తూర్పుగోదావరి

ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్రేయపురం, మార్చి 19: ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని, ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. ఆదివారం కోనసీమ తిరుపతిగా పేర్గాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ కమిటీ సమావేశాన్ని ఆదివారం ఆ గ్రామంలోని ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించారు. కమిటీ ప్రమాణ స్వీకారం అయిన తరువాత తొలిసారిగా సమావేశం నిర్వహించడంతో అభినందన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప మాట్లాడుతూ ఆలయ ధర్మకర్తల మండళ్లు భక్తుల అభిప్రాయాలకు తగ్గట్టుగా దేవాలయాలను అభివృద్ధి చేయాలన్నారు. ఎంపి మురళీమోహన్ మాట్లాడుతూ సిఎం చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, హిందూ దేవాలయాల్లో అన్న ప్రసాద వితరణ జరిగేలా ఆయా ఆలయ ధర్మకర్తల మండళ్లు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రహదారులను వెడల్పుచేసినట్టు చెప్పారు. ఆలయానికి వచ్చే మార్గంలో ఉన్న మెర్లపాలెం వద్ద వంతెనను నిర్మించనున్నట్టు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ గతంలో కంటే ఆలయానికి భక్తుల రద్దీ నానాటికీ పెరుగుతోందని, అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. సుమారు తొమ్మిది దశాబ్ధాల కిందట ఆగిపోయిన స్వామివారి రథోత్సవాన్ని పునఃప్రారంభిస్తున్నామని, వచ్చే నెలలో జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవాలలో భాగంగా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం ధర్మకర్తల మండలి ఛైర్మన్ కరుటూరి నర్సింహారావు, సభ్యులు పడాల పద్మావతి, పొలిమాటి శ్రీను, కోమలి సత్యనారాయణ, తూము వెంకట్రావు, పరవస్తు పట్ట్భా రామ వేణుగోపాల్, వేపుగంటి వెంకన్న, వేగేశ్న లక్ష్మీపతిరాజు, కొంతం వెంకట మహేష్ కృష్ణ, వాడపల్లి సుందర శేషారత్నంలను పూలమాలలు, శాలువాలతో ముఖ్య అతిథులు సత్కరించి, అభినందించారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ ఛైర్మన్ కెవి సత్యనారాయణరెడ్డి, ఎంపిపి వాకలపూడి వెంకట కృష్ణారావు, ముళ్లపూడి భాస్కరరావు, ఆలయ ఇఒ భాగవతుల వెంకటరమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఉత్తరాది స్ఫూర్తితో దక్షిణాదిన పాగాకు కృషిచేయాలి
బిజెపి కార్యకర్తలకు కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు సత్యకృష్ణంరాజు పిలుపు

అమలాపురం, మార్చి 19: ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపి సాధించిన ఘన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బిజెపి అధికారం చేపట్టేందుకు నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుండే పని చేయాలని జాతీయ హార్టికల్చర్ డైరెక్టర్ చోడరాజు సత్యకృష్ణంరాజు అన్నారు. కోనసీమ పర్యటనలో భాగంగా ఆదివారం అమలాపురం పట్టణ బిజెపి కార్యాలయం వద్ద పట్టణ పార్టీ అధ్యక్షుడు అయితాబత్తుల అభిషేక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణంరాజు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంస్కరణలను ప్రజలు అర్ధం చేసుకున్నారని, దీనిని భవిష్యత్‌లో జరిగే ఎన్నికలకు అనుకూలంగా మార్చాలని సూచించారు. కోనసీమ హార్టికల్చర్ అభివృద్ధికి అనువైన ప్రాంతమని, కొబ్బరి తోటల్లో అంతర పంటలుగా ఉద్యానవన సాగు చేయాలని ఈ సందర్భంగా కృష్ణంరాజు సూచించారు. ఉద్యానవన పంటల అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం పలు రాయితీలు అందజేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోనసీమ కొబ్బరి రైతులు, ఆక్వా రైతుల సమస్యలపై చర్చించేందుకు రానున్న కాలంలో అమలాపురంలో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అంతకు ముందు కృష్ణంరాజుకు బిజెపి నాయకులు ముదునూరి రంగరాజు, యర్రమిల్లి పాండురంగరావులతోపాటు పలువురు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు ఆర్‌వి నాయుడు, బసవా శివరామప్రసాద్, మోకా వెంకటసుబ్బారావు, పెయ్యిల శ్యామ్‌ప్రసాద్, చిట్టూరి రాజేశ్వరి, సంసాని వెంకటరత్నంకుమార్, నిమ్మకాయల వెంకటరెడ్డినాయుడు, కర్రి తాతారావు, జంగా రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.

రేపే మంజునాథ కమిషన్ రాక
-22, 23 తేదీల్లో ప్రజాభిప్రాయ సేకరణ

కాకినాడ, మార్చి 19: రాష్ట్ర ప్రభుత్వం కులాల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు నియమించిన రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (మంజునాథ కమిషన్) ఈ నెల 21న జిల్లా కేంద్రం కాకినాడ నగరానికి రానుంది. ఆరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడలో బయలుదేరి, సాయంత్రం 6 గంటలకు కాకినాడ చేరుకుని స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో కమిషన్ బస చేస్తుంది. రాత్రి 7 గంటలకు కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఎదురవుతున్న సమస్యలు, క్రీమిలేయర్, స్మార్ట్‌పల్స్ సర్వే తదితర అంశాలపై కలెక్టర్, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తారు. ఈ నెల 22న ఉదయం 10.30 గంటల నుండి స్థానిక రంగరాయ వైద్య కళాశాల సెమినార్ హాలులో ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్) నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు అతిథి గృహానికి చేరుకుంటారు. 23వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి రంగరాయ వైద్య కళాశాల సెమినార్ హాలులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన అనంతరం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తారు. బిసి కమిషన్ జిల్లాకు రానున్న నేపథ్యంలో కమిషన్ ముందు హాజరయ్యేందుకు ఆయా కుల సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. కమిషన్ జిల్లాలో రెండు రోజులు విచారించనుండటంతో ఎవరి వాదనలు వారు వినిపించేందుకు, విజ్ఞాపన పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయా కులాల ఆర్ధిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు, సమస్యలపై కులాల వారీ నివేదికలు సిద్ధం చేస్తున్నారు. కమిషన్‌కు విన్నవించుకునేందుకు జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల నుండి కుల సంఘాల ప్రతినిధులు తరలి రానున్నారు. కమిషన్ రాక నేపథ్యంలో జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. నగరంలో ఏ విధమైన ప్రచార కార్యక్రమాలకు తావులేదని, కటౌట్లు, బ్యానర్లు, కుల సంఘాలకు సంబంధించిన పోస్టర్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రశాంతమైన, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో కమిషన్ ఎదుట ఆయా కుల సంఘాలు హాజరై తమ విజ్ఞాపనలు, వినతులను సమర్పించుకోవాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ సూచించారు.

అంత్యక్రియలకు చచ్చిపోతున్నాం!
శ్మశానానికి వెళ్లడానికి వంతెన కోసం పాడెతో ఉచ్చులవారిపేట వాసుల వినూత్న నిరసన
డి.గన్నవరం మార్చి 19: ‘నేతల్లారా మాగోడు వినిపించదా? మా కష్టం కనిపించదా’ అంటూ ఉచ్చులవారిపేట గ్రామస్థులు ఆదివారం శవాన్ని తరలించేందుకు తయారుచేసిన అరటిబొందల పాడెతో గంటి రోడ్డుపై ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తిని అడ్డగించి నిరసన తెలిపారు. గ్రామస్థులు ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని సుమారు అయిదు కి.మీ మేర మోసుకెళ్లి ఖననం చేయాల్సి వస్తోందని, ఈ విషయాన్ని దశాబ్దాలుగా నాయకులకు విన్నవించుకున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదని వారు ఆవేదన చెందారు. 12 ఏళ్ల క్రితం వంతెన పనులు ప్రారంభించి పిల్లర్లకే పరిమితమైందన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి ఈ వేసవి కాలువ కట్టుబడుల సమయంలో వంతెన నిర్మాణం పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చి ఆందోళనకారులను శాంతింపచేశారు. అనంతరం గ్రామస్తులు అరటి బొందలతో చేసిన పాడెపై మృతదేహంతో కూడిన చెక్కపెట్టెను ఉంచి కాలువను ఈదుకుంటూ అవతలి ఏటిగట్టుపైకి శవాన్ని తరలించి ఖననం చేశారు. ఈ కారణంగా గంటి రోడ్డుపై ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎస్సై పూడి వీరబాబు సిబ్బందితో రంగప్రవేశం చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.