ఆటాపోటీ

సమర్థుడికే పగ్గాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతకాలం ఎదురుచూస్తేనేం.. సమర్థుడికే టీమిండియా కోచ్ పగ్గాలు దక్కాయి. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) చాలా కాలం తర్వాత సాధ్యమైనంత వరకూ పారదర్శకతను పాటించినట్టు కోచ్ ఎంపిక ప్రక్రియ స్పష్టం చేసింది. కుంబ్లేతో పోటీపడిన వాళ్లలో చాలా మంది అంతర్జాతీయ క్రికెట్‌లో పేరుప్రఖ్యాతులు అర్జించిన వారే ఉన్నారు. రేసులో అందరినీ ఓడించిన కుంబ్లే కోచ్ పదవిని దక్కించుకున్నాడంటే అతని ప్రతిభను ఊహించుకోవచ్చు. బోర్డు అధికారులకు అతనిపై ఉన్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద చాలాకాలంగా ఉత్కంఠ రేపుతున్న టీమిండియా ప్రధాన కోచ్ పదవికి ఎంపిక అనేక దశల్లో కొనసాగిన వడపోత, ఇంటర్వ్యూల అనంతరం పూర్తయింది. సమర్థుడి పేరును సిఫార్సు చేయడానికి బిసిసిఐ ఆధ్వర్యంలోని క్రికెట్ సలహా కమిటీ (సిఎసి) నడుం బిగించి, చివరి వరకూ చాలా కసరత్తే చేసింది. 57 మంది దరఖాస్తు చేసుకోగా, 21 మంది పేర్లను ప్రాథమికంగా ఖరారు చేసింది. జాబితాను మరింత సంక్షిప్తం చేసి, పది మందిని ఇంటర్వ్యూలకు పిలిచింది. సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్‌లతో కూడిన ఈ కమిటీ తనకు అప్పగించిన పనిని పారదర్శకంగానే పూర్తి చేసింది. జట్టుకు డైరెక్టర్‌గా సేవలు అందించిన రవి శాస్ర్తీ, 1983లో ప్రపంచ కప్‌ను సాధించిన భారత జట్టులో కీలక సభ్యుడు బల్వీందర్ సింగ్ సంధూ, మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు టామ్ మూడీ, స్టువర్ట్ లా, జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ తదితరులు దరఖాస్తు చేసుకున్న తరణంలో ఎవరిని పక్కకుపెట్టాలి? ఎవరిని ఇంటర్వ్యూకు ఆహ్వానించాలి? అన్న ప్రశ్నలకు సమాధాన్ని వెతుక్కోవడానికి శ్రమించింది. చివరికి అర్హులుగా భావించిన పది మంది ఇంటర్వ్యూలు తీసుకోవాలని నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎసి సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ ఏడుగురు అభ్యర్థులను సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేశారు. ముందుగానే నిర్ధారించుకున్న లక్ష్యాలను, అర్హతా అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఇంటర్వ్యూ కొనసాగింది. ఇంటర్వ్యూలో పాల్గొన్న వారంతా టీమిండియాను మరింత పటిష్టంగా తీర్చిదిద్దడానికి, ప్రపంచ మేటి జట్టుగా నిలబెట్టడానికి తాము ఎంచుకున్న మార్గాలను, రూపొందించుకున్న ప్రణాళికలను వివరించారు. చివరి వరకు రేసులో పోటాపోటీగా ఉన్న వారిలో కుంబ్లే వ్యక్తిగతంగా ఈ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. కాగా, ప్రస్తుతం విదేశంలో ఉన్న రవిశాస్ర్తీ ‘స్కైప్’లో అందుబాటులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు స్టూవర్ట్ లా, టామ్ మూడీ, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ జట్లకు గతంలో కోచ్‌గా సేవలు అందించిన ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఆండీ మోలెస్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ లక్ష్యాలను, వాటిని అందుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలను వివరించారు. భారత మాజీ ఆటగాళ్లు లాల్‌చంద్ రాజ్‌పుట్, ప్రవీణ్ ఆమ్రేలను సిఎసి ఇంటర్వ్యూ చేసింది. అయితే, ప్రధాన అభ్యర్థుల్లో ఒకడిగా ముద్రపడిన సందీప్ పాటిల్‌ను ఇంటర్వ్యూకు పిలవలేదు. ఏఏ అంశాల ఆధారంగా ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేశారు? ఏఏ కారణాలతో కొంత మందిని నిరాకరించారు? అన్న ప్రశ్నలకు సిఎసి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మొత్తం మీద ఇంటర్వూ ప్రక్రియను పూర్తి చేసిన సిఎసి ఒక సమగ్ర నివేదికను బిసిసిఐకి అందచేసింది. ధర్మశాలలో సమావేశమైన బిసిసిఐ పాలక మండలి ఈ నివేదిక ఆధారంగా కుంబ్లేను కోచ్‌గా ఎంపిక చేసింది.
కొత్త విధానం
భారత క్రికెట్ జట్టుకు కోచ్ ఎంపిక గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త విధానంలో జరిగింది. మొట్టమొదటిసారి కోచ్, సపోర్టింగ్ స్ట్ఫా నియామకానికి బిసిసిఐ బహిరంగ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనకు భారీ స్పందన లభించింది. అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగిన కుంబ్లే చివరికి కోచ్ పదవిని దక్కించుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో టెస్టులు, వనే్డ మ్యాచ్‌ల్లో కలిపి మొత్తం 956 వికెట్లు పడగొట్టిన కుంబ్లే టీమిండియాకు చక్కటి మార్గదర్శకాన్ని అందిస్తాడనడంలో అనుమానం లేదు. అంతర్జాతీయ కెరీర్‌ను ముగించిన తర్వాత బిసిసిఐలో పలు కీలక బాధ్యతలను పోషించిన కుంబ్లే సమర్థుడిగా పేరుతెచ్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కూడా అతని సేవలను స్వీకరిస్తున్నది. కోచ్‌కి అవసరమైన అన్ని లక్షణాలు, ఆ పదవికి కావాల్సిన అన్ని అర్హతలు అతనికి ఉన్నాయి. అందుకే అతనినే కోచ్ పదవి వరించింది. కుంబ్లే ఎన్నో బాధ్యతలను సమర్థంగా పోషించాడు. ఇప్పటికీ నిర్వహిస్తున్నాడు. 2009 జనవరి ఒకటిన అతను ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా)కు అనుబంధంగా పని చేస్తున్న అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యుడిగా నియమితుడయ్యాడు. 2010 నవంబర్ 21న అతను కర్నాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కెఎస్‌సిఎ)కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అదే సమయంలో, భారత జట్టులో అతని సహచరులైన వెంకటేశ్ ప్రసాద్ ఉపాధ్యక్షుడిగా, జవగళ్ శ్రీనాథ్ కార్యదర్శిగా ఎన్నిక కావడం గమనార్హం. 2012 అక్టోబర్ 12న అతను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలోని క్రికెట్ కమిటీకి చైర్మన్‌గా ఎంపికయ్యాడు. పలు పదవులు నిర్వహించిన అతని మార్గదర్శకంలో భారత జట్టు అత్యున్నత శిఖరాలను చేరుకోవడం ఖాయం.
టెస్టుల్లో మొనగాడు
అనీల్ కుంబ్లే టెస్టు క్రికెట్‌లో మొనగాడిగా వెలిగిపోయాడు. దాదాపుగా మీడియం పేసర్ వేసేటంత వేగంతో బంతులు వేసే అతను కెరీర్‌లో 132 టెస్టులు ఆడి, 619 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఎక్కువ వికెట్లు కూల్చిన బౌలర్ల జాబితాలో అతనికి మూడో స్థానం లభించింది. ముత్తయ్య మురళీధరన్ 133 టెస్టుల్లో 800 వికెట్లు, షేన్ వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు సాధించి మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. అంతేకాదు, టెస్టుల్లో నలభై వేలకుపైగా బంతులు వేసిన బౌలర్ల జాబితాలో కుంబ్లే రెండో స్థానాన్ని ఆక్రమించాడు. మురళీధరన్ 44,039 బంతులు వేస్తే, కుంబ్లే 40,850 బంతులు వేశాడు. వార్న్ 40,705 బంతులు వేసి ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. వెస్టిండీస్ మాజీ పేసర్ కొట్నీ వాల్ష్ 29,248 బంతులు వేసి ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడంటే, మొదటి ముగ్గురి ప్రతిభ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అనీల్ కుంబ్లే బౌలింగ్‌లోనే కాదు.. బ్యాటింగ్‌లోనూ ప్రతిభావంతుడే. 2007 ఆగస్టు 9 నుంచి 13వ తేదీ వరకు లండన్‌లోని ది ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అతను 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టెస్టుల్లో 2,506 పరుగులు చేసిన అతనికి అదే అత్యధిక స్కోరు. ఐదు అర్ధ శతకాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. 302 ఫోర్లు, 9 సిక్సర్లు కొట్టాడు. 60 క్యాచ్‌లు కూడా పట్టి, మంచి ఫీల్డర్‌గా తనను తాను నిరూపించుకున్నాడు.
టెస్టుల్లో సమర్థుడు కాబట్టి వనే్డల్లో అతను రాణించలేదనుకుంటే పొరపాటే. ఈ ఫార్మెట్‌లో 271 మ్యాచ్‌లు ఆడిన అతను 938 పరుగులు చేశాడు. 26 పరుగులు అతని అత్యధిక స్కోరు. 14,496 బంతులు విసిరి, 10,412 పరుగులిచ్చి 337 వికెట్లు పడగొట్టాడు. 1993లో వెస్టిండీస్‌తో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణ. భారత్ తరఫున ఇప్పటి వరకూ అదే రికార్డు. పరిమిత ఓవర్ల ఫార్మెట్‌లో అతను రాణించగలడని చెప్పడానికి 1996 అక్టోబర్ 21న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ని ఉదాహరణగా పేర్కోవచ్చు. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోగా, చివరిలో జవగళ్ శ్రీనాథ్ (30 నాటౌట్)తో కలిసి కుంబ్లే (16 నాటౌట్) తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 52 పరుగులు జోడించి, రెండు వికెట్ల తేడాతో జట్టును గెలిపించాడు. 1996 ప్రపంచ కప్‌లో అతను 15 వికెట్లు పడగొట్టి, టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ కెరీర్‌ను ఎంతో సమర్థంగా నిర్వహించిన అతను టీమిండియా కోచ్‌గానూ ఉత్తమ సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాడు. వివాదాలకు దూరంగా ఉండే కుంబ్లే జట్టులో నెలకొన్న విభేదాలకు తెరదించు తాడని ఆశిద్దాం.
**
పది వికెట్ల వీరుడు
టెస్టు క్రికెట్ చరిత్రలో, ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా అనీల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ 1956 జూలై 26 నుంచి 31 వరకు మాంచెస్టర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు కూల్చాడు. మిగిలి ఒక వికెట్‌ను టోనీ లాక్ పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి అసాధారణ ప్రతిభ కనబరచిన లేకర్ 51.2 ఓవర్లు బౌల్ చేసి, 53 పరుగులిచ్చి పది వికెట్లు సాధించాడు. కాగా, 1999 ఫిబ్రవరి నాలుగు నుంచి ఏడో తేదీ వరకు పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కుంబ్లే 24.3 ఓవర్లు బౌల్ చేసి, 75 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 26.3 ఓవర్లు వేసిన అతను 74 పరుగులకు పది వికెట్లు కూల్చాడు. ఈ ఫీట్‌ను సాధించిన రెండో బౌలర్‌గా, మొదటి భారతీయుడిగా చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. కుంబ్లే ప్రతిభను గుర్తించిన బెంగళూరు అధికారులు ఓరియంటల్ సర్కిల్‌కు అతని పేరు పెట్టారు.
**

పేసర్‌గా కెరీర్ మొదలు
కుంబ్లే తన 13వ ఏట యంగ్ క్రికెటర్స్ క్లబ్‌లో చేరి, అక్కడే బౌలింగ్‌లో ఓనమాలు దిద్దుకున్నాడు. మొదట్లో అతను మీడియం పేసర్‌గా ఎదిగేందుకు ప్రయత్నించాడు. ఆతర్వాత స్పిన్‌పై దృష్టి మరల్చాడు. చాలా తక్కువ కాలంలోనే సమర్థుడైన బౌలర్‌గా గుర్తింపు సంపాదించాడు. 1989లో తన 19వ ఏట కర్నాటక తరఫున హైదరాబాద్‌తో తొలి రంజీ మ్యాచ్ ఆడాడు. పేసర్‌గా క్రికెట్‌ను ఆరంభించాడు కాబట్టే, స్పిన్నర్‌గా మారినప్పటికీ, అతని బంతులు మీడియం పేస్‌తో సమానమైన వేగంతో దూసుకెళ్లేవి. ఒక రకంగా ‘్ఫస్ట్ స్పిన్’ను కుంబ్లే కనిపెట్టాడు.

- ఎస్‌ఎంఎస్