అమృత వర్షిణి

సంగీత సాహిత్య కళానిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరికైనా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏ పద్యమో పాటో లేదా ఉపన్యాసమో వినాలనిపించటం సర్వసాధారణం. అన్నీ అందుబాటులో ఉన్నాయిగా! వినే వాళ్లుంటేనే మాటకూ పాటకూ అర్థం. లేకపోతే బధిరులకు శంఖారావమే.
సంగీతానికీ సాహిత్యానికీ, ఇతర లలిత కళలకూ ఒక వేదికంటూ ఉండాలి. సభలు, సాంస్కృతిక సంస్థలూ యిందుకే ఆవిర్భవించి, వాటి కర్తవ్యం అవి నిర్వహిస్తుంటాయి. ఈ ప్రయోజనం కోసమే ప్రభుత్వం తన వంతుగా, ప్రసార మాధ్యమాలను సృష్టించింది. అందులో ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాలు ప్రధానమైనవి. ఇప్పుడు అసంఖ్యాకంగా ఛానళ్లు వచ్చి పడ్డాయి. నిజానికి రేడియో బాగా బతికిన రోజుల్లో ప్రజలకు చేరువై, స్థిరమై నిలిచిపోవటానికి ప్రధాన కారణం. రేడియో కేంద్రాల నుండి ప్రసారమయ్యే నాటకాలు లేదా సంగీత కార్యక్రమాలూను. నటనలో ఎంతో అనుభవమున్న నటుల వల్ల నాటకాలు, సంప్రదాయ సంగీతానుభవమున్న విద్వాంసుల వల్ల మంచి సంగీంతం కలిసి సరస్వతీ నిలయాలుగా ఒక వెలుగు వెలిగాయి.
దీనికి మూల స్తంభాలు, అందులోని సంగీత విద్వాంసులు. వారిని నిలయ కళాకారులని ఎంతో గౌరవంగా పిలిచేవారు. ఇప్పుడు ఆ కళాకారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. నేను చెప్పేది కొన్ని దశాబ్దాల నాటి సంగతి. ఆ రోజుల్లో నిలయ విద్వాంసులు 25 నుండి 30 వరకూ ఉండేవారు. చాలా రేడియో కేంద్రాల్లో పనిచేసే విద్వాంసులు నిరంతర సాధనతో, ఉన్నతశ్రేణి సంగీత విద్వాంసుడై, రేడియో కేంద్రాల కీర్తిని పెంచినవారున్నారు. రేడియో సంగీత కార్యక్రమాల స్థాయి వీరి వల్లే పెరిగింది. వారివల్ల రేడియో హోదాయే పెరిగింది.
మా నాన్నగారు నా చిన్నతనంలో మా అన్నదమ్ములచే త్యాగరాజ కీర్తనలు, రామదాసు కీర్తనలు, పిల్లల కోసం బాల భక్తుల కథలతో, 15,20 ని.ల వ్యవధిలో సంగీత రూపకాలు రూపొందించి పాడించేవారు. ఆ రోజుల్లో, లబ్ధ ప్రతిష్టులైన నిలయ కళాకారుల వాద్య బృందాన్ని కనులారా చూస్తూ, వీనుల విందుగా మేం పాడిన ఆ మధుర క్షణాలు నాకింకా గుర్తే.
తల ఎత్తి నమస్కరించతగిన ఎంతో ఎత్తుకు ఎదిగిన విద్వాంసులు వారు. ఆ విద్వాంసులను ఆదర్శంగా భావించిన మా నాన్నగారు వారి ప్రతిభను పదేపదే కొనియాడుతూండేవారు. వీణపై రామవరపు సుబ్బారావు, వేణువుపై వెలిది సుబ్బారావు, కె.కణ్ణన్, వయొలిన్ విద్వాంసులైన అన్నవరపు రామస్వామి, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, దత్తాడ పాండురంగరాజు, అందుకూరి యజ్ఞ నారాయణ శాస్ర్తీ, మొదలైన కొందరు ప్రసిద్ధులతో కలిసి పని చేయటం నా అదృష్టం. ఒక్కొక్కరూ ఒక్కో శిఖర సమానులు. వృత్తిరీత్యా నేనో ఎనౌన్సర్‌ని. వివిధ్‌భారతి కార్యక్రమాలతోపాటు సంగీత ప్రధానమైనవెన్నో ప్రతి వారం సమర్పిస్తూ ఉండేవాణ్ణి.
సృజనాత్మకత లేనిదే ఆకాశవాణి లేదు. కొత్త కొత్త ఊహలు, ఆలోచనలూ పుట్టాలనీ శ్రోతలను రంజింపజేయాలనీ రేడియో ఉనికి ప్రశ్నార్థకం కాకూడదనే ఆశయ సిద్ధి కలిగిన అతి కొద్దిమంది భావుకులైన వారిలో ఎన్నతగిన వ్యక్తి డా.బాలాంత్రపు రజనీకాంతరావు.
‘మానిషాద ప్రతిష్టాం త్యమగమః శాసతీస్రమాః’ అనే శ్లోకంతో వాల్మీకి రామాయణం ఆరంభవౌతుంది. ఆది కావ్యావతరణ మనే సంగీత రూపకాన్ని రూపొందించి ప్రసారం చేసే సందర్భంలో జరిగిన చిన్న సన్నివేశం మీకు గుర్తు చేస్తాను. 60 ఏళ్ల నాటి సంగతి. ఆ వేళ స్టూడియోలో వాద్యబృందమంతా ఉన్నారు.
రజనీ గారితోపాటు కొందరు సాంకేతిక నిపుణులు, నేను కూర్చుని ఉండగా రెండు క్రౌంచ పక్షులు చెట్టుమీద కూడి ఉన్న సమయంలో, ఒక నిషాదుడు (బోయవాడు) బాణం గురి చూసి వదుల్తాడు.
వేదనతో జారిపడిన పక్షిని చూసి ఆడపక్షి విలపిస్తున్న దృశ్యం, వివరించిన తర్వాత. ఆ పక్షి విలపించిన దృశ్యాన్ని ఒక వయొలిన్ విద్వాంసుడు తన కమానుతో ఆవిష్కరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. క్రౌంచ పక్షి విలాపాన్ని వయొలిన్‌పై పలికించిన విద్వాంసుణ్ణి, పిలిచి కౌగిలించుకున్నారు రజని.
ఆయనెవరో కాదు. నిలయ విద్వాంసుడైన నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులే. మా నాన్నగారితో ఆచార్యులు గారికి ఎంతో స్నేహముంది. ఏలూరులో ఆచార్యులుగారి బంధువుల ఇంటికి వచ్చినప్పుడల్లా మా నాన్నగారు ఆయనతో సంగీత గోష్టి జరపటం నాకు తెలుసు. నేను రేడియోలో ప్రవేశించిన తర్వాత మళ్లీ చాలా కాలానికి ఆయన ప్రతిభా సామర్థ్యాలు ప్రత్యక్షంగా రేడియోలో చూసే అవకాశం లభించింది. దేశంలో చాలా ప్రధాన రేడియో కేంద్రాల్లో కొందరు నిలయ విద్వాంసులు, వారు ఉద్యోగంలో చేరే నాటికి ఎంత విద్వత్ప్రతిభ ఉంటుందో అంతకు మించి ఒక్క అంగుళం పెరగదు, తరగదు. సంగీతంపై అంకిత భావముండి లక్ష్య శుద్ధి కలిగిన వారు మాత్రం కొందరుంటారు. వారికి ఆకాశమే హద్దు. అంచెలంచెలుగా ఎంతో ఎత్తుకు ఎదిగి సంగీత రంగంలో ఎంతో ఆదర్శవంతులై నిలుస్తారనటానికి సాక్ష్యం కృష్ణమాచార్యులు వంటి కొందరు లబ్ధప్రతిష్టులే. విద్వల్లోకం మెచ్చిన ప్రజ్ఞాశాలి.. పండితుడు.. సంప్రదాయ సంగీతంలోని మర్మాలను కుండబద్దలు కొట్టినట్లుగా సాధికారికంగా చెప్పగలిగిన అరుదైన సంగీతజ్ఞుడు. 1970 ప్రాంతంలో ఓ ఉగాది పండుగ కోసం ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రాసిన ‘పసరాకు తల ఎత్తుతుందీ’ అనే ఉగాది గీతాన్ని ‘సిందుభైరవి’ స్వరాల్లో కంపోజ్ చేసి ఆచార్యులకు వినిపించాను. తలూపుతూ ‘మీ మల్లాది వారు ఘటికులే!’ అంటూ అభినందించారు. పిన్నలకు పిన్న, పెద్దలకు పెద్ద. సంప్రదాయ సంగీతం పట్ల అఖండమైన గౌరవ ప్రపత్తులూ, భక్తీ నిండుగా కలిగిన ఆచార్యుల వారిలో అటు సంగీత సరస్వతినీ, సాహిత్య పరిణతినీ రెండూ దర్శించేవాణ్ణి.
బాలాంత్రపు రజనీకాంతరావు తాను రూపొందించిన యక్ష గానాలకూ, సంగీత రూపకాలకూ, ఆచార్యుల వారి సలహాలు తీసుకునేవారు. నిర్మొహమాటంగా సంగీత మర్మాలు చెప్తే, ఏకీభవించేవారెప్పుడూ తక్కువే. సంగీత సాహిత్య జ్ఞాన సంపన్నుడైన నిగర్వి నిరాడంబర వ్యక్తి కావటంతో ఆయన అభిప్రాయాలకు గౌరవం ఉండేది.
సోత్కర్ష ఎరుగడు. పరనింద తెలియదు. ఉన్నతమైన పండిత వంశంలో పుట్టిన ఆచార్యుల వారు ఆధ్యాత్మిక విద్యలో పారంగతులు. సంస్కృతాంధ్ర తమిళ సాహిత్యాలలో ఉద్దండులు. హరికథా గానంలో అందెవేసిన చేయి. గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతుల వారి శిష్య వర్గంలో, శతాధిక గ్రంథ రచనలతోపాటు రామాయణ, భారత భాగవతాలను, హరికథలుగా రూపొందించి ప్రదర్శించిన జ్ఞాని.
వోలేటి గారి దగ్గర శిష్యరికం చేస్తూ, పాడే నన్ను చూసి ఓ రోజు నా పాటను మెచ్చుకుంటూ, ‘మీరు హరికథలు కూడా చెప్తే బాగుంటుందని, సలహా ఇచ్చారు. తల ఊపానే గాని, దానివైపు దృష్టి పెట్టలేక పోయాను. అదలా ఉంచండి. సంస్కృతాంధ్ర భాషలలో వైదుష్యమున్న ఆచార్యులుగారు రచించిన కీర్తనలు ఆయనను ఉత్తమ వాగ్గేయకారుణ్ణి చేశాయి. ‘నాటక ప్రియ’ రాగంలో, ఆయన రచించిన (వోలేటి గారు కోరిన కారణంగా) ‘మారజననీం’ అనే కీర్తన సంగీత లోకంలో బహుళ ప్రసిద్ధమై దక్షిణాది విద్వాంసుల ప్రశంసలు పొందింది.
‘త్యాగరాజ గేయార్థ కుంచిక’ స్వరరాగ సుధ, వివిధ రాగాల ముఖ చిత్రాల పరిచయంతో రాసిన గ్రంథం, యిలా పుంఖానుపుంఖంగా వైవిధ్యమైన గ్రంథాలను సంగీత లోకానికి అందించిన కృష్ణమాచార్యులు ఎందరో శిష్యులను తయారుచేసిన సద్గురువు. నిజానికి మన తెలుగు గడ్డపై ఒకప్పుడు దక్షిణాది వారితో సమాన ప్రతిభ కలిగిన విద్వాంసులున్నారు. కానీ శిష్యుల్ని తయారుచేయాలన్న ఉత్సాహమున్న వారు చాలా తక్కువ. అటు, డా.శ్రీపాద పినాకపాణి విజయవాడలో పారుపల్లి వారి పుణ్యమా యని శిష్య ప్రశిష్య సంతతి బాగా వృద్ధి చెంది ఉన్నత సంగీత ప్రమాణాలతో విద్వాంసులను తయారుచేసే ప్రక్రియ కొనసాగింది. లక్ష్య లక్షణ జ్ఞానం పుష్కలంగా కలిగి రేడియో సంగీత కార్యక్రమాల్లో తన పాత్రను సమర్థవంతంగా పోషించిన కృష్ణమాచార్యులు సంగీత లోకం గుర్తుంచుకునే వ్యక్తి, చిరస్మరణీయుడు.

- మల్లాది సూరిబాబు 90527 65490, 91827 18656