భక్తి కథలు

యాజ్ఞసేని-4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకిప్పుడు నీ సహాయం అవసరమైంది. నాకు ధన సహాయం చేయుము’’ అని అన్నాడు.
ఆ మాటలు విన్న ద్రుపదుడు రాజ్యమదంతో, గతాన్ని మరిచి, మిత్రుడని కూడా గౌరవించక ‘‘నేను రాజును. నీవు ఒక బీద బ్రాహ్మణుడవు. నాకూ, నీకూ స్నేహం ఎక్కడ? సరితూగే రాజులతో మాత్రమే స్నేహము ఉంటుంది. నీవు వెంటనే ఇక్కడనుండి మరలిపొమ్ము’’ అని అవమానపరచి వెడలగొట్టిస్తాడు.
ధనాన్నిగానీ, పాడి ఆవులను గానీ ఇవ్వకపోయినా కనీసం ఒక బ్రాహ్మణుడననీ, బాల్యమిత్రుడననీ గౌరవించక అవమానపరిచిన ద్రుపదుడిమీద ప్రతీకారం తీసుకోవాలని తలంచాడు ద్రోణుడు. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. భార్యాబిడ్డలతో కలిసి కురు రాజ్య రాజధాని అయిన హస్తినాపురానికి పయనమైనాడు. హస్తినకు చేరాడు.
3
ఒకనాడు ద్రోణుడు బయలువెడలి వస్తూ దారి ప్రక్కన పిల్లలు ఆడుకొనటం చూస్తాడు. వారు ఒక బావి వద్ద గుమికూడి బావిలోనికి త్రొంగిజూస్తూ ఆందోళనలో కనిపించారు. ద్రోణుడు అక్కడికి వచ్చి వారితో ‘‘మీరు రాజకుమారులుగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఎందుకు గుమికూడారు? ఏం జరిగింది?’’ అని అడిగాడు.
అందుకు కురు పాండవ రాకుమారులు ‘‘మహర్షీ! మేము ఆటలాడుకుంటున్న చెండు ఈ బావిలో పడింది. చాలా లోతుగా వున్నది. దానిని ఎలా పైకి తీయాలో తెలియక ఆలోచిస్తున్నాం’’ అని వినయంతో అన్నారు.
‘‘పిల్లలారా! మీ అస్త్ర గురువెవ్వరు? మీరు విలువిద్యలు నేర్చుకొనలేదా? ఆ బంతిని పైకి ఎలా తియ్యాలో తెలియదా?’’ అని అన్నాడు ద్రోణుడు.
‘‘మహర్షీ! మా గురువర్యులు ‘కృపాచార్యులవారు’. తమరు దయతో ఈ చెండును పైకి ఎలా రాబట్టాలో సెలవియ్యండి’’ అని ప్రార్థించారు రాకుమారులు.
అంత ద్రోణుడు రాకుమారులవద్దనున్న ఒక ధనుస్సును కొన్ని బాణాలను తీసికొని బాణాలను ఒక దాని వెనుక మరొకదాన్ని సంధిస్తూ బావిలోనికి వదలి చెండును గ్రుచ్చి దానిని పైకి తీశాడు. అది చూచిన రాకుమారులు ఆశ్చర్యచకితులైనారు. వారు వెంటనే పోయి జరిగిన విషయాన్ని భీష్మ పితామహునికి విన్నవిస్తారు.
భీష్మ పితామహుడు ద్రోణుని సగౌరవంగా ఆహ్వానించాడు. ద్రోణుడు పితామహునికి తనకు తాను పరిచయం చేసుకున్నాడు. జరిగిన వృత్తాంతాన్ని వివరించి చెప్పగా మతిమంతుడైన భీష్ముడు మహర్షితో...
‘‘మహర్షీ! వీరందరూ నా మనమలు. వీరందరికి గురుత్వం వహించి గొప్పగా విలువిద్యలన్నింటినీ నేర్పండి. విలువిద్యలో, నీతిలో, పరాక్రమంలో పరశురాముడు కూడా మిమ్ములను పోలడని విన్నాను’’ అని అన్నాడు.
‘‘పితామహా! మీరు కోరినట్లే నా శక్తిమేర వీరిని పరాక్రమవంతులుగా చేస్తాను’’ అని ద్రోణుడు వారిని శిష్యులుగా స్వీకరించాడు.
4
అది ద్రోణాచార్యుడి ఆశ్రమ ప్రాంతం. తపోవనాన్ని తలపించేటట్లుగా ఉన్నది. సువిశాల ప్రాంగణంలో పర్ణశాలతో శోభాయమానంగా ప్రకాశిస్తున్నది.
పొడవుగా పెరిగిన చెట్లతో, గుబురుగా పూలు పూచిన అశోక వృక్షాలతో, సుపొన్నలు, పొన్నలతో, మొగలి పొదలతో, చక్కగా కాయలు కాచి పండిన అందమైన తియ్యమాడి చెట్లతో, గుంపులుగా యున్న రంభాతరువులతో (అరటిచెట్లు) చూడముచ్చటగావిస్తున్నది.
కోయిల గుంపుల మధురస్వరాలు, శుకపికధ్వనుల, పక్షుల కిలకిలారావాలు వీనులకు విందు చేస్తున్నాయి.
ఆశ్రమానికి అల్లంత దూరంలో పెద్ద పెద్ద సువిశాల మైదానాలు కనిపిస్తున్నాయి. ఒక చోట మల్లయుద్ధ యోధులు శిక్షణ పొందేందుకు నిర్మింపబడిన ఇసుకతో నింపిన ప్రాంగణములు.
రథికులు తమ తమ రథలపై శిక్షణ పొందటానికై ఏర్పాటుచేసిన మైదానాలు కొన్నిచోట్ల కనిపిస్తున్నాయి.
అశ్వములపై శిక్షణ పొందటానికై యున్న సువిశాల ప్రాంఘాలు అల్లంత దూరంలో వున్నాయి. గదాయుద్ధం కొరకు నిర్మింపబడిన ఒక పాటి ప్రాంగణాలు కనిపిస్తున్నాయి.
ఈటె, కత్తి, తోమరం, కుంతం, శక్తి మొదలైన ఆయుధలను ఉపయోగించే విధానాలలో శిక్షణ పొందేందుకు ప్రాంగణాలు ఉన్నాయ.
రాకుమారులు ముఖ్యంగా నేర్చుకొనే ధనుర్విద్యకు అవసరమైన సువిశాల ప్రదేవాలు ఒకచోట కానవస్తున్నాయి.
ద్రోణాచార్డు కౌరవ పాండవుల శస్త్రాస్త్ర విద్య గురువుగా భీష్మ పితామహునిచే నియమింపబడ్డాడు. - ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము