ఆటాపోటీ

వామ్మో.. యోయో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడల్లో ఫిట్నెస్‌కు ప్రాధాన్యం పెరిగింది. శారీరకంగా ఎలాంటి సమస్యలు లేనప్పుడే, క్రీడా రంగంలో రాణిస్తారనే వాస్తవాన్ని అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, రగ్బీ సమాఖ్యలు చాలా కాలం క్రితమే గుర్తించగా, క్రికెట్‌లోకి ఈ ఒరవడి ఆలస్యంగా అడుగుపెట్టింది. ఫిట్నెస్‌కు ప్రామాణికంగా పేర్కొనే యోయో టెస్టు కూడా క్రికెట్‌కు కొత్తే. భారత్‌కు ఇది మరీ కొత్త. నిన్నమొన్నటి వరకూ భారత క్రికెటర్లది ఇష్టారాజ్యంగా కొనసాగింది. ఇష్టమైతే రొటీన్ వామప్‌కు హాజరయ్యేవాళ్లు. లేదంటే డ్రెస్సింగ్ రూమ్‌లో విశ్రాంతి తీసుకుంటూనో, పబ్‌లు, క్లబ్‌ల్లో జల్సాల్లోనే గడిపేవాళ్లు. కెరీర్‌ను మొదలుపెట్టినప్పటి నుంచి రిటైర్మెంట్ ప్రకటించే వరకూ ఒళ్లు అలవకుండా ఏళ్లకు ఏళ్లు జట్టులో కొనసాగిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అదంతా ఇప్పుడు గత చరిత్ర. స్టార్ హోదాను సంపాదించుకున్న ఒకరిద్దరు మినహా, ఏ సందర్భంలోనైనా ఫిట్నెస్ సమస్యతో జట్టుకు దూరమైన ఎవరైనా యోయో పరీక్షకు హాజరుకావాల్సిందే. దానిని విజయవంతంగా పూర్తి చేస్తేనే జట్టులో ఎంపిక సమయంలో పేరును పరిశీలిస్తారు. యువరాజ్ సింగ్ ఇటీవలే యోయో పరీక్షలో నెగ్గి, ఆ ఉత్సాహంతోనే జాతీయ జట్టులో స్థానం కోసం 2019 వరకూ ప్రయత్నిస్తునే ఉంటానని ప్రకటించాడు. మరో రెండేళ్ల వరకూ ఖచ్చితంగా ఫిట్నెస్‌తో ఉంటానని 36 ఏళ్ల యువీ నమ్మకం. అతనికి అంత ఆత్మవిశ్వాసం వచ్చిందంటే, యోయో పరీక్ష స్థాయి ఏమిటో ఊహించుకోవచ్చు.
ఒక ఆటగాడికి యోయో పరీక్ష ఐదో స్థాయి స్పీడ్‌తో మొదలవుతుంది. అది ఒక షటిల్ (పరిగెత్తాల్సిన నిర్ణీత దూరం)తో పూర్తవుతుంది. ఆ వెంటనే తొమ్మిదో స్థాయి టెస్టు ఉంటుంది. అందులోనూ ఒకటే షటిల్ ఉంటుంది. తొమ్మిది తర్వాత 11వ స్థాయి పరీక్ష జరుగుతుంది. అందులో రెండు షటిల్స్ ఉంటాయి. 12వ స్థాయిలో మూడు షిటిల్స్.. 13వ దశలో నాలుగు షటిల్స్.. ఇలా పరిగెత్తాల్సిన దూరం పెరుగుతూ ఉంటుంది. యోయో పరీక్షలో చివరిది 23వ స్థాయి. ఈ స్థాయి దరిదాపుల్లోకి కూడా ఇప్పటి వరకూ ఎవరూ చేరుకోలేదు. ఒక్కో షటిల్ దూరం 40 మీటర్లు లేదా 131.234 అడుగులు. ఒక్కో స్థాయిని ఎంత సమయంలో పూర్తి చేశాడో చూసుకొని, సగటు వేగాన్ని కొలుస్తారు. ఒక్కో షటిల్ మధ్యలో ఆటగాడికి పది సెకన్ల విశ్రాంతి లభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, యోయో టెస్టులో షటిల్స్ లెవెల్స్‌ను పూర్తి చేయాలంటే, అవిశ్రాంతంగా పరిగెత్తాల్సిందే. ముందుగానే ఖాయం చేసుకున్న ప్రమాణాల ప్రకారం, ఒక్కో షటిల్‌ను పూర్తి చేయడానికి ఖచ్చితమైన సమయాన్ని నిర్ధారిస్తారు. ఆ సమయం ముగిసిన వెంటనే ‘బీప్’ శబ్దం వస్తుంది. ఒకవేళ బీప్ సౌండ్ వచ్చిన తర్వాత కూడా షటిల్‌ను పూర్తి చేయలేకపోతే, యోయో పరీక్షలో విఫలమైనట్టే. అందుకే, ఎప్పటికప్పుడు వేగాన్ని సరి చూసుకుంటూ, అవసరమైతే పెంచుకోవడానికి వీలుగా రిమైండర్లు కూడా వస్తాయి. అధికారికంగా మూడు కంటే ఎక్కువ హెచ్చరికలు వస్తే, ఆ ఆటగాడిని యోయో పరీక్షలో విఫలమైనట్టు ప్రకటిస్తారు. ఒక్కో షటిల్ పూర్తి చేయడానికి కేటాయించే సమయం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అంటే, షటిల్ లెవెల్‌తోపాటు పరిగెత్తాల్సిన వేగం కూడా పెరుగుతుంది. బీప్ సౌండ్ వచ్చేలోగా నిర్ధారించుకున్న లెవెల్స్‌ను పూర్తి చేసినప్పుడే యోయో పరీక్షను విజయవంతంగా ముగించినట్టు అవుతుంది.
యోయో పరీక్షలో వేగాన్ని ఒక్కో జట్టు ఒక్కో విధంగా నిర్ధారించుకుంటుంది. మన దేశం విషయానికి వస్తే, కనీస స్థాయిని 16.1గా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఖరారు చేసింది. అంటే, ఐదో స్థాయితో మొదలుపెట్టి, 16వ స్థాయి మొదటి భాగంతో ముగించాలి. అంటే, యోయో పరీక్షలో ఒక భారత క్రికెటర్ కనీసం 1,120 మీటర్లు (3,674.541 అడుగులు) పరిగెత్తాలి. పాకిస్తాన్‌లో కనీస స్థాయిని 17.4గా స్థిరీకరించారు. వెస్టిండీస్‌లో కనీసం 19వ స్థాయిని అధిగమించాలి. అన్నిటికంటే అధికంగా న్యూజిలాండ్ క్రికెటర్లు 20.1 స్థాయిని పూర్తి చేయాలి. మనవారు 16.1 స్థాయికే ఆపసోపాలు పడుతుంటే, 20.1 స్థాయిని పూర్తి చేయాలంటే ఏమంటారో? ఎంత మంది ఆ పరీక్షలో నెగ్గుతారో? ఎంత మంది జట్టులో స్థానం కోల్పోతారో?
ఆద్యుడు లెగెర్
యోయో టెస్టుకు ఒక రకంగా ల్యూక్ లెగెర్‌ను ఆద్యుడిగా చెప్పుకోవాలి. మాంట్రియల్ యూనివర్శిటీకి చెందిన అతను ఎన్నో రకాలుగా అధ్యయనం చేసి మరీ ఫిట్నెస్ పరీక్షకు విధివిధానాలను రూపొందించారు. 12 నిమిషాల వ్యవధిలో, 20 మీటర్ల దూరం ఉండే ఎన్ని షటిల్స్‌ను పూర్తి చేస్తారన్నది అతని పరీక్షా విధానంలో కీలకాంశం. ఒక షటిల్‌కు మరో షటిల్‌కు మధ్య విరామం ఉండదు. దీనినే ‘లెగెర్ టెస్ట్’ అంటారు. క్రికెట్ లేదా ఫుట్‌బాల్‌లో విశ్రాంతి తీసుకునేటంత సమయం ఉండదని, అందుకే ఆటగాళ్లు విరామం లేకుండా సుమారు పావుగంట పరుగులు తీస్తేనే ఫిట్నెస్‌ను కాపాడుకోవడం సాధ్యమవుతుందని లెగెర్ వాదన. ఆండ్రూ లీపస్ వంటి ప్రముఖ ఫిజియోథెరపిస్టులు కూడా లెగెర్ వాదనను సమర్థిస్తున్నారు. బౌలింగ్ లేదా ఫీల్డింగ్.. త్రోయింగ్ లేదా హిట్టింగ్.. ఏది చేసినా, ఒక బంతికీ మరో బంతికీ మధ్య 30 సెకన్ల వ్యవధి మాత్రమే ఉంటుందనే సిద్ధాంతాన్ని అమలు చేస్తేనే క్రికెట్‌లో రాణించడం సాధ్యమని లీపస్ చాలా సందర్భాల్లో స్పష్టం చేశాడు. అడెలైడ్‌లోని డారెన్ లీమన్ క్రికెట్ అకాడెమీలోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒకప్పుడు క్రికెటర్‌గా ఆస్ట్రేలియా జట్టుకు విశిష్ట సేవలు అందించిన లీమన్ ఇప్పుడు కోచ్ హోదాలో ఆటగాళ్లకు మార్గదర్శకం చేస్తున్నాడు. అతను కూడా తన అకాడెమీలో ఆటగాళ్ల ఫిట్నెస్‌కు యోయో టెస్టునే ప్రామాణికంగా తీసుకుంటున్నాడు. క్రీడల్లో, ముఖ్యంగా క్రికెట్‌లో గాయపడడం సామాన్యమని, అయితే, యోయో పరీక్షలో పాసైన వారు గాయాలబారిన పడడం చాలా తక్కువని లీపస్ స్పష్టం చేస్తున్నాడు. అనేక అధ్యాయాలు కూడా ఈ వాదన సరైనదేనని నిర్ధారిస్తున్నాయి.
భారత క్రికెటర్లకు కష్టమే!
ప్రాక్టీస్ సెషన్ అంటేనే ఆమడ దూరం పరుగులు తీసే చాలా మంది భారత క్రికెటర్లను యోయో పరీక్ష బెంబేలెత్తిస్తున్నది. ప్రాక్టీస్ సెషన్‌లో ముందుగా రొటీన్ వామప్, ఆతర్వాత కొంత సేపు నెట్ ప్రాక్టీస్. ఆ మాత్రం దానికే చాలా మంది క్రికెటర్లు హైరానా పడుతుంటారు. ఏదో ఒక కారణంతో ప్రాక్టీస్‌కు ఎగనామం పెడుతుంటారు. అలాంటి వారు యోయో టెస్టులో సఫలమవుతారనుకోవడం అత్యాశే. అయితే, ప్రస్తుతానికి యోయో టెస్టు కేవలం ఫిట్నెస్ సమస్యలతో కొంతకాలం విశ్రాంతి తీసుకొని, తిరిగి జట్టులోకి రావాలనుకునే క్రికెటర్లకే పరిమితం చేశారు. మిగతా వారికి ఇది అత్యవసరం కాదు. ఒకవేళ ప్రతి సిరీస్ ముందు ఎంపికైన ఆటగాళ్లంతా తప్పనిసరిగా యోయో టెస్టును పూర్తి చేయాలన్న నిబంధనను చేరిస్తే, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ వంటి కొద్ది మంది తప్ప మిగతా వారంతా ఇరుకున పడతారు. అందుకే, యోయో టెస్టు పేరు చెప్తేనే చాలా మంది భారత క్రికెటర్లు భయపడుతున్నారు. సాధ్యమైనంత వరకూ దానిని ఎదుర్కొనే పరిస్థితి రాకూడదని కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.

-విశ్వమిత్ర