ఆటాపోటీ

క్లే కోర్టు యుద్ధం ‘ఫ్రెంచ్ ఓపెన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెన్నిస్... ఆడేవాళ్లకే కాదు.. చూసే వాళ్లకూ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మిగతా క్రీడల్లో మాదిరి మూసపోసినట్టు ఒకే విధంగా ఆడడం టెన్నిస్‌లో కనిపించదు. పశుబలంతో బంతిని బలంగా కొట్టే ‘పవర్ ప్లే’ వచ్చి చేరిందన్న ఆందోళన వ్యక్తమవుతున్నా, చాలా క్రీడల్లాగా టెన్నిస్ తన మూలాలను కోల్పోలేదు. అందుకే, టెన్నిస్‌లో ప్రతి మ్యాచ్ ఒక అద్భుత దృశ్యంగా కనువిందు చేస్తుంది. ప్రతి షాట్‌లోనూ కళాత్మక విలువలు పుష్కలంగా ఉంటాయి. సాధారణ టోర్నీల్లోనే ఈ దృశ్యాలు కనిపిస్తే, టెన్నిస్‌కే తలమానికమైన గ్రాండ్ శ్లామ్స్ పోటీలు ఏ స్థాయిలో జరుగుతాయో ఊహించుకోవచ్చు.

ఏటా జరిగే నాలుగు గ్రాండ్ శ్లామ్స్‌లో ఒక్కో టోర్నీకి ఒక్కో ప్రత్యేకత ఉంది. వింబుల్డన్‌ను అనధికార ప్రపంచ చాంపియన్‌షిప్‌గా పేర్కోవచ్చు. ఆస్ట్రేలియా ఓపెన్ క్రీడాకారుల ఫిట్నెస్‌కు పరీక్షగా నిలుస్తుంది. యుఎస్ ఓపెన్ కళాత్మకతకు ప్రతిరూపం. క్లే కోర్టుపై జరుగుతుంది కాబట్టే ఈ మూడు గ్రాండ్ శ్లామ్స్‌కు భిన్నంగా ఉంటుంది ఫ్రెంచ్ ఓపెన్. ఆస్ఫాల్ట్, కార్పెట్, ఆక్రిలిక్, ఆర్ట్ఫిషియల్ క్లే, ఆర్ట్ఫిషియల్ గ్రాస్, కార్పెట్, టైల్స్, ఉడ్, కాన్వాస్ వంటి ఎన్నో రకాల టెన్నిస్ కోర్టులున్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో కీలక టోర్నీలు గ్రాస్, క్లే, హార్డ్ (కాంక్రీట్) కోర్టులపైనే జరుగుతాయి. ప్రత్యేకంగా రూపొందించిన క్లే కోర్టుపై బంతి చాలా నెమ్మదిగా కదలడం వల్ల క్రీడాకారులు విపరీతంగా శ్రమించాల్సి వస్తుంది.
ఆగని ప్రస్థానం
రోలాండ్ గారోస్ ప్రస్థానం 1891 నుంచి నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. 1939-1945 మధ్యకాలంలో, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా టోర్నమెంట్‌ను నిలిపేశారు. అయితే, అనధికారికంగా ఫ్రెంచ్ జాతీయ టెన్నిస్ టోర్నీ రోలాండ్ గారోస్ వేదికగా జరిగింది. అయితే, ఆ పోటీలకు ఫ్రెంచ్ వారినే అనుమతించారు. స్థానికులకు అచ్చిరాని టోర్నమెంట్‌గా ఫ్రెంచ్ ఓపెన్‌ను పేర్కోవాలి. ఇప్పటి వరకూ ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు మాత్రమే టైటిళ్లను గెల్చుకోగలిగారు. 1983లో యానిక్ నోవా తర్వాత పురుషుల సింగిల్స్‌లో ఫ్రెంచ్ వారెవరూ టైటిల్ సాధించలేదు. అదే విధంగా మహిళల విభాగంలో మేరీ పియర్స్ 2000లో టైటిల్ అందుకుంది. ఫ్రెంచ్ ఓపెన్‌ను కైవసం చేసుకున్న తొలి ఆఫ్రికన్ అమెరికన్ క్రీడాకారుడిగా యానిక్ నోవా రికార్డు సృష్టించాడు. మహిళల విభాగంలో ఈ ఘనత అథ్లియా గిబ్సన్‌కు దక్కుతుంది. 1956లో ఆమె ఫ్రెంచ్ ఓపెన్‌ను సాధించింది. వింబుల్డన్ టైటిల్‌ను సాధించిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ కూడా ఆమే కావడం విశేషం.
ఎన్నో మార్పులు
ఫ్రెంచ్ ఓపెన్ ఎన్నో మార్పులు చేర్పుల తర్వాత క్లే ఈవెంట్‌గా స్థిరపడింది. మొదట్లో గ్రాస్ కోర్టులపై మ్యాచ్‌లను నిర్వహించేవారు. 1928లో కొత్త స్టేడియాన్ని నిర్మించినప్పుడు, తొలిసారి రెడ్ క్లేని ప్రవేశపెట్టారు. ఆ సమయంలో అమెరికాతో జరిగిన డేవిస్ కప్ మ్యాచ్‌లకు మరో కోర్టు అందుబాటులో లేకపోవడంతో, ప్రత్యేకంగా స్టేడియాన్ని నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. మిగతా గ్రాండ్ శ్లామ్స్ వేదికలతో పోలిస్తే, పారిస్‌లోని రోలాండ్ గారోస్ ఎరీనా సగం కూడా ఉండదు. దీనిని అభివృద్ధి చేయడానికి ఫ్రాన్స్ భారీ ప్రణాళికలను సిద్ధం చేసి, అమలు చేస్తున్నది. ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌కు కూడా భారీ వేదిక సిద్ధమైంది. అమెచ్యూర్స్, ప్రొఫెషనల్స్‌కు సమానాశాలిచ్చిన తొలి గ్రాండ్ శ్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్. 1968లో ఓపెన్ టోర్నీగా మార్చిన నిర్వాహకులు అమెచ్యూర్స్‌కు కూడా ప్రొఫెషనల్స్‌తో కలిసి పోటీపడే అవకాశాన్ని కల్పించారు.
115వ రోలాండ్ గారోస్
ఫ్రెంచ్ ఓపెన్‌కు ‘రోలాండ్ గారోస్’ అన్న పేరు కూడా ఉంది. పైలట్‌గా పని చేసిన రోలాండ్ గారోస్ పేరుమీదే నిర్వహించే ఈ టోర్నీకి ఘన చరిత్ర ఉంది. ఫ్రెంచ్ ఓపెన్ జరిగే ప్రధాన కోర్టును కూడా రోలాండ్ గారోస్‌గానే పిలుస్తారు. క్లేకోర్టు సమరమైన ఫ్రెంచ్ ఓపెన్ 115వ పోటీలు ఈనెల 22న పారిస్‌లోని రోలాండ్ గారోస్‌లో మొదలవుతాయి.
జూన్ ఐదో తేదీ వరకూ జరిగే ఈ గ్రాండ్ శ్లామ్‌లో పురుషులు, మహిళలకు సింగిల్స్, డబుల్స్‌తోపాటు మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. ప్రొఫెషనల్స్ బరిలోకి దిగుతారు. జూనియర్, వీల్‌చెయిర్, వెటరన్స్, లెజెండ్స్ విభాగాల్లోనూ పోటీలు జరుగుతాయి. ఈసారి ఫైనల్‌ను రోలాండ్ గారోస్‌లోని ఫిలిప్ చాట్రియర్ కోర్టులో నిర్వహిస్తారు. మిగతా గ్రాండ్ శ్లామ్స్ మాదిరిగానే ఫ్రెంచ్ ఓపెన్ కూడా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా దేశాల్లో ఫ్రెంచ్ ఓపెన్ కంటే రొలాండ్ గారోస్ పేరే ఎక్కువగా ప్రచారంలో ఉంది. 1891లో మొదలైన ఈ టోర్నీ ఒకప్పుడు ఫ్రెంచ్ టెన్నిస్ క్లబ్ సభ్యులకు మాత్రమే పరిమితమైంది. మొదటి టైటిల్‌ను బ్రైటన్ హెచ్ బ్రిగ్స్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో అతను బైగ్నెరెస్‌ను 6-3-6-4 తేడాతో ఓడించి, తొలి చాంపియన్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. 1897లో మహిళల సింగిల్స్ విభాగంలో పోటీలు ఆరంభమయ్యాయి. పి.గిరాడ్‌ను 6-3, 6-1 ఆధిక్యంతో ఓడించిన ఆడిన్ మాడ్సన్ తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 1925లో దీనిని ఓపెన్ టోర్నీగా ప్రకటించారు. పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో జీన్ బరోట్రాను 7-5, 6-1, 6-4 తేడాతో ఓడించిన రెనె లాకోస్టే, మహిళల ఫైనల్‌లో కిట్టీ మెక్‌కేన్‌పై 6-1, 6-2 ఆధిక్యంతో విజయం సాధించిన సుజానే లెన్‌గ్లెన్ టైటిళ్లు అందుకున్నారు. వివిధ దశల్లో పలురకాల కోర్టులపైన జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ చివరికి క్లే కోర్టు టోర్నమెంట్‌గా స్థిరపడింది. రొలాండ్ గారోస్‌లో మాదిరి మరే ఇతర టోర్నీల్లో ప్రయోగాలు చేసివుండకపోవచ్చు. అందుకే మిగతా గ్రాండ్ శ్లామ్స్ వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్‌లతో పోలిస్తే ఫ్రెంచ్ ఓపెన్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఫ్రాన్స్‌లో ఈ టోర్నీని ‘లెస్ ఇంటర్నేషనాక్స్ డి ఫ్రాన్స్ డి రోలాండ్ గారోస్’, ‘టోర్నోయ్ డి రోలాండ్ గారోస్’ అని పిలుస్తారు. ఫ్రెంచ్ ఓపెన్ అన్న పేరును ఫ్రెంచ్ క్రీడాభిమానులు వ్యతిరేకిస్తారు. తమ ప్రత్యేకతను చాటుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు. నిర్వాహకులు కూడా అదే స్థాయిలో శ్రమించడంతో, ఈ టోర్నీ గ్రాండ్ శ్లామ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ప్రతిష్టాత్మకమైన ఈ టైటిల్‌ను సాధించడానికి ఈసారి హేమాహేమీలు బరిలోకి దిగుతున్న నేపథ్యంలో, పోటీ తీవ్రంగా ఉండనుంది. టైటిళ్లు ఎవరికి దక్కినా, ప్రతి మ్యాచ్ ఉత్కంఠను రేపనుంది. మొత్తం మీద అభిమానుల కోసం ఫ్రెంచ్ ఓపెన్ విందు సిద్ధంగా ఉంది. అభిమానులకు కనువిందు చేయనుంది.

పురుషుల విభాగంలో ‘టాప్-10’ సీడింగ్స్
1. నొవాక్ జొకోవిచ్, 2. ఆండీ ముర్రే, 3. రోజర్ ఫెదరర్, 4. స్టానిస్లాస్ వావ్రిన్కా, 5. రాఫెల్ నాదల్, 6. కెయ్ నిషికొరి, 7. జో విల్‌ఫ్రెడ్ సొంగా, 8. థామస్ బెర్డిచ్, 9. మిలోస్ రవోనిక్, 10. రిచర్డ్ గాస్క్వెట్.
మహిళల విభాగంలో ‘టాప్-10’ సీడింగ్స్
1. సెరెనా విలియమ్స్, 2. విక్టోరియా అజరెన్కా, 3. ఏంజెలిక్ కెర్బర్, 4. గార్బినె ముగురుజా, 5. విక్టోరియా అజరెన్కా, 6. సిమోనా హాలెప్, 7. రాబెర్టా విన్సీ, 8. టిమియా బాసిన్‌స్కీ, 9. వీనస్ విలియమ్స్, 10. పెట్రా క్విటోవా.

- విశ్వ