర్యటనలో ఒక జెడ్‌పిటిసి సభ్యురాలు కోరినప్పటికీ, నేటికీ అతీగతిలేకుండా పోయిందని తమ్ముళ్ళు గుర్రుగా ఉన్నారు. ఇటువంటి వాతావరణంలో గ్రామాల్లోకి వెళ్తే ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్ళు కావస్తున్నా ఒక్క పేదోడికి కూడా ఇల్లు కట్టించలేకపోవడం, అనేకమంది అర్హులకు పింఛన్లు మంజూరు చేయలేకపోవడం, రేషన్ కార్డులు కావాలంటూ ఇచ్చిన దరఖాస్తులు అపరిష్కృతంగా మిగిలిపోవడం వంటి ప్రాథమిక సమస్యలు పరిష్కరించలేని స్థితిలో ఇటు క్యాడర్, అటు అధికారులు ఏ ముఖంతో జన్మభూమి సభలకు వెళ్తామంటూ ఎవరికివారు చర్చించుకుంటున్నారు.

పరిహారం తర్వాతే పనులు చేయండి
హిరమండలం, డిసెంబర్ 8: రిజర్వాయర్ పనులను గార్లపాడు గ్రామ నిర్వాసితులు అడ్డుకున్నారు. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గురువారం వివిధ శాఖల అధికారులు నిర్వాసితులతో జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో అధికారులు వెనుదిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాలివి. గార్లపాడు సమీపంలో నిర్వాసితులు బుధవారం రాత్రి రిజర్వాయర్ పనులను అడ్డుకున్నారు. అధికారులు వారి సమస్యలు పరిష్కారానికి కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామంలో భూసేకరణ యూనిట్ ప్రత్యేకాధికారి గోవర్ధనరావు, తహశీల్దార్ కాళీప్రసాద్, వంశధార డిఇఇలు బ్రహ్మానందం, శ్రీనివాసరావు నిర్వాసితులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నిర్వాసితులు నారాయణరావు, వెంకటరమణ, తవిటినాయుడు, రామారావు తదితరులు మాట్లాడుతూ రిజర్వాయర్ ప్రారంభం నుంచి పరిహారం అందిస్తామని అధికారులు కుంటుసాకులు చెబుతూ ఇప్పటివరకు కాలయాపన చేశారని ఆరోపించారు. నెల రోజుల్లో లోక్ అదాలత్ ద్వారా 31 ఇళ్లకు పరిహారం చెల్లింపునకు అధికారులు ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. రిజర్వాయర్ పనులు వేగవంతం చేసేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారే తప్ప సమస్య పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పనులకు సంబంధించి పది రోజుల్లో పరిహారం చెల్లిస్తామని అధికారులు హామీలు నిర్వాసితులు తిరస్కరించారు. ఈ సమస్యలు పరిష్కరించాకే ఈ పనులు చేపట్టాలని నిర్వాసితులు పట్టుబట్టారు. దీంతో అధికారులు గ్రామం నుంచి వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది.
మరో పోరాటానికి సిద్ధం
సమస్యలు పరిష్కారానికి మరో పోరాటానికైనా సిద్ధమని నిర్వాసితులు తెలిపారు. నిర్వాసిత సంఘం కార్యదర్శి గంగరాపు సింహాచలం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికారులు పరిహారం చెల్లింపులో చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. సమస్యలను పక్కదారి పట్టించి ప్రాజెక్టు పనులు చేపట్టడానికి అధికారులు చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాతపట్నం సి ఐ ప్రకాశరావు, ఇన్‌చార్జి ఎస్‌ఐ సి.హెచ్.దుర్గాప్రసాద్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆరోగ్య శ్రీని రక్షించాలి
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 8: దివంగత ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఆరోగ్య శ్రీ పథకాన్ని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైకాపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి అన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం రూపుమార్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు సుమారు రూ.600కోట్లు ప్రభుత్వం బకాయి ఉందన్న చెబుతున్న చంద్రబాబు అమరావతి నిర్మాణానికి కృష్ణా పుస్కరాలకు వేలాదికోట్లను ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో కనీసం కొంతమొత్తాని ఆరోగ్యశ్రీ పథకానికి ఇవ్వాల్సిందిగా కోరారు. ఆరోగ్య శ్రీ పథకం వర్తించకపోవడం వల్లే బుధవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో తల్లితోపాటు ఇద్దరు కవలలు మృతిచెందారన్నారు. ఉద్దానంలో డయాలసిస్ రోగులు రోజురోజుకూ ఎక్కువౌతున్నారని నెలకు నాలుగుసార్లు డయాలసిస్ చేసుకోవాలంటే అంత మొత్తాన్ని సామాన్య ప్రజలు వెచ్చించలేకపోతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఆరోగ్య శ్రీ పథకాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడిగా కొలిచే సందర్భాలు కూడా కొలిచే సందర్భాలున్నాయన్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో పొందుపరిచిన అంశాలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య శ్రీ పథకం రక్షించాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నామని ఈకార్యక్రమానికి కార్యకర్తలతోపాటు ప్రజలు అభిమానులు కూడా హాజరు కావచ్చునని
పిలుపునిచ్చారు. అందవరపుసూరిబాబు మాట్లాడుతూ దివంగత నేత వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి పేద, బడుగు, బలహీనవర్గాలు, మధ్యతరగతి ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఆయన కోరారు. ఎంవి పద్మావతి, ఎన్ని ధనుంజయ, సాధు వైకుంఠరావు, మామిడి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
సీతంపేట, డిసెంబర్ 8: సీతంపేట ఐటిడిఎ పరిధిలోని గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని ఐటిడిఎ పిఒ ఎల్.శివశంకర్ అన్నారు. గురువారం స్థానిక ఐటిడిఎ కార్యాలయంలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇంతవరకు జరుగుతున్న పనులు, వాటి వివరాలు, నిధులు తదితర అంశాలపై ఇఇ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు.
దోనుబాయి సమీపంలో ఉన్న సున్నపుగెడ్డ జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. దీనిపై ఇఇ మాట్లాడుతూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే అటవీ అధికారుల అనుమతి ఉండాలన్నారు.
అలాగే శ్రీకాకుళంలో రూ.కోటితో నిర్మించనున్న మినీ ఆడిటోరియానికి స్థలాన్ని ఎక్కడ కేటాయించాలన్నదానిపై అక్కడి ఆర్‌డి ఒతో పిఒ మాట్లాడారు. రూ.1.30 లక్షలతో గిరిజన భవన్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
డిజిటల్ తరగతులు ప్రారంభం
గిరిజన విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధన కార్యక్రమాన్ని ఐటిడిఎ పిఒ శివశంకర్ శుక్రవారం ప్రారంభించారు.
స్థానిక ఏపి ఆర్ బాలికల పాఠశాలలో ఈ విద్యాబోధన ప్రారంభించి అధికారులకు పలు సూచనలు చేశారు. తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి అనంతరం ఈ బోధన ద్వారా మరింతగా వారికి అర్థమయ్యేలా చూడాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిడి నాయక్, డిప్యూటి డిఇఒ మల్లయ్య, ఇఇ శ్రీనివాస్ తదితరులున్నారు.

పింఛన్ బాధిత కుటుంబానికి వైకాపా నేత పరామర్శ
కవిటి, డిసెంబర్ 8: తన ఖాతాలో ఇంకా పింఛన్ సొమ్ము పడలేదని తెలుసుకున్న మండలంలోని పాతవరక గ్రామానికి చెందిన బెహరా ఖగా(60) బ్యాంకు వద్దే మృతి చెందాడు. బొరివంక గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకుకు ఆటోలో గురువారం ఉదయం ఖగా వచ్చాడు. బ్యాంకులోకి వెళ్ళిన కుటుంబ సభ్యులు పింఛన్ విషయం చెప్పడంతో అక్కడికక్కడే మరణించాడు. సంఘటన తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జీ నర్తు రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతిని కుటుంబ సభ్యులను ఓదార్చి, కొంత ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైయిందనిఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరు వలన పింఛన్లు తీసుకునేందుకు వృద్ధులు పడరాని పాట్లు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నేరుగా వృద్ధుల ఇళ్ల వద్దకే వెళ్ళి పింఛన్లు పంపిణీ చేయించాలని డిమాండ్ చేశారు. ఇచ్ఛాపురం ఎఎంసి మాజీ చైర్మన్ శ్యాంపురియా, దుద్ది సతీష్ తదితరులు ఉన్నారు.

మహిళా కానిస్టేబుళ్ల అభ్యర్థులకు పరీక్షలు
ఎచ్చెర్ల, డిసెంబర్ 8: పోలీసు కానిస్టేబుళ్ల నియామకాల్లో భాగంగా స్థానిక ఏ ఆర్ మైదానంలో నాలుగు రోజులుగా శారీరక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం మహిళా అభ్యర్థులకు ఎత్తు, బరువు పరీక్షలను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె.బ్రహ్మారెడ్డి నేతృత్వంలో కొనసాగించారు. 1004మంది ఈ పరీక్షలకు హాజరు కాగా 955మంది ఇందులో మహిళలు 541మంది ఉన్నారు. పురుషులకు ఎత్తు, ఛాతి కొలతలు బయోమెట్రిక్ హాజరు వంటి ప్రక్రియ పూర్తి చేశారు.
ఎస్పీ తిరుమలరావు, డిఎస్పీలు కె.్భర్గవరావునాయుడు, వివేకానంద, ఆర్‌ఐ కోటేశ్వరబాబు, సిబ్బంది ఉన్నారు.
ఇప్పటివరకు 2930మంది పరుగు పరీక్షలకు అర్హత సాధించారు. అయితే ఈనెల 21నుంచి 23వరకు 100, 1600 పరుగు పందెంతోపాటు లాంగ్‌జంప్ వంటి దేహదార్యుడ పరీక్షలు సెన్సార్‌ల సాయంతో పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు ఎస్పీ వెల్లడించడంతో అభ్యర్థుల్లో నెలకొన్న ఉత్కంఠ వీడింది.
పంటలు ధ్వంసం చేసిన ఏనుగులు

సారవకోట, డిసెంబర్ 8: మండలంలోని సవరమాలువ గ్రామానికి సమీపానికి బుధవారం సాయంత్రం చేరుకున్న ఏనుగులు ఆ రాత్రి అక్కడి పెద్దచెరువులో మకాంపెట్టి సమీపంలో గల గిరిజనులకు చెందిన పంటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. చేరువలో ఉన్న కొండ నుండి నాలుగు ఏనుగులు ఒకేసారి ఆకస్మికంగా వచ్చాయని ప్రాణరక్షణతో తాము పరుగులు పెట్టామని గిరిజనులు తెలిపారు. పలువురు గిరిజనులకు చెందిన అరటి, జీడితోటలు పూర్తిగా నాశనం చేశాయి. పెద్ద చెరువుకు సమీపంలోగల పంటపొలాలలో ఉన్న వరిచేనును నాశనం చేశాయి. ఇదిలా ఉండగా ఏనుగుల నుండి ఆస్తినష్టంతోపాటు ప్రాణానికి కూడా ముప్పు ఉంటుందని ఆందోళన చెందిన గిరిజనులు జిల్లాలోని గొడియాపూడి గ్రామానికి చెందిన మాలేసవరులను రప్పించి మంటలు పెట్టి శబ్దాలు చేస్తూ ఏనుగులను కొండ ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం గ్రామంలో ఏనుగుల ట్రాకర్లు లక్ష్మణరావు, చిరంజీవితోపాటు అటవీశాఖ సిబ్బంది మకాంపెట్టి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఏనుగుల వలన గిరిజనులకు ఏ మేరకు నష్టం జరిగిందనే విషయంపై అంచనాలు వేస్తున్నారు. గిరిజనుల నుండి పూర్తివివరాలు అటవీశాఖ సిబ్బంది సేకరించారు. ఏనుగులు కొండమీద నుండి తిరిగికిందకు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సిబ్బంది హెచ్చరించారు.
నగదురహిత లావాదేవీలపై అవగాహన పెంచండి
ఎచ్చెర్ల, డిసెంబర్ 8: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేయడంతో తలెత్తిన సమస్యలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ నిర్ణయాలకు అనుగుణంగా పౌరుల్లో నగదురహిత లావాదేవీలపై అవగాహన పెంచాల్సిన బాధ్యత విద్యాధికులపై ఉందని వర్శిటీ రిజిస్ట్రార్ జి.తులసీరావుస్పష్టంచేశారు.
గురువారం కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ సెమినార్ హాల్‌లో నగదురహిత లావాదేవీలపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. సామాజిక విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా అందరికీ ప్రధానమంత్రి రూపొందించిన జన్‌ధన్ ఖాతాలను మండల కేంద్రమైన ఎచ్చెర్లలో తెరిపించామని గుర్తు చేశారు. ఈగ్రామాన్ని దత్తతగా తీసుకొని ప్రతీ కుటుంబ సభ్యులు నగదురహిత లావాదేవీలు నిర్వహించుకునేలా చైతన్యం కల్పించాలని ప్రణాళికా సిద్ధం చేశామన్నారు.
కార్యాచరణ ప్రాప్తికి స్థానికుల్లో నగదురహిత లావాదేవీలపై అవగాహన పెంపొందించి అభివృద్ధి వేగవంతానికి వర్శిటీవిద్యార్థులు తోడ్పాటు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జామినేషన్ డీన్ కామరాజు, నగదురహిత లావాదేవీల నోడల్ అధికారి డాక్టర్ ఎస్.తారకేశ్వరరావులు ఉన్నారు.

ఉత్సాహభరితంగా జోనల్ క్రీడా పోటీలు

వీరఘట్టం, డిసెంబర్ 8: స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం ప్రారంభమైన ఖేల్ ఇండియా పాలకొండ నియోజకవర్గ స్థాయి అంతర పాఠశాలల జోనల్ క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభం జరిగాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచే పిడిలు, పిఇటిలు క్రీడాకారులకు క్రీడలు నిర్వహించారు. ఉత్సాహభరితంగా ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగాయి. కబడ్డీ, వాలీబాల్, హైజంప్ తదితర పోటీల్లో పాల్గొని అందరినీ ఆనందపరిచారు. మీట్ ఆర్గనైజర్ రామకృష్ణ, పాఠశాల హెచ్‌ఎం నరసింహరావు, విద్యాకమిటీ చైర్మన్ జనార్థనరావులు పర్యవేక్షణలో నిర్వహించారు.
ఈ క్రీడలు సందర్భంగా మండలంలోని పలు గ్రామాల చెందిన యువతీయువకులు వితరణతో పాటు వీరఘట్టం మండలం నుంచి పెద్ద ఎత్తున క్రీడలను చూసేందుకు వచ్చారు. కలియుగభీముడు కోడిరామ్మూర్తినాయుడు జన్మించినది వీరఘట్టం కావడం అందరికీ గుర్తింపునిస్తుంది.
ఈ నెల 11వ తేదీ వరకు క్రీడలు జరగనున్నందున పలువురు హాజరై క్రీడాకారులకు ఉత్సాహం కలుగుతుంది. ఈ పోటీల్లో సుమారు 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు.