డైలీ సీరియల్

విలువల లోగిలి-64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరువాత చందూ, అమృత, నరేంద్రనాథ్ చేశాక మిగిలిన ముఖ్యులు, బంధువులను కూడా ప్రదక్షిణాలు చేసుకోమన్నారు.
ఇక కాడి ఎత్తబోతుండగా శాంతి వచ్చి చివరి ప్రదక్షిణం చేసుకుంది. ఈ లోకంతో తన పని అయిపోయింది అని చెబుతూ వీడ్కోలు తీసుకుంటున్నట్లు సుగుణ పాడె కదిలింది.
ఆమె వెంటనే పదుగురూ బయలుదేరారు.
విశ్వను ఆపటం ఒక శాంతివల్లే అయింది.
మిగిలిన అందరూ విషణ్ణవదనాలతో కాసేపు అక్కడే నిలబడిపోయారు. కాసేటి తర్వాత అందరూ లోపలికి వెళ్లి స్నానాల కార్యక్రమం ప్రారంభించారు.
అవసర సమయంలో ఆదుకోవటానికే స్నేహితులు అన్నట్లు ఆ సమయంలో శాంతి రాక విశ్వకి చాలా ఊరట కలిగించింది. ఓ బొమ్మలా, ఓ యంత్రంలా ఆమె చెప్పినట్లు వింటోందే తప్ప తను ఏం చేస్తోందో తనకే తెలియనంత యాంత్రికతలో ఉంది విశ్వ.
శాంతి ఆమెను ఒక్క క్షణం కూడా వీడడంలేదు.
అమ్మా అని పిలిచినందుకు, కొడుకులు లేని కారణంగా సుగుణను తనే దహనం చేసివచ్చాడు సూర్యచంద్ర.
శ్మశానానికి వెళ్లివచ్చినవారంతా స్నానాలు చేసాక భోజనాలు చేశారు.
ఎక్కడివాళ్ళక్కడకు వెళ్లిపోయాక ఇంట్లోవాళ్లూ, దగ్గర బంధువులు మాత్రం మిగిలారు.
అందరూ ఉన్నారు తన తల్లి మాత్రమే తనను ఒంటరిగా మిగిల్చి వెళ్లిపోయింది అన్న ఆలోచన విశ్వను మరింత ఒంటరిని చేసింది.
నేలమీద ఓ ప్రక్కగా భూమి తల్లిని కావలించుకుని పడుకొని అలిసిన తన మనసుకు ఓదార్పు తెచ్చుకుంది. ఎంతైనా ఆమే ఓ మనిషే. కానీ బంధం విలువ తెలిసినది. అనుబంధాన్ని లతలా పెనవేసుకున్నది, ఆమె అనురాగంలో ఎదిగినది, ఆమె లాలనలో ఓలలాడినది, ఆమె ప్రేమలో మునిగింది. ఇప్పుడు లేవమంటే లేస్తుందా? ఆ ప్రేమ ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిందంతే అంతే ఒప్పుకుంటుందా?
మనిషి ఒప్పుకున్నా మనసు ససేమిరా ఒప్పుకోదు. దానికి భవబంధాలను వదులుకోవడానికి ఇష్టపడదు.
ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు గుట్టలు గుట్టలుగా తీరం వెంబడి పడివున్న శవాలను అమ్మ, తను వెళ్లి చూసేవాళ్ళు. అక్కడ తోటివాళ్ళు అవసరం ఎంతో ఉంటుందని సహాయం ఎక్కడ కావాలంటే అక్కడికి పరుగెట్టేవాళ్ళు తామిద్దరూ. సాటి వాళ్ళంతా తమవాళ్ళే అనుకొనేవాళ్ళం. వాళ్లందరి చావులు కళ్లజూసినపుడు కడుపులో దేవినట్లుండేది. అంతులేని బాధ ఆవరించేది. అయ్యో! అని జాలివేసేది.
కానీ ఇప్పుడు అలా కాదు. తన శరీరంలో ఒక భాగాన్ని కోసి తీసుకువెళ్లిపోతున్నట్లుంది.
ఇది తట్టుకోవటం తన వల్ల కావటంలేదే?
అమ్మ కళ్లను దానం చేస్తే బాగుండేది.
చందూకి ఆ విషయం చెప్పే అవకాశం రాలేదు.
ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇద్దరికి వెలుగులు పంచే అవకాశాన్ని తను ఈ రోజు పోగొట్టుకుంది.
హైదరాబాద్ ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి ఉత్తరం వ్రాసి మరీ ఫారమ్స్ తెప్పించి ఎందరితోనో తమ కళ్ళు దానం చేస్తామని సంతకం చేయించి పంపింది. ఇష్టంలేని వారినికూడా దాని ఆవశ్యకత వినిపించి మరీ వాళ్ళచేత ఇష్టపూర్వకంగా సంతకాలు చేయించింది. అప్పుడే తనూ, అమ్మ కూడా సంతకం చేసారు. అవన్నీ వాళ్లకి పోస్టులో పంపారు. అమ్మ చనిపోయిందని వాళ్ళకు తెలిసినా బాగుండేది. చక్కగా అమ్మ కళ్ళు ఇద్దరికి ఉపయోగపడేవి అనుకుంది బాధగా.
ఇప్పుడు అమ్మ చనిపోయిందన్న బాధకన్నా ఈ బాధ ఎక్కువయిపోయింది.
అప్పుడే శాంతి అక్కడకు వచ్చింది. ఇక ఆపుకోలేక ఆ విషయం చెప్పింది విశ్వ.
‘నువ్వేం బాధపడకు విశ్వా. మంచివాళ్ళకు పనులు వాటంతటవే అయిపోతాయి’’
‘‘అంటే..?’’ అంది శాంతిని ఏమి జరిగిందన్నట్లు చూస్తూ.
మీ ఇంటి దగ్గర నువ్వు ‘నేత్రదానం’కోసం ఎవరితోనో చనిపోయాక వాళ్ళ కళ్ళు ఇస్తామని సిగ్నేచర్ తీసుకున్నావట. వాళ్ళు వెంటనే మీ అమ్మగారు చనిపోయారని వాళ్ళు రాసుకున్న ఫోన్ నెంబర్‌కి ఫోన్ చేసి చెప్పి నీ సెల్ నెంబరు ఇచ్చారట. వాళ్ళు వెంటనే ఫోను చేసి చందూని విషయం కనుక్కొని ఇక్కడ దగ్గర్లో వున్న వాళ్ళ స్ట్ఫాకి చెప్పి సకాలంలో అమ్మ కళ్ళు తీసుకెళ్ళారట. అదే అమ్మ ‘రెటీనా’ని. ఇదంతా చందూ ఎవరితోనో చెబుతూ ఉంటే విన్నాను’’అంది శాంతి.
‘‘అమ్మయ్యా!’’ అనుకుంది విశ్వ.
గుండెలమీదున్న ఓ పెద్ద బండరాయిని తీసేసినంత సంతృప్తిగా ఉంది. అప్పుడర్థమయింది విశ్వకి తనింక విరివిగా మరింత ఈ సేవలో పడిపోతే తప్ప అమ్మ ఆలోచనలనుంచీ తప్పించుకోలేనని.
ప్రతీక్షణం గుర్తువస్తున్న అమ్మను ఏదీ మరిపించలేదని.
విధికి ఎవరి జీవితమన్నా సాఫీగా నడిచిపోతుంటే నచ్చదనుకుంటా. అందుకే మలుపులు త్రిప్పతుంటుంది. ఇలాంటి షాక్‌లిచిచ్చి.
ఏ వాహనాన్నో నడుపుతున్నపుడు మలుపు వస్తోందంటే జాగ్రత్తగా చూసుకుని వెళతాం. అది తిరిగాక గానీ అటు ఎవరు వస్తున్నదీ తెలియదు. తెలిసాక చాకచాక్యంగా వాటిని తప్పించుకుంటాం. కానీ జీవితంలో మాత్రం ఈ మలుపులు ఊహించనివి. వచ్చినపుడే వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. మళ్లీ బండి గాడిన పడేవరకూ ఆత్మవిశ్వాసంతో పోరాడాలి. ఏ మాత్రం అధైర్యపడినా మళ్లీ ఎక్కలేనంత అగాధంలో పడిపోతాం. అంతదాకా ఎవరూ తెచ్చుకోకూడదు.అందుకే విశ్వకి ఒక్కరోజులోనే కనువిప్పు కలిగింది. ఆమెలాంటివాళ్ళు అలా నిరాశలో మునిగిపోతే నిరాశావాదులెంతమందో అన్యాయమైపోతారు. ఆమె ఎప్పుడు ఆశాకిరణంలానే పదుగురికి వెలుగునివ్వాలి.అదే విధాత లక్ష్యం. ఈ సంఘటనతో ఆమెను మరింత రాటుతేల్చాడు. అంతే.
పంతులుగారు చెప్పిన ప్రకారం కార్యక్రమాలు యధావిధిగా జరిగిపోతున్నాయి. మూడవ రోజున చిన్నకర్మ జరిపారు.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206