ఆటాపోటీ

ఆకాశమే హద్దుగా ప్రస్థానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశమే హద్దుగా భారత యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ దూసుకుపోతున్నాడు. అద్వితీయ ప్రతిభాపాటవాలతో సంచలనాలు సృష్టిస్తున్నాడు. టెస్టు జట్టు కెప్టెన్‌గా, వనే్డ, టి-20 ఫార్మెట్స్‌లో వైస్ కెప్టెన్‌గా సేవలు అందిస్తున్నాడు. సచిన్ తెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు రాడనుకొని ఆందోళన చెందిన అభిమానులకు కోహ్లీ రూపంలో ఊరట లభించింది. అండర్-19 వరల్డ్ కప్‌ను భారత్‌కు అందించిన కెప్టెన్‌గా ఆరంభమైన అతని జైత్రయాత్ర కొనసాగుతున్నది. అయితే, 2009లో ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నీలో ఆడిన తర్వాత తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని కోహ్లీ అంటాడు.
ఎమర్జింగ్ ప్లేయర్!
కోహ్లీ 2008లో అండర్-19 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టుకు నాయకత్వం వహించిన విషయం చాలా మందికి తెలుసు. అయితే, ఆ మరుసటి సంవత్సరమే అతను మరో అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2009లో ఆస్ట్రేలియాలో ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ జరిగింది. అందులో భారత్ విజయం సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అతను మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో 398 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. అండర్-19 వరల్డ్ కప్ గ్రూప్ ‘బి’ నుంచి పోటీపడిన భారత్ ఆరు మ్యాచ్‌లు ఆడి, మూడు విజయాలు సాధించింది. మూడు పరాజయాలను ఎదుర్కొంది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడి, మూడు వికెట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. కోహ్లీ 43 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ రాణించి 27 పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు. సూపర్ ఫైనల్ భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ అందుకుంది.

విరాట్ కోహ్లీ..
ఆకాశమే హద్దుగా చెలరేగే ఆటగాడు. లక్ష్యాలవైపు దూకుడుగా దూసుకెళ్లే బ్యాట్స్‌మన్. బ్యాటింగ్‌లో నైపుణ్యానికి ఒక ఆకృతినిచ్చి, దానికి ధైర్యం, వేగంగా నిర్ణయాలు తీసుకునే తత్వాలను జోడిస్తే కోహ్లీ రూపంలో ఒక మహాశక్తి ఆవిష్కారమవుతుంది. క్రికెట్‌లో అతని ప్రతిభ అనన్యసామాన్యం. అతను అధిరోహిస్తున్న శిఖరాలు అనితర సాధ్యం. అందుకే ‘క్రికెట్ దేవుడు’ సచిన్ తెండూల్కర్ స్థానాన్ని సులభంగానే భర్తీ చేయగలుగుతున్నాడు. అతని పేరును ఒక రోజులో ఏదో ఒక సమయంలో పలకని నాలుక, అతని ఆటను ప్రశంసించని నాలుక లేదు. ప్రశంసలు వరదలా వెల్లువెత్తినా, విమర్శలు సునామీలై విరుచుకుపడినా తన పంథాలో తాను దూసుకెళ్లే నైజం కోహ్లీది. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ నెలకొల్పిన ఎన్నో రికార్డులను బద్దలు చేసే సత్తా ఉన్న ఏకైక ఆటగాడు అతను. ఆటపై రాహుల్ ద్రవిడ్‌కు ఉన్న మక్కువ, అంకిత భావం, జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే తత్వంతోపాటు వీరేందర్ సెవాగ్‌కు ఉన్న ధైర్యం, సచిన్‌లోని అసాధారణ ప్రతిభ ఒకటిగా కలిస్తే కోహ్లీ అవుతాడని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. బంతి కనిపిస్తేచాలు దానిని బలంగా, తనకు ఇష్టమైన దిశలో కొట్టే విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్ పేరును ఇప్పటికీ ప్రస్తావిస్తునే ఉంటారు. అంతటి మన్ననలు పొందిన రిచర్డ్స్ కూడా కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు. అతని ఆటను చూస్తుంటే తన ఆటను తానే చూస్తున్నట్టు ఉందని కితాబునిచ్చాడు. కోహ్లీ ప్రతిభను విశే్లషించడానికి ఇంతకంటే గొప్ప మాటలు ఉంటాయా? దేశ రాజధాని న్యూఢిల్లీలోని వెస్ట్ క్రికెట్ అకాడెమీలో 1998లో కోహ్లీ క్రికెట్ శిక్షణను ఆరంభించాడు. సమర్థుడైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. బ్యాటింగ్ చేసే సమయంలో అతని ఫుట్‌వర్క్ గురించి ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. వేగంగా కదలడం, బంతిని కొట్టాల్సిన దిశను రెప్పపాటు వ్యవధిలో నిర్ధారించుకోవడం కోహ్లీకి ప్రత్యేకతను సంపాదించిపెట్టాయి. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్చెల్ గిబ్స్ బ్యాటింగ్ తీరును కోహ్లీ ఎంతో ఇష్టపడేవాడు. అదే స్థాయిలో అతను ఆటను ప్రేమించాడు. ఆరాధించాడు. నైపుణ్యాన్ని ప్రదర్శించి, రంజీ జట్టులోకి, ఆతర్వాత టీమిండియాకు ఎంపికయ్యాడు.
నాయకత్వం లక్షణాలు
కోహ్లీలో మొదటి నుంచే నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. 2008లో అతను అండర్-19 జట్టుకు నాయకత్వం వహించి, భారత్‌కు ప్రపంచ కప్‌ను సాధించిపెట్టాడు. టీమిండియా టెస్టు జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ అందుబాటులో లేనప్పుడు వనే్డ, టి-20 ఫార్మెట్స్‌లోనూ అతను జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అతని సారథ్యంలోనే ఆడుతున్నది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే తన అపారమైన ప్రతిభాపాటవాలతో టీమిండియాలో కోహ్లీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. జట్టుకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా 2013లో అర్జున అవార్డు లభించింది.
రికార్డుల కోహ్లీ
ఇప్పటికే ఎన్నో రికార్డులు కోహ్లీ ఖాతాలో చేరాయి. మరెన్నో రికార్డులు వచ్చి చేరేందుకు క్యూ కట్టాయి. ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఆడుతూ, మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన తొలి, ఇప్పటి వరకూ ఏకైక భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది. 2010లో బంగ్లాదేశ్‌పై అతను మీర్పూర్‌లో అజేయంగా 100 పరుగులు సాధించాడు. వనే్డల్లో 20 లేదా అంతకు మించి సెంచరీలు చేసిన 12 మంది క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. వీరిలో ఎనిమిది మంది ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యారు. వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 1,000, 3,000, 4,000, 5,000, 6,000, 7,000 పరుగుల మైలురాళ్లను తక్కువ ఇన్నింగ్స్‌లోనే అధిగమించిన భారత బ్యాట్స్‌మన్‌లో కోహ్లీది అగ్రస్థానం. 5,000, 6,000 పరుగుల మైలురాళ్లను అత్యంత వేగంగా దాటిన రికార్డులను అతను సృష్టించినప్పటికీ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా వాటిని అధిగమించాడు. వనే్డల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులను వరుసగా మూడు పర్యాయాలు నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ సరసన కోహ్లీ స్థానం దక్కించుకున్నాడు. 2012లో అతను వనే్డ, టెస్టు ఫార్మెట్స్‌లో అత్యధిక పరుగులు చేసి, ‘ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నాడు. వనే్డల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయుడు కూడా కోహ్లీనే. 2013లో ఆస్ట్రేలియాపై అతను 52 బంతుల్లోనే శతకాన్ని సాధించాడు. దీనితో 360 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ఛేదించగలిగింది. 22వ పుట్టిన రోజు కంటే ముందుగానే వనే్డల్లో రెండు శతకాలు చేసిన మూడో భారత క్రికెటర్‌గా కోహ్లీ పేరు రికార్డు పుటల్లో స్థిరంగా ఉంది. అంతకు ముందు సచిన్, సురేష్ రైనా ఈ ఫీట్ సాధించారు.
దూకుడుకు పునాది
భారత అండర్-19 జట్టు స్పిన్నర్ రాజ్ కుమార్ శర్మకు టీమిండియాలో అవకాశం దక్కకపోవడంతో పశ్చిమ ఢిల్లీలో క్రికెట్ అకాడెమీని నెలకొల్పాడు. కోహ్లీని తొమ్మిదేళ్ల వయసులో అతని తండ్రి ప్రేమ్ కోహ్లీ శిక్షణ కోసం అక్కడే చేర్చాడు. సోదరుడు వికాస్‌తో కలిసి కోహ్లీ ప్రాక్టీస్ చేసేవాడు. వికాస్ రాణించలేదుగానీ కోహ్లీ మాత్రం అసాధారణ ప్రతిభ కనబరిచాడు. తన కంటే ఎక్కువ వయసు ఉన్న బౌలర్లను పిలిచి, వేగంగా బంతులు వేయమని కోరేవాడు. వారిని రెచ్చగొట్టేవాడు. దీనితో వారు తమ శక్తికొద్దీ మెరుపు వేగంతో దూసుకెళ్లే బంతులు వేసేవారు. బౌలర్లను వెక్కిరించడం, ఎవరైనా వేగవంతమైన బంతి వేస్తే దానిని బౌండరీకి తరలించడం అప్పటి నుంచే కోహ్లీకి అలవాటయ్యాయి. మైదానంలో అతను దూకుడుగా వ్యవహరించడానికి కూడా ఇదే కారణం. కోహ్లీ బలమైన షాట్లకు అతని బ్యాట్లు ముక్కలయ్యేవి. మధ్యతరగతి కుటుంబీకుడైన ప్రేమ్ వారానికో బ్యాట్ తెచ్చి ఇవ్వలేక సతమతమయ్యేవాడు. పరిస్థితిని గమనించిన రాజ్ కుమార్ రంగంలోకి దిగాడు. కోహ్లీని మీరట్‌లోని బ్యాట్ల తయారీ కంపెనీ బిడిఎంకు తీసుకెళ్లాడు. అంత చిన్న పిల్లావాడితో బ్యాట్ల సరఫరాకు కాంట్రాక్టు ఇచ్చేందుకు అక్కడి యాజమాన్యం సందేహించింది. కానీ, అప్పటి పెట్టుబడి తర్వాతి కాలంలో వారికి కలిసొచ్చింది. తనపై ఆధారపడిన ఎవరినీ కోహ్లీ నిరాశ పరచలేదు. ఈ అంకిత భావ మే అతనిని తిరుగులేని వీరుడిగా నిలబెడు తున్నది.

- యు. సాయ కిరణ్