అమృత వర్షిణి

గీతవాద్య నటన నాటక ప్రియులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడో 50 ఏళ్ల నాటి మాట. ఆకాశవాణికి ‘వాణి’ అనే పత్రిక వుండేది. అందులో ఉద్యోగ ప్రకటన చూసిన ఓ యువకుడు తిన్నగా అప్పటి డైరెక్టరయిన డా.బాలాంత్రపు రజనీకాంతరావును కలుసుకుని దరఖాస్తు చేతికిస్తోంటే, మీ తండ్రి చంద్రశేఖర శాస్ర్తీగారెలా వున్నారు? అని కుశల ప్రశ్నలు వేసి, ఆ యువకుని వైపు చూసి ‘అయినా ఈ ఉద్యోగాలు నీకెందుకయ్యా? మంచి సంగీత నాటిక ఒకటి రాసివ్వరాదూ? ప్రసారం చేద్దాం’ అనగానే ఎగిరి గంతేసిన ఆ యువ రచయిత అంతరంగ స్థలం మీద అప్పటికే గజ్జెకట్టి ఆడుతున్న ఒక సంగీతభరిత రూపకానికి అన్ని హంగులూ సమకూర్చుకుని రాత్రింబవళ్లూ కూర్చుని పూర్తి చేసి, తాను రాసిన పద్యాలనూ, పాటలనూ చూసుకుని తృప్తి పడ్డాడు. అయినా మనసులో అదో అలజడి. అంతకు ముందు రూపక రచన అలవాటులేని పని. రాగ తాళాలకూ, స్వరకల్పనకూ సరితూగుతుందో లేదో అనే అనుమానంతోనే, తిన్నగా, మద్రాసులో తనకు పరిచయమున్న సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర్రావు చేతికిచ్చాడు. రెండు గంటలు పాటు వంచిన తల ఎత్తకుండా ఆ నాటికంతా చదివి ‘దీనికి సంగీతం నేనే చేస్తాను’ అంటూ రజనీగారికి ఫోన్ చేసి చెప్పటంతో ఈ యువ రచయిత ఆనందానికి అవధుల్లేవు. ‘మీరు చేస్తే అంతకన్నా కావలసినదేముందని ఒక్కసారి ఆ స్క్రిప్టు చూడాలన్నా’రు. వెంటనే విజయవాడ వచ్చి రూపకాన్ని రజనీగారి చేతిలో పెట్టారు. ఆకాశవాణిలో ఏ రూపకమైనా, నాటకమైనా గంట వ్యవధికి మించి వుండదు. రెండు గంటల వ్యవధి గల ఆ రూపకాన్ని కుదించీ కుదించీ గంటన్నరకు సరిపెట్టటం జరిగింది. ప్రత్యేక అనుమతి తీసుకుని గంటన్నరకు ఆ రూపకాన్ని సిద్ధం చేశారు. ఆ రూపకం పేరు ‘సిరికా కొలను చిన్నది’. ఆ యువ రచయితే వేటూరి సుందర్రామ్మూర్తి. అప్పటికి నేను విజయవాడ రేడియో కేంద్రంలో అడుగుపెట్టి మూడేళ్లయింది. ఎం.ఎల్.నరసింహం అనే చక్కని సంగీత విద్వాంసుడు, శ్రీరంగం గోపాలరత్నం, ఎన్‌సివి జగన్నాథాచార్యులు మొదలైన హేమాహేమీలంతా స్టూడియోల్లో కలయ తిరుగుతూండగా ముచ్చటేసి పెండ్యాల నాగేశ్వర్రావు పాట ఎలా కంపోజ్ చేసి నేర్పుతారా? అనే ఉత్సాహం కొద్దీ, వెళ్లి స్టూడియోలో కూర్చుని వాళ్ల రిహార్సల్స్ చూస్తున్నాను. ఖాళీ దొరికినప్పుడల్లా పెండ్యాలతో మాట్లాడేవాణ్ణి. ఆయన సంగీత నేపథ్యంతో నాకో అవగాహన ఏర్పడింది. ప్రతిభకు అంతఃకరణే ప్రమాణం. ఈ వేళ చాలామంది సంగీత దర్శకుల సంగీత నేపథ్యం ఎవరికీ తెలియదు.
ఏ ఒక్క సినీ సంగీత దర్శకుడైనా మనలా వెళ్లి సంగీత కచేరీలలో స్థిమితంగా, కూర్చుని వినగా చూశారా? యిళ్లల్లోనే వింటారు. బహిరంగ వేదికలపై రాగము, రసము లాంటి విషయాలేమైనా మాట్లాడగా చూశారా? మాట్లాడరు. ఇళ్లల్లోనే కూర్చుని, వారిక్కావల్సిన సంగీత విషయాలన్నీ సేకరించి వింటూంటారు. అంతేకాదు. సంగీత దర్శకులందరూ పాడలేరు. ప్రతి గాయకుడూ సంగీతం సమకూర్చలేడు. సంగీతం అంటే ఆసక్తి ఉన్నా అందరికీ అందుబాటులో లేని ప్రజ్ఞ అది. సినీ రంగంలో వెనకటి తరంలో సంప్రదాయ సంగీత మాధుర్యాన్ని పంచి నాలుగు కాలాల పాటు గుర్తుంచుకునేలా పాటలు చేసిన వారిలో పెండ్యాల నాగేశ్వర్రావు ప్రముఖుడు. ఆయన కంపోజ్ చేయటం వేటూరికి వరమైంది. ‘సిరికా కొలను చిన్నది’ పాటలన్నీ సాహిత్యపరంగా ఒక మెట్టుపైనుండేవి. అనుభవం పండిన పెండ్యాల పాడి చెప్తోంటే ఒక్కొక్క మాటకూ, ఆ రాగచ్ఛాయల విరుపులను గోపాలరత్నం నరసింహం పోటాపోటీగా పాడేవారు. ఓ రోజు భోజన విరామ సమయంలో పనిలో పనిగా పిలిచి ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ ‘నాగేశ్వర్రావుగారూ! యిలా ప్రతీ సంగతీ విడమరచి ఒక శిల్పంలా మలిచి పాడిస్తున్నారు, సరే చాలా బాగుంది. మీరెన్ని సంగతులు గుప్పించినా, మరెన్ని గమకాలు దట్టించినా పాడగలిగే ఘంటసాల వంటి గాయకులు లేరు కదా? ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారని అడిగాను. ఈ వేళ ఆనాటి గంగా ప్రవాహం లాటి గానం లేదు. ఏదో పిల్ల కాలువలతో సర్దుకుంటున్నాం అన్నారు. ఆయనతో పోల్చటం కష్టం. ఆ శకం ముగిసింది అన్నారు. పెండ్యాల చేతిలోపడ్డ ‘సిరికా కొలను చిన్నదాన్ని’ మద్రాసులో కనబడ్డ ప్రతీ ప్రొడ్యూసర్‌కూ, దర్శకుడికీ, నిర్మాతకూ పరిచయం చేసి వినిపించటంలో కృతకృత్యుడైన వేటూరి ‘దశ తిరిగి... చక్కని ‘దిశ’ ఏర్పడి, సినీ రచయితగా స్థిరపడిపోయారు. కారణం పెండ్యాల హస్తవాసి. పెండ్యాల నాగేశ్వర్రావు సంగీత నేపథ్యం చాలా బలమైంది. వీరిది కృష్ణా జిల్లా కాటూరు. వీరి తండ్రి సీతారామయ్య మంచి హార్మొనిస్టు. ఆ విద్యయే ఈయనక్కూడా అబ్బింది.
గొంతు సన్నగా, ఆడ వేషాలకు అనువైనదిగా వుండటం వల్ల దైతా గోపాలం అనే రంగస్థల నటుడు పెండ్యాలకు సక్కుబాయి వేషం ఇచ్చి నెమ్మదిగా రంగస్థలానికి లాగారు. ఆ రోజుల్లో అంటే 1935-60 మధ్య పౌరాణిక నాటక రంగస్థల కళాకారులంతా కృష్ణా గుంటూరు జిల్లా వాసులే. కపిలవాయి, ఉప్పులూరి సంజీవరావు, అద్దంకి శ్రీరామ్మూర్తి, వేమూరి గగ్గయ్య, జొన్నవిత్తుల, సిఎస్‌ఆర్, బందా, ఒకరా యద్దరా? కృష్ణా తీరానికి వనె్నలద్దినవారే. ఈ తరం వాళ్లు ఎప్పుడో మర్చిపోయారు.
దైతా గోపాలంది శ్రీకాకుళం శివారు గ్రామం పాపనాశనం. యక్షగాన సంప్రదాయం బాగా ప్రసిద్ధమైన ఆ రోజుల్లో, కూచిపూడి యక్షగాన రీతుల్ని బాగా వొంటిబట్టించుకున్న గోపాలానికి నెమ్మదిగా రంగస్థల నాటకాల మీద చిన్నప్పటి నుండి మక్కువ ఏర్పడింది. దైతా గోపాలం ధర్మమాయని రంగస్థల నాటక పద్యాలు, పాటలు ఎలా కంపోజ్ చేస్తారో ప్రత్యక్షంగా గమనించిన పెండ్యాల క్రమంగా అపార అనుభవం గడించారు. ఆ రోజుల్లో పౌరాణిక నాటక రంగ సంగీతం సంప్రదాయానికి భిన్నంగా ఏ మాత్రం వుండేది కాదు. పైగా స్టేజీ మీద నటిస్తూ, సంభాషణలతో సంగీతం పాడటం అసిధారావ్రతం. అదీ.. నటన. అదీ.. గానం. ఈ రెండింటికీ భాష్యం చెప్పారు వారందరూ. వెనకటి రోజుల్లో సినిమా సంగీతానికి సంగీత గౌరవం ఏర్పడటానికి ప్రధాన కారణం పెండ్యాల, రాజేశ్వర్రావు, ఘంటసాల, సుసర్ల, అశ్వత్థామ లాంటి గట్టి సంగీత పునాది. క్రమక్రమంగా అన్ని రంగాల్లోలాగా ఇందులో కూడా ప్రమాణాలు తగ్గిపోయాయి. ఏం పాడినా, ఎలా పాడినా, ఎవరు పాడినా పట్టించుకునే వాళ్లు లేరు. వటవృక్షంలా పెరిగిన నేటి సాంకేతిక సదుపాయాలు ఇప్పుడున్నట్లుగా ఆనాడు లేవు. వెనకటి తరంలోని నటీనటులను కళ్లారా కన్నవారూ, చెవులారా విన్నవారూ చాలా అదృష్టవంతులు.
పెండ్యాలను డ్రామా సీనులోంచి చిత్రసీమకు లాగిన ఘనత కడారు నాగభూషణంది.
ముదినేపల్లి డ్రమటిక్ అసోసియేషన్‌లో చేరి అక్కినేని, దుక్కిపాటి మొదలైన వారితో నాలుగేళ్లు పని చేశారు. ఈ పరిచయం సినిమా రంగంలో కాస్త నిలదొక్కుకోవటానికి ఉపయోగపడింది. గాలిపెంచల నరసింహారావుకు కొన్నాళ్లు సహాయకుడుగా వుండి, 150 చిత్రాలకు పైగానే సంగీతం సమకూర్చిన పెండ్యాల పాటల్లో సంప్రదాయానికి దూరంగా ఉండేవి కనపడవు. పాటకు గౌరవం తెచ్చిన వారిని మనస్ఫూర్తిగా మెచ్చుకుని మంచి పాటకు అర్థం తెలిసిన సంస్కారవంతులైన నిర్మాతలు, దర్శకులుండే రోజుల్లో బ్రతికి, తమ పాటలకు శాశ్వతత్వాన్ని కల్పించిన పెండ్యాల వంటి సంగీత దర్శకులేరీ? ఆ పాటలు నేటికీ శ్రవణానందంగా, ఒకవైపు వినే శ్రోతలున్నా, అదేం ఖర్మమో గుర్రపు డెక్కలతో చెరువులూ, వాగులూ నిండిపోయినట్లు ఏం పాడుతున్నారో అర్థం కాదు. ఏ భాషలో పాడుతున్నారో తెలియదు. ఎలా పాడారో కూడా తెలియని దశలో వున్నాం. సంగీత ప్రమాణాలు ఎవరికి వారే నిర్ణయించుకునే స్థితికి వచ్చేశారు. అలాగే వినేస్తున్నారు. మళ్లీ ఉత్తమ సాహిత్యం, ఉన్నతమైన సంగీతం వినే రోజులొస్తాయా?

- మల్లాది సూరిబాబు 90527 65490