తూర్పుగోదావరి

వెయ్యి అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజానగరం, డిసెంబర్ 9: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై శుక్రవారం వెయ్యి అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా నగదు రహిత లావాదేవీలపై ప్రతి గ్రామంలో ప్రజలను చైతన్యపరుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉప కులపతి ముర్రు ముత్యాలనాయుడు ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న 290 యూనిట్లలో సుమారు 1200 గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలపై ఎన్‌ఎస్‌ఎస్ కార్యకర్తల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తామని భారత్‌మాత సాక్షిగా ప్రమాణం చేయించారు. రానున్న వారం రోజుల్లో ఆయా గ్రామాల్లో స్వైపింగ్ మిషన్లు ఏ విధంగా వినియోగించాలి, ఆధార్ కార్డులు, డిజిఎస్‌లు, ఇ వ్యాలెట్, యుపిఐ, అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ డేటా విధానాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అడ్డాడ నర్సింహారావు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, ఎన్‌ఎస్‌ఎస్ పోగ్రామ్ కోఆర్డినేటర్ ఆచార్య కిరణ్‌చంద్ర, విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు ఆచార్య జానకీరావు, ఇతర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు
ఆనారోగ్యశ్రీ చేసేశారు
కాకినాడ, డిసెంబర్ 9: పేదల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాకు వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చాలా వ్యాధులను ప్రైవేటు ఆసుపత్రుల నుండి ప్రభుత్వాసుపత్రులకు మార్చారన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక పేద ప్రజలకు వైద్యం అందటం లేదన్నారు. ముఖ్యఅతిథి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. ఈ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చి వైద్యం అందించకుండా చేస్తున్నారన్నారు. తన మామ చనిపోవటానికి కారణమైన చంద్రబాబు పథకానికి పేరు మార్చి కూడా ఎన్టీఆర్‌ను ప్రజల్లో చులకన చేస్తున్నారని చెప్పారు. విద్య, వైద్య, సంక్షేమ రంగాలను విస్మరిస్తే ఏ ప్రభుత్వం మన్ననలు పొందదని, వారు ప్రజాగ్రహం చవిచూడక తప్పదన్నారు. అన్నీ ఆలోచించి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టామని, దీనిని పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకలు అమలు చేశాయన్నారు. పేదల ఆరోగ్యానికి ఉపయోగపడే 108, 104 అంబులెన్స్‌లు, పేదలకు వైద్యం, విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలు పెట్టి ప్రజామన్ననలు పొందామని బోస్ తెలిపారు. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీని కొనసాగించి బకాయిలు చెల్లించాలని డిమాండ్‌చేశారు. ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ వేలాది మంది పేదలకు ఈ పథకం భరోసా ఇచ్చిందన్నారు. వైఎస్ పథకానికి ఎన్టీఆర్ పేరు తగిలించి నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ధర్నాలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, నాయకులు పెండెం దొరబాబు, ముత్తా శశిధర్, తోట సుబ్బారావు నాయుడు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, పోలు విజయలక్ష్మి, యనమదల గీత, బొంతు రాజేశ్వరరావు, గిరిజాల స్వామినాయుడు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, వేగుళ్ల లీలాకృష్ణ, పితాని బాలకృష్ణ, కొండేటి చిట్టిబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, శెట్టిబత్తుల రాజబాబు, ఆకుల వీర్రాజు, రావూరి వెంకటేశ్వరరావు, అనంత ఉదయభాస్కర్, ముత్యాల శ్రీనివాస్, ఆర్‌విజెఆర్ కుమార్ మిండగుదిటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో ఎఒ పి తేజేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు.

వైసిపి గూటికి దుర్గేష్
- హైదరాబాద్‌లో 12న జగన్ సమక్షంలో చేరిక

రాజమహేంద్రవరం, డిసెంబర్ 9: కాంగ్రెస్ పార్టీలో తనకున్న సుదీర్ఘ అనుభవాన్ని, అనుబంధాన్ని పక్కనబెట్టి మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా రాజీనామా చేసి వైసిపి గూటికి చేరుతున్నారు. తన అనుచరులతో కలిసి వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నానని శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో కందుల దుర్గేష్ వెల్లడించారు. తన సహచరులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సంప్రదించిన తర్వాతే కలసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇప్పటికే తాను వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డిని కలిశానని, ఈ నెల 12వ తేదీ ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరుతున్నానని వెల్లడించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజా తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈ మేరకు 11వ తేదీన తనతో పయనించే సుమారు యాభై మందితో హైదరాబాద్ బయలుదేరనున్నట్టు తెలిపారు. తాను ఆరాధ్యదైవంగా భావించే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారుడిని ఈ రాష్ట్రానికి సిఎంని చేయాలనే ధ్యేయంతోనే బేషరతుగా వైసిపిలోకి చేరుతున్నానని, ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తానన్నారు.
మాతా శిశు మరణాలు తగ్గించేందుకు కృషి
రంపచోడవరం, డిసెంబర్ 9: గిరిజన ప్రాంతాల్లో మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాన మంత్రి సురక్షా మాతృత్వ అభియాన్ కార్యక్రమం పేరిట గర్భిణుల ఆరోగ్య మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రతి నెల 9వ తేదీ ప్రధాన మంత్రి సురక్షా మాతృత్వ అభియాన్ పేరిట అన్ని పిహెచ్‌సిల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కాన్పు ప్రమాదకరమైన గర్భిణులను గుర్తించి, తగు వైద్య సహాయం అందిస్తారన్నారు. గర్భవతులు తమ పేర్లను పిహెచ్‌సిల్లో నమోదు చేయించుకోవడంతోపాటు నాలుగు సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. అలాగే అంగన్‌వాడీల ద్వారా ప్రవసానికి ముందు 6 నెలలు, ప్రసవానంతరం 6 నెలలు పౌష్టికాహారం పొందాలని కలెక్టర్ తెలిపారు. గిరిజన ప్రాంత గర్భిణుల్లో రక్తం తక్కువగా ఉంటోందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భం ధరించిన తరువాత కష్టతరమైన పనులకు వెళ్లవద్దని మహిళలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి మండల కేంద్రంలో అంగన్‌వాడీల నిర్వహణపై వర్కర్లకు తగు శిక్షణ ఇస్తామని చెప్పారు. అంగన్‌వాడీలు పనితీరు మెరుగుపరచుకోవాలని ఆదేశించారు. ఐటిడిఎ పిఒ దినేష్‌కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య పోషణ కేంద్రాల ద్వారా గర్భిణిగా ఉన్న సమయంలో పోషకాహారం తీసుకున్నట్టయితే ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ సతీమణి, మహిళా శిశు సంజీవని జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీదేవి మాట్లాడుతూ ఏజెన్సీలో మాతా శిశు మరణాలను తగ్గించేందుకు మండలానికి 10 అంగన్‌వాడీలు చొప్పున 11 మండలాల్లో 110 కేంద్రాలను పైలట్‌గా తీసుకుని అంగన్‌వాడీ స్థాయి మానిటరింగ్ కమిటీని నియమిస్తామన్నారు.
సొమ్ము చేతికందక రైతాంగం విలవిల

కాకినాడ, డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలతో రైతాంగం విలవిల్లాడుతోంది. 500, 1000 నోట్ల రద్దు కారణంగా ఈ సీజన్‌లో సమయానికి డబ్బు చేతికందక రైతులు అప్పుల పాలవుతున్నారు. తాము పండించిన పంటను కొనుగోలు చేసేవారున్నప్పటికీ, డబ్బులిచ్చేవారు మాత్రం లేని చిత్రమైన పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలిస్తే రైతులకు గిట్టుబాటు ధర మాటెలా ఉన్నా అంతా అరువు బేరం చందాన సాగుతోంది. ఆయా సీజన్లలో మిల్లర్లు రైతులకు ముందుగా పెట్టుబడులు పెట్టడం, పంటలు పండించడం సాధారణంగా జరుగుతోంది. పంట చేతికందాక రైతుల నుండి మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. ప్రభుత్వం ఏటా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నప్పటికీ అధిక శాతం రైతులు ముందుగా కుదుర్చుకున్న అంగీకారం మేరకు మిల్లర్లకే ధాన్యాన్ని విక్రయిస్తుంటారు. మిల్లర్లు కూడా కనీస మద్దతు ధర కంటే 50నుండి 100 రూపాయల వరకు అదనంగా రైతులకు చెల్లిస్తుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సొమ్ము చెల్లించలేమంటూ మిల్లర్లు చేతులెత్తేస్తున్నారు. సకాలంలో బ్యాంకర్ల నుండి తమకు చెల్లింపులు లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని మిల్లర్లు వాపోతున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్న రైతులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు! పంట విక్రయించాక 24 నుండి 48గంటల్లోగా సొమ్మును నేరుగా రైతుల ఖాతాలకు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆచరణలో బ్యాంకర్లు నగదును రైతుల చేతికివ్వలేని దుస్థితి ఏర్పడింది. వారానికి 24 వేల రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, తమ వద్ద సొమ్ము లేదంటూ బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. రోజుకు 2వేల నుండి 4వేలకు మించి బ్యాంకర్లు ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం రెండవ పంట (రబీ)కు సంబంధించి పనులు ప్రారంభమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూలీలకు చెల్లింపులు జరిపేందుకు సొమ్ము అవసరమని రైతులు వాపోతున్నారు. ఓవైపు ఖరీఫ్ పంట డబ్బు చేతికి రాక, మరోప్రక్క బ్యాంకులు అప్పులు ఇవ్వక, కూలీలకు చెల్లింపులు చేయలేక రైతులు సతమతం అవుతున్నారు. ఇక ఉద్యానవన పంటలు, వాణిజ్య పంటల పరిస్థితి మరింత దారుణంగా మారింది. అరటి పంటకు ఎకరానికి 70వేల వంతున, కందకు లక్ష వంతున రుణాలివ్వాల్సి ఉంది. ఈ రుణాలను తిరిగి ఏడాది లోగా జీరో శాతం వడ్డీపై బ్యాంకర్లకు చెల్లిస్తే మళ్ళీ నాలుగు రోజుల్లో రుణం పొందే అవకాశం ఉంది. ఇపుడా పరిస్థితి లేదు. రుణం కావాలంటే తీసుకున్న అప్పును చెల్లించాల్సి ఉంది. ఇక్కడ కూడా వ్యాపారుల నుండి సొమ్ము అందకపోవడంతో అప్పులు చెల్లించలేక, కొత్తగా రుణాలు పొందలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వాటిని కొనుగోలు చేసేందుకు బ్యాంకు కార్డులు ఉపయోగించుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు.
చెక్కు, ఆన్‌లైన్‌లో చెల్లింపు...
ధాన్యం సేకరణ అనంతరం రైతులకు చెక్కు, ఆన్‌లైన్ విధానంలోనే సొమ్ము చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ గురువారం ప్రకటించారు. ఈ ఆదేశాల ప్రకారం ఇక రైతుల ఖాతాల్లోనే సొమ్ము ఉంటుంది. ఆ సొమ్మును చేతికి అందుకోవాలని ఆశిస్తే మాత్రం సాధ్యం కాదని స్పష్టమవుతోంది. ఈ కారణంగా రోజూవారీ చెల్లింపులు, ఇతర ఆర్ధిక పరమైన వ్యవహారాల్లో తమకు శిరోభారం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నగదు రహిత లావాదేవీలపై అవగాహన కలిగి ఉండాలి

రాజమహేంద్రవరం, డిసెంబర్ 9: క్షేత్రస్థాయిలో ప్రతీ ఒక్కరూ నగదు రహిత లావాదేవీలపై అవగాహన కలిగి వుండాలని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా సైనికుల్లా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో శుక్రవారం నగదు రహిత లావాదేవీలపై అవగాహన శిక్షణా కార్యక్రమంలో భాగంగా అధికారులు, ప్రైవేటు సంస్థల అసోసియేషన్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు గ్రామాల్లోని ప్రజలకు సంపూర్ణమైన అవగాహన కల్పించేందుకు ముందు అధికారులు పూర్తి అవగాహన పెంపొందించుకుని క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. మరోవైపు చిల్లర నోట్ల సమస్యలను అధిగమించేందుకు యంత్రాంగం కృషిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్ద నోట్లు రద్దుచేసి నెల రోజులు దాటుతోందని, ప్రజల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా యంత్రాంగం సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించారు. మొబైల్ యాప్స్ వినియోగంపై సంపూర్ణమైన అవగాహన పెంపొందించాలన్నారు. 90 శాతం బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ఖాతాదారులందరికీ ఎటిఎం కార్డులు వచ్చేలా చూడాలన్నారు. మహిళా గ్రూపుల్లో కూడా బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వారందరికీ మొబైల్ యాప్స్ ద్వారా లావాదేవీలు నిర్వహించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లా ట్రైనింగ్ కో-ఆర్డినేటర్ సూరపరాజు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత కూన మృతి
మారేడుమిల్లి, డిసెంబర్ 9: ఏజెన్సీ మండలం మారేడుమ్లి శివార్లలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులి పిల్ల మృతిచెందింది. మారేడుమిల్లి నుండి రంపచోడవరం వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం మృతిచెందివున్న చిరుతపులి పిల్లను గమనించిన వాహనదారుల సమాచారంతో దాన్ని చూడటానికి స్థానికులు తండోపతండాలుగా తరలివచ్చారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని, మృతిచెందినది చిరుతపులి పిల్ల కాదని పేర్కొని, పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో దానిని ఖననం చేశారు.
మళ్లీ మొదలైన దివీస్ వివాదం
తొండంగి, డిసెంబర్ 9: వివాదాస్పద దివీస్ లేబరేటరీ తేనెతుట్టె మళ్లీ కదిలింది. మందుల కంపెనీ పనులను శుక్రవారం స్థానికులు అడ్డగించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు లాఠీలను ఝుళిపించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని వ్యాన్‌లోకి ఎక్కించి కోటనందూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే... దివీస్ లేబరేటరీ కంపెనీని నిర్మించే ప్రదేశంలో రెవెన్యూ అధికారులు శుక్రవారం భూమికి హద్దులు ఏర్పాటు చేసే నిమిత్తం సర్వే ప్రారంభించారు. తాటియాకులపాలెం, పంపాదిపేట, కొత్తపాకలు తదితర గ్రామాలకు చెందిన ప్రజలు ఈ పనులను అడుడకున్నారు. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులతో ప్రజలు వాగ్వివాదానికి దిగడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పనులు ముందుకు సాగనివ్వకపోవడంతో పోలీసులు ప్రజలను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు.
దివీస్ లేబొరేటరీ సంస్థకు అప్పగించిన 20 ఎకరాల్లో భూమికి హద్దులు ఏర్పాటుచేసి, వాటిలో చెట్లను నరికిస్తుండగా పలు గ్రామాల ప్రజలు అడ్డగించి అధికారుల వద్దనుండి రికార్డులను తీసుకుపోయినట్టు పోలీసులకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా ఈ వ్యవహారంలో బాధితుల తరపున పోరాడుతున్న స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సంఘటనా స్థలానికి చేసుకుని ప్రజలతోను, పోలీసు అధికారులతోను మాట్లాడారు. అలాగే పెద్దాపురం ఆర్డీవో విశే్వశ్వరరావుతో కూడా ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి పోలీసులను భారీ సంఖ్యలో మోహరించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఈ ప్రాంతానికి వచ్చి ప్రజలతో సమీక్షలు నిర్వహించి వారి అపోహలను తొలగించి వారిలో అవగాహన కల్పించాలని, ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఇక్కడ ప్రజలకు వ్యతిరేకంగా దివీస్ పనులను చేపడితే ప్రజలకు మద్దతుగా న్యాయ పోరాటం చేస్తానని ఆయన హెచ్చరించారు.

జగన్ వ్యాఖ్యలు విడ్డూరం
కాకినాడ, డిసెంబర్ 9: ప్రతిపక్ష వైసిపి నేత వైఎస్ జగన్ గిరిజన, పోలవరం వంటి సమస్యలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుతో కలిసి విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ తన తండ్రి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయకుండా కేవలం కమీషన్ల కోసం కాలువలు తవ్వి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారన్నారు. నాడు పోలవరం నిర్వాసితులకు 2.6 లక్షలు నష్ట పరిహారం ఇస్తే చంద్రబాబు ప్రభుత్వం 7.36 లక్షలతో పాటుగా ఒక ఇల్లును కూడా ఇస్తుందన్నారు. 44 గ్రామాలు ప్రాజెక్టులో మునిగిపోతుండగా 22 గ్రామాలకు పరిహారం ఇచ్చామని మిగిలిన వాటికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. వసతి గృహాలకు ఆరుకోట్లతో ప్రతిపాదనలు పంపామని, వీటిలో నాలుగున్నర కోట్లు చింతూరు పిహెచ్‌సికి, మిగిలిన 1.50 కోట్లు వసతి గృహాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు.
ప్రభుత్వానికి ఉపయోగపడే సలహాలను ప్రతిపక్షం ఇవ్వాలని, ప్రజలను తప్పుదారి పట్టే విధంగా జగన్ మాట్లాడడం సరికాదన్నారు. జగన్ కలలు మాని రాష్ట్భ్రావృద్ధికి సూచనలు చేయాలని వారు చెప్పారు. గతంలో కంటే ఆరోగ్యశ్రీ పథకంలో అదనంగా మరో 100కు పైగా రోగాలను చేర్చామని చెప్పారు. రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేశామని చెప్పారు. సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు నున్న దొరబాబు, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎంజి సూర్యనారాయణ, మైనార్టీ నాయకుడు ఎండి జహీరుద్దీన్ జిలానీ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా తప్పనిసరి
కాకినాడ, డిసెంబర్ 9: నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరికి బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలని జెసి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం జెసి ఆర్‌టిసి బస్‌కాంప్లెక్స్ వద్ద ఉన్న రైతుబజార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జెసి సత్యనారాయణ మాట్లాడుతూ కాయగూరలు కొనుగోలు చేసే వినియోగదారులకు చిల్లర కొరత వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఎస్టేట్ అధికారికి ఆదేశాలు జారీ చేశామన్నారు. చిల్లర కరెన్సీ కొరత వల్ల రైతుబజార్ కార్యాలయంలో నగదు జమ చేసే టోకెన్‌లు పొంది వాటితో కాయగూరలు కొనుగోలు చేసుకోవాలన్నారు. 100, 50, 20, 10 రూపాయల టోకెన్లను ఎస్టేట్ అధికారి వినియోగదారులకు జారీచేయాలని సూచించారు. వచ్చిన టోకెన్లు రైతులు ఎస్టేట్ అధికారికి ఇస్తే వారి ఖాతాలో నగదును జమ చేస్తామని చెప్పారు. నగదు రహిత లావాదేవీలపై ఈ నెల 13 నుండి 23 వరకు జెఎన్‌టియు విద్యార్ధులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని జెసి చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎడి కిషోర్‌కుమార్, సివిల్ సప్లయిస్ డిఎం ఎ కృష్ణారావు, అర్బన్ తహశీల్దార్ జి బాలసుబ్రహ్మణ్యం, ఎస్టేట్ అధికారి ఎం గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

15 నుండి మండపేటలో రాష్టస్థ్రాయి పాలపోటీలు
కాకినాడ సిటీ, డిసెంబర్ 9: రాష్టస్థ్రాయి పాలపోటీలను ఈనెల 15వ తేదీ నుండి మండపేటలో నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. దేశ జాతులైన ఒంగోలు, గిర్, పుంగనూరు ఆవు జాతులు, ముర్రా, జాఫర్బాదీ గేదె జాతుల పెంపకాన్ని ప్రోత్సహించడానికి, రైతులకు ఆధునిక సాంకేతిక పెంపు పద్ధతులపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈపోటీలను నిర్వహిస్తున్నామన్నారు. మండపేటలోని వల్లూరి వెంకట్రావు స్మారక రాష్టస్థ్రాయి పాల పోటీలు, అందాలపోటీల పేరిట ఈనెల 15న ప్రారంభమై 17వ తేదీ వరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ పోటీల నిర్వహణకు 19లక్షల రూపాయల వ్యయమయ్యే అవకాశం ఉంటుందని అంచనావేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ఆరు లక్షలు, పశు సంవర్ధక శాఖ 4లక్షలు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ లక్ష నిధులను మంజూరు చేశాయని, మిగిలిన మొత్తాన్ని మండపేట అభ్యుదయ రైతులు భరించనున్నారని తెలిపారు. పోటీలకు హాజరయ్యే పాడి పశువుల రైతులకు ముత్యాల రామారావు భోజన వసతిని, పడాల సుబ్బారావు బహుమతుల షీల్డులను అందజేస్తారన్నారు. పోటీలు ముర్రా, జాఫర్బాదీ గేదె జాతులు, ఒంగోలు, గిర్, పుంగనూరు ఆవు జాతుల ఐదు విభాగాల్లో జరుగుతాయని, ఒక్కో విభాగంలో ప్రథమ బహుమతిగా 50వేలు, ద్వితీయ బహుమతిగా 40వేలు, తృతీయ బహుమతిగా 30వేల రూపాయలను అందజేస్తామని కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. మండపేట మారేడుబాక రోడ్డులో ఈపోటీలను నిర్వహిస్తామని, పోటీలో పాల్గొనదలచిన రైతులు తమ పశువులను తీసుకువచ్చి ఈనెల 14, 15తేదీల్లో మధ్యాహ్నం 1గంటల సమయంలోపు తమ పేర్లను నమోదుచేసుకోవాలని కోరారు. ఈనెల 15వ తేదీ సాయంత్రం 5గంటలకు స్థానిక ఎమ్మెల్లే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రారంభిస్తారని చెప్పారు. ఈ నెల 17న జరిగే ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మకాయల చినరాజప్ప, జిల్లాపరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, రాష్ట్ర పశుగణావృద్ధి సంస్థ ఛైర్మన్ యాళ్ల దొరబాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ మన్మోహన్‌సింగ్ తదితరులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ అరుణ్‌కుమార్ శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ వి వెంకటేశ్వరరావు, డివిజనల్ సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ అధికారి డాక్టర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రకారుడు గువ్వల కెనడీ ఆకస్మిక మృతి
రాజమహేంద్రవరం, డిసెంబర్ 9: రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు గువ్వల కెనడీ శుక్రవారం ఆకస్మికంగా మృతిచెందారు. తన అందమైన చిత్రాలతో నగర ఖ్యాతిని ఇనుమడింపజేసిన కెనడీ ఎన్నో అద్భుత చిత్రాలను ఆవిష్కరించారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ చిత్రాలను, పుష్కరాల సమయంలో చిత్రాలతో పాటు ఎన్నో భావరూప కళాఖండాలను చిత్రించి తన సృజనాత్మకతతో చిత్రలేఖనంలో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించారు. కెనడీ కుంచె నుంచి జాలువారిన అత్యద్భుతమైన పెయింటింగ్‌తో ఎన్నో ప్రదర్శనలు నిర్వహించారు. గత కొంత కాలంగా అస్వస్థతకు గురైన కెనడీ ఆకస్మికంగా మృతిచెందడంతో నగరంలో విషాదం అలుముకుంది. గోదావరి నది భావుకతతో ఎన్నో చిత్రాలతో గోదావరి నదిని మరింత అందంగా తీర్చిదిద్దిన ఆయన కలం రాజమహేంద్రవరం నగరానికి ఒక ల్యాండ్ మార్కువంటిదని పలువురు ఆయన ప్రతిభను శ్లాఘిస్తూ నివాళి అర్పించారు. కెనడీ మృతిపట్ల వైసిపి కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు సంతాపం తెలియజేశారు. కెనడీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.