అమృత వర్షిణి
ఆదర్శ గురువు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పూజ్య సద్గురు కందుకూరి శివానందమ్తూగారి శివసాయుజ్యంతో భారతీయ ధార్మిక ఇతిహాసంలో ఒక అపురూప ఉజ్వల ప్రకరణం ముగిసింది. ఆరు దశాబ్దాలపాటు ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, ప్రజాజీవన, సేవా రంగాల్లో లక్షల మందిని ప్రభావితులను చేసి ధర్మ మార్గాన నడిపించి, విలక్షణ పౌరులుగా తీర్చిదిద్దిన ఒక దివ్యశక్తి చరిత్రాత్మక జీవనయాత్ర చాలించింది. భారతజాతి ఒక మహా దేశికుడిని, గొప్ప దేశభక్తుడిని, తన ఉనికి చేతనే జగతికి దీవెనలందించిన ఒక మహాపురుషుడిని కోల్పోయింది. శివానందమూర్తిగారి మహాభినిష్క్రమణం ధార్మిక రంగం బహుశా ఏనాటికీ పూడ్చుకోలేని వెలితి.
వేదయుగం నుంచి నేటి దాకా ఎందరో యోగులు, పెద్దలు, సద్గురువులు, అవతార పురుషులు, మహాజ్ఞానులు, మహాద్రష్టలు కోరిన వారికి కొంగుబంగారమై, సాధకులకు బోధకులై, చేయిపట్టి తీరం దాటిస్తూనే ఉన్నారు. సర్వకాలాల్లో ఆధ్యాత్మిక రంగాన్ని సుసంపన్నం చేసిన మహనీయులు లెక్కకు మిక్కిలే అయినా సద్గురు శివానందమూర్తితో పోల్చదగిన మహత్తు మనకు తెలిసిన వేల ఏళ్ల భారతదేశ చరిత్రలో మరొకటి కానరాదు. బ్రహ్మజ్ఞానాన్ని లోకజ్ఞానంతో మేళవించి.. మనుష్యుడికి మొట్టమొదట కావలసింది ప్రపంచ జ్ఞానమని ప్రబోధించి.. దేశక్షేమాన్ని కాంక్షించి, దేశం కోసమే, తపించి.. దేశభక్తులను, ధర్మవీరులను తయారుచేయడమే పనిగా పెట్టుకుని.. దేశ రక్షణకు, జనహితానికి, అమోఘంగా, అజ్ఞాతంగా నిస్వార్థంగా అనవరతం పాటుపడుతూ, భారతజాతి అభ్యున్నతి కోసం, సనాతన ధర్మ సంరక్షణ కోసం, నిశ్శబ్దంగా, ప్రతిఫలాపేక్ష రహితంగా విరామమెరుగక పరిశ్రమించిన శివానందమూర్తిగారి వంటి ఆధ్యాత్మిక శిఖరాన్ని భారతజాతి మునె్నన్నడూ ఎరుగదు.
పైసా పనిచేసి పదివేల రూపాయల ప్రచారం ఆశించే మనుషులు కొల్లలుగా ఉన్న ఈ రోజుల్లో పది లక్షల రూపాయల పనిచేసి పైసా ప్రచారాన్ని కూడా ఆపేక్షించని మహనీయుడు శివానందమూర్తిగారు. వెయ్యి పున్నములను కొనే్నళ్ల కిందే దాటిన సుదీర్ఘ జీవనయానంలో ఆయన మూడో కంటికి తెలియకుండా ఎన్ని గుప్తదానాలు చేశారో, ఎటువంటి మహత్కార్యాలు చేశారో, ఏఏ రంగాల్లో ఏఏ రీతుల్లో అజ్ఞాతంగా ఎనె్నన్ని సేవలందించారో, దేశరక్షణకు సొంత ఖర్చుతో ఎన్ని యజ్ఞాలు చేయించారో, పూర్తిగా తెలిసినవారు బహుశా ఎవరూ లేరు. పిలిస్తే పలికే దైవంలా నమ్ముకున్న భక్తులకు ఆపదలు బాపేందుకు ఆయన చూపిన మహిమలు పైకి చాటుకోవడం ఆయనకు సుతరామూ ఇష్టం ఉండేది కాదు. లేని శక్తులు ఉన్నట్టుగా భ్రమగొలిపి, జనాకర్షణ, ధనాకర్షణలకు పాల్పడే కపట జీవులు కొల్లలుగా ఉన్నకాలంలో తన మహత్తును సాధ్యమైనంత వరకు పరుల కంటపడకుండా తనలోనే దాచుకుని, సాదాసీదా గృహస్థుగా జీవితం గడిపిన వాడాయన. గృహస్థాశ్రమంలోనే ఉంటూ పరమహంస పరివ్రాజకులైన జగద్గురుల చేతనే వందనాలందుకున్న మహాజ్ఞాని, ప్రత్యేకంగా ఏ గురువూ లేకుండా పుట్టుక నుంచే ఆత్మజ్ఞానం కలిగిన మహాయోగి శివానందమూర్తిగారు.
సంపన్న జమిందారీ కుటుంబంలో పుట్టినా భోగభాగ్యాలను తృణప్రాయంగా భావించి, కట్టుబట్టలతో విశాల జనజీవితంలోకి అడుగుపెట్టిన అపర సిద్దార్థుడు శివానందమూర్తిగారు. పోలీసు కొలువులో మధ్యస్థాయి కార్యాలయ ఉద్యోగిగా పనిచేస్తూనే పోలీసు శాఖలో ఉన్నతస్థాయిగల తన పై అధికారులచేత పాదాభివందనాలు చేయించుకున్నవాడాయన. సంగీత, నాట్య శాస్త్రాలను, పుక్కిట పట్టి కొమ్ములు తిరిగిన మహా సంగీత విద్వాంసులకు, మహా నాట్యకారిణులకే ఆయా విద్యలలో వారు కలనైనా ఊహించని మెలకువలను నేర్పించగలిగిన మహా మహోపాధ్యాయుడాయన. ప్రపంచంలో ఏ రంగంలోని నిష్ణాతులతోనైనా పది నిమిషాలు ముచ్చటిస్తే చాలు ఆ రంగంలో వారికి ఏనాడూ తోచని కొత్త కోణాలు స్ఫురింపజేయగల్గిన నడిచే విజ్ఞానసర్వస్వం ఆయన. కాలేజీ విద్యార్థిగా గురుగోల్వార్కర్ నుంచి నేరుగా స్ఫూర్తి పొంది, సామాన్య స్వయంసేవకునిగా పని చేసిన శివానందమూర్తిగారు కాలక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కి మార్గదర్శకుల్లో ఒకరుగా, మొత్తం హిందూ సమాజానికి, పెద్దదిక్కుగా భాసిల్లారు. సనాతన ధర్మ పునరుజ్జీవనానికి, భారతజాతి పునర్వైభవానికి ఆర్ష సంస్కృతి పునరుత్థానానికి జీవితమంతటినీ అంకితం చేసి, దేశాన్ని కమ్మిన అసుర శక్తుల పీడను విరగడ చేయడానికి శివానందమూర్తిగారు తన యావచ్ఛక్తినీ, తనకున్న తపోబలమంతటినీ ధారబోశారు. నిరుటి సాధారణ ఎన్నికల సమయంలో మంచం మీద కాలు కదిలించలేని నిస్సహాయ స్థితిలో ఉండి కూడా ఎవరికీ చెప్పాపెట్టకుండా తలచిందే తడవుగా దిగ్గున బయలుదేరి ఆయన కాశీ విశ్వనాథాలయానికి వెళ్లి, అన్నీ ఎవరో అమర్చిపెట్టినట్టుగా అక్కడ ప్రత్యేక పూజలు కావించి, మైళ్లదూరం చకచక నడిచి గంగాస్నానం చేసి, సమాజ క్షేమం కోసం దైవశక్తిని ఆవాహన చేసిన తీరు ఎవరికో తప్ప తెలియదు. పశ్చిమతీరం వలె, తూర్పు తీరం కూడా, వైభవంతో విలసిల్లి, ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టాలన్న మహాసంకల్పంతో ప్రపంచంలో కనీవినీ ఎరుగని రీతిలో భీమిలి ఆనందవనంలో సొంత ఖర్చుతో ఆద్యాది మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించి, పూర్తిగా సొంత వనరులతో దాన్ని నిర్వహిస్తున్న వైనం ఎరిగినవారు ఆయన ప్రణాళికా నైపుణ్యాన్ని, కార్యదక్షతను, నిస్వార్థ త్యాగనిరతిని మెచ్చుకోకుండా ఉండలేరు. తాను మహాశైవ పీఠానికి అధిపతి అయి కూడా శివకేశవ అభేదాన్ని నొక్కిచెబుతూ శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఏటేటా మహా వైభవంగా నిర్వహిస్తూ, ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, అకాడెమీలు సైతం ఆశ్చర్యపడే రీతిలో వివిధ రంగాల ప్రతిభామూర్తులను ఆయా సందర్భాల్లో సత్కరించడం ఆయనకే చెల్లింది.
అర్జీ పెట్టనిదే గౌరవ డాక్టరేటు, పైరవీ చేయనిదే పద్మశ్రీ అయినా రాని ఈ కాలంలో వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను ఏనాడో చూపించిన విశిష్ట వ్యక్తులను వెతికి పట్టుకుని, లక్ష రూపాయల పైచిలుకు భూరి బహుమానాన్ని, ప్రతిష్ఠాత్మకమైన శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డును దయచేసి స్వీకరించవలసిందని ఏటేటా వినమ్రంగా పిలువనంపిన ఆదర్శమూర్తి శివానందమూర్తిగారు. తాను వేదవేదాంగాలను కాచివడబోసి, సనాతన ధర్మానికి పట్టుగొమ్మలా నిలిచిన హైందవ ధర్మాచార్యుడు అయి కూడా తన చిరకాల నివాసమైన భీమునిపట్నంలో చర్చిలకు, మసీదులకు సైతం విరాళాలిచ్చి, అన్ని మతాలవారినీ సమానంగా ఆదరించి సర్వధర్మ సమభావనకు ప్రతిరూపంగా నిలిచిన విశిష్ట వ్యక్తి ఆయన. వైదిక విద్యల్లో, యోగసాధనలో, ఆధ్యాత్మిక చింతనలో, మహామహులకు సైతం మార్గదర్శనం చేయగలిగిన ‘గురువుగారు’ సామాన్యుల్లోకెల్లా సామాన్యులకు సైతం వారి స్థాయికి దిగి వచ్చి జ్ఞానబోధ చేయగలిగిన మనీషి. కఠయోగానికి ఎంత గహనమైన వ్యాఖ్యానం చేసి, కాలచక్ర గతిని ఎంత లోతుగా కళ్లకు కట్టించారో, మహర్షుల చరిత్రలను అంత సరళంగా పాఠక జనానికి సైతం బోధ పరచగలిగిన మహా రచయిత ఆయన. సద్గురు శివానందమూర్తిగారు భౌతిక జీవన ప్రస్థానం చాలించినా జిజ్ఞాసువులను, దేశభక్తులను, ధర్మనిబద్ధులకు గురుమూర్తిగా కలకాలం నిలిచే ఉంటారు. త్రైలింగస్వామి, నృసింహ సరస్వతి, రమణ మహర్షి వంటి మహనీయుల కోవకు చెందిన ఈ ఆధునిక యోగీశ్వరుడి దివ్యస్మృతికి ఆంధ్రభూమి నివాళి.
‘ఆంధ్రభూమి’ సంపాదకీయం
-11, జూన్ 2015