పశ్చిమగోదావరి

కలెక్టరేట్‌నూ రిజిస్టర్ చేసేస్తారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 15: ఏలూరులోని చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘానికి చెందిన స్ధలం అమ్మకం అంశం ఇప్పుడు తీవ్రస్ధాయి వివాదానికి దారితీస్తోంది. ఇప్పటికే ఈవిషయంలో చేనేత జౌళి శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయటం తెల్సిందే. అయితే ఈవ్యవహారంపై జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్‌కు ఫిర్యాదు అందటంతో ఆయన ఈ అంశాన్ని సీరియస్‌గానే పరిగణించారు. సొసైటీకి చెందిన కోట్ల రూపాయల విలువైన భూమిని ఏ నిబంధనలు పాటించకుండా విక్రయాలు ఎలా జరిగాయి, ఆ స్ధలాల రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు అన్న అంశంపై ఆయన సంబంధిత అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. సోమవారం మీకోసం కార్యక్రమంలో చేనేత కార్మికసంఘం జిల్లా కార్యదర్శి పిచ్చుక ఆదిశేషు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని పరిశీలించిన కలెక్టరు ఈ వ్యవహారంలో గోల్‌మాల్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ చేనేత శాఖ ఎడి, జిల్లా సహకార అధికారి, జిల్లా రిజిస్ట్రార్‌లను వెనువెంటనే పిలిపించారు. వారితో సొసైటీ భూమి అమ్మకంపై మాట్లాడారు. 80ఏళ్ల చరిత్ర ఉన్న సొసైటీకి చెందిన 3825.64 గజాల స్ధలం ఏవిధంగా విక్రయం చేశారు, దీనిలో అనుసరించిన విధానాలు ఏమిటి, అసలు ఏవిధమైన నిబంధనలు అంగీకరించకపోయినా రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి అన్న వివరాలపై అధికారులను నిలదీశారు. చేనేత శాఖ అనుమతి లేకుండా ఈవ్యవహారం అసలు ముందుకు ఎలా వెళ్లిందని సంబంధిత ఎడిని నిలదీశారు. ఇన్ని కోట్ల రూపాయల విలువైన ఈస్ధలాన్ని నిబంధనలకు విరుద్దంగా ఏవిధంగా విక్రయించే నిర్ణయం జరిగింది, దానికి తగ్గట్టు రిజిస్ట్రేషన్లు ఎలా పూర్తయ్యాయి అని ప్రశ్నించారు. ఈసందర్భంగానే జిల్లా కలెక్టరు భాస్కర్ అధికారుల వ్యవహారశైలిపై తీవ్రస్ధాయిలోనే విరుచుకుపడ్డారు. పదిమంది వ్యక్తులకు ఈ స్ధలాన్ని ముక్కలుగా విడగొట్టి విక్రయించి రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయని పలుమార్లు ప్రశ్నించారు. తక్షణం రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఆదేశించారు. అయితే దీనికి జిల్లా రిజిస్ట్రార్ నుంచి సానుకూలస్పందన రాకపోగా రద్దు చేయడానికి నిబంధనలు ఇప్పుడు అంగీకరించవని చెప్పేందుకు ప్రయత్నించగా రిజిస్ట్రార్‌పై కలెక్టరు తీవ్రస్దాయిలో మండిపడ్డారు. ఈవిధంగా చూస్తుంటే ఎవరైనా వస్తే జిల్లా కలెక్టరేట్‌ను కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తారా అంటూ ప్రశ్నించారు. ఉన్న నిబంధనలను పరిశీలించి అవసరమైతే ఉన్నతాధికారులను సంప్రదించి ఈ స్ధలం రిజిస్ట్రేషన్లను మాత్రం తక్షణం రద్దు చేయించాలని సంబంధిత శాఖాధికారులను కలెక్టరు ఆదేశించారు. అంతేకాకుండా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలకు కూడా శ్రీకారం చుట్టాలన్నారు. మొత్తంమీద కోట్ల రూపాయల విలువైన స్ధలాన్ని రోజుల వ్యవధిలోనే పదిమందికి ముక్కలుగా విడగొట్టి అప్పనంగా అప్పగించిన వ్యవహారం అటు రాజకీయంగాను, ఇటు అధికారవర్గాల్లోనూ కూడా పెద్దఎత్తున సంచలనంగా మారింది.
ఇదిఇలాఉండగా సొసైటీకి చెందిన కోట్ల రూపాయల విలువైన భూమిని ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయించిన సంఘం అధ్యక్షులు మత్సా శాంతారావు పైనా, నిబంధనలను పాటించకుండా అక్రమపద్దతుల్లో రిజిస్ట్రేషన్లు చేసిన అధికారులపైనా కఠినచర్యలు తీసుకోవాలని దేవాంగుల సంఘం నాయకులు స్ధానిక పద్మశాలీల సంఘం భవన్‌లో సమావేశమై ఈమేరకు తీర్మానించారు. అలాగే కుట్రపూరితంగా ఈ స్ధలాన్ని కబ్జా చేసేందుకు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నవారిపై సివిల్, క్రిమినల్ కేసులు పెట్టాలని నాయకులు కొమ్మన వెంకటరమణ, యర్రా వీర్రాజు, వీరా సోమసుందరం, వీరా సుబ్బారావు, తిప్పాని రాజారామ్మోహనరావు, కోటంశెట్టి రామారావు, పిచ్చుక ఆదిశేషు తదితరులు డిమాండ్ చేశారు.

హాలోగ్రామ్ అమలయ్యేనా?
తప్పనిసరిగా అమలు చేయాలంటున్న కమిషనర్: సాకులు చెబుతున్న నిర్వాహకులు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 15: హాలోగ్రామ్.. ఈ పదం కార్పొరేట్ షాపింగ్ మాల్స్‌లో విని ఉంటాం. అయితే ఇప్పుడు మద్యం దుకాణాల్లోకి ప్రవేశించింది. షాపింగ్ మాల్స్‌లో వారి వ్యాపార విస్తరణకు ఈ ప్రక్రియ ఉపయోగపడితే.. మద్యం దుకాణదారుల్లో కొందరికి మాత్రం అడ్డంకి కానుంది. గత కొనే్నళ్లుగా దీనిని అమలుచేయాలని ప్రభుత్వం.. వీలుకాదని మద్యం దుకాణదారుల నడుమ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిన హాలోగ్రామ్ విధానం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోను హాలోగ్రామ్ అమలు చేయాల్సిందేనని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. మరి ఈ విధానం ఈసారి ఎలా అమలవుతుందో ఎక్సైజ్ అధికారులకు, దుకాణదారులకు మధ్య జరిగిన తెర వెనుక చర్చలపై ఆధారపడి ఉంది. ఇక హాలోగ్రామ్ వల్ల మద్యం సీసాపై ఉన్న లేబుల్ (చిన్నపాటి ముచ్చు)ను స్కానింగ్ చేస్తారు. తద్వారా ఆ బాటిల్ బిల్లింగ్ (విక్రయం) కావడంతో పాటు అక్రమ మద్యం విధానానికి స్వస్తి చెప్పవచ్చు. ఏ స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయనేది కూడా తెలుస్తుంది. బెల్టు దుకాణాల్లో పట్టుబడిన మద్యం సీసాలు ఏ దుకాణం నుంచి వచ్చాయనేది కూడా తెలుస్తుంది. ఈ హాలోగ్రామ్ సాఫ్ట్‌వేర్ కోసం ప్రతీనెల కొంత మొత్తాన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీకి నిర్వాహకులు చెల్లిస్తేనే ఈ ప్రక్రియ అమలవుతుంది.
బల్లమీద యంత్రం.. స్కానింగ్‌లో కనికట్టు
అయితే ఈ ప్రక్రియ దుకాణదారుల నిర్వహణ పైనే ఆధారపడి ఉంటుంది. హాలోగ్రామ్ అమలు చేస్తున్నాం చూడండని నమ్మించేందుకు బల్లమీద యంత్రం పెట్టి స్కానింగ్ చేయకుండా సీసాలు విక్రయిస్తే అక్రమాలు నిరోధించడం కష్టమే. కొందరు దుకాణదారులు ఇలాగే కానిచ్చేసినట్టు విమర్శలు వినిపించాయి. బల్లమీద యంత్రాన్ని పెట్టి సీసాలు మాత్రం స్కానింగ్ చేయకుండా ఇచ్చేసిన సందర్భాలూ చాలా ఉన్నాయి. ఇది కనుక అమలుచేస్తే కల్తీ మద్యం, అక్రమ మద్యం తదితర అక్రమాలు బయటకు వచ్చేస్తాయన్న ఉద్దేశంతో కొందరు నిర్వాహకులు చూసీచూడనట్టుగా పోవాలని, బల్లమీద స్కానింగ్ మిషన్ ఉందో లేదో చూసుకుని అన్నిచోట్ల ఉన్నాయని రిపోర్టులు పైకి పంపించుకోండని ఎక్సైజ్ అధికారులకు ఉచిత సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరు సైతం సరే అని తలూపినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి.
మద్యం దుకాణాల కన్నా రెండింతలు బెల్టు దుకాణాలు?
ప్రస్తుతం జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల కన్నా బెల్టు దుకాణాలే రెండింతలున్నాయని చెప్పవచ్చు. ప్రతి మద్యం దుకాణానికి ఆ సమీప ప్రాంతంలో ఒక బెల్టు దుకాణాన్ని ఏర్పాటుచేసి మూడు పువ్వులు, ఆరు కాయలుగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని మాత్రం ఎక్సైజ్ శాఖ చూసీచూడనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు లేకపోలేదు. జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా ఇదే పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. ఇక ఆ బెల్టు దుకాణాల్లో భారీ ఎత్తున మద్యం సీసాలు దొరికినా చర్యలు శూన్యం. ఒక మనిషి దగ్గర నాలుగు సీసాలు ఉండవచ్చునని చెబుతున్న ఎక్సైజ్ అధికారులు అంతకన్నా ఎక్కువ కొన్నిచోట్ల పట్టుబడినప్పుడు వారిపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పలేని స్థితిలో ఉన్నారు.
పారిశ్రామికవేత్తలుగా రాణించాలి
*విద్యార్థులకు చేతన్ ఖజారియా పిలుపు * పారిశ్రామిక, నైపుణ్యాల, వ్యాపార విధానాలపై చర్చ * హాజరైన ఉత్తరాదికి చెందిన పారిశ్రామికవేత్తలు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 15: విద్యార్థి దశలోనే సాంకేతిక నైపుణ్యాలు, వ్యక్తిగత సామర్ధ్యాలు, వ్యాపార విధానాలు, తయారీ రంగంలోని నూతన ఒరవడులపై దృష్టిసారించాలని ఖజారియా సిరామిక్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చేతన్ ఖజారియా విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం భీమవరం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థినులకు పారిశ్రామిక నైపుణ్యాలు, వ్యాపార రంగ విధానాలపై ఉత్తర భారతదేశంలోని ప్రముఖ సిరామిక్స్ సంస్థ ఖజారియా సిరామిక్స్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ చేతన్ ఖజారియాతో ముఖాముఖి చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్‌లో వినియోగదారుల అభిరుచులు, శైలి, ఆర్థిక స్థితిగతులు బట్టి వస్తురూపకల్పన, తయారీ, మార్కెటింగ్ విధానాలు ఉంటాయన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలపై అవగాహన సదస్సులు, సెమినార్లు ఎంతో అవసరమన్నారు. ఇంజనీరింగ్ లేదా మేనేజ్‌మెంట్ ఏ విభాగమైనా పారిశ్రామిక రంగంలో నూతన తయారీ విధానాలు, డిజైన్, నాణ్యత ఉన్న వస్తు రూపకల్పన కోసం పరిశోధనలు చేస్తారన్నారు. విద్యార్థులు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని సూచించారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కెవి విష్ణురాజు మాట్లాడుతూ ఔత్సాహిక విద్యార్థులు స్వయంశక్తితో వ్యాపారవేత్తలుగా రాణించవచ్చునన్నారు. ఇందుకోసం స్టార్టప్ కంపెనీల పేరిట మేకిన్ ఇండియా మిషన్‌లో కల్పించే అవకాశాలపై దృష్టిసారించాలని వివరించారు. వైస్‌చైర్మన్ ఆర్. రవిచంద్రన్ మాట్లాడారు. అనంతరం ఎంబిఎ, విఐటి విద్యార్థినులు మహేశ్వరి, వౌనిక, హర్షిత, వౌనికలు అడిగిన పలు ప్రశ్నలకు చేతన్ ఖజారియా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా చేతన్ ఖజారియాను చైర్మన్ కెవి విష్ణురాజు ఘనంగా సత్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. శ్రీనివాసరావు, వైస్‌ప్రిన్సిపల్ డాక్టర్ పి. శ్రీనివాసరాజు తదితరులు పాల్గొనగా, ఉత్తర భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్తలు చర్చా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పట్టిసీమలో పటిష్ఠ ఏర్పాట్లు
దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వేములపూడి
ఏలూరు, ఫిబ్రవరి 15 : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 7వ తేదీన పట్టిసీమకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం పటిష్టమైన ఏర్పాట్లు చేశామని దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వేములపూడి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని చెప్పారు. తాత్కాలిక పందిళ్లు ఏర్పాటు, బారికేడ్లు ఏర్పాటు, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వృద్దులు, వికలాంగులు జాప్యం లేకుండా దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశామన్నారు. బస్టాండ్‌ల నుంచి ఆలయం వరకు కూడా తమ శాఖ సిబ్బందిని ఎక్కడికక్కడ నియమించామని, భక్తులకు అసౌకర్యం కలిగితే తక్షణమే చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రతిపాదించామన్నారు. ఆలయం వద్ద భక్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఉచిత ప్రసాదం, ఉచిత దర్శనం కలగచేస్తున్నామన్నారు. జిల్లాలోని ఎండోమెంట్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక నియామకాలు జరిపామని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమతోపాటు గునుపూడి, పాలకొల్లు, లక్ష్మణేశ్వరపురం, ఆచంట, నత్తా రామేశ్వరం, ఏలూరులోని పత్తేబాద పాత శివాలయం, నగరేశ్వరాలయం తదితర ప్రాంతాల్లో వున్న శివాలయాలకు మహాశివరాత్రినాడు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారని అంచనా వుందని, ఈ మేరకు ఆయా ఆలయాల వద్ద ఏర్పాట్లు ముమ్మరం చేశామన్నారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రపర్చడం, వెల్లలు, రంగులు వేయడం, పందిళ్లు వేయడం తదితర పనుల నిర్వహణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆర్‌టిసి సంస్థ ఆయా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు.

‘చింతలపూడి’ కాలువ పనులు అడ్డుకున్న రైతులు
గోపాలపురం, ఫిబ్రవరి 15: చింతలపూడి పథకం కాలువ నిర్మాణాల వల్ల భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం అందజేసే వరకూ పనులు జరగనీయబోమని భీమోలు రైతులు హెచ్చరించారు. భీమోలు గ్రామ శివార్లలో అక్క దేవతల గుడి సమీపం నుండి చింతలపూడి కాలువ తవ్వకాలు చేపట్టవలసి ఉంది. నష్టపరిహారం విషయంలో రైతులు గతంలో హైకోర్టును ఆశ్రయించడంతో అధికారులు పనులను నిలుపుదల చేశారు. సోమవారం హఠాత్తుగా అధికారులు రైతుల పంట పొలాల్లోకి ప్రవేశించి పనులు ప్రారంభిస్తుండగా 94.65 ఎకరాలకు చెందిన 33మంది బాధిత రైతులు పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు అధికారులతో మాట్లాడుతూ తాము పొలాల్లో పంట సాగుచేసుకుంటున్నామని, కాలువల పేర్లతో పంటలను ధ్వంసం చేయడమేమిటని అధికారులను నిలదీశారు. తమ గ్రామానికి ఎగువన ఉన్న అన్నదేవరపేటకు చెందిన భూములకు ఎకరాకు రూ.27లక్షలు నష్టపరిహారం ఇవ్వగా, తమకు దిగువన ఉన్న గుడ్డిగూడెం గ్రామంలోని భూములకు రూ.23లక్షలు ఇచ్చారన్నారు. తమకు మాత్రం రూ.15.41లక్షలు ప్రకటించడం అన్యాయమని వాపోయారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టైనా నష్టపరిహారం సాధించుకుంటామని, అప్పటి వరకూ పనులు సాగనిచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పారు. సంఘటనా స్థలంలో ఉన్న తహసీల్దార్ ఎన్ నర్సింహమ్మూర్తి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయవలసి వచ్చింది. పోలీసు, రెవెన్యూ అధికారులు కలిసి రైతులతో చర్చించినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదిలేక అధికారులు వెనుతిరిగారు. నష్టపరిహారం విషయమై విలేఖర్లు తహసీల్దార్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే తాము పనులు చేసేందుకు వచ్చినట్టు చెప్పారు. అధికారుల ఆదేశాల మేరకే నష్టపరిహారం అందివ్వడం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డిఇ భాస్కర రామకృష్ణ, ఆర్‌ఐ డి రవి, ఎస్సై యు లక్ష్మీనారాయణ, విఆర్వో ఏడుకొండలు, రైతులు గద్దే వెంకటేశ్వరరావు, ఆర్ అప్పారావు, కోడి దేవీప్రసాద్, మధ్యాహ్నపు గంగరాజు, వింటి రామకృష్ణ, వింటి పేరయ్య, పసుపులేటి బలరామకృష్ణ తదితరులు ఉన్నారు.
శ్రీనివాసరావు మృతి కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలి
డిసిసిబి ఛైర్మన్ ముత్యాల రత్నం
ఏలూరు, ఫిబ్రవరి 15 : కాళ్ల గ్రామంలో ఒక బెల్టుషాపులో ఈ నెల 6వ తేదీన తూము శ్రీనివాస్ అనే వ్యక్తిని కొట్టి చంపి దహనం చేసిన సంఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిసిసిబి ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు కోరారు. స్థానిక డిసిసిబి సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళ్ల గ్రామంలో ఒక పెట్రోలు బంకు దగ్గర ఉన్న బెల్టుషాపులో ఈ నెల 6వ తేదీన తూము శ్రీనివాస్ అనే వ్యక్తిని కొంతమంది దుండగులు కొట్టి చంపి సమీపంలో ఉన్న ఒక గడ్డివాములో తగలబెట్టడం అత్యంత హేయకరమని అన్నారు. ఆ బెల్టుషాపులో తరచూ కొట్లాటలు జరగడం పట్ల అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, ఈ రోజు జరిగిన సంఘటనలో ఒక అమాయక వ్యక్తి మరణించడం చాలా బాధాకరమని ఈ విషయమై జిల్లా కలెక్టరుకు, ఎస్‌పికు ఫిర్యాదు చేసామన్నారు. ఈ సంఘటనకు కారకులైన సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షించి కుటుంబానికి న్యాయం చేయడమే కాకుండా ఆకుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని వెంకటేశ్వరరావు కోరారు. మద్యం షాపుల నిర్వహణ గ్రామీణ ప్రాంతాల్లోని పలు చోట్ల గుడికి, బడికి దగ్గరగా వున్నాయని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎక్సైజ్ ఉన్నతాధికారులకు, పోలీసు యంత్రాంగానికి గతంలో తాను ఫిర్యాదు చేశానని, అయినప్పటికీ కూడా పట్టించుకోలేదని, కాబట్టే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని రత్నం పేర్కొన్నారు. ఇప్పటికైనా గుడికి, బడికి దగ్గరలో వున్న మద్యం షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు.
కాపులను బీసీల్లో కలిపితే ఊరుకోం
జిల్లా బిసి సంక్షేమ సంఘ నాయకులు ఆందోళన
ఏలూరు, ఫిబ్రవరి 15 : రాజ్యాంగ పరంగా బిసిలకు కేటాయించిన రిజర్వేషన్లు పర్యవేక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుందని, కాపు సామాజిక వర్గాన్ని బిసిల్లో కలిపితే ఊరుకోమని జిల్లా బిసి సంక్షేమ సంఘ నాయకులు ఆందోళన చేశారు. కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ధర్నానుద్దేశించి బిసి సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ విశే్వశ్వరరావు, నగర గౌడ సంఘ అధ్యక్షులు కాసాని రమేష్ గౌడ్‌లు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గాన్ని బిసి జాబితాలో చేర్చాలనే ప్రతిపాదన సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధమైనదన్నారు. భారత రాజ్యాంగంలోని 340 (15) తదితర నిబంధనల స్వభావానికి విరుద్ధమైనదన్నారు. రిజర్వేషన్లు అనేవి సాంఘిక వివక్షత, అణచివేతకు సంబంధించినవేకానీ ఆర్ధిక అంశం కాదని, ఆర్ధిక వెనుకబాటు తనాన్ని, పేదరికాన్ని నిర్మూలించడానికి ఆర్ధిక పరమైన సహకారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుందన్నారు. ప్రస్తుతం బిసి జాబితాలో వున్న కులాలు సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్ధికంగా, రాజకీయంగా చాలా వెనుకబడి వున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘ నాయకులు రెడ్డి సత్యనారాయణ, పివి పెద్దిరాజు, మారగాని చంద్రకిరణ్, వీరవల్లి శ్రీనివాస్, గుత్తుల బాలా త్రిపుర సుందరి, బచ్చు పద్మావతి, బోని శివ, వేగి చిన్న ప్రసాద్, కాజుల తిలక్, తుమరాడ శ్రీనివాసరావు, ఎచ్చెర్ల సత్యనారాయణ, తెంటు సూర్యనారాయణ, వంగలపూడి పోతురాజు, చిట్టిబోయిన పవన్‌గౌడ్, లక్కోజు సాయి, బళ్ల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాపులను బిసిల్లో చేర్చవద్దంటూ కొద్దిసేపు నినాదాలతో హోరెత్తించారు.
రైతులకు జైపూర్ సుగర్స్ ‘చెక్’
చెల్లని చెరకు బకాయి చెక్కులు
తాళ్లపూడి, ఫిబ్రవరి 15: చెరకు రైతుల బకాయి కింద చాగల్లు జైపూర్ సుగర్స్ యాజమాన్యం రైతులకు జారీచేసిన చెక్కులు బ్యాంకులో చెల్లుబాటు కాని పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన తాళ్లపూడి ఆంధ్రాబ్యాంకులో చోటుచేసుకుంది. బల్లిపాడు గ్రామానికి చెందిన తొమ్మిది మంది రైతులు తమ బకాయిల కోసం శుక్రవారం యాజమాన్యం నుంచి పొందిన చెక్కులను సోమవారం ఆంధ్రాబ్యాంకుకు తీసుకువచ్చారు. బ్యాంకు వెళ్లిన రైతులు బ్యాంకు మేనేజరు చెప్పిన సమాధానంతో అయోమయానికి గురయ్యారు. రైతులకు చెక్కులిచ్చిన జైపూర్ యాజమాన్యం ఈలోపునే బ్యాంకులకు వెళ్లి ఆ చెక్కులను చెల్లించవద్దని పేర్కొంటూ బ్యాంకు మేనేజరుకు లేఖను అందజేసింది. బ్యాంకు మేనేజర్ ఆ చెక్కులను తీసుకోకపోవడంతో రైతులు లబోదిబోమన్నారు. గత కొన్నాళ్లుగా చెరకు బకాయిలు చెల్లించడం లేదని నాయకులకు, అధికారులకు మొరపెట్టుకున్నా రైతుల కష్టాలు తీరకపోగా సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
సూర్యారావును మద్యం వ్యాపారస్థులే హతమార్చారు
* సిఐ జయసూర్య
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 15: మండల కేంద్రమైన కాళ్ళ శివారులో సూర్యారావుపేట పుంత రోడ్డులో కాలి బూడిదైన తూము శ్రీనివాసరావుని చంపింది మద్యం వ్యాపారస్తులని భీమవరం రూరల్ సిఐ ఆర్‌జి జయసూర్య చెప్పారు. వ్యూహాత్మకంగానే శ్రీనివాసరావును హతమార్చి, తోట సత్యనారాయణ పొలం వద్ద పంట బోదెకు అనుకుని ఉన్న తోట పాపారావు గడ్డివామిలో శ్రీనివాసరావు శరీరానికి నిప్పు పెట్టినట్టు తెలిపారు. సోమవారం భీమవరం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 9వ తేదీన శ్రీనివాసరావు కనిపించడం లేదని అతని భార్య నాగలక్ష్మి ఫిర్యాదు చేసిందన్నారు. అదేరోజు సగం కాలిన శరీర భాగాన్ని నాగలక్ష్మికి చూపించగా ఆమె గుర్తించిందన్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి ఎస్సై ఇ. ప్రసాదరావు దర్యాప్తు చేశారన్నారు. ఈ దర్యాప్తులో 5వ తేదీ రాత్రి కాళ్ళ గ్రామంలోని సత్యదేవ వైన్స్ నుండి అదృశ్యమయ్యాడని గుర్తించామన్నారు. దీంతో అదే బ్రాందీ షాపులో పనిచేస్తున్న నోఓకు, మర్రి కృపాదానం, యాళ్ళ రవీంద్రలు కనిపించకపోవడంతో వారిని వ్యూహాత్మకంగా పట్టుకున్నామన్నారు. ఈ ముగ్గురు శ్రీనివాసరావును కొట్టి చంపి గడ్డివామిలో వేసి కాల్చివేసినట్టు అంగీకరించారని తెలిపారు. శ్రీనివాసరావు గతంలో మద్యం సేవించే విషయంలో ఒకటి రెండు పర్యాయాలు మాటల యుద్ధానికి దిగాడని, ఆ రోజు కూడా మాటల యుద్ధానికి దిగిన నేపథ్యంలో బ్రాందీ షాపు వెనుక ఉన్న షెడ్డులో హతమార్చినట్టు తెలిపారని సిఐ వివరించారు. దీంతో వీరు ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఎస్సైతో పాటు ఎఎస్సైలు రామకృష్ణ, హరిబాబులను సిఐ ప్రత్యేకంగా అభినందించారు.
కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

జెసిబి, మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్
పోలవరం, ఫిబ్రవరి 15: పోలవరం మండలం ప్రగడపల్లి సమీపంలో కొవ్వాడ కాలువలో అక్రమంగా ఇసుక తవ్వుతున్న జెసిబి, మూడు ట్రాక్టర్లను అధికారులు సోమవారం ఉదయం సీజ్ చేశారు. సమాచారం మేరకు ఆ ప్రాంతానికి చేరుకున్న ఆర్‌ఐ ఆర్‌ఎస్ నాగరాజు, పట్టిసీమ విఆర్వో ఎంఎస్ వెంకటేశ్వరరావు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జెసిబిని, ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై తహసీల్దారుకు, పోలీస్ స్టేషన్‌కు విఆర్వో ఫిర్యాదుచేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న జెసిబిని, మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్టు తహసీల్దార్ ముక్కంటి తెలిపారు.
19న భారీ రుణమేళా!
హాజరుకానున్న సిఎం!!
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, ఫిబ్రవరి 15: జిల్లా కేంద్రమైన ఏలూరులో ఈనెల 19వ తేదీన భారీఎత్తున రుణమేళా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అయా వర్గాలకు భారీఎత్తున రుణాలు మంజూరు చేసేందుకు ఈ రుణమేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ రుణమేళాకు హాజరవుతారని భావిస్తున్నారు. సోమవారం విజయవాడలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ రుణమేళాకు సంబంధించి నిర్ణయం తీసుకుని ఉంటారని తెలుస్తోంది. సిఎం పర్యటనకు సంబంధించి మంగళవారం స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
ఏలూరు, ఫిబ్రవరి 15: జెఎన్‌యులో విద్యార్ధినాయకులను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆరోపిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో స్ధానిక పాతబస్టాండ్ వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశ్వవిద్యాలయాల్లో వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య, అభ్యుదయవాదులపై దాడులు పెరిగాయన్నారు. వామపక్ష కార్యాలయాలపై దాడులకు సంఘ్‌పరివార్ శక్తులే కారణమన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ జెఎన్‌యు విద్యార్ధిసంఘం అధ్యక్షులు కన్హయ్యకుమార్‌ను అరెస్టు చేయటం, అతనిపై దేశద్రోహం కేసు పెట్టడం దారుణమన్నారు. ఎబివిపి ఓటమిని జీర్ణించుకోలేకే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నెక్కంటి సుబ్బారావు, బండి వెంకటేశ్వరరావు, మున్నీర్, శ్రీనివాసడాంగే, పుప్పాల కన్నబాబు, బి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.