డైలీ సీరియల్

విలువల లోగిలి-65

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు రోజులుండి శాంతి వెళ్లిపోయింది.
భీమేశ్వరి కుదిరినప్పుడల్లా వచ్చి వెళుతోంది.
విశ్వను ఎవరూ ఒంటరిగా వదలటంలేదు.
తెలిసినవాళ్ళు ఎవరో ఒకరు వచ్చి పలకరిస్తూనే ఉన్నారు.
ఎవరూలేని సమయంలో ఎవరో ఒకరు ఆమె ప్రక్కనే ఉండేట్లు చూసుకుంటున్నారు.
ఆ రోజు శుక్రవారం.. ఎవరూ పలకరింపునకు రారు. ఎవరో ఒకరు తనని అంటిపెట్టుకునే వున్నా అమ్మతో తను గడిపిన రోజులు అనుక్షణం గర్తువస్తూనే వున్నాయి.
ఆటైనా, పాటైనా కలిసే చేసేవారు. సంగీతం తనను నేర్చుకుంటానని అడిగింది అమ్మను.
వెళ్లమంది.. తను ఒప్పుకోలేదు.
నువ్వూ వస్తేనే వెళతానంది. మొండిపట్టు పట్టింది.
కుదరదమ్మా అని చెప్పినా వినలేదు.
చివరకు తన కోసం తను కూడా సంగీతం నేర్చుకుంది.
ఇద్దరూ ఇంటికి వచ్చాక కలిసే సంగీత సాధన చేసేవారు. అక్కడ నేర్చుకోవటం, ఇంటి దగ్గర సాధన చేయటం బాగుండేది.
‘‘సంగీతంలో చేరాక ఎప్పటికన్నా మనసు ప్రశాంతంగా ఉంటోందే’’ అనేది అమ్మ.
తను ఎప్పుడూ కూనిరాగాలు తీస్తూనే ఉండేది.
‘‘విశ్వ గొంతు చాలా శ్రావ్యంగా ఉంటుంది. ఎప్పుడూ మాన్పించకండి’’ అని చెప్పేది సంగీతం టీచరు శ్రావ్య.
‘అలాగే’ అనేది అమ్మ.
సంవత్సరం అలా నేర్చుకున్నామేమో!
ఉన్నట్టుండి అమ్మకి జ్వరం వచ్చింది. ఆ తర్వాత జ్వరం తగ్గింది కానీ నీరసం తగ్గలేదు. ఇక రాలేనని చెప్పేసింది.
తనను వెళ్ళమని ఎంత బ్రతిమలాడినా మానేసింది.
మళ్లీ అటువైపు చూడలేదు అమ్మకు బాగైనా.
కానీ అప్పుడు తనతోపాటు క్లాసులో మ్యూజిక్ నేర్చుకోవటానికి వచ్చినవాళ్లు తర్వాత ఎక్కడ కనబడినా పలకరిస్తూనే ఉండేవారు.
తను ప్రాక్టీసుకి, క్లాసులకి వెళ్లకపోయినా వీళ్ళు నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నారే అనుకుంటూ ఉండేది వాళ్ళు ఎప్పుడు పలకరించినా.
తమ ఇద్దరికి ఫీజు కట్టడానికి అదనంగా తెల్లవారు జామున లేచి అమ్మ రెండు గంటలు ఎక్కువ కష్టపడిందని తెలిసినప్పుడు మాత్రం ఆ సంతోషం అంతా ఆవిరయిపోయింది.
సంగీతం నేర్చుకుంటానని అమ్మను ఎందుకడిగానా అని చాన్నాళ్ళు బాధపడింది. అలా ఎంత కష్టాన్నైనా శంకరుడు తన గరళంలో హలాహలాన్ని మ్రింగినట్లు తనలోనే దాచుకునేది. ఎప్పుడూ బయటపడేది కాదు.
ఈ విషయం అయినా తనకు తెలిసేదే కాదు.
‘‘ప్రక్కింటి పిన్ని రోజూ 3 గంటలకే మీ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయేమిటి? విశ్వ లేచి చదువుకుంటోందా’’ అని అడిగింది.
ఆవిడ అలా అడిగేటప్పటికి అమ్మకి ఏం చెయ్యాలో తోచలేదు.
‘‘విశ్వా! తాళింపులోకి కరివేపాకు కావాలి. కాస్త కోసి తెస్తావా’’ అంది తనను బయటకు పంపించాలని.
అమ్మ తనని ఎందుకు అలా వెళ్ళమందో తెలుసుకోవాలని తనకున్నా అమ్మ చెప్పింది వినాలని ఆ రోజు వెళ్లింది పెరట్లోకి. చాలా రోజులదాకా ఆ విషయం తనను పీడించింది. అడిగితే అమ్మ బాధపడుతుందని ఊరుకుంది.
ఆ తరువాత ఎప్పుడో ఇరుగుపొరుగు వారు మెట్లమీద కూర్చుని మాట్లాడే మాటల్లో ఈ విషయం బయటపడింది. తను స్కూలు నుంచీ వస్తూ ఆ విషయం వింది.
ముందుగా తెలిస్తే ఏదో ఒక వంక చెప్పి మానేసి ఉండేది. కానీ అప్పటికే అమ్మ, తను సంగీతంకి వెళ్లటానికి మానేసారుకూడా!
అలా అమ్మ అంత కష్టపడి పెంచింది కాబట్టే తను ఇంకొన్నాళ్ళు సుఖపెట్టాలనుకుంది.
కష్టపడినన్నాళ్ళు కూడా సుఖపడలేదు.
అమ్మకంతే ప్రాప్తి ఏమో!
అదే అమ్మని అక్కడే విడిచి వచ్చేస్తే తనకి ఈ మాత్రం ప్రశాంతత కూడా దక్కేది కాదు. చందూ అమ్మను ఒప్పించి మంచి పనిచేశాడు.
అమ్మని మొన్న తనతోపాటూ చందూ తీసుకువెళ్లి ఉంటే ఇంకొంచెం ఆనందంగా, మరికొంత తృప్తిగా కన్నుమూసేదేమో!
అప్పుడు ఆ ఆనందాన్ని తట్టుకోలేక చనిపోయిందనుకునేవాళ్ళేమో!
‘కళ్ళకు కట్టినట్లు అన్నీ వివరించి చెప్పావుగా. ఇంక ఆ విషయంలో బాధపడకు’ అంది అంతరంగం.
ఏమిటో వెధవ మనసు వద్దని చెప్పినా అవే విషయాలు ఒకటే గుర్తుచేస్తుంది అనుకుంది, తనను తనే తిట్టుకుంది.
తలమీద చేతితో ఒకటిచ్చుకుంది.
అటువైపుగా వెళుతూ ఆ దృశ్యాన్ని చూసిన చందూ మనసు తల్లడిల్లిపోయింది.
తన విశ్వ మళ్లీ మామూలు మనిషి అవుతుందా?
ఎవరో ఒకరు తన ప్రక్కన ఉండడంతో తనకు ఆమెతో ఒంటరిగా మాట్లాడే అవకాశమే రావటంలేదు.
తనకు తెలుసు విశ్వ చాలా సెన్సిటివ్.
చిన్న పిల్లల మనస్తత్వం.
తను చాలా గంభీరం అనుకుంటుంది కానీ వెన్నలా కరిగిపోయే సున్నితత్వం ఆమె అణువణువునా.
ఆమె ఈ జన్మకి తనకు దొరికిన ఒక వరం.
జన్మజన్మలకీ కూడా వదులుకోలేని కోహినూర్ వజ్రం.
ఆమెను సదా కాపాడుకోవడం తన ధర్మం అనుకున్నాడు మనసులోనూ చందూ.
***
పెద్దకర్మ కార్యక్రమం కూడా సజావుగా జరిగిపోయింది.
ఏ లోకంలో సుగుణ ఉందో కానీ ఈ లోకంలో జరగాల్సిన కార్యక్రమం ఏ లోటూ లేకుండా జరిగిపోయింది.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206