భక్తి కథలు

యాజ్ఞసేని-24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైలాస పర్వత సౌందర్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రకాశిస్తూ, ఆకాశాన్నంటే శిఖరాలుగల అందమైన సౌధ ప్రదేశాలతో అనేక విధాలైన మంచెలతో మంటపం అమరియున్నది.
బంగారు చాందినీలతో, మణులు పొదిగిన కుట్టిమ స్థలాలతో, భూషణాలతో సుఖంగా ఎక్కగల మెట్లతో, సింహాసనాలతో ఆ సభా మండపం విలసిల్లింది.
పూలమాలికలతో దండలతో కట్టబడి అగరువాసనతో నిండిన మంటపం సువాసనలను వెదజల్లుచున్నది.
మంటపానికి దారులు తీసే అనేక తోరణాలు, మంచెలు, ఆసనాలు శోభాయమానంగా కనువిందు చేస్తుండగా, రకరకాల రంగు పూలతో మంటపం అలంకరింపబడింది.
అంత ఒకరితో ఒకరు పోటీపడుచూ చక్కగా దండలతో అలంకరించుకొన్న యువకులైన కొందరు రాజులందరు ఎవరి అస్తబ్రలాన్ని ఊహించుకొంటూ ఆయుధాలు పట్టి కదిలారు.
రూపం, బలం, శీలం, ధనం, వనం మెదలైన దర్పాలతో రాజులు మంచుకొండలలోని మదించిన ఏనుగుల సమూహంవలె రకరకాల నడకలు నడిచారు.
వచ్చిన రాజులు ఒకరినొకరు స్పర్థతో చూసికొంటూ ద్రౌపది తన సొత్తేననుకుంటూ మత్స్యయంత్రాన్ని ఛేదించవచ్చారు.
సభామంటపంలోని పలు రకాల ఆసనాలలో స్వయంవరానికి వచ్చిన వివిధ దేశాల రాజులందరూ చక్కగా అలరించుకొని పోటీపడుచూ ఆసీనులైయున్నారు.
అందులో మహాబల పరాక్రమాలుగల రాజశ్రేష్ఠులు కృష్ణాగరుసువాసనా భరితులై, సౌభాగ్య సంపన్నులై కూర్చొని ఉన్నారు.
తమ మంచి కర్మలతో, శుభకర్మలతో స్వర్గానికి హితులై తమ దేశాన్ని రక్షించుకొనే ప్రసన్న హృదయులైన బ్రాహ్మణ భక్తులు అక్కడ చేరియున్నారు.
పౌరులు, జానపదులు, ద్రౌపదీ దర్శనం కోసం ఎతె్తైన మంచెలమీద కూర్చొని యున్నారు.
అత్యున్నతమైన పాంచాల రాజవైభవాన్ని తిలకిస్తూ బ్రాహ్మణ వేషధారులైన పాండవులు కూడా బ్రాహ్మణులతోపాటు కూర్చున్నారు.
పాంచాల రాజ తనయ ద్రౌపది, సన్నని అందమైన నడుముగలది, మణులతో రత్నాలతో, ముత్యాలతో విరాజిల్లే బహువిధ బంగారు ఆభరణాలను అందంగా అలంకరించుకొని పూలదండలతో మైపూతలతో నిర్మల దేహకాంతితో, తెల్లని పూలదండనొకటి చేతబూని ప్రజలంతా తనను చూచి ‘‘ఈ మన్మథుని అయిదు పూల బాణాలకంటె వేరైన ఆరవ పూల బాణమా’’ అని అనుకొనేటట్లుగా నిలిచియున్నది.
ధవళ భూషణులు, పుష్పమాల, చందనము ధరించి సితపుష్పమాల చేబూని మన్మథుని ఆరవ బాణమా అనునట్లు స్వయంవర రంగమధ్యమునకు రాగా!
మంత్రవేత్త అయిన సోమకవంశ (చంద్రవంశ) పురోహితుడు యధావిధిగా అగ్నిహోత్రాన్ని ఏర్పరచి నేతితో హోమం చేశాడు. అగ్ని సంతర్పణ, బ్రాహ్మణుల స్వస్తివచనాలు, ఆశీర్వచనాలు అతిశయిల్లాయి.
ఆ సమయంలో మంగళ వాద్య ధ్వనులన్నీ నిలిపివేయబడ్డాయి. దృష్టద్యుమ్నుడు తన చెల్లెలైన ద్రౌపదిని తీసుకొని వచ్చాడు.
అక్కడ చేరిన రాజ సమూహాన్నంతా చూచి అగ్నిహోత్రం వద్ద గంధపుష్ప దీపాలతో పూజింపబడిన ధనుస్సును బాణాలను, ఆకాశంలోనున్న మత్స్యయంత్రాన్ని వాళ్ళకుచూపించి-
‘‘ఈ విల్లు ఎక్కుబెట్టి ఐదు బాణాలతో ఈ యంత్రంలోని మత్స్యాన్ని కొట్టినవాడే ఈ కన్యకు తగిన మన్మథ సమానుడైన భర్త. ఈ మత్స్యయంత్రం ముని శక్తితో పొందినది కనుక ఇప్పుడు మీరు ప్రయత్నించండి. విలువిద్యలో గొప్ప సామర్థ్యం, బలగంగలవారు చక్కని కీర్తినీ, కళ్యాణాన్ని పొందటానికది సరైన సమయము’’ అని అక్కడ చేరిన రాజపుత్రులందరికినీ తెలియజెప్పాడు.
(ఇక్కడ ధనుస్సులో బాణపూరణము చేసి పైన తిరుగుచున్న యంత్ర మత్స్యమును అథోముఖుడై దాని ప్రతిబింబమును (నీటిలో) చూచి బాణముచే కొట్టవలెను. ఐదు బాణములివ్వబడినవి)
తరువాత చెల్లెలైన ద్రౌపదిని చూసి సమస్త భూ మండలంలోగల రాకుమారులందరూ నీ స్వయంవరానికికి వచ్చారు. వీళ్ళనుచూడుము అని-
దుర్యోధన, దుశ్శాసన మొదలైన ధృతరాష్ట్ర కుమారులు నూర్గురనూ, ఆ సమీపంలోనే యున్న కర్ణుడు, అశ్వత్థామ, సోమదత్తులనూ, కొడుకులతో కూడి యున్న శల్య విరాటులనూ, అక్రూరుడు, సాత్యకి, సారణుడూ మొదలైన యదువృష్ణి భోజాంధక వంశశ్రేష్ఠులనూ, సుకుమారుడు, సుమిత్రుడూ, మొదలైన రాజులనూ, బ్రాహ్మణ సమూహాలను చూసి-
‘‘ఓ చంద్రవదనా! యాజ్ఞసేనీ! వీరిలో మత్స్యంత్రాన్ని కొట్టినవాడిని ప్రేమతో వరించుము’’ అని అన్నాడు.
అపుడు ఆకాశంలో దేవతలూ, చారణులూ, గరుడులూ, అప్సరసలతో కలిసి గంధర్వులు, కిన్నరులూ, రుద్రులూ, ఆదిత్యులూ, వసువులూ, అశ్వినీ దేవతలు, సిద్ధులూ, సాధ్యులూ, మరుత్తులూ, విశ్వావసువు, నారద పర్వతలూ ద్రౌపది స్వయంవర ఉత్సవాన్ని చూడగోరి ప్రీతితో వచ్చారు. వారల విమానాలు ఆకాశంలో ప్రకాశించాయి.
- ఇంకా ఉంది

- త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము