ఆటాపోటీ

అడకత్తెరలో మనోహర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)ని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని, పాలనా వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉంచుతానని అట్టహాసంగా ప్రకటించిన శశాంక్ మనోహర్ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారింది. బిసిసిఐ అధ్యక్షుడిగా, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్న అతను ఒకవైపు కోర్టు కేసులతో, మరోవైపు వివిధ సభ్య సంఘాల విమర్శలతో సతమతమవుతున్నాడు. ఎవరికీ సమాధానం చెప్పుకోలేక, ఎవరినీ ఒప్పించలేక, ఏ వర్గాన్నీ మెప్పించలేక గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. బిసిసిఐ ప్రక్షాళనకు సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేస్తే దేశ క్రికెట్‌పై బిసిసిఐకి ఉన్న పట్టు పోతుంది. కాదని భీష్మించుకుంటే, అసలు బిసిసిఐ ఉనికికే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక మనోహర్ అల్లాడుతున్నాడని అతని సన్నిహితులు అంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాతే అతని గురించి స్పష్టత లభిస్తుంది.
--

మరాఠా యోధుడు శశాంక్ మనోహర్ బిసిసిఐకిగానీ, పాలనాపరమైన వ్యవహారాలకుగానీ కొత్తకాదు. 2008 నుంచి 2011 వరకూ అతను బిసిసిఐ అధ్యక్షుడిగా సేవలు అందించాడు. గత ఏడాది జగ్మోహన్ దాల్మియా హఠాన్మరణంతో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగ్గా, మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. వృత్తిరీత్యా అతను న్యాయవాది. బోర్డు అధ్యక్షుడిగా మొదటి విడత పని చేసిన కాలంలో ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్టు అమలు చేయడంలో అతనిని మించిన వారు లేరని అందరి నంచి ప్రశంసలు అందుకున్నాడు. అయితే, అప్పట్లో బిసిసిఐ పరిస్థితి వేరు. భారత క్రికెట్‌ను ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు లేకుండా బిసిసిఐ శాసించే రోజులు. బోర్డును ధిక్కరించే సాహసం ఎవరూ చేసేవారు కారు. సభ్య సంఘాలు నోరు మెదపడానికే భయపడేవి. భారత్‌లో క్రికెట్‌కు తిరుగులేని ఆదరణ ఉండడంతో, బోర్డు కోట్లకు పడగలెత్తింది. క్రికెట్‌ను ఒక మతంగా, క్రికెటర్లను దేవతలుగా ఆరాధించే దేశంలో ఏ స్థాయి మ్యాచ్‌లకైనా స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. కోట్లాది మంది అభిమానులు టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్‌లు చూస్తుంటారు. క్రికెట్ ఒక వ్యసనంలా మారింది. మీడియాకు కూడా క్రికెట్ వార్తలు వేయనిదే రోజు గడవని పరిస్థితి తలెత్తింది. బలమైన ఊడలతో పాతుకుపోయిన క్రికెట్‌ను పెకలించడం ఎవరికీ సాధ్యం కాదన్న వాస్తవాన్ని గ్రహించిన బిసిసిఐ మరింతగా రెచ్చిపోయింది. శ్రీనివాసన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని విమర్శలకు తావిచ్చింది. క్రమంగా బిసిసిఐపై తిరుగుబాటు మొదలైంది. ఐపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం తెరపైకి రావడంతో బిసిసిఐ పరువు నడిబజారుకెక్కింది. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగి, చివరికి బోర్డు గొంతుకు ఉచ్చుగా మారింది. కింది స్థాయి కోర్టుల నుంచి మొదలుపెట్టి బిసిసిఐపై బీహార్ క్రికెట్ సంఘంతోపాటు పలువురు వ్యక్తిగత హోదాలో వేసిన పిటిషన్లు కూడా చివరికి సుప్రీం కోర్టుకు చేరాయి. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం నిగ్గుతేల్చడానికి ముకుల్ ముద్గల్ నేతృత్వంలో ఒక కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. రెండు విడతల్లో విచారణను పూర్తి చేసిన ఆ కమిటీ రెండు నివేదికలను సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా దోషులపై శిక్షలను ఖరారు చేయడానికి, బిసిసిఐని ప్రక్షాళన చేయడానికి అవసరమైన సూచనలు చేయడానికి లోధా కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. ఈ కమిటీ చేసిన సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని కోర్టు చేసిన సూచనలపై బిసిసిఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ ప్రతిపాదనలను అమలు చేయడం అసాధ్యమని తేల్చిచెప్పింది. అయితే, ఎందుకు అసాధ్యమన్న సుప్రీం కోర్టు ప్రశ్నకు బోర్డు వద్ద సమాధానం లేదు. ఈ కేసు విచారణ కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే, పలు సందర్భాల్లో కోర్టు బిసిసిఐకి వైఖరిని ఎండగడుతూ పలు వ్యాఖ్యాలు చేసింది. భారత క్రికెట్ రంగంలో గుత్త్ధాపత్యాన్ని కొనసాగిస్తున్నదని, ఎంతో మంది యువ క్రికెటర్లకు అవకాశం రాకుండా అడ్డుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పు ఇంకా వెలువడకపోయినా, బోర్డును సుమాచార చట్టం పరిధిలోకి చేర్చడం నుంచి, పాలక మండలి సభ్యుల వయోపరిమితి వరకూ లోధా కమిటీ చేసిన సూచనలను తు.చ తప్పకుండా అమలు చేసి తీరాలని ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బోర్డుతోపాటు సభ్య సంఘాల్లోనూ మంత్రులెవరూ పాలక మండళ్లలో ఉండరాదని లోధా చేసిన ప్రధాన సూచనల్లో ఒకటి. 70 ఏళ్లు దాటిన వారికి వర్కింగ్ కమిటీలో అవకాశం ఉండరాదన్నది మరొకటి. ఈ సిఫార్సులను అమలు చేస్తే, చాలా మంది ప్రముఖులు బిసిసిఐపై పట్టు కోల్పోతారు. అందుకే, మనోహర్ ఈ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అయితే, అంతకు ముందే బిసిసిఐని సమూలంగా మార్చేస్తానని, కొత్త రూపాన్ని తెస్తానని అతను ప్రకటించాడు. లోధా కమిటీ చేసిన సూచనలు నిజంగానే బోర్డు ముఖచిత్రాన్ని మార్చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఒకవైపు బోర్డు పాలనా వ్యవహారాలను పారదర్శకంగా ఉంచుతానంటూ ప్రకటిస్తున్న మనోహర్ సుప్రీం కోర్టు సూచనల మేరకు లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నాడన్న ప్రశ్న తలెత్తుతోంది. లోధా ప్రతిపాదననలకు అంగీకరిస్తే, తన అధికార పునాదులు కదిలిపోతాయన్న భయం అతనిని వెంటాడుతున్నది. సుప్రీం కోర్టు ఆదేశిస్తే, ఆ ప్రతిపాదనలను అమలు చేయక తప్పని పరిస్థితి. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారిన మనోహర్ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదనేది ఆసక్తిని రేపుతోంది. భారీ మార్పులకు అతను సహకరిస్తాడా లేక ఈ తలనొప్పి తనకు ఎందుకంటూ పక్కకు తప్పుకొంటాడా అన్నది చూడాలి. మొత్తం మీద ఏం చేయాలో తెలియని స్థితిలో మనోహర్ కొట్టుమిట్టాడుతున్నాడు. సుప్రీం కోర్టు తీర్పు ఎంత త్వరగా వెలువడితే, బిసిసిఐ భవితవ్యం అంత త్వరగా నిర్ధారణ అవుతుంది.

భవిష్యత్తు అగమ్యగోచరం
బిసిసిఐ అధ్యక్షుడు
శశాంక్ మనోహర్

- బిట్రగుంట