భక్తి కథలు

యాజ్ఞసేని-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వయంవరంలో ద్రౌపదిని ఎలా చేపట్టాలో, దానికి తగిన అవకాశాలేమిటో, వ్యూహాలేమిటో తెలిసికొనగోరి దుర్యోధనుడు అన్నాడు.
‘‘ద్రౌపదిని స్వయంవరంలో గెలువగలవాడెవడు. అర్జునుని తరువాత అంత సమర్థుడు కర్ణుడొక్కడే గదా?’’ అని.
‘‘మిత్రమా! నీవు కూడా సమర్థుడవే! శల్య జరాసంధులు కూడా సమర్థులే! మనందరం ప్రయత్నించి చూడాలి!’’ అన్నాడు కర్ణుడు.
‘‘మత్స్య యంత్రాన్ని పడగొట్టడమనే కఠిన పరీక్ష పెట్టింది అర్జునుని కోసమే. ఒకరకంగా కర్ణుని నిలవరించాలనే దురుద్దేశ్యం కూడా ఉండవచ్చును. వారికి అర్జునుడు ఒక్కడే ఈ యంత్రాన్ని ఛేదించగలడనే నమ్మకం’’ అని అన్నాడు దుర్యోధనుడు.
‘‘అన్నా! మనలో ముందు నీవే ప్రయత్నించాలి. ఆ తరువాత కర్ణుడు ప్రయత్నించాలి’’ అని అన్నాడు దుశ్శాసనుడు.
‘‘ఒకవేళ మత్స్య యంత్రాన్ని ఛేదించడంలో దుర్యోధనుడు విఫలమైతే ద్రౌపది దక్కదు గదా! దుర్యోధనుడే ద్రౌపదిని చేపట్టాలి. దానివలన పాంచాల రాజ్యం ఎల్లప్పుడూ కురు రాజ్యానికిలోబడి వుంటుంది. అలా కాక అర్జునుడు యంత్రాన్ని పడగొట్టి ద్రౌపదిని పొందితే, ద్రుపదుడు పాండు పుత్రుల అండతో దుర్యోధనునికి కాకుండా పాండవులకు రాజ్యాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేయవచ్చు’’ అని అన్నాడు శకుని.
‘‘శకుని మామా! పాండవులు లక్క ఇంటిలో కాలి బూడిదైపోయారు. ఇంకెక్కడి అర్జునుడు. అది అంతా ద్రుపదుని భ్రమ మాత్రమే’’ అన్నాడు దుర్యోధనుడు.
‘‘అయితే ద్రుపదుడు స్వయంవరాన్ని ఎందుకు ప్రకటించాడు?’’ అన్నాడు దుశ్శాసనుడు.
‘‘జరాసంధుడు ద్రౌపదిని తన మనుమడైన మేఘసంధికి ఇచ్చి వివాహం చెయ్యమని కబురంపాడట. జరాసంధుని నిలువరించడానికే స్వయంవరాన్ని ప్రకటించాడు. ద్రుపదునికి జరాసంధునితో చెలిమి ఇష్టం లేదు. కురు సామ్రాజ్యానికి దగ్గరైతే జరాసంధునికి అడ్డు వేయవచ్చును. అందువల్ల మనం ఎలాగైనా ద్రౌపదిని దుర్యోధనుడు చేపట్టేట్లు చూడాలి’’ అని అన్నాడు శకుని.
శకుని మాటలలోని మర్మాన్ని గ్రహించాడు కర్ణుడు. ద్రౌపదిని దుర్యోధనునికి కట్టబెట్టి తనను దూరంగా ఉంచాలనే ప్రయత్నమే ఇది. ద్రౌపదిపై తనకు ఎలాంటి మోహం లేదు. మిత్రునికి సహాయం చేయడమే తన కర్తవ్యం. పరి పరి విధాల ఆలోచించి కర్ణుడు అన్నాడు.
‘‘ద్రౌపదిపై నాకెలాంటి వ్యామోహం లేదు. కేవలం దుర్యోధనుని అనుసరించడమే నా పని. ఒకవేళ దుర్యోధనుడు మత్స్యయంత్రాన్ని ఛేదించలేకపోతే నేనే మత్స్య యంత్రాన్ని పడగొట్టి ద్రౌపదిని జయించి ఆమెను నా మిత్రుడైన దుర్యోధనునికి కానుకగా సమర్పిస్తాను’’.
‘‘్భళా! భళా! కర్ణా! నీ ప్రభుభక్తికి, మొక్కవోని నీ స్నేహానికి నేనెంతో సంతోషిస్తున్నాను’’ అని అన్నాడు జిత్తులమారి శకుని. తన పాచిక పారిందని సంతోషించాడు.
ఇంత జరిగినా అందరిలోనూ ఎక్కడో ఓ మూల ఈ స్వయంవరానికి పాండవులు వస్తారేమోనని అనుమానం వేధిస్తున్నది.

14
స్వయంవరం ప్రకటించిన రోజు దగ్గరపడింది. ఇక ఒక రోజు మాత్రమే ఉన్నది.
యాజ్ఞసేని వికలిత చిత్తయై యున్నది. మనస్సు కూడా స్వాధీనంలో లేదు. రాజప్రాసాదంలోని పైభాగానికి వెళ్లింది. మళ్లీ క్రిందికి దిగింది. తన శయ్యాగారంలోనికి వెళ్లింది. మంచంమీద వొరిగింది అటునిటు మసలింది.
శయ్యపైనుండి లేచింది. గదిలోని కవాటాలకు గల తెరలను తొలగించింది. వలయాకారంగా వున్న వసారాలోనికి వెళ్లింది. దేనికోసమో కళ్ళు పరిపరివిధాల వెదుకుతున్నాయి. అటునిటు చూచింది. పెద్ద నిట్టూర్పు విడిచింది. మళ్లీ గదిలోనికి ప్రవేశించింది.
మెల్లగా నడుచుకుంటూ రాజప్రాసాదం పైభాగానికి వెళ్లింది. కలయజూచింది.
కాంపిల్యం ఏదో పండుగ శోభను సంతరించుకున్నట్లు కనిపించింది.
అల్లంత దూరంలో అక్కడక్కడా చిన్న పెద్ద రంగు రంగుల గుడారాలు కనిపిస్తున్నాయి.
రంగు రంగుల వస్త్రాలతో చేసిన వ్రేలాడుచున్న తోరణాలను చూచింది.
పొడుగాటి వస్త్రాలపై వ్రాసిన స్వాగత తోరణాలు కట్టబడి వున్నాయి.
రహదారులకు ఇరువైపులా పొడుగాటి కట్టెలతో నిర్మింపబడిన వలయాకార తోరణాలు రంగు రంగుల గుడ్డలతో చుట్టబడి చూడ ఇంపుగా కనిపిస్తున్నాయి.
వీధులన్నీ రంగు రంగుల రంగవల్లులతో శోభిల్లుచున్నాయి.
చిన్న రథాల నుండి పెద్ద రథాలతో, అంబారీలతో అలంకరింపబడిన ఏనుగులతో, గుఱ్ఱాలతో పురవీధులన్నీ నిండుగా ఉన్నాయి.
గుంపులు గుంపులుగా తరలి వస్తున్న రాజులు, రాజకుమారులు, వారి వెంట ఆయా దేశాల జెండాలను మోస్తున్న భటులు కనబడుచున్నారు.
కాంపిల్య పుర వీధులన్నీ నిండుగా కనపడుచున్నవి.
చూపు మరల్చి దూరంగా చూచింది. ప్రశాంతంగా ప్రవహిస్తున్న గంగానది కనిపిస్తున్నది. - ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము