ఆటాపోటీ

క్రికెట్ విశ్వరూపం ఐపిఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐపిఎల్ 2008 ఏప్రిల్ 18న కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌తో మొదలైంది. మొత్తం 43 రోజులు జరిగిన మొదటి ఐపిఎల్‌లో 59 మ్యాచ్‌లు జరపాలని నిర్ణయించారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో మే 22న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిగతా 58 మ్యాచ్‌లు జరిగాయి. రౌండ్ రాబిన్ విధానంలో ప్రతి జట్టూ బరిలో ఉన్న మిగతా ఏడు జట్లతో హోం గ్రౌండ్‌లో ఒకటి, ఇతర కేంద్రంలో ఒకటి చొప్పున మ్యాచ్‌లు ఆడాయి. 2008 నుంచి ఇప్పటి వరకూ ఐపిఎల్ టోర్నీ అభిమానులను ఆకట్టుకుంటునే ఉంది. ఎన్ని విమర్శలు చెలరేగినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా అప్రతిహతంగా ముందుకు సాగుతునే ఉంది.

ప్రపంచ క్రికెట్‌లో అభిమానులు ‘పొట్టి’ ఫార్మెట్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు ఈ ఫార్మెట్ యావత్ క్రికెట్‌ను ఏలుతోంది. రోజులు తరబడి జరిగినా ఫలితం వస్తుందో లేదో తెలియని టెస్టు మ్యాచ్‌ల కంటే అటో ఇటో తేలిపోయే వనే్డ ఇంటర్నేషనల్స్‌కు అభిమానులు ఏర్పడ్డారు. అయితే, ఫుట్‌బాల్, టెన్నిస్, బాడ్మింటన్ వంటి క్రీడల్లో ఫలితాలు ఒకటిరెండు గంటల్లోనే తేలితే, క్రికెట్ మ్యాచ్ కోసం ఒకరోజు మొత్తాన్ని వృథా చేయడానికి చాలా మంది సుముఖంగా లేరు. ఈ సమస్యను అధిగమించే క్రమంలోనే ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్‌లు ఆవిర్భవించాయి. ఒక్కో జట్టు అత్యధికంగా 20 ఓవర్లు ఆడుతుంది. మొత్తం మీద 40 ఓవర్లలో మ్యాచ్ ఫలితం తేలుతుంది. ఈ ‘వామన’ క్రికెట్‌కు ఆదరణ పెరగడంతో అన్ని దేశాల్లోనూ ఈ ఫార్మెట్‌లోనే టోర్నీలు జోరందుకున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కూడా ఈ ఫార్మెట్ విశిష్ఠతను గుర్తించింది. 2007లో తొలిసారి ఈ ఫార్మెట్‌లో ప్రపంచ చాంపియ్‌షిప్‌ను నిర్వహించింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా టి-20 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలు ప్రతి రెండేళ్లకోసారి జరుగుతున్నాయి. పొట్టి క్రికెట్ విశ్వరూపాన్ని ప్రపంచం ప్రత్యక్షంగా చూసింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌తోపాటు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్వహించే ఐపిఎల్ టోర్నమెంట్‌కు కూడా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. క్రికెట్ చరిత్రనే కొత్త మలుపుతిప్పిన ఐపిఎల్‌ను అన్ని దేశాలూ అనుసరిస్తున్నాయి. ఈఏడాది ఐపిఎల్ ఏప్రిల్ 9న మొదలై మే 29వ తేదీతో ముగుస్తుంది.

టి-20 ఫార్మెట్‌లో కొత్త టోర్నీనా.. అవసరం లేదన్నారు కొందరు. ఇంగ్లీష్ కౌంటీలు, బిగ్‌బాష్‌లకు ఆదరణ లభించడం లేదు.. మన దేశంలో కొత్త లీగ్‌ను ప్రవేశపెడితే సాధించేది ఏమీ లేదు అంటూ తెగేసి చెప్పారు మరికొందరు.
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సభ్యుడు లలిత్ మోదీ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ ఆవిర్భావానికి ముందు ఎన్నో పురిటి నొప్పులు పడింది. వ్యతిరేకతలను ఎదుర్కొంది.
చాలా మంది కాదన్నారు. కొందరు బలవంతంగా సరేనన్నారు. అతి కొద్దిమంది మాత్రమే లలిత్ మోదీ సామర్థ్యంపై నమ్మకం ఉంచారు. 2007లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఆధ్వర్యంలో ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసిఎల్) ఎక్కడ ప్రజాదరణ పొందుతుందోనన్న భయంతో మోదీ ప్రతిపాదనకు బిసిసిఐ అంగీకరించింది. తొమ్మిది నగరాల జట్లతోపాటు నాలుగు విదేశీ జట్లను కూడా చేర్చి ఐసిఎల్‌ను నిర్వహించాలన్న ఆలోచనే ఐపిఎల్‌కు పునాది. ఎనిమిది జట్లతో ఈటోర్నీ తెరపైకి వచ్చింది. యూరోపియన్ సాకర్ నుంచి అమెరికా బేస్‌బాల్ వరకు, బ్రిటిష్ కౌంటీల నుంచి ఆస్ట్రేలియా బిగ్‌బాష్ వరకూ ఎన్నో క్రీడల్లో విజయవంతమైన టోర్నీలను అధ్యయనం చేసి, వాటికి కొత్త సొబగులు అద్ది, ఐపిఎల్ విందును సిద్ధం చేశాడు లలిత్ మోదీ. దేశవిదేశీ క్రికెటర్లు.. వారిలో ప్రస్తుతం ఆడుతున్నవారేకాదు.. కొన్నాళ్ల క్రితం కెరీర్‌కు గుడ్‌బై చెప్పినవారు కూడా ఉంటారు. చీర్‌లీడర్ల చిందులు ఉంటాయి. లేట్‌నైట్ పార్టీలకు కొదువ లేదు. అసలే క్రికెట్‌ను ఒక మతంగా అభిమానించి, ఆరాధించే భారత్.. క్రికెటర్లను దేవతల్లా కొలిచే వీరాభిమానులు.. అన్ని దేశాలకు చెందిన ఆటగాళ్లు.. మాజీలకూ చోటు.. ఇంతకంటే కొత్తదనం ఏమీ ఉండదు. అందుకే ఐపిఎల్ చాలా తక్కువ సమయంలోనే విశేష ఆదరణ పొందింది. క్రికెట్ ప్రపంచంలో పెను తుపాను సృష్టించిన ‘పొట్టి క్రికెట్’ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) విందు మరోసారి సిద్ధమైంది. యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్ నుంచి ఇంగ్లీష్ కౌంటీస్ వరకూ వివిధ రకాల టోర్నీల మేలుకలయికగా రూపుదిద్దుకున్న ఐపిఎల్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. ఫ్రాంచైజీల విధానాన్ని ఇంగ్లీష్ కౌంటీలు, యుఫా సాకర్ నుంచి స్వీకరించారు. చీర్‌లీడర్లు క్రికెట్‌లో తొలిసారి రంగ ప్రవేశం చేశారు. టి-20 ఫార్మెట్ కావడంతో, సుమారు మూడు గంటల వ్యవధిలోనే ఫలితం తేలిపోతుంది. అన్నిటినీ మించి క్రికెట్‌లో పేరొందిన ఎంతోమంది ప్రస్తుత క్రికెటర్లతోపాటు మాజీ ఆటగాళ్లను చూసే అవకాశం రావడం ప్రేక్షకులను ఐపిఎల్ మ్యాచ్‌లకు పరుగులు తీయించింది. సినిమా స్టార్లు వివిధ ఫ్రాంచైజీల్లో భాగస్వాములుగా మారడంతో టోర్నీలో గ్లామర్ కూడా చోటు చేసుకుంది. దేశంలో క్రికెట్ ఒక మతంలా మారితే, క్రికెటర్లు సాక్ష్యాత్తు దేవతల్లా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నారు. సినీ తారలకు ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ పారితోషికాలు క్రికెట్ దిగ్గజాలను సైతం ఐపిఎల్‌కు క్యూ కట్టిస్తున్నాయి. తాము తీసుకున్న మొత్తాలకు న్యాయం చేయడంతోపాటు, భవిష్యత్తు డిమాండ్‌ను మరింతగా పెంచుకోవాలన్న తాపత్రయం క్రికెటర్లను పోరాట యోధులుగా మారుస్తున్నది. ఈ యుద్ధాలే ఐపిఎల్‌కు ప్రత్యేక ఆకర్షణను తెచ్చింది.
ప్రస్తుత, మాజీలతో కళకళ
అన్ని దేశాల ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ఉంటారు కాబట్టి అభిమానులు ఈ టోర్నీని విశేషంగా ఆదరిస్తున్నారు. కెరీర్ మొత్తంలో లభించనంత మొత్తం ఒకే ఒక్క సీజన్‌లో వచ్చిపడుతుంటే, మ్యాచ్‌లు ఆడినా ఆడకపోయినా ఐపిఎల్‌లో ఉంటే చాలనుకుంటూ క్రికెటర్లు పోటీ పడుతున్నారు. జాతీయ జట్టులో ఉన్నవారు తమ నైపుణ్యానికి మరింత పదును పెట్టుకోవడానికి ఐపిఎల్‌ను వేదికగా మార్చుకున్నారు. యువ ఆటగాళ్లు తమ సత్తాను నిరూపించుకొని, సెలక్టర్ల దృష్టిలో పడాలని శ్రమిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరమైనప్పటికీ ఆటపై ఉన్న మక్కువతో మాజీ ఆటగాళ్లు కూడా మేమున్నామంటూ ఉరుకులు పరుగుల మీద వస్తున్నారు. ఎవరికి కావాల్సిన అంశాలు వారికి ఉన్నాయి. ఎవరిని ఏ విధంగా ఆకట్టుకోవాలో బాగా తెలిసిన వ్యాపారవేత్త కావడంతో లలిత్ మోదీ చాలా సులభంగానే అటు క్రికెటర్లు, ఇటు అభిమానుల నాడీ పట్టేశాడు. బాలీవుడ్ తారలను క్రికెట్‌కు పరిచయం చేశాడు. క్రికెట్‌కు సినీ తళుకులను జత కలిపాడు. ఐపిఎల్‌ను ఒక అద్భుత దృశ్యకావ్యంగా మన కళ్ల ముందు ఆవిష్కరింపచేశాడు. అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలతో లలిత్ మోదీ ఐపిఎల్ కమిషనర్ హోదా నుంచి వైదొలగాల్సి వచ్చినా, కోర్టు కేసులు ఎదుర్కొంటున్నా, ఐపిఎల్‌ను ప్రపంచ మేటి టోర్నీగా తీర్చిదిద్దిన ఘనత అతనికే దక్కుతుంది. ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా.. ఐపిఎల్ విజయానికి అతనే సూత్రధారి.
క్రికెట్ ప్రపంచంలో పెనుతుపాను సృష్టించి, దాదాపు అన్ని దేశాల్లోనూ సరికొత్త టి-20 టోర్నీల ఆవిర్భావానికి కారణమైన ఐపిఎల్ మరోసారి కనువిందు చేయడానికి సిద్ధమైంది. ‘పొట్టి క్రికెట్’ విశ్వరూపాన్ని మన కళ్ల ముందు సాక్షాత్కరింప చేయడానికి తాజా ఐపిఎల్ కొత్త సొబగులను అద్దుకుంటున్నది. పలు రకాల క్రీడల్లో ఐపిఎల్ తరహా టోర్నీలు వచ్చాయంటే, దీనికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఊహించుకోవచ్చు. వివిధ క్రీడల్లోని పేరొందిన టోర్నీల మేలికలయికగా రూపుదిద్దుకున్న ఐపిఎల్ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా తట్టుకొని నిలబడింది. అప్రతిహతంగా ముందుకు దూసుకెళుతున్నది. ఇంగ్లీష్ కౌంటీలు, యూరోపియన్ సాకర్ నుంచి ఫ్రాంచైజీల విధానం ఐపిఎల్‌లోకి వచ్చిచేరింది. అంతకు ముందు వరకూ సాకర్ వంటి కొన్ని క్రీడలకే పరిమితమైన చీర్‌లీడర్ల సంస్కృతి మొట్టమొదటిసారి ఐపిఎల్‌తో క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. సుమారు మూడు గంటల్లో ముగిసే పొట్టి ఫార్మెట్ కావడం, పైగా ప్రస్తుత, మాజీ క్రికెటర్ల ఆటను చూసే అవకాశం లభించడం తమ అదృష్టంగా భావిస్తున్న ప్రేక్షకులు ప్రతిసారీ ఐపిఎల్ మ్యాచ్‌లకు పరుగులు తీస్తునే ఉన్నారు. క్రికెట్ ప్రతిభకు గ్లామర్ కూడా జత కలవడంతో ఐపిఎల్‌కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. వేలం ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించే అవకాశం.. ఆతర్వాత అండార్స్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్స్‌తో భారీ మొత్తాలను ఖాతాల్లో వేసుకునే సదుపాయం కేవలం ఐపిఎల్‌కు మాత్రమే ఉంది. అందుకే, ప్రస్తుత క్రికెటర్లే కాదు.. మాజీ దిగ్గజాలు కూడా ఈ టోర్నీ పట్ల ఆసక్తి చూపుతున్నారు. తాము తీసుకున్న మొత్తాలకు న్యాయం చేయాలన్న తపన ఒకవైపు.. అద్భుతంగా రాణించడం ద్వారా భవిష్యత్తులో మరింత మొత్తాన్ని సంపాదించుకోవచ్చన్న ఆశ మరోవైపు క్రికెటర్లను పోరాటయోధులుగా మారుస్తున్నది. జాతీయ జట్టులో స్థిరత్వాన్ని కోరుకుంటున్నవారు.. అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దీనితో ఐపిఎల్ ఒక మహా సంగ్రామాన్ని తలపిస్తున్నది. ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్‌గా మారి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నది. ఒక ఐడియా జీవితానే్న మార్చేస్తుందన్న వ్యాపార ప్రకటనను లలిత్ మోదీ నిజం చేసి చూపించాడు. అతని ఐడియా యావత్ క్రికెట్ స్వరూపానే్న పూర్తిగా మార్చేసింది.
ఫిక్సింగ్ బెడద
డబ్బు ఎక్కడ ఉందో పెడ ధోరణులు కూడా అక్కడికే చేరుకుంటాయి. కోట్లకు కోట్లు చేతులు మారుతున్న తరుణంలో ఐపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ సంప్రదాయాలు పాతుకుపోతున్నాయి. ఐపిఎల్ క్రమంగా అవినీతి ఊబిలోకి కూరుకుపోయింది. ఆరో ఐపిఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాను స్పాట్ ఫిక్సింగ్ నేరంపై పోలీసులు అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. అంతకు ముందు, ఆతర్వాత కూడా ఫిక్సింగ్‌గానీ, బెట్టింగ్‌గానీ లేదని చెప్పలేం. ఐదో ఐపిఎల్‌లోనూ బుకీలతో కలిసి ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఐదుగురు క్రికెటర్లపై బిసిసిఐ వేటు వేసింది. అయితే, వారంతా చిన్నస్థాయి ఆటగాళ్లు కావడంతో ఆ సంఘటన ప్రధాన్యతను సంతరించుకోలేదు. శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెటర్ కాబట్టి ఆరో ఐపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసు సంచలనం సృష్టించింది. అందరి దృష్టినీ ఆకర్షించింది. విందూ రణ్‌ధావా వంటి బాలీవుడ్ నటుల నుంచి అప్పటి బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు స్వయానా అల్లుడైన గురునాథ్ మెయప్పన్ వరకూ ఎంతో మంది ప్రముఖుల పేర్లు స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో తెరపైకి వచ్చాయి. సుప్రీం కోర్టు విచారణ, ముకుల్ ముద్గల్, ఆర్‌ఎం లోధా కమిటీల నివేదికల తర్వాత కూడా ఈ వ్యవహారం కొలిక్కిరాలేదు. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి బిసిసిఐ ససేమిరా అంటున్న నేపథ్యంలో, బిసిసిఐ ప్రక్షాళనకు సుప్రీం కోర్టు తీసుకుంటున్న చర్యలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

- ఎస్‌ఎంఎస్